Railway Department
-
రైల్వే జోన్ పనులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ఐదున్నరేళ్ల తర్వాత కలల జోన్ పనులకు రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు రూ.149.16 కోట్లతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ టెండర్లు పిలిచింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వేకు కేటాయించిన ముడసర్లోవ భూముల్లోనే జోన్ జీఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపు దిద్దుకోనుంది. టెండర్లు ఖరారు చేసిన 24 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తి చేయాలని షరతులు విధించింది. ఈ ఏడాది జనవరిలోనే ముడసర్లోవ భూములు అప్పగిస్తే.. అవి ముంపు భూములంటూ అబద్ధాలతో గోబెల్స్ ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అవే భూములు దిక్కంటూ జోన్ కార్యాలయ పనులకు సిద్ధం చేయడం గమనార్హం. రెండు బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 9 అంతస్తులతో హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ నిర్మించనున్నారు. ప్రతి భవనానికి రెండు యాక్సెస్ పాయింట్లు, రెండు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్ ఏరియా, పార్కింగ్ పావ్డ్ ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, బిల్ట్ అప్ ఏరియా, బేస్మెంట్, పార్కింగ్ ఇలా.. ప్యాకేజీలుగా పనులు విభజించారు. అసలేం జరిగిందంటే..రోడ్డు విస్తరణలో భాగంగా పెందుర్తి ట్రాన్సిట్ కారిడార్ మంజూరు చేసిన సమయంలో రోడ్డు నిర్మాణానికి, రైల్వే భూముల్లో తరాలుగా ఉన్న మురికివాడల అభివృద్ధికి మొత్తం 26.11 ఎకరాలు అవసరమయ్యాయి. దీనిపై రైల్వే అధికారులతో దఫ దఫాలుగా జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. చివరికి 1ః2 నిష్పత్తిలో అంటే 52.22 ఎకరాలు ముడసర్లోవలో ఇచ్చే ప్రతిపాదనకు రైల్వే అధికారులు అంగీకరించారు. ముడసర్లోవ స్థలం రైల్వేకు ఇచ్చేందుకు 2013 ఫిబ్రవరి 2న నం.55/12తో జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేశారు. దీనిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబర్ 26న జీవో ఎంఎస్ నం.254 జారీ చేసింది. విశాఖపట్నం రూరల్‌లోని ముడసర్లోవలో సర్వే నెం.26లో జీవీఎంసీకి చెందిన సుమారు 270 ఎకరాలు పోరంబోకు ఉండగా, ఇందులో 52 ఎకరాలు రైల్వే శాఖకు అప్పగించేందుకు నిర్ణయించారు. అప్పట్లో రైల్వే అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేసి, వారు ఆమోదించిన తర్వాతే భూమి అప్పగింత చర్యలు చేపట్టారు. జీవీఎంసీ, రైల్వేల మధ్య 2013లో ఒప్పందం కుదిరితే 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా, భూమి ఇవ్వకుండా జాప్యం చేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములు అందిస్తే.. దానిపైనా విష ప్రచారం చేశారు. ఏ నిర్మాణాలకైనా అనుకూలంవాస్తవానికి రైల్వేకు ఇచ్చిన ఈ ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అది మిక్స్డ్ జోన్. ఏ విధమైన భవనాలైనా నిర్మించుకునేందుకు అనుకూలమైన స్థలంగా ధ్రువీకరించారు. ఆ భూమి చెరువు బ్యాక్ వాటర్‌లో లేదని, ముడసర్లోవ రిజర్వాయర్‌లో భాగం కాదని, ముంపునకు గురయ్యే అవకాశమే లేదని మాస్టర్ ప్లాన్‌లో స్పష్టం చేశారు. ఈ విషయంపై రైల్వే అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, లేఖలూ రాలేదు. అక్కడ ఉన్న ఆక్రమణల్ని తొలగించి.. స్థానికులతో సంప్రదింపులు చేసి.. సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించి రెవిన్యూ శాఖ మొత్తం స్థలానికి కంచె కూడా వేసింది. రైల్వేకు ఇవ్వాల్సిన 52.22 ఎకరాల భూమిని క్లియర్ టైటిల్‌తో సిద్ధం చేశారు. వాల్తేరు డీఆర్ఎంకు ఈ ఏడాది జనవరి 2న లేఖలు రాసి.. అప్పగించారు. నాడు అది ముంపు ప్రాంతమంటూ అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. ఇప్పుడు అదే భూమి అద్భుతమంటూ పొగడటం గమనార్హం.తాత్కాలిక సేవలు ఎప్పుడో మరి?2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ.. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే.. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు ఇవ్వాలా వద్దా.. అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పని లేకుండా.. జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తను సమర్పించిన జోన్ డీపీఆర్‌లోనూ పొందు పరిచారు. -
పొగ బండులు ఇక మాయం
సాక్షి, హైదరాబాద్: రైలుకు పర్యాయపదంగా వాడే పొగబండి ఇక మాయం కానుంది. డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేను పూర్తిస్థాయిలో విద్యుదీకరించి.. ఇక ఎలక్ట్రిక్ ఇంజన్లనే వాడాలన్న రైల్వే శాఖ నిర్ణయానికి తగ్గట్టుగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు ఆ మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఎలక్ట్రిఫికేషన్ పనులను కూడా నిర్వహించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది.ఆ నిర్ణయాన్నే ఇప్పుడు అమలులోకి తెస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ (పూర్తి కొత్త) లైన్ పనుల్లో దీనిని అమలు చేయనున్నారు. దీనిలో భాగమైన మనోహరాబాద్ (మేడ్చల్ సమీపం), కొత్తపల్లి (కరీంనగర్ శివారు) ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అటు ట్రాక్ పనులు నిర్వహిస్తూనే సమాంతరంగా విద్యుత్తు లైన్ కూడా ఏర్పాటు చేసే పని ప్రారంభించబోతున్నారు. మామూలుగా అయితే కనీసం ఓ దశాబ్దం తర్వాత జరగాల్సిన పనులు తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడే జరగనున్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. 76.65 కి.మీ. ఉన్న ఈ మార్గాన్ని ముందు విద్యుదీకరించాలని నిర్ణయించారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరో రెండుమూడు నెలల్లో పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు.తెలంగాణలో జరగాల్సింది94 కి.మీ. మాత్రమే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. వీటిల్లో 6,150 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 2,015 రూట్ కి.మీ.లలో ట్రాక్ ఉండగా ఇప్పటికే 1,921 రూట్ కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 94 కి.మీ.మేర మాత్రమే విద్యుదీకరణ పనులు జరగాల్సి ఉంది. ఏడాదిలో ఆ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రైలు మార్గాల జాబితాలో మనోహరాబాద్–కొత్తపల్లి రూట్‌ను చేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే, విద్యుదీకరించనున్నందున దీనినీ ఎలక్ట్రిఫికేషన్ జాబితాలో చేరుస్తున్నారు. అకోలా మార్గంలో ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మధ్య పనులు జరగాల్సి ఉంది. అక్కన్నపేట–మెదక్ మధ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే తెలంగాణలో 100% విద్యుదీకరణ జరిగినట్టవుతుంది. రూ.105 కోట్లతో పనులు.. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ దాటాక ఈ కొత్త మార్గం మొదలవుతుంది. అక్కడి నుంచి 76.65 కి.మీ. దూరంలో ఉన్న సిద్దిపేట వరకు పనులు పూర్తి కావటంతో రైలు సరీ్వసులు ప్రారంభించారు. ప్రస్తుతం డీజిల్ లోకోతో కూడిన డెమూ రైళ్లు నడుస్తున్నాయి. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సమీపంలోని మానేరు మీద వంతెన నిర్మించి నది దాటాక కొత్తపల్లి వరకు ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 2027 నాటికి ఆ పనులు పూర్తవుతాయి. ఈలోపు సిద్దిపేట వరకు విద్యుదీకరించాలని నిర్ణయించి, అక్కడి వరకు రూ.105.05 కోట్లతో నిర్వహించే పనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో నిర్మాణ సంస్థకు అవార్డు అందచేయటంతో పనులు మొదలుకానున్నాయి. గజ్వేల్ సమీపంలో 25 కేవీ సబ్‌స్టేషన్.. విద్యుత్ సరఫరా కోసం గజ్వేల్ సమీపంలో 25 కేవీ సామర్థ్యంతో ప్రత్యేక సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. త్వరలో ఈ పనులు మొదలు కానున్నాయి. స్థానికంగా ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానిస్తారు. -
‘లైడర్’ వచ్చేస్తోంది
రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. తొలి దశలో 1,000 రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి కేంద్రం తీసుకు వస్తోంది. సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 24సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. రైలు పట్టాలను తొలగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను పెట్టడం వంటి దుశ్చర్యలకు విద్రోహులు పాల్పడుతున్నారు. అలాంటి కుట్రలకు చెక్ పెట్టేందుకు రైలు పట్టాల భద్రత కోసం రైల్వే శాఖ లైడర్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఇప్పటికే పట్టాలు తప్పి జరిగే ప్రమాదాల నివారణ కోసం రూ.15 వేల కోట్లతో రైలు కోచ్‌లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుకు రైల్లే శాఖ కార్యచరణ చేపట్టింది. దానికి అదనంగా లైడర్ ప్రాజెక్ట్‌కు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే టెండర్లు పిలిచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు సంక్లిప్తంగా...దేశవ్యాప్తంగా విస్తరణలైడర్ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. మొదటి దశలో వెయ్యి రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకొస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,200 కోట్ల ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు సైతం పిలిచింది. ఈ ప్రాజక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెన్సార్ టెక్నాలజీతో..» లైడర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండే సెన్సార్ టెక్నాలజీ రైలు పట్టాల త్రీడీ నమూనాలను రూపొందించి లోకో పైలెట్ కేబిన్‌లోకి పంపిస్తుంది. » రైళ్లలో ఏర్పాటు చేసే సెన్సార్లు రైలు పట్టాల రియల్ టైమ్ డేటాను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. » రైలు పట్టాలు తప్పినా, పట్టాలు విరిగినా, పట్టాలపై చిన్న బీటలు ఉన్నా సరే వెంటనే గుర్తించవచ్చు. » లేజర్ బీమ్లతో రైలు పట్టాలను సెన్సార్ చేసి.. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే గుర్తించే వీలు కలుగుతుంది.» ఆ ప్రమాదం ఎంత దూరంలో ఉందన్నది కూడా ఈ సాంకేతికత కచ్చితంగా తెలియజేస్తుంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే కనీసం 15 కి.మీ. దూరంలోనే రైలును నిలిపివేసేందుకు లోకో పైలట్‌కు అవకాశం ఉంటుంది. -
‘కవచ్’కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు రైల్వే శాఖ మేల్కొంది. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు అవి పరస్పరం ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక ‘కవచ్’ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రయోగాలు, పరీక్షలు అంటూ కాలయాపన చేసిన తర్వాత ఆ పరిజ్ఞానాన్ని ట్రాక్ మీద, లోకోమోటివ్‌లలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచింది. ఈ పరిజ్ఞానానికి సంబంధించి 4.0 వెర్షన్ ప్రయోగాలు విజయవంతం కావటంతో, దాన్ని దశలవారీగా అన్ని జోన్లలో ఏర్పాటు చేయనుంది.ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 వేల రూట్ కిలోమీటర్లలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో ఆ వ్యవస్థ ఉండగా, కొత్తగా మరో 1,618 రూట్ కి.మీ.లలో ఏర్పాటుకు తాజాగా రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. దక్షిణ మధ్య రైల్వేతో శ్రీకారం..: దేశంలో తొలిసారి కవచ్ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కవచ్ పరిజ్ఞా నాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు 2014–15లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడి సెక్షన్లను ఎంచుకున్నారు. 250 కి.మీ. పరి ధిలో పలు దశల్లో పరీక్షించారు. 2015–16లో ప్యాసింజర్ రైళ్లలో క్షేత్రస్థాయి ట్రయల్స్ నిర్వ హించారు. 2017–18లో కవచ్ స్పెసిఫికేషన్ వెర్షన్ 3.2ను విజయవంతంగా ముగించారు. 2018–19లో ఈ పరిజ్ఞానానికి ఆర్డీఎస్ఓ ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో, 200 లోకోమోటివ్స్‌లో ఏర్పాటైంది. ఇప్పుడు కవచ్ మేజర్ వర్షన్ అయిన 4.0 ద్వారా ఆ పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షన్ ట్రయల్స్ కోసం సనత్‌నగర్–వికారాబాద్ సెక్షన్ పరిధిలో 65 రూట్ కి.మీ.లలో ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఈ పరిజ్ఞానాన్ని హై డెన్సిటీ నెట్ వర్క్ పరిధిలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోస బలార్షా–కాజీపేట– విజయవాడ, విజయవాడ–గూడూరు, విజయ వాడ–దువ్వాడ, వాడి–గుంతకల్–ఎర్రగుంట్ల–రేణిగుంట కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఈ రూట్లలో మొత్తం 1,618 రూట్ కి.మీ. లలో ఏర్పాటుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కవచ్‌తో ఇవీ లాభాలు» ఒకే ట్రాక్‌మీద రెండు రైళ్లు వచ్చినప్పు డు లోకోపైలట్ బ్రేక్ వేయకపోయినా, ఆ పరిజ్ఞానం వల్ల రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుంది. » ఎక్కడైనా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు లోకోపైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు నడిపినప్పుడు లోకో పైలట్‌ను ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ రైలును ఆపకపోతే తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది. » అవసరమైన ప్రాంతాల్లో హారన్ మోగించనప్పుడు ఇది తనంతట తానుగా ఆ పని చేస్తుంది. -
ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్‌లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలోని భుజ్ నగరం మధ్య ఇది నడవనుంది. మరిన్ని వందే మెట్రో రైళ్లను కూడా త్వరలో ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది. వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్‌లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం. ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. -
సికింద్రాబాద్–నాగ్‌పూర్ వందేభారత్‌కు 20 కోచ్‌లు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పునకు కారణమైన వందేభారత్ రైళ్ల సిరీస్‌లో మరో నూతన అంకానికి కేంద్ర ప్రభుత్వం తెరదీస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ కేటగిరీ రైళ్లలో మొదలైన వందేభారత్ తదుపరి వర్షన్‌గా వందేభారత్ స్లీపర్ సరీ్వసులు ప్రారంభిస్తున్న రైల్వే, తాజాగా 20 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 16 కోచ్‌ల వందేభారత్, 8 కోచ్‌ల మినీ వందేభారత్ రైళ్లే తిరుగుతున్నాయి. మొదటిసారి 20 కోచ్‌ల రేక్‌ను ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అలాంటి నాలుగు రైళ్లను ప్రారంభిస్తుండగా, అందులో ఒకటి తెలంగాణ నుంచి నడవనుండటం విశేషం. ఈనెల 16న ప్రారంభం కానున్న సికింద్రాబాద్–నాగ్‌పూర్ ఆరెంజ్ వందేభారత్‌ను కూడా 20 కోచ్‌లతో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లే..మరింతమంది ప్రయాణికులను సర్దుబాటు చేసే క్రమంలో 20 కోచ్‌ల సెట్‌ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ ఆలోచనకు రాగా, ప్రతినెలా అలాంటి ఒక సెట్‌ను తయారు చేయాలని చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యా క్టరీని ఆదేశించింది. దీంతో మే, జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి నాలుగు రేక్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో రెండింటిని ఉత్తర రైల్వేకు, తూర్పు రైల్వేకు, సెంట్రల్ రైల్వే జోన్‌కు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు గతంలోనే మంజూరైంది. రేక్ కొరత వల్ల దాని ప్రారంభం ఆలస్యమవుతూ వచి్చంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వేకు కేటాయించిన 20 కోచ్‌ల రైలును సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య తిప్పనున్నట్టు తెలిసింది. 20 కోచ్‌ల వందేభారత్‌లో 3 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు, 16 ఎకానమీ (ఏసీ చైర్‌కార్) కోచ్‌లు ఉంటాయని సమాచారం. సాధారణ 16 కోచ్‌ల రేక్‌లో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2, ఎకానమీ కోచ్‌లు 14 ఉంటున్నాయి.యమ గిరాకీఎనిమిది కోచ్‌ల వందేభారత్‌లో 530 సీట్లుంటున్నాయి. అదే 16 కోచ్‌ల వందేభారత్‌లో 1,128 సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్‌ల రేక్‌లో 312 సీట్లు పెంచుతూ వాటి సంఖ్యను 1,440కి విస్తరించారు. ఆ మేరకు ప్రయాణికులకు అదనంగా వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 110 శాతంగా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం వందేభారత్‌లో అది 130 శాతాన్ని మించింది. దీంతో కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య మూడు డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లు తిరుగుతున్నాయి. హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు నాగ్‌పూర్ మీదుగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి ఓసారి నడిచే హైదరాబాద్–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, వారానికి నాలుగు రోజులు తిరిగే బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు సహా మొత్తం 8 రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలు రానుంది. -
సికింద్రాబాద్: రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక, ఇక నుంచి..
వేలాదిమంది ప్రయాణికులు... ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఒకటి– పది.. ప్లాట్‌ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశద్వారాల్లో బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పని చేయదు. పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా పట్టించుకోరు.. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో... వెరసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకొంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. వెరసి ఈ స్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహాలో పటిష్టమైన భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందిన ఘనతను సాధించుకున్నది భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. కానీ, అక్కడ భారీ వ్యయంతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా.. అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు అటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.లగేజీ చెకింగ్ తర్వాతే లోనికిసికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెకింగ్ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు రైలు బయలుదేరే వేళ కంటే కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి విమానాశ్రయాల్లోనే ఉంటోంది. విమాన ప్రయాణికులకు లగేజీ చెకింగ్ అనేది నిర్బంధ ప్రక్రియ. అది జరక్కుంటే విమానంలోకి అనుమతి ఉండదు. అదే పద్ధతిని సికింద్రాబాద్ స్టేషన్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.రైలు అనౌన్స్మెంట్ అయ్యాకే ప్లాట్‌ఫామ్ పైకిప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌పామ్‌లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతిస్తారు.ఆలస్యంగా వస్తే అంతేసరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్‌ఫామ్ మీదకు పరుగెత్తుకు రావటం స్టేషన్లలో నిత్యకృత్యం. కానీ, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వారిని అనుమతించకూడదన్న యోచనలో అధికారులున్నారు. కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకునే ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే.కునుకు కోసం వచ్చే వారికి ఇక నో ఎంట్రీప్రయాణాలతో ప్రమేయం లేకుండా చాలా మంది చీకటిపడగానే స్టేషన్లోకి చేరుకుని ఏ ఖాళీ బెంచీనో చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక అలాంటి వారికి లోనికి అనుమతి ఉండదు. టికెట్ ఉన్న వారిని మాత్రమే.. రైలు వచ్చే వేళకు ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతిస్తారు. లేని వారికి నో ఎంట్రీ. వెరసి ఇక ప్లాట్‌ఫామ్ ప్రాంతాలు అడ్డదిడ్డంగా పడుకునేవారితో కనిపించవన్నమాట.మిగతావాటి సంగతేంటి..?ప్రపంచస్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. ఏపీ పరిధిలో తిరుపతి, నెల్లూరు ఉండగా, తెలంగాణలో ఒక్క సికింద్రాబాద్ మాత్రమే ఉంది. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్‌భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇవి ఉన్న భవనాలను మెరుగు పరుస్తారు. సికింద్రాబాద్ తరహాలో మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించరు. అమృత్‌భారత్ స్టేషన్లలో ఈ పద్ధతులు ఉండాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అమృత్‌భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగానే అభివృద్ధి చేస్తున్న నగరంలోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో మాత్రం సికింద్రాబాద్ తరహా విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు. -
భూ పరిహారానికీ పైసల్లేవు
సాక్షి, హైదరాబాద్: కీలక రైల్వే ప్రాజెక్టు పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించలేకపోతోంది. తక్కువ మొత్తమే అవసరమున్నా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయే దుస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి గ్రీన్‌ఫీల్డ్ రైల్వే మార్గంగా పనులు ప్రారంభించుకున్న మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు పనులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వేగం మందగించింది. రాజధాని నగరంతో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌లాంటి కీలక పట్టణాలను నేరుగా అనుసంధానించే కీలక ప్రాజెక్టు అయినప్పటికీ, భూసేకరణ నిధులు విడుదల చేయకపోవటంతో ఆ ప్రాజెక్టు పనులు పడకేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు 2023లో రైలు సర్విసు ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి సిరిసిల్ల వరకు రైలు సర్విసు ప్రారంభించేలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. సిరిసిల్ల స్టేషన్‌కు చేరువలో ఉన్న మానేరు నదిని దాటి తదుపరి కరీంనగర్ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. సిరిసిల్ల వరకు ట్రాక్ (రెయిల్స్ పరవటం) ఏర్పాటు పనులు జరుపుతూనే, కరీంనగర్ వరకు నేలను లెవల్ చేసే పనిని సమాంతరంగా నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనుల కోసం టెండర్లు పిలిచి పనులు నిర్వహిస్తున్న రైల్వే, ఆపై కరీంనగర్ వరకు కూడా తదుపరి టెండర్ పిలవాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి వరకు భూసేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. దీంతో అక్కడి వరకు భూమి రైల్వేకు స్వా«దీనం కావటంతో.. తంగళ్లపల్లి వరకు పనుల కోసం టెండర్లు పిలిచింది. ఇప్పుడు ఆక్కడే పనులు జరుగుతున్నాయి. తంగళ్లపల్లి తర్వాత 15 హెక్టార్ల అటవీ భూములున్నాయి. దానికి సంబంధించి అనుమతి రావాల్సి ఉంది. ఆ తర్వాత సిరిసిల్ల వరకు భూపరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదు. నిజానికి కొత్తపల్లి వరకు భూసేకరణ ప్రక్రియ అంతా పూర్తయింది. రైతులకు పరిహారాన్ని అందించటమే మిగిలిఉంది. పరిహారం అందిస్తేనే ఆ భూములు రైల్వేకు స్వా«దీనం చేసే పరిస్థితి ఉంటుంది. తన వంతు వాటాగా తాజా బడ్జెట్లో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుకు రూ.350 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. గతేడాది బడ్జెట్ నిధుల (రూ.185 కోట్లు) కంటే ఇది దాదాపు రెట్టింపు కావటం విశేషం. రూ.130 కోట్లు మాత్రమే.. తంగళ్లపల్లి నుంచి సిరిసిల్ల మధ్యలో పరిహారం మొత్తం రూ.68 కోట్లుగా ఉంది. ఆ తర్వాత కొత్తపల్లి (చివరి స్టేషన్) వరకు మరో రూ.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి సాంకేతిక అంశాలన్నీ పూర్తయి కేవలం పరిహారం చెల్లింపు మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టులో భూసేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ప్రక్రియనే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇతర అవసరాలకు నిధులు మళ్లించటంతో భూపరిహారానికి డబ్బులు కేటాయించలేకపోతోందంటూ కొందరు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ పలుదఫాలుగా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నిధులు మాత్రం విడుదల కావటం లేదు. భూ పరిహారం చెల్లింపు పూర్తయితే తప్ప ఆ పనులు చేపట్టే వీలు లేదు. రైల్వే శాఖ ఆయా పనులకు టెండర్లు పిలవాలంటే కనీసం 90 శాతం భూమి తన స్వాధీనం అయి ఉండాలి. పరిహారం డబ్బులు చెల్లించనందున స్వా«దీన ప్రక్రియకు వీలు లేదు. దీంతో కొత్తపల్లి వరకు రైలును నడిపేందుకు మరో మూడేళ్ల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి ఉందని తెలుస్తోంది. -
‘ఏసీ’ భారం.. జనరల్ ‘ఘోరం’
ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఆదాయం దృష్టితో కాకుండా బాధ్యతతో వ్యవహరిస్తాయి. ప్రధానంగా మన దేశంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి నప్పుడు ఎక్కువగా ప్రయాణించేది రైళ్ల లోనే. అదీ స్లీపర్, జనరల్ కోచ్‌ల్లోనే. తక్కువ చార్జీతో గమ్యస్థానం చేరొచ్చనేదే పేదల ఆశ. అయితే కొంత కాలంగా రైల్వే శాఖ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. జనరల్, స్లీపర్ కోచ్ లను తగ్గించేస్తూ.. ఏసీ కోచ్‌లను పెంచేస్తూ ‘పక్కా వ్యాపారం’ చేస్తోంది. పర్యవసానంగా ఏ రైలులోని జనరల్ కోచ్‌ల్లో చూసినా పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి.. ఒంటి కాలిపై నిల్చొని.. టాయ్‌లెట్స్ ముందు ఇరుక్కుని.. మెట్లపై వేలాడుతూ.. చెమటలు కార్చుకుంటూ.. చిన్నారుల ఏడుపుల మధ్య ప్రయాణం సాగించాల్సి వస్తోంది. 70–80 మంది ప్రయాణించాల్సిన కోచ్‌లో దాదాపు 500 మంది వెళుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది. హౌరా, పూరి, గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వివేక్ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్.. ఇలా ఒక్కటేమిటి రైళ్లన్నింటిలోనూ ఇదే దుస్థితి. ‘ఊరికి ఎలా వెళ్లాలి దేవుడా..’ అంటూ పేదలు వణికిపోతున్నారు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు.. అనే నానుడికి ఇప్పుడు రైల్లో జనరల్ బోగీ ఎక్కిచూడు.. అనే వాక్యం కలుపుకోవాలి. రైలు ఎక్కాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనని సామాన్యులు హడలి పోతుండటం నేటి వాస్తవం. ఏసీ కోచ్‌లో వెళ్లాలంటే ఆరి్థక భారం.. స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉండవు.. జనరల్ కోచ్‌లలో కాలు పెట్టేందుకే చోటుండదు.. ఇదీ సగటు రైల్వే ప్రయాణికుల దుస్థితి. రైల్వేల ఆధునికీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ పన్నిన మాయోపాయం పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ధనిక, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా రైళ్లను తీర్చిదిద్దడమే ఆధునికీకరణని రైల్వే శాఖ వక్రభాష్యం చెబుతోంది. సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండటం.. వారికి మెరుగైన వసతులు సమకూర్చడం అనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా పక్కా పన్నాగంతో జనరల్, స్లీపర్ కోచ్‌ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది. కోచ్‌ల సంఖ్యే కాకుండా ఏకంగా దేశంలో జనరల్, స్లీపర్ కోచ్‌ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ... రాబోయే కాలమంతా ఏసీ రైలు ప్రయాణమేనని తేల్చి చెబుతోంది. కేవలం ఏసీ కోచ్‌లే అందుబాటులో ఉండేలా చేసి భారీగా టికెట్ల రాబడి పెంచుకోవాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రయాణికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ అంశంపై ‘సాక్షి’ దృష్టి సారించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణించే ప్రధాన రైళ్లలో పరిస్థితిని పరిశీలించింది. యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, కోరమండల్, హౌరా–చెన్నై మెయిల్, గౌతమి, శేషాద్రి, పద్మావతి, ఎల్టీటీ, అల్లెప్పి–ధన్‌బాద్, తిరుపతి–పూరి, నవ జీవన్, తిరుపతి –హౌరా, ప్రశాంతి.. ఇలా ఏ రైలు చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్త రైళ్లలో తీవ్ర అవస్థల మయం.. అన్నట్లుంది జనరల్, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణికుల పరిస్థితి. జనరల్, స్లీపర్ కోచ్‌ల కోత రైల్వే శాఖ ఓ ప్రణాళిక ప్రకారం నాలుగేళ్లుగా వందే భారత్ వంటి ఏసీ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. తద్వారా అధిక చార్జీలు ఉండే ఏసీ కోచ్‌ల వైపు ప్రయాణికులను మళ్లించడం ద్వారా అధిక ఆదాయ సముపార్జనకే పెద్దపీట వేస్తోంది. మరోవైపు దిగువ మధ్య తరగతి, పేద ప్రయాణికులు ప్రయాణించే స్లీపర్, జనరల్ కోచ్‌ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. 2019లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియను మూడేళ్లుగా వేగవంతం చేసింది. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రాయాణికుల కోసం సగటున 22 కోచ్‌లతో నిర్వహిస్తున్నారు. గతంలో రైళ్లలో జనరల్ కోచ్‌లు నాలుగు, స్లీపర్ కోచ్‌లు 12 వరకు ఉండగా.. థర్డ్ ఏసీ కోచ్‌లు మూడు, సెకండ్ ఏసీ కోచ్‌లు రెండు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉండేవి. కానీ మూడేళ్లుగా రైలు కోచ్‌ల కూర్పును రైల్వే శాఖ అమాంతం మార్చేసింది. ప్రస్తుతం జనరల్ కోచ్‌లు రెండు, స్లీపర్ కోచ్‌లు 10కి తగ్గించింది. థర్డ్ ఏసీ కోచ్‌లు ఆరు, సెకండ్ ఏసీ కోచ్‌లు మూడు, ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటిగా చేసింది. దాంతో ఒక్కో రైలులో స్లీపర్ కోచ్‌లలో దాదాపు 150 బెర్త్‌లు, జనరల్ కోచ్‌లలో 150 వరకు సీట్లు తగ్గిపోయాయి. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఆధారపడే 300 సీట్లలో కోత పడింది. మరోవైపు ఏసీ కోచ్‌ల సంఖ్య పెరగడంతో వాటిలో 280 నుంచి 300 బెర్త్‌లు పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవుల స్పెషల్ రైళ్లలో అయితే స్లీపర్ కోచ్‌ల సంఖ్య కేవలం ఆరింటికే పరిమితం చేస్తూ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ప్రధానమైన 40 రైళ్లలో ఏకంగా 100 ఏసీ కోచ్‌లను పెంచింది. వాటిలో థర్డ్ ఏసీ కోచ్‌లు 75, సెకండ్ ఏసీ కోచ్‌లు 20, ఫస్ట్ ఏసీ కోచ్‌లు 5 ఉన్నాయి. కొత్తగా ఎల్‌హెచ్‌బీ సాంకేతిక విధానంతో ఉత్పత్తి చేస్తున్న కోచ్‌లను ప్రవేశపెడుతున్నామనే సాకుతో స్లీపర్ కోచ్‌లను తగ్గిస్తూ ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోచ్‌ల ఉత్పత్తిలోనూ అదే వివక్ష కొత్త రైల్వే కోచ్‌ల ఉత్పత్తిలోనూ కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రయాణికుల పట్ల వివక్ష కనబరుస్తోంది. అయిదేళ్లుగా రైల్వే శాఖ ఉత్పత్తి చేస్తున్న కోచ్‌ల విధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని చెన్నై, కపుర్తలా, రాయ్‌బరేలీలోని కోచ్ ఫ్యాక్టరీలలో జనరల్, స్లీపర్ కోచ్‌ల ఉత్పత్తిని రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తూ... ఏసీ కోచ్‌ల ఉత్పత్తిని పెంచుతోంది. ఆ మూడు ఫ్యాక్టరీలలో 2019–20లో 997 ఏసీ కోచ్‌లను ఉత్పత్తి చేశారు. కాగా 2024–25లో ఏకంగా 2,571 ఏసీ కోచ్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరోవైపు ఆ ఫ్యాక్టరీలలో 2019–20లో 1,925 జనరల్, స్లీపర్ కోచ్‌లను ఉత్పత్తి చేశారు. ఆ ఉత్పత్తిలో 85 శాతం కోత విధించి 2024–25లో కేవలం 278 కోచ్‌లే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. అంటే జనరల్, స్లీపర్ కోచ్‌ల స్థానంలో క్రమంగా ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలనే కార్యచరణ అమలు చేస్తోంది. 22 కోచ్‌లు ఉన్న రైళ్లలో కనీసం 18 ఏసీ కోచ్‌లే ఉండేట్టుగా చేయాలన్నది రైల్వే శాఖ అంతిమ లక్ష్యమని రైల్వే వర్గాలు చెప్పడం గమనార్హం. ‘స్లీపర్’లో దొరకదు.. ‘జనరల్’లో చోటు ఉండదు రైల్లో ప్రయాణం అంటేనే పేదలు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. స్లీపర్ కోచ్‌లో ప్రయాణం చేద్దామంటే రిజర్వేషన్లు దొరకడం లేదు. బెర్త్‌లు తగ్గిపోవడంతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే రిజర్వేషన్ దొరకదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ విధానంలో రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధర తడిసి మోపెడవుతోంది. జనరల్ కోచ్‌లో వెళ్లడం అంటే ప్రాణాలకు తెగించి సాహసం చేసినట్టే. ఒక జనరల్ కోచ్‌లో 72 నుంచి 80 వరకు సీట్లు ఉంటాయి. కానీ ఏ సమయంలో ఏ రైలులో జనరల్ కోచ్ చూసినా కనీసం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు. ముగ్గురు కూర్చునే బెర్త్‌లో ఆరుగురు కూర్చోవడమే కాదు.. సీట్ల మధ్య ఖాళీల్లోనూ చివరికి లగేజీ పెట్టే రాక్ల మీద కూడా కూర్చొని కనిపిస్తారు. టాయిలెట్ల పక్కన ఒకరిని నెట్టుకుంటూ ఒకరు కూర్చోనో, నిలబడో పరస్పరం ఘర్షణ పడుతూ ప్రయాణిస్తుండటం అన్నది మన రైళ్లలో సర్వసాధారణమైంది. కనీసం నీళ్లు తాగుదామన్నా అవ్వదు.. టాయిలెట్‌కు వెళ్దామంటే కుదరదు.. కాలు కదుపుదామన్నా సాధ్యం కాదు.. మెట్లపైన సైతం వేలాడుతూ ప్రాణాలకు తెగించి ప్రయాణించే ప్రయాణికుల దృశ్యాలు మన రైళ్లలో నిత్యం ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపిస్తాయి. అధిక రాబడే రైల్వే శాఖ లక్ష్యం అధిక రాబడే లక్ష్యంగా రైల్వే శాఖ ఏసీ కోచ్‌లకు పరిమితికి మించి ప్రాధాన్యమిస్తోంది. జనరల్, స్లీపర్ కోచ్‌లను తగ్గించి ఏసీ కోచ్‌లను పెంచితే అధిక రాబడి వస్తుందన్నది రైల్వే శాఖ ఉద్దేశం. ఉదాహరణకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నంకు స్లీపర్ కోచ్‌లో టికెట్ రూ.255. అదే థర్డ్ ఏసీ అయితే 660, సెకండ్ ఏసీ అయితే 910, ఫస్ట్ ఏసీ అయితే రూ.1,551. ఈ లెక్కన స్లీపర్ కోచ్ కంటే థర్డ్ ఏసీ 100 శాతానికి పైగా, సెకండ్ ఏసీ 200 శాతంపైగా, ఫస్ట్ ఏసీ ఏకంగా 400–500 శాతం అధికం. రైల్వే శాఖ స్లీపర్ కోచ్‌లను తగ్గిస్తూ ఏసీ కోచ్‌లను పెంచడం వెనుక లోగట్టు అధిక రాబడే అని ఈ గణాంకాలు బట్టబయలు చేస్తున్నాయి. రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 22 వేల రైళ్లను నిర్వహిస్తుండగా వాటిలో రోజుకు సగటున 13,500 రైళ్లు నిర్వహిస్తోంది. వాటిలో రోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఆ లెక్కన జనరల్, స్లీపర్ కోచ్‌లను తగ్గించి ఏసీ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేట్టు చేస్తే టికెట్ల ద్వారా భారీ రాబడి సాధించవచ్చనద్ని రైల్వే శాఖ ఉద్దేశం. అంటే కేంద్ర ప్రభుత్వానికి లాభం.. సామాన్య ప్రయాణికులకు భారం. ఇదే రైల్వే శాఖ లెక్క.అమ్మో వందే భారత్ అత్యధిక చార్జీలతో పూర్తిగా ఏసీ కోచ్‌లతో నిర్వహించే వందే భారత్ రైళ్లకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుండటం సామాన్యులకు భారంగా మారింది. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లన్నీ వందేభారత్ రైళ్లేనని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ ప్రస్తుతం దేశంలో 41 వందేభారత్ రైళ్లను నిర్వహిస్తోంది. వాటిలో ఏపీలో నాలుగు నిర్వహిస్తున్నారు. కాగా 2030 నాటికి 800 వందేభారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 40 వేల కోచ్‌లను కూడా వందేభారత్ కోచ్‌ల స్థాయికి ఆధునికీకరిస్తామని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ రైళ్లను నిర్ధిష్ట సమయంలో నడిపేందుకు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.కాళ్లు కింద మోపలేం విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ మంగళవారం కిక్కిరిసి విశాఖపట్నం చేరుకుంది. ఈ రైలులో జనరల్, స్లీపర్క్లాస్లలో కనీసం కాలు మోపేందుకు కూడా ఖాళీ లేదు. ఈ రైలులో జనరల్4, స్లీపర్7, ఏసీ కోచ్‌లు 8 ఉన్నాయి. జనరల్ కోచ్‌లలో 200 మంది చొప్పున ఉన్నారు. స్లీపర్ కోచ్‌లో కేవలం 78 బెర్తుల చొప్పున మాత్రమే ఉన్నప్పటకీ రెట్టింపు ప్రయాణికులు కనిపించారు. డిబ్రూగడ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇదే విధంగా కిక్కిరిసి వెళ్లింది. ఈ రైలులో జనరల్ బోగీలు మూడు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాంద్ర వాసుల ప్రధాన రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న రెండు జనరల్ కోచ్‌లలో పరిస్థితి కనీసం కాలు మోపలేని విధంగా ఉంది. రెండు బోగీల్లో వెయ్యి మంది! ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే తిరుపతి నగరం మీదుగా రోజూ పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లలోని జనరల్ బోగీలన్నీ కిక్కిరిసి ఉంటాయి. హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లోని జనరల్ బోగీలో అయితే ఒకరిపై ఒకరు కూర్చొని, నిల్చొని ప్రయాణిస్తుండటం రోజూ కనిపిస్తుంది. బెంగళూరు నుంచి కాటా్పడి, తిరుపతి, రేణిగుంట, ఒంగోలు, విజయవాడ, శ్రీకాకుళం, పలాస మీదుగా హౌరాకు చేరుకునే ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసి నడిచింది. ఇందులో జనరల్ బోగీలు కేవలం రెండే ఉన్నాయి. ఈ రెండు బోగీల కెపాసిటీ 180 మంది. మంగళవారం సుమారు వెయ్యి మంది ప్రయాణించి ఉండొచ్చని అధికారుల అంచనా. అనేక మంది ఒంటి కాలుపై నిల్చుని ఉండటం కనిపించింది.ఉన్న వాటికీ ఎసరు ఏలూరులో మంగళవారం ఈస్ట్‌కోస్ట్ రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు వచి్చంది. రెండే జనరల్ బోగీలున్నాయి. అప్పటికే ఆ బోగీ కిక్కిరిసి ఉంది. ఒక్క ఏలూరులోనే ఈ రెండు జనరల్ బోగీల్లో 60 మంది ఎక్కారు. ఒక్కో బోగీలో 150–200 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బాత్రూమ్ల వద్ద, నడిచే మార్గంలో, వాకిట్లో కూర్చున్నారు. మరి కొంతమంది రెండు బోగీలను కలిపే మార్గంలో టాయిలెట్లను ఆనుకుని కూడా కూర్చోనుండటం కని్పంచింది. కరోనా సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదు. మహిళలు, దివ్యాంగులు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఉండే బోగీ ఇప్పుడు కనిపించడం లేదు. ఉన్న రైళ్లనూ రద్దు చేస్తున్నారు.ఇదీ లెక్కరాష్ట్రంలో రోజూ సగటున ప్రయాణిస్తున్న రైళ్లు 340350ఇందులో విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్లు 280విజయవాడ నుంచి రోజూ రాకపోకలుసాగిస్తున్న ప్రయాణికులు 1,00,000మొత్తం ప్రయాణికుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు 40%స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తున్నవారు 20%ఒక రైల్లో జనరల్ బోగీలు 10% -
చెన్నై–మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు
సాక్షి, అమరావతి : దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్‌ను నిరి్మంచాలని జాతీయ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ.మేర నిరి్మంచనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్‌ను రైల్వేశాఖ సూత్రప్రాయంగా ఆమోదించి భూసేకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేయనుంది. మూడు రాష్ట్రాల మీదుగా.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్ వరకు నిరి్మస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్‌లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిరి్మస్తారు. రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా ఏలివేటెడ్ కారిడార్, ఎట్ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్‌ఫీల్డ్ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్‌ను ఖరారుచేశారు. ఈ కారిడార్‌లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్‌లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు. మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్.. ఇక ఈ హైస్పీడ్ రైలుకు చెన్నై–మైసూర్ మధ్య 11 చోట్ల హాల్ట్‌లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్‌లలో ఎలివేటెడ్ రైల్వేస్టేషన్లను నిరి్మస్తారు. భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిరి్మంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్‌ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆరి్థక సంవత్సరంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..ఇక ఈ హైస్పీడ్ రైల్ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. -
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నలుగురు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, గాయపడిన 17 మందికి ప్రయాణికులకు చికిత్స అందుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోపు లోకోపైలట్ (డ్రైవర్) మీడియాతో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.‘రైలు పట్టాలు తప్పడానికి ముందు భారీ పేలుడు శబ్ధం విన్నా’అని అన్నారాయన. అయితే ఇందులో కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి రైలు నెంబర్ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రూఘఢ్(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్ సెక్షన్లో మోతిఘడ్ స్టేషన్ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. Gonda Train Derailment | Ex gratia of Rs. 10 lakhs to the family of the deceased, Rs 2.5 lakhs for grievous injury and Rs. 50,000 to the minor injured, has been announced. Apart from the CRS enquiry, a high-level enquiry has been ordered: Ministry of Railways pic.twitter.com/0mDy97pheD— ANI (@ANI) July 18, 2024 -
46 రైళ్లలో జనరల్ బోగీల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దేశవ్యాప్తంగా జనరల్ బోగీలను పెంచాలన్న ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దేశంలోని 46 ప్రముఖ రైళ్లలో రెండేసి చొప్పున మొత్తం 92 జనరల్ కోచ్‌లను పెంచుతున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే త్వరలో మరో 22 రైళ్లలో జనరల్ కోచ్‌లను పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న 12 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 23 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేసి నడపనున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఆ జాబితాలో సికింద్రాబాద్–గూడూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (12710/12709) నవంబర్ 8 నుంచి, సికింద్రాబాద్–హౌరా, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12704/12703) నవంబర్ 8 నుంచి, హైదరాబాద్–విశాఖపట్నం, గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728/12727) నవంబర్ 10 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/12738) నవంబర్ 8 నుంచి, కాకినాడ పోర్టు–భవనగర్, కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (12755/12756) ఈ నెల 14 నుంచి, కాకినాడ పోర్టు–షిర్డీ సాయినగర్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17206/17205) నవంబర్ 11 నుంచి, హైదరాబాద్–తాంబరం, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12760/12759) నవంబర్ 11 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, కొకనాడ ఎక్స్‌ప్రెస్ (12775/12776) నవంబర్ 12 నుంచి, సికింద్రాబాద్–భువనేశ్వర్, విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016/17015) నవంబర్ 14 నుంచి, మచిలీపట్నం–యశ్వంత్‌పూర్, కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17211/17212) నవంబర్ 11 నుంచి, మచిలీపట్నం–ధర్మవరం, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216) ఈ నెల 12 నుంచి, కాకినాడ పోర్టు–లోకమాన్య తిలక్ టెర్మినస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17221/17222) నవంబర్ 16 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే తిరుపతి–కొల్లం ఎక్స్‌ప్రెస్ (17421/17422) కూడా ఈ జాబితాలో ఉంది. -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్‌గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్‌కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్‌కు కొత్త రైల్వే లైన్‌ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
కలలు మాని... కళ్ళు తెరవాలి!
ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లో జనం బక్రీద్ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్ పైలట్, కో–పైలట్ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్‌ను పట్టించుకోకుండా గూడ్స్ ట్రైన్ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్ ఛైర్పర్సన్ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్ మాస్టర్ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. ఈ ‘కవచ్’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్‌లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! గతంలో సాధారణ బడ్జెట్‌కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్ ఇప్పుడో అనాథ. ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్‌కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్‌ఛార్జ్‌గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం. -
పైనొక రైలు.. కిందొక రైలు
సాక్షి, హైదరాబాద్: పైన రైలు.. కింద రైలు.. అలాంటి వంతెనలు మన దేశంలో తక్కువ. ఒక రైలు మార్గాన్ని మరో మార్గం క్రాస్ చేసే సందర్భాల్లో వీటి అవసరమున్నా.. ఆర్థిక భారం, ఇతర కారణాలతో నిర్మించడం లేదు. అయితే క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడూరు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రెండు మూడు మార్గాల సమస్య తీరేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది.ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. మరోవైపు విష్ణుపురం–మోటుమర్రి మధ్య 89కిలోమీటర్ల మేర సరుకు రవాణా రైలు మార్గం ఉంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. అది పూర్తయితే రైళ్లు నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది. ప్రయాణ సమయం కొంత తగ్గుతుంది. 1,400 మీటర్ల ఎలివేటెడ్ మార్గం ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దా టిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. దీనికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. భూసేకరణ ముగిసేలోపు వంతెన భాగాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భూమి చుట్టూ 310 రౌండ్లు
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆధునికీకరణలో భాగంగా కొత్తగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లకు ఇప్పుడు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైన వందేభారత్ రైళ్లు ఇప్పటి వరకు తిరిగిన నిడివిని పరిశీలిస్తే.. 310 పర్యాయాలు భూపరిభ్రమణం చేసిన దూరంతో సమానమట. ఇది సరికొత్త రికార్డు అంటూ రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. 105.57% ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సగటు 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్ రైలు సర్వీసు గరిష్టంగా 175.3 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది. వందేభారత్ రైళ్లలో తిరుగుతున్న ప్రయాణికుల్లో 26–45 ఏళ్ల మధ్య ఉన్నవారు 45.9 శాతంగా నమోదవుతోంది. కేరళలో తిరుగుతున్న వందేభారత్ సర్వీసుల్లో అత్యధికంగా 15.7 శాతం వృద్ధులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. గోవాలో తిరుగుతున్న వందేభారత్ రైళ్లలో అత్యధికంగా 42 శాతం మంది మహిళా ప్రయాణికులుంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సర్వీసుల్లో గరిష్టంగా 67 శాతం మంది పురుషులు ఉంటున్నట్టు నమోదైంది. తెలంగాణలో నాలుగు రైళ్లుప్రస్తుతం తెలంగాణలో నాలుగు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైలు సేవలు గతేడాది సంక్రాంతికి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటుండటంతో ఇటీవల ఇదే రూట్లో రెండో వందేభారత్ రైలు మొదలైన విషయం తెలిసిందే. రెండోది 8 కోచ్‌ల మినీఆరెంజ్ వందేభారత్. ఒకే రూట్లో రెండు వందేభారత్ రైళ్లు తిరగటం తొలుత కేరళలో మొదలైంది. రెండో ప్రయత్నంగా సికింద్రాబాద్– విశాఖ మార్గం ఎంచుకోవటం విశేషం. ఈమా ర్గం కాకుండా, సికింద్రాబాద్–తిరుపతి, కాచిగూడ–బెంగుళూరు మధ్య మరో రెండు సర్వీసులు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లు తిప్పాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇక త్వరలో రాత్రి వేళ తిరిగే స్లీపర్ వందేభారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి.సెమీ హైస్పీడ్ రైళ్లుగా...రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి తీసుకెళ్తూ సెమీ హైస్పీడ్ రైళ్లుగా వీటిని ప్రారంభించారు. గంటకు 160 కి.మీ. వేగ సామర్థ్యమున్న ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు సర్వీసులు (స్పెషల్ రైళ్లు కలుపుకొని) సేవలు అందిస్తున్నాయి. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అన్ని వందేభారత్ రైళ్లు 18423 ట్రిప్పులు తిరిగాయి. వీటి మొత్తం నిడివి1,24,87,540 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది 310 పర్యాయాలు భూమి చుట్టూ పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. గత ఏడాది కాలంలో 97,71,705 కి.మీ.లు తిరిగినట్టు వెల్లడించింది. -
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్‌లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్‌కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్‌కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది. 2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో) కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి: 407 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హైలెవల్ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు -
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల సర్వేలాంటి కొత్తవాటి జోలికి కేంద్రప్రభుత్వం పోలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోనే సరిపెట్టింది. ఆర్మూరు–ఆదిలాబాద్, వికారాబాద్–కృష్ణా లైన్లు సహా సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్లాంటి వాటి ఊసే లేకుండా రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. తేడాది బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.4418 కోట్లు కేటాయించగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం మధ్యంతర బడ్జెట్లో రూ.5,071 కోట్లను ప్రతిపాదించింది. ఇది అంతకుముందు బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ కావటం విశేషం. 2022–23లో రూ.2,038 కోట్లు కేటాయించారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా... కాజీపేట–విజయవాడ మూడో లైను: రూ.310 కోట్లు. ఇది 2012–13లో మంజూరైంది. పూర్తి నిడివి 219 కి.మీ.. దీని అంచనా వ్యయం రూ.1857 కోట్లు. విజయవాడ–కొండపల్లి వైపు పని పూర్తి కాగా, ఇప్పుడు విజయవాడ–ఖమ్మం మధ్య నిర్వహిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించారు. కాజీపేట–బల్లార్షా మూడో లైను: రూ.300 కోట్లు. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. కాజీపేట హసన్‌పర్తి మధ్య పనులు జరగాల్సి ఉండగా, ఎగువ భాగంలో దాదాపు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.350 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరు కాగా, నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ.. అంచ నా వ్యయం రూ.1160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భ రించనుండగా, రాష్ట్రప్రభుత్వం ఒకవంతుతో పాటు భూసేకరణ వ్యయాన్ని భరిస్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తి కా వటంతో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సర్విసులు మొ దలయ్యాయి. సికింద్రాబాద్–సిరిసిల్ల మధ్య భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు డిపాజిట్ చేయకపోవటంతో పనులు ఆగాయి. గత బడ్జెట్లో రూ.185 కోట్లు కేటాయించారు. భద్రాచలం–సత్తుపల్లి:రూ.6 కోట్లు ఇది 2010–11లో మంజూరైంది. నిడివి 54 కి.మీ. అంచనా వ్యయం రూ.704 కోట్లు. సింగరేణితో కలిపి రైల్వే ఈ సంయుక్త ప్రాజెక్టును చేపట్టింది. బొగ్గు తరలింపు ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ: రూ.50 కోట్లు నగర ట్రాఫిక్‌కు ఊరటనిచ్చే ఈ ప్రాజెక్టును 2012–13లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.817 కోట్లు. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.450 కోట్లు. కానీ రాష్ట్రప్రభుత్వం రూ.130 కోట్లతోనే సరిపుచ్చింది. గత బడ్జెట్లో భారీగా నిధులు విడుదల కావటంతో పనులు వేగంగా సాగాయి. దీంతో ప్రాజెక్టు సిద్ధమైంది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్: రూ.10 కోట్లు రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 10 లక్షలతో సరిపెట్టింది. కానీ ఈసారి రూ.10 కోట్లు కేటాయించటంతో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్లపల్లి శాటిలైట్ టెర్మి నల్:రూ.46 కోట్లు సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో టెర్మి నల్ నిర్మించారు. ఇందులో 6 ప్లాట్‌ఫామ్స్, 5 పిట్ లైన్లు ఉంటాయి. రైల్వే కోరినంత భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించలేదన్న విమర్శ ఉంది. దీంతో దీన్ని ఆశించినస్థాయిలో కాకుండా చిన్నదిగానే నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. భద్రాచలం–కొవ్వూరు: రూ.10 లక్షలు ఇది కీలకప్రాజెక్టు అయినప్పటికీ నిధుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గత బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించగా ఈసారి నామమాత్రపు నిధులతోనే సరిపెట్టారు. మణుగూరు–రామగుండం: రూ.5 కోట్లు కీలక ప్రాజెక్టుకు తొలిసారి భారీ నిధులు కాజీపేట మీదుగా సికింద్రాబాద్–విజయవాడ మార్గం ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయ లైను అవసరం ఏర్పడింది. నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. 248 కి.మీ. మేర రెండోలైన్ నిర్మించాల్సి ఉంది. రూ.2853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండు లైన్లు పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచుతారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. గత బడ్జెట్లో రూ.60 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.10 కోట్లకు కుదించారు. అవి కూడా విడుదల కాలేదు. తొలిసారిగా ఆ ప్రాజెక్టుకు రూ.200 కోట్లను తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.140 కోట్లు ప్రతిపాదించారు. తొలుత వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపుగా మంజూరు చేసిన దీన్ని.. గత బడ్జెట్లో వ్యాగన్ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అంచనా వ్యయాన్ని రూ.521 కోట్లకు పెంచారు. గతేడాది నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చదును చేయటం, కొన్ని షెడ్లు నిర్మించటం, ఒక ఆర్యూబీని సిద్ధం చేయటం.. తదితరాలు పూర్తి చేశారు. ఇప్పుడు మెరుగ్గానే నిధులు వచ్చినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు వేగంగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి సంవత్సరం నాటికి అది పూర్తయి పని ప్రారంభించనుంది. -
ఏపీలో 3 రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఏపీలోని పలు గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను రైల్వేశాఖ పొడిగించింది. వీటిలో గుంటూరు– విశాఖ (22701/22702) రైలు విశాఖ, విజయవాడ,గుంటూరు మీదుగా ప్రయాణిస్తోంది. మిగిలిన 2 రైళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. వాటిలో నర్సాపూర్–హుబ్లీ (17225/17226) రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. నంద్యాల–రేణిగుంట (07285/07284) రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కంభాలపల్లె స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ రైళ్ల సర్వీసులను శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు శుక్రవారం నుంచే ప్రయాణికుల సేవల్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.