2030 నాటికి 5 కోట్ల మందికి ఉద్యోగాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంచనా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
సౌర విద్యుత్ 44 శాతం..
భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.
లక్ష ఈ–బస్‌లు అవసరం..
ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment