డీజిల్ ఇంజన్ల స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజన్లు
తెలంగాణలో 100 శాతం రైల్వే మార్గాలవిద్యుదీకరణకు ఏర్పాట్లు
ఇకనుంచి లైన్ నిర్మాణంతోపాటే విద్యుదీకరణ పనులు.. మనోహరాబాద్–కొత్తపల్లి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుతో శ్రీకారం
టెండర్ల ప్రక్రియ పూర్తి.. 2,3 నెలల్లో పనులు
సాక్షి, హైదరాబాద్: రైలుకు పర్యాయపదంగా వాడే పొగబండి ఇక మాయం కానుంది. డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేను పూర్తిస్థాయిలో విద్యుదీకరించి.. ఇక ఎలక్ట్రిక్ ఇంజన్లనే వాడాలన్న రైల్వే శాఖ నిర్ణయానికి తగ్గట్టుగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు ఆ మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఎలక్ట్రిఫికేషన్ పనులను కూడా నిర్వహించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది.
ఆ నిర్ణయాన్నే ఇప్పుడు అమలులోకి తెస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ (పూర్తి కొత్త) లైన్ పనుల్లో దీనిని అమలు చేయనున్నారు. దీనిలో భాగమైన మనోహరాబాద్ (మేడ్చల్ సమీపం), కొత్తపల్లి (కరీంనగర్ శివారు) ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అటు ట్రాక్ పనులు నిర్వహిస్తూనే సమాంతరంగా విద్యుత్తు లైన్ కూడా ఏర్పాటు చేసే పని ప్రారంభించబోతున్నారు. మామూలుగా అయితే కనీసం ఓ దశాబ్దం తర్వాత జరగాల్సిన పనులు తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడే జరగనున్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. 76.65 కి.మీ. ఉన్న ఈ మార్గాన్ని ముందు విద్యుదీకరించాలని నిర్ణయించారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరో రెండుమూడు నెలల్లో పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు.
తెలంగాణలో జరగాల్సింది
94 కి.మీ. మాత్రమే..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. వీటిల్లో 6,150 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 2,015 రూట్ కి.మీ.లలో ట్రాక్ ఉండగా ఇప్పటికే 1,921 రూట్ కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 94 కి.మీ.మేర మాత్రమే విద్యుదీకరణ పనులు జరగాల్సి ఉంది. ఏడాదిలో ఆ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రైలు మార్గాల జాబితాలో మనోహరాబాద్–కొత్తపల్లి రూట్‌ను చేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే, విద్యుదీకరించనున్నందున దీనినీ ఎలక్ట్రిఫికేషన్ జాబితాలో చేరుస్తున్నారు. అకోలా మార్గంలో ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మధ్య పనులు జరగాల్సి ఉంది. అక్కన్నపేట–మెదక్ మధ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే తెలంగాణలో 100% విద్యుదీకరణ జరిగినట్టవుతుంది.
రూ.105 కోట్లతో పనులు..
మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ దాటాక ఈ కొత్త మార్గం మొదలవుతుంది. అక్కడి నుంచి 76.65 కి.మీ. దూరంలో ఉన్న సిద్దిపేట వరకు పనులు పూర్తి కావటంతో రైలు సరీ్వసులు ప్రారంభించారు. ప్రస్తుతం డీజిల్ లోకోతో కూడిన డెమూ రైళ్లు నడుస్తున్నాయి. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సమీపంలోని మానేరు మీద వంతెన నిర్మించి నది దాటాక కొత్తపల్లి వరకు ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 2027 నాటికి ఆ పనులు పూర్తవుతాయి. ఈలోపు సిద్దిపేట వరకు విద్యుదీకరించాలని నిర్ణయించి, అక్కడి వరకు రూ.105.05 కోట్లతో నిర్వహించే పనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో నిర్మాణ సంస్థకు అవార్డు అందచేయటంతో పనులు మొదలుకానున్నాయి.
గజ్వేల్ సమీపంలో 25 కేవీ సబ్‌స్టేషన్..
విద్యుత్ సరఫరా కోసం గజ్వేల్ సమీపంలో 25 కేవీ సామర్థ్యంతో ప్రత్యేక సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. త్వరలో ఈ పనులు మొదలు కానున్నాయి. స్థానికంగా ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment