Electric vehicle
-
భారత్‌కు చెందిన మొదటి సోలార్ ఈవీ
పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) వైవే ఈవాను భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. రూ.3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీతో ఈవీ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఫీచర్లు, స్పెసిఫికేషన్లువైవే ఈవా పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచుతుంది. ఈ ఫీచర్ సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. నోవా (9 కిలోవాట్ బ్యాటరీ), స్టెల్లా (12 కిలోవాట్ బ్యాటరీ), వెగా (18 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్లు ఉన్నాయి. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటాయి. వైవే ఈవా గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదవైవే ఎవా డెలివరీలు 2026 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతాయని వైవ్ మొబిలిటీ ప్రకటించింది. మొదటి 25,000 మంది కస్టమర్లకు పొడిగించిన బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల కాంప్లిమెంటరీ వెహికల్ కనెక్టివిటీతో సహా అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తున్నట్లు ప్రకటించింది. -
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఆటో భారత్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్‌లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్‌లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్‌గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్‌ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్‌లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్‌ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్‌కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్‌ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్‌తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్‌లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్‌లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు. -
పవన్ పార్టనర్ కు 1200 ఎకరాలు
-
ఈవీ రంగం @ 8 రెట్లు..!
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరిశ్రమ దేశంలో ఎనిమిది రెట్లు దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్ద కాలంలో ఈవీల విక్రయాలు 640 రెట్లు పెరిగాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏటా 2,600 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయని, గత ఏడాది ఈ సంఖ్య 16.8 లక్షల యూనిట్లు దాటిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2025ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఏడాదికి 2.5 కోట్ల వాహనాల అపూర్వ అమ్మకాలను చూసిందని, కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ పరిశ్రమ 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. పర్యావరణ అనుకూల సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మొబిలిటీ రంగంలో భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చొరవ దేశ ఆటో పరిశ్రమ వృద్ధి అవకాశాలకు ఆజ్యం పోస్తోందని, ఈ రంగం అభివృద్ధిలో భారీ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తోడ్పడే మొబిలిటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారతీయ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలో రతన్ టాటా, ఒసాము సుజుకీ సహకారం ఎంతో ఉందని మోదీ అన్నారు.టాటా.. 32 కొత్త వాహనాలు టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో వేదికగా ప్యాసింజర్, కమర్షి యల్ విభాగంలో 32 కొత్త వాహనాలతోపాటు వివిధ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా సియర్రా ఎస్యూవీ, హ్యారియర్ ఈవీతోపాటు అవిన్యా కాన్సెప్ట్ ఈవీ సైతం కొలువుదీరింది. అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ 2026లో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.సుజుకీ ఈ–యాక్సెస్ 95 కిలోమీటర్లు సుజుకీ తాజాగా భారత్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ ఎలక్ట్రిక్ వర్షన్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ–యాక్సెస్ ప్రత్యేకత. 3.07 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు. చార్జింగ్ పూర్తి కావడానికి 240 వాట్ పోర్టబుల్ చార్జర్‌తో 6 గంటల 42 నిముషాలు, ఫాస్ట్ చార్జర్‌తో 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. పండుగ సీజన్ మార్కెట్లోకి రానుంది. కాగా, యాక్సెస్ 125 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తోపాటు జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.ఇక జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు విభిన్న రంగాల్లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్‌లో కార్స్, ట్రక్స్, బస్‌ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేయనున్నట్టు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. సాంకేతిక భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు జిందాల్ చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ తొలి వాహనం 2027–2028లో రోడ్లపైకి వస్తుందన్నారు.మారుతీ ఈ–విటారా రేంజ్ 500 కి.మీమారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారా కొలువుదీరింది. 49, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా పరుగుతీయనుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్స్, లెవెల్–2 అడాస్, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. 300 ఎన్ఎం టార్క్ అందించే ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ సైతం ఉంది. ప్రపంచ మార్కెట్‌కు ఈ–విటారా కార్లను మారుతీ సుజుకీ వచ్చే 10 ఏళ్లపాటు ప్రత్యేకంగా సరఫరా చేయనుండడం విశేషం. ఈ–విటారా తయారీ, ప్రత్యేకంగా ఈవీ ప్రొడక్షన్ లైన్ కోసం రూ.2,100 కోట్లకుపైగా పెట్టుబడి చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. కాగా, ‘ఈ ఫర్ మీ’ పేరుతో పూర్థిస్థాయిలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు మారుతీ శ్రీకారం చుట్టింది. టాప్–100 నగరాల్లోని డీలర్షిప్స్ వద్ద ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. అలాగే 1,000కిపైగా నగరాల్లో ఈవీల కోసం ప్రత్యేకంగా 1,500ల పైచిలుకు సరీ్వస్ సెంటర్లను నెలకొల్పుతారు. కొత్తగా 1.5 లక్షల మందికి.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం వెన్నుదన్నుగా నిలిచిందని, తద్వారా పరిశ్రమకు అదనంగా రూ.2.25 లక్షల కోట్ల అమ్మకాలు తోడయ్యాయని నరేంద్ర మోదీ అన్నారు. వాహన రంగంలో కొత్తగా 1.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ఈ పథకం తెచి్చపెట్టిందని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై దేశ వ్యయాలను తగ్గించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణ సౌలభ్యం భారత్‌కు అతిపెద్ద ప్రాధాన్యతగా ఉందని, గత బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. భారత ఆటోమొబైల్ రంగం గత ఏడాది 12% వృద్ధి చెందిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 22 వరకు కొనసాగనుంది. ఆటోమొబైల్, విడిభాగాలు, సాంకేతికతల్లో 100కుపైగా నూతన ఆవిష్కరణలకు ఎక్స్పో వేదిక కానుంది. -
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్‌తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
మారుతీ సుజుకీ నుంచి చిన్న ఈవీ!
న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్ వాటాలో భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్‌కు ఏమి అవసరమో మాకు తెలుసు. అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్‌కు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్‌కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న ఎలక్ట్రిక్ కార్లు.. ఎస్‌యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్‌యూవీలను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు. ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లు ట్యాంక్ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్ఎస్ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది. ఇంకా డిమాండ్ ఉంది.. అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్‌లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఎలక్ట్రిక్ యాక్సెస్ సైతం.. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–యాక్సెస్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్‌లో పెట్రోల్ వర్షన్ యాక్సెస్–125 విక్రయిస్తోంది. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ కావచ్చు..మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్ వచ్చారని, ఈ మార్కెట్ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్ ఎగ్జిక్యూటివ్‌లు అలంకరిస్తున్నారు. -
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు. -
ఈవీ వాహనాల్లో గేమ్‌ఛేంజర్.. నానో పీసీఎం
రవాణా రంగంలో విద్యుత్తు వాహనాలు ఒక సంచలనం...పర్యావరణ హితమైనవి. ఖర్చు తక్కువ. లాభమెక్కువ!ఈ కారణంగానే ఇటీవలి కాలంలో స్కూటర్లు మొదలుకొని..ఆటోలు, మోటార్‌బైకులు, కార్లు అనేకం విద్యుత్తుతోనే నడుస్తున్నాయి!అయితే... వీటిల్లో సమస్యలూ లేకపోలేదు.కొన్ని స్కూటర్లు రోడ్లపైనే కాలి బూడిదవుతూంటే..ఇంకొన్నింటి బ్యాటరీలు టపాసుల్లా పేలిపోతున్నాయి!ఈ సమస్యలకు కారణాలేమిటి? పరిష్కారం ఉందా?విద్యుత్తు వాహనాల్లో ఇప్పుడు వాడుతున్న...లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ‘సాక్షి.కాం’డాక్టర్ నిశాంత్ దొంగరి.. (Nishanth Dongari) విద్యుత్తు వాహన రంగంలో చిరపరిచితమైన పేరిది. హైదరాబాద్‌లోని ఐఐటీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే.. ఇక్కడ మొట్టమొదటి విద్యుత్తు వాహన స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన వ్యక్తి ఈయన. ప్యూర్ ఈవీ (Pure EV) పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న విద్యుత్తు స్కూటర్లు డాక్టర్ నిశాంత్ సృష్టే. ఇటీవలి కాలంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అనేక సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి.కాం’ ఆయన్ను సంప్రదించింది. ఆ వివరాలు..బ్యాటరీలు ఎందుకు కాలిపోతున్నాయి?ఛార్జ్ చేసేటప్పుడు.. వినియోగించే సమయంలోనూ అన్ని బ్యాటరీలూ వేడెక్కుతూంటాయి. ఇది సహజం. అయితే సక్రమంగా నియంత్రించకపోతే ఈ వేడి కాస్తా ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్తు వాహనాల బ్యాటరీలు అన్నింటిలోనూ వేడిని పసికట్టేందుకు సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి.‘‘ప్యూర్ -ఈవీలో మేము ఇంకో అడుగు ముందుకేశాము. బ్యాటరీల్లో వేడిని ఎప్పటికప్పుడు తగ్గించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారి ఫేజ్ ఛేంజ్ మెటీరియల్ (PCM)ను ఉపయోగించాం. వేడి ఎక్కువైనప్పుడు ఈ పదార్థం ద్రవరూపంలోకి మారిపోతుంది. వేడిని బ్యాటరీల నుంచి దూరంగా తీసుకెళుతుంది. తరువాతి కాలంలో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశాము. నానోస్థాయి పదార్థాన్ని చేర్చడం ద్వారా బ్యాటరీల్లోని వేడి మరింత సమర్థంగా తగ్గించగలిగాం. ఈ నానోపీసీఎం కారణంగా ప్యూర్-ఈవీ బ్యాటరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలిపోవు అని గ్యారెంటీగా చెప్పగలం.’’విద్యుత్తు వాహనాల్లో ఏఐ వాడకం ఎలా ఉండబోతోంది?వాహనాల్లో కృత్రిమ మేధ వాడకం గత ఐదేళ్లలో బాగా పెరిగింది. విద్యుత్తు వాహనాల్లో కూడా. ప్రస్తుతం ప్యూర్-ఈవీలో బ్యాటరీ ప్యాక్‌లలోని ఒక్కో సెల్‌ను పరిశీలించేందుకు మేము కృత్రిమ మేధను వాడుతున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను గుర్తించేందుకు, వినియోగదారులకు పరిష్కార మార్గాలు సూచించేందుకూ జనరేటివ్ ఏఐను వాడే ఆలోచనలో ఉన్నాం. ఉదాహరణకు.. మీ వాహనం అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయిందనుకుందాం. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్లో మీ సమస్య వివరాలు ఎంటర్ చేస్తే జనరేటివ్ ఏఐ ‘‘స్విచ్ ఆన్/ఆఫ్ చేసి చూడండి’’ లేదా ఇంకో పరిష్కార మార్గం సూచిస్తుంది.లిథియం అయాన్ బ్యాటరీలు ఇంకెంత కాలం?విద్యుత్తు వాహనాలతోపాటు అనేక ఇతర రంగాల్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలే అధికం. రానున్న 30 - 50 ఏళ్ల వరకూ ఇదే పంథా కొనసాగనుంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది 20 - 25 ఏళ్ల ముందు మాత్రమే. కాథోడ్, ఆనోడ్, ఎలక్ట్రొలైట్, సెపరేటర్ వంటి అనేక అంశాల్లో మెరుగుదలకు చాలా అవకాశాలున్నాయి. నిల్వ చేయగల విద్యుత్తు, భద్రత అంశాలు కూడా బాగా మెరుగు అవుతాయి. సైద్ధాంతికంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ద్రవ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో 220 వాట్ల విద్యుత్తు నిల్వ చేయగలిగితే సాలిడ్ స్టేట్ బ్యాటరీల్లో ఇది 800 వాట్లకు చేరుకోగలదు. రానున్న ఐదేళ్లలో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవడంతోపాటు అవసరమైనప్పుడు అవసరమైనంత వేగాన్ని ఇచ్చే టెక్నాలజీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.భారత్ లాంటి దేశాలు లిథియంపై మౌలిక రంగ పరిశోధనలు మరిన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ముడి ఖనిజం నుంచి లిథియం అయాన్‌ను మరింత సమర్థంగా వెలికితీయగలిగితే, వాడేసిన బ్యాటరీల నుంచి మెరుగ్గా రీసైకిల్ చేయగలిగితే బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ ఈ విషయాల్లో చొరవ చూపాలి. ముడి ఖనిజం ద్వారా వెలికితీసే లిథియంకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాగలదు. లిథియం అయాన్ బ్యాటరీల్లో మరింత ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసేందుకు కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరం (మైలేజీ) మరింత పెరుగుతుంది. కాబట్టి.. సమీప భవిష్యత్తులో లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదనే చెప్పాలి.హోండా లాంటి కంపెనీలు హైడ్రోజన్‌పై దృష్టి పెడుతున్నాయి కదా?నిజమే. కానీ హైడ్రోజన్‌తో వ్యక్తిగత వాహనాలు నడుస్తాయని నేను భావించడం లేదు. లారీలు, ట్రక్కులు, రైళ్లు, చిన్న నౌకల వంటి భారీ వాహనాలకు హైడ్రజన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ కూడా ఇటీవలి కాలంలో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే విషయంలో చొరవ చూపుతోంది. పరిశోధనలపై దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో రవాణా రంగంలో హైడ్రోజన్ కీలకం కాగలదు. చిన్న వాహనాల విషయానికి వస్తే హైడ్రోజన్‌ను నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. -
ఈ ఏడాది బెంజ్ ఎనిమిది కొత్త మోడళ్లు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్‌తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు కొత్త మోడళ్లు..మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరురెండింతలైన ఈవీలు..2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్‌లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు. -
ఈవీ సబ్సిడీల నిలిపివేతకు పరిశ్రమ ఓకే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ పెరుగుతుండటంతో ఇకపై రాయితీలు నిలిపివేసినా సమస్య ఉండదని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీ పథకం ముగిసిన తర్వాత రాయితీలను నిలిపివేయొచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కంపెనీలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. బ్యాటరీ చార్జింగ్, స్వాపింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై పరిశ్రమ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం చెప్పారు. ఈవీల వినియోగంతో ఖర్చులపరంగా ఒనగూరే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ఆయన తెలిపారు. బ్యాటరీల మారి్పడికి ఉమ్మడిగా వనరులు వినియోగించుకోవడం కావచ్చు లేదా సొంత బ్యాటరీలతోనే వాహనాలను విక్రయించడం కావచ్చు ఎటువంటి వ్యాపార విధానాలనైనా పాటించేందుకు వాహనాల తయారీ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్, భారతీయ ప్రమాణాల బ్యూరో, అంకుర సంస్థలు, టాటా..మెర్సిడెస్ బెంజ్ తదితర వాహనాల కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఫేమ్ ఇండియా, పీఎం ఈ–డ్రైవ్ తదితర స్కీముల ద్వారా విద్యుత్తు వాహనాల విక్రయాలను పెంచే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2022లో భారత్‌లో మొత్తం ఈవీల విక్రయాలు 10 లక్షలుగా నమోదయ్యాయి. దేశీయంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటర్స్ అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ ఈవీ దిగ్గజాలను ఆకర్షించేందుకు కేంద్రం గతేడాది మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రవేశపెట్టింది. దీని కింద కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడితో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థలకు సుంకాలపరంగా కొన్ని మినహాయింపులను ప్రతిపాదించింది. అలాగే ఫేమ్–2 స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 10,763 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్‌లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్‌లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్‌లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్‌కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్‌కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్‌లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్‌ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్‌లో టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
ఐపీవోకు 8 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఎనిమిది కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో లీలా ప్యాలస్ మాతృ సంస్థ ష్లాస్ బెంగళూరు, ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ, మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ తదితరాలున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్ 10–23 మధ్య కాలంలో ఇవి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఈ నెలాఖరుకల్లా అనుమతులు పొందాయి. ఐపీవోకు అనుమతి లభించిన ఇతర కంపెనీలలో ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ సైతం చేరాయి. వివరాలు చూద్దాం..ఏథర్ ఎనర్జీ ద్విచక్ర ఈవీ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలో ఈవీ ప్లాంటు ఏర్పాటుకు, ఆర్‌అండ్‌డీకి, రుణ చెల్లింపులకు, మార్కెటింగ్ వ్యయాలకు వెచ్చించనుంది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ఈవీ కంపెనీగా లిస్ట్‌కానుంది.హోటల్ లీలాలీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్వాహక కంపెనీ ష్లాస్ బెంగళూరు ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య రంగ ఐపీవోగా నిలవనుంది. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్కు పెట్టుబడులున్న కంపెనీ ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 10 ప్రాంతాలలోని 12 హోటళ్ల ద్వారా 3,382 గదులను నిర్వహిస్తోంది. ఓస్వాల్ పంప్స్ తక్కువ, అధిక వేగంగల(లోస్పీడ్, హైస్పీడ్) మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్ వివేక్ గుప్తా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలకు, సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్ సోలార్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. ఈ బాటలో హర్యానాలోని కర్ణాల్లో కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు, రుణ చెల్లింపులకు సైతం వెచ్చించనుంది.ఫ్యాబ్ టెక్నాలజీస్ ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్ పరిశ్రమలలో టర్న్‌కీ ఇంజినీరింగ్ సొల్యూషన్లు అందించే ఫ్యాబ్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆయా విభాగాలలో కంపెనీ సమీకృత సొల్యూషన్లు సమకూర్చుతోంది. వీటిలో డిజైనింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ తదితర సేవలున్నాయి. ఐవేల్యూ ఇన్ఫో పీఈ సంస్థ క్రియేడర్కు పెట్టుబడులున్న ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా 1.87 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. క్రియేడర్ 1.11 కోట్ల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రధానంగా డిజిటల్ అప్లికేషన్ల మేనేజింగ్, డేటా నిర్వహణలో సమీకృత ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తోంది. జనవరి 6న స్టాండర్డ్ గ్లాస్ ఆఫర్ఫార్మా రంగానికి ప్రత్యేక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభం కానుంది. జనవరి 8న ఆఫర్ ముగియనుంది. ప్రైస్ బ్యాండ్ రూ. 133–140గా నిర్ణయించారు. కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. అలాగే రూ.350 కోట్ల వరకు వి లువైన 1.84 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ఈ ఆఫర్‌తో తమ హోల్డింగ్స్ లో కొంత భాగాన్ని కంపెనీ ప్రమోటర్లు ఎస్2 ఇంజనీరింగ్, కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్ రావు కందుల విక్రయించనున్నారు.క్వాలిటీ పవర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, పవర్ టెక్నాలజీల కంపెనీ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 225 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్ చిత్రా పాండ్యన్ ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో పాండ్యన్ కుటుంబానికి 100 శాతం వాటా ఉంది. -
ఆటో దిగ్గజాల జత.. సక్సెస్ మంత్ర..!
ఆటోరంగం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఒక కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేగంగా దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఒకవైపు, ఆర్టీఫిషియల్ టెక్నాలజీతో నడిచే డ్రైవర్ లెస్ కార్లు రోబో ట్యాక్సీలు మరోవైపు ఆటో కంపెనీ లకు ఆర్థిక భారాన్ని పెడుతున్నాయి.. అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఆధిపత్యం చెలాయిస్తుంటే, చైనా కంపెనీలు బీవైడీ, నియో, గ్రేట్‌వాల్ మోటార్స్ తక్కువ ధరకే ఈవీలను రోడ్లపైకి తెస్తూ చైనాకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి, అనేక దేశాల్లో ఆటో కంపెనీలు తమ పోటీ కంపెనీలతోనే పొత్తుకు దిగుతున్నాయి.ప్రత్యర్ధి కంపెనీలతోనే చేతులు కలుపుతున్నాయి. కార్ల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా పలు విభాగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా విలీనం బాట పట్టి ఇతర మార్కెట్లకు విస్తరిస్తుంటే మరికొన్ని టెక్నాలజీని షేర్ చేసుకుంటూ కొత్త మోడళ్ల అభివృద్ధి వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. తాజాగా జపనీస్ కంపెనీలు నిస్సాన్, హోండా కూడా విలీనానికి చేతులు కలపడం ఆటో రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా విలీనాలు, భాగస్వామ్యాలతో ఏ కంపెనీ ఎక్కువ లాభపడినట్లు గణాంకాలు వెల్లడించడంలేదు. వివరాలు చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్భాగస్వామ్యాల తీరిదీ.. ⇒ ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతల కోసం ఫోర్డ్ మోటార్, ఫోక్స్‌వేగన్ చేతులు కలిపాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల బిజినెస్‌ను మూసివేయగా.. కొంతమేర లబ్ధి పొందాయి. ⇒ జనరల్ మోటార్స్‌తో హోండా జత కలిసింది. జీఎం తయారు చేసే 2 ఈవీ కార్లను హోండా విక్రయిస్తోంది. ఈ రెండింటికి మాత్రమే ఈ భాగస్వామ్యం పరిమితం. ⇒ ఫ్రాన్స్ ప్యూజో, ఫియట్ క్రిస్లర్ జట్టు కట్టడం ద్వారా 2021లో స్టెల్లాంటిస్‌కు ఊపిరిపోశాయి. అయితే ఫ్యాక్టరీలు మూసివేత బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ⇒ రేనాల్ట్తో నిస్సాన్ జత కలిసింది. దీంతో నిస్సాన్ నిలదొక్కుకుంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే అంత విజయవంతంకాలేదు. ⇒ అందుబాటు ధరల కార్ల తయారీకి వీలుగా లగ్జరీ కార్ల కంపెనీ దైమ్లర్తో, క్రిస్లర్ విలీనమైనప్పటికీ 9 ఏళ్ల తదుపరి 2007లో విడిపోయాయి.దేశీయంగా.. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2016లోనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2019 ఆగస్ట్‌లో దీర్ఘకాలిక సహకారంలో భాగంగా ఈవీ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్‌పై కన్నేశాయి. ఈ బాటలో దేశీయంగా మారుతీ సుజుకీ బ్రాండ్ ద్వారా కార్ల అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు వేశాయి. మరోపక్క మారుతీ సియాజ్, ఎర్టిగా ప్లాట్‌ఫామ్ ద్వారా అభివృద్ధి చేసిన వాహనాలను సరఫరా చేయనుంది. ఇదేవిధంగా సీవిభాగంలోని ఎంపీవీ, టయోటా కరోలా సెడాన్, విటారా బ్రెజ్జా తదితర ప్లాట్‌ఫామ్‌లను పరస్పరం అభివృద్ధి చేయనున్నాయి.టాటా చేతికి జేఎల్ఆర్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి జాగ్వార్– ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్), మజ్దా, వోల్వో విభాగాలను ఫోర్డ్ మోటార్ కంపెనీ విక్రయించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారీ నష్టాలలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జేఎల్ఆర్ను దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తదుపరి కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా అధ్యక్షతన నష్టాలను వీడి లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే. హోండా – నిస్సాన్ విలీనం.. మూడో పెద్ద కంపెనీ జపనీస్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ తాజాగా విలీనానికి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో అమ్మకాలరీత్యా ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీ ఆవిర్భావానికి తెరతీయనున్నాయి. మిత్సుబిషీ సైతం వీటితో కలవనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే విలీన కంపెనీ టయోటా, ఫోక్స్వ్యాగన్తో పోటీ పడనుంది. ఇప్పటికే నిస్సాన్, హోండా, మిత్సుబిషీ సంయుక్తంగా ఈవీల కోసం బ్యాటరీలు తదితర విడిభాగాల తయారీ టెక్నాలజీని పంచుకోనున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అటానమస్ డ్రైవింగ్‌కు వీలుగా సాఫ్ట్ వేర్‌పై పరిశోధనలు సైతం చేపట్టనున్నట్లు తెలియజేశాయి.ఆర్ఐఎల్– టెస్లా టెస్లా దేశీయంగా రిలయన్స్‌తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్లు సమా చారం. తద్వారా స్థానికంగా టెస్లా ఎల క్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్‌తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ దేశీయంగా తొలి హైడ్రోజన్ ఐసీఈ ఇంజిన్‌తో నడిచే హెవీడ్యూటీ ట్రక్‌ను 2023లో ఆవిష్కరించింది.జేఎస్‌డబ్ల్యూ– చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి జిందాల్ గ్రూప్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ సైతం చైనీస్ దిగ్గజాలు బీవైడీ, జీలీ తదితరాలతో చర్చలు. జరుపుతోంది. లైసెన్సింగ్ ఒప్పందం, టెక్నాలజీ బదిలీ తదితరాలకు ఒప్పందాలు కుదుర్చుకునే సన్నాహాల్లో ఉంది. వోల్వో కార్ల కంపెనీగా జీలీ ఇప్పటికే పరోక్షంగా కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా 2024 తొలి 11 నెలల్లో 18.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు విక్రయంకావడంతో పలు దిగ్గజాలు ఈవీ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నాయి. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్‌లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్‌లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్‌వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్‌లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
సెకెండ్ హ్యాండ్ వాహనాలపై భారీ పన్ను?
పాత, వాడిన ఎలక్ట్రిక్ వాహనాలు (EV), తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాలపై వస్తు సేవల పన్ను (GST) పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు ఆధారంగా పన్ను రేటు 12 శాతం నుండి 18 శాతానికి పెంచవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 రిపోర్ట్ పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డిసెంబర్ 20-21 తేదీలలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఈవీలకు రాయితీపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. అలాగే పాత, వాడిన విద్యుత్ వాహనాలపై 12 శాతం పన్ను అమలవుతోంది. దీన్ని 18 శాతానికి తీసుకెళ్లాలని తద్వారా రీసేల్ మార్కెట్ సౌలభ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై విధించే జీఎస్టీ సరఫరాదారు మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.ప్రస్తుత విధానంలో 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన పెట్రోల్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అదేవిధంగా 1500 సీసీ పైగా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన డీజిల్ వాహనాలు, అలాగే 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగిన ఎస్‌యూవీలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు.ఇదీ చదవండి: ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..ఇక ఈవీలు, చిన్న కార్లతో సహా అన్ని ఇతర వాహనాలు ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈవీలతో సహా 12 శాతం కేటగిరీలోని అన్ని వాహనాలకూ 18 శాతం పన్ను విధించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇది ఆమోదం పొందితే అన్ని పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై ఏకరీతిలో 18 శాతం పన్ను అమలవుతుంది. -
హైదరాబాద్ : హైటెక్స్ లో 'గ్రీన్ వాహనాల ఎక్స్పో-2024' ప్రారంభం (ఫొటోలు)
-
కొత్త ఎలక్ట్రిక్ కారు.. పేరు మార్చేసిన మహీంద్రా: ఎందుకంటే..
మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.6ఈ పేరుతో ఇండిగో సేవలుఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది. -
250 కొత్త డీలర్‌షిప్‌లు.. ప్యూర్ ఈవీ విస్తరణ ప్రణాళిక
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సుస్థిర రవాణా కోసం వినూత్న పరిష్కారాలను పరిచయం చేస్తూ దేశవ్యాప్తంగా ఉనికిని పెంచుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.లాంగ్-రేంజ్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశవ్యాప్తంగా తమ మొత్తం నెట్‌వర్క్‌ను 320కి పైగా పెంచుకోవాలని యోచిస్తోంది.నూతన ఆవిష్కరణలు, వాహనదారుల భద్రతకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ నిశాంత్ దొంగరి తెలిపారు. నానో పీసీఎం (ఫేజ్ చేంజ్ మెటీరియల్) టెక్నాలజీని బ్యాటరీ సిస్టమ్‌లలో ఉపయోగించిన మొదటి కంపెనీ తమదే అని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాల శాతం తగ్గడమే కాకుండా బ్యాటరీల సామర్థ్యం కూడా పెరిగిందంటున్నారు. -
బడ్జెట్ ఫ్రెండ్లీ.. రూ. 50వేలుంటే చాలు!
ఒక టూ వీలర్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలైన వెచ్చించాల్సిందే వెచ్చించాల్సిందే అనుకుంటారు. అయితే ఇక్కడ మేము చెప్పబోయే ద్విచక్రవాహనాలు మాత్రం రూ. 50వేలు కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..యో ఎడ్జ్: ఇదొక ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 49,086 మాత్రమే (ఎక్స్ షోరూమ్). 1.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్.. ఒక ఫుల్ ఛార్జీతో 60 కిమీ రేంజ్ అందిస్తుంది3. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. కేవలం 95 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.టీవీఎస్ ఎక్స్ఎల్ 100: ఎక్కువగా గ్రామాల్లో కనిపించే ఈ టూ వీలర్.. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం. రూ. 46671 (ఎక్స్ షోరూమ్) విలువైన ఈ వెహికల్ బరువులు మోయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మన ఊరి బందీగా ప్రసిద్ధి చెందిన ఈ ఎక్స్ఎల్ 100 ఇప్పటికి 10 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం.టీవీఎస్ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ: రూ. 44,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఫ్రెండ్లీ బడ్జెట్ టూ వీలర్. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ 99.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది కేవలం 88 కేజీల బరువున్నప్పటికీ.. 59.5 కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.పైన చెప్పిన టూ వీలర్ ధరలు.. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ధరల్లో మార్పు ఉంటుంది. ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’
ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ మార్పులకు పరిష్కారం చూపవని ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ తెలిపారు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా వాతావరణ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అందుకు బదులుగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై ప్రపంచం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల లండన్ కింగ్స్ కాలేజీలో గ్లోబల్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య. దీన్ని పరిష్కరించేందుకు అందరూ ముందుకు రావాలి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సమస్యకు పరిష్కారం చూపవు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా ఇది పరిష్కారం కాదు. స్థానిక ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. బంగ్లాదేశ్‌లో చాలా ఏళ్లుగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ వాతావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దాంతో స్థానికులు వాతావరణానికి చేటు చేసే కార్యాలకు స్వతహాగా దూరంగా ఉంటున్నారు. ఈ మార్పునకు ఏదో గొప్ప సాంకేతిక తోడ్పడలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. భారత్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశం. అలాంటిది ఇక్కడి రైతులు చాలా ఏళ్లుగా తమకు తోచినంతలో నీటిని సమర్థంగా వాడుకుని పంటలు పండిస్తున్నారు. వనరులను సమర్థంగా వాడుకోవాలనే స్పృహ అందరిలోనూ ఉండాలి. అప్పుడే వాతావరణం మరింత క్షీణించకుండా కాపాడుకోవచ్చు’ అని అమితావ్ ఘోష్ అన్నారు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’‘ఇరాక్ యుద్ధ సమయంలో యూఎస్ మిలిటరీ ఏటా 1.3 బిలియన్ గ్యాలన్ల చమురును వినియోగించింది. ఇది బంగ్లాదేశ్ వార్షిక వినియోగం కంటే ఎక్కువ. యుద్ధాలు, భౌగోళిక అనిశ్చితుల కారణంగా చెలరేగులున్న వైరుధ్యం వల్ల వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. అయినా ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా చర్చకు వస్తాయి’ అని అన్నారు. -
ఫుల్ ఛార్జ్ బ్యాటరీ: నిమిషంలో..
హోండా టూ వీలర్స్ ఇండియా ఇటీవలే.. యాక్టివా ఈ, క్యూసీ1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. యాక్టివా ఈ.. రిమూవబుల్ (స్వాపబుల్) బ్యాటరీ పొందుతుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తరువాత.. ఫుల్ ఛార్జ్ వున్న బ్యాటరీలను స్వాపింగ్ స్టేషన్లో తీసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. వీటిని కేవలం నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చని కంపెనీ కూడా చెబుతోంది. స్వాపింగ్ స్టేషన్ సందర్శించిన తరువాత.. స్మార్ట్ కీ ఉపయోగించి అక్కడ నుంచి బ్యాటరీలను తీసుకోవచ్చు. అదే సమయంలో స్కూటర్లోని బ్యాటరీలను రిమూవ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి సంస్థ చెప్పినట్లుగానే బ్యాటరీని నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చు.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయిఒక్కో బ్యాటరీ బరువు 10.2 కేజీలు ఉంటుంది. స్కూటర్ రెండు బ్యాటరీలతో 102 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమగానే ఉంటుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరిలో మొదలవుతాయి. -
కార్గో ఈ-త్రీవీలర్లకు రాయితీల పొడిగింపు
న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ల కొనుగోలుపై రాయితీలకు సంబంధించి పీఎం ఈ–డ్రైవ్ పథకం రెండవ దశను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 80,546 యూనిట్లకు రాయితీ మంజూరు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే నిర్ధేశించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందే నవంబర్ 7 నాటికే చేరుకుంది.దీంతో 2025 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన రెండవ దశను ముందుగానే ప్రారంభించాల్సి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎల్5 విభాగంలో 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నవంబర్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2024 నవంబర్ 8 నుంచి 2026 మార్చి 31 మధ్య మొత్తం 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్గో త్రీ–వీలర్లకు కిలోవాట్ అవర్‌కు రూ.2,500 సబ్సిడీ ఉంటుంది.రాయితీ కింద గరిష్టంగా ఒక్కో వాహనానికి రూ.25,000 అందిస్తారు. గతంలో ఈ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ ఇచ్చేవారు. గరిష్టంగా రూ.50,000 ఉండేది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. -
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే: ధరలు ఎలా ఉన్నాయంటే..
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్లైట్లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్‌లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్లు, హుడ్ స్కూప్‌తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్లైన్డ్ బంపర్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్‌రౌండ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్‌కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తాయి. -
తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31, 2026 వరకు రెండు సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వంద శాతం మినహాయింపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ పాలసీని కూని ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సంఖ్యను మాపీ చేస్తూ.. అన్ని ఈవీలకు వర్తిస్తుందని వెల్లడించింది.తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఆటో, ట్రాక్టర్స్, బస్సులు కొనుగోలుపైన వంద శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది. కొత్త పాలసీ ప్రకారం ద్విచక్ర వాహనాలపై రూ.15,000, నాలుగు చక్రాల వాహనాలపై రూ.3 లక్షల వరకు పన్నులు, ఫీజులు ఆదా చేసుకోవచ్చు.ప్రస్తుతం తెలంగాణలో 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు సమాచారం. ఇది రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో 5 శాతం అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశంప్రస్తుతం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఈవీ పాలసీ.. ఇతర రాష్ట్రాలకు కూడా చేసే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో.. వాయు కాలుష్యం తీవ్రతరమైపోయింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే.. తప్పకుండా ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాల్సిందే. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ఈ పాలసీని అమలు చేసినా.. ఆశ్చర్యపడల్సిన పని లేదు.కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ పథకాలను తీసుకువచ్చింది. ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రూ.10,900 కోట్లు వెచ్చించింది. ఈ స్కీమ్ 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు.ఇదీ చదవండి: మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సబ్సిడీలను అందించాయి. అయితే ఇప్పుడు ఫ్యూయెల్ వాహనాల మాదిరిగానే.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేశాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈవీల సంఖ్య మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.