రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా | Acceptance of applications with fake websites: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా

Published Mon, Jul 1 2024 4:08 AM | Last Updated on Mon, Jul 1 2024 4:08 AM

Acceptance of applications with fake websites: Andhra Pradesh

ఏటీవీఎం ఫెసిలిటేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని బురిడీ

రైల్వే శాఖ నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ ఘరానా మోసం 

నకిలీ వెబ్‌సైట్లతో దరఖాస్తుల స్వీకరణ 

అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు 

అవి రెగ్యులర్‌ ఉద్యోగాలు కావన్న రైల్వే శాఖ

సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్‌ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్‌లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ..  

‘ఏటీవీఎం ఫెసిలిటేటర్‌’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్‌..  
రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామ­ని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్‌ / డెబిట్‌ కార్డుతో టికెట్‌ కొనుగోలు చేయొ­చ్చు. టికెట్‌ కౌంటర్లలో క్యూలలో నిలబడా­ల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.

అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్‌ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్‌ 1, కాకినాడ టౌన్‌ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్‌ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

బోగస్‌ వెబ్‌సైట్లతో టోకరా.. 
రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోస­గాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్‌ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్‌/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్‌ వెబ్‌సైట్లను సృష్టించి యువతను మభ్య పెడు­తున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్‌ చేసి ఆ నకిలీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.

ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్‌ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.

అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదు
రైల్వే శాఖ స్పష్టికరణ 
ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్‌ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్‌ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్‌ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్‌ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.

అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్‌ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్‌ పోస్టులు అనేవి రెగ్యులర్‌ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్‌ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement