Notification
-
ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోమని న్యాకోనే చెప్పిందట!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు పాతరేసింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. గోప్యంగా ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కావాల్సిన వారికి పోస్టులు కట్టబెడుతోంది. తాజాగా ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (శాక్స్)లో వైద్య పోస్టులను ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వైద్య శాఖ భర్తీ చేయడం విమర్శలకు దారితీసింది. ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటి రెట్రోవైరల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్స్‌లో మెడికల్ ఆఫీసర్(ఎంవో) పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే హార్మోని కన్సల్టెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే విధానంలో మంగళవారం ముగ్గురు వైద్యులను నియమించారు. ఈ వ్యవహారంపై ‘నోటిఫికేషన్ ఇవ్వకుండా వైద్యుల నియామకమా?’ శీర్షికతో బుధవారం “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో న్యాకో మార్గదర్శకాలను అనుసరించే ఔట్‌సోర్సింగ్‌లో వైద్యులను నియమిస్తున్నామని శాక్స్ అధికారులు సమర్ధించుకున్నారు.వాస్తవానికి ఏఆర్టీ సెంటర్స్‌లో వైద్య, ఇతర సిబ్బంది పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని జాతీయ ఏఆర్టీ సేవల నిర్వహణ మార్గదర్శకాలు–2021లోనే న్యాకో స్పష్టంగా చెప్పింది. ఒక పోస్టుకు ఐదు దరఖాస్తులు దాటితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ కలిగిన వారిని నియమించాలని న్యాకో నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను అనుసరిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శాక్స్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో శాక్స్‌లో సమన్వయకర్తలు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది పోస్టులన్నింటినీ బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వనించి, ఆర్ఓఆర్ పాటిస్తూ ప్రతిభ కలిగిన, అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. రూ. లక్షల్లో వసూళ్లుకూటమి ప్రభుత్వం మాత్రం న్యాకో నిబంధనలంటూ ఔట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తోంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న వైద్యులకు నెలకు రూ.72 వేల వేతనం ఉంటుంది. ఎన్హెచ్ఎం పరిధిలో ఇంతకంటే తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఏఆర్టీ సెంటర్లలో వేతనం కొంత ఎక్కువ, పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీటికి బహిరంగ నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మంది యువ వైద్యులు ముందుకు వస్తారని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినా, అర్హులకు అన్యాయం చేస్తూ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం అవుట్సోర్సింగ్ రూ. లక్షల్లో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక శాక్స్‌లో ఇదే తరహాలో క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో ఓ కీలక అధికారి బంధువుకు గుంటూరు జిల్లాలో ఓ పోస్టును కట్టబెట్టారు. -
ఎనిమిది కులాల పేర్లు మార్పు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని ఎనిమిది కులాల పేర్లను మా ర్పు చేసేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కులాల పేర్లను తిట్ల రూపంలో వాడుతున్నారని, దీంతో కులం పేరు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉందని దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మరి, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలకు చెందిన ప్రతినిధులు పలు సందర్భాల్లో బీసీ కమిషన్‌కు పెద్ద సంఖ్యలో వినతులు సమర్పించారు.ఈ అంశంపై స్పందించిన బీసీ కమిషన్ తాజాగా పేర్ల మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలను ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రభుత్వ పనివేళల్లో స్వీకరించనున్నట్లు వివరించింది. -
వక్ఫ్ బోర్డు పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ శుక్రవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. వక్ఫ్ యాక్ట్–1995 సవరణ చట్టం–2013(సెక్షన్ 27) ప్రకారం 8మందితో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం చేపట్టినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యుల నుంచి ఎండీ రుహుల్లా(ఎమ్మెల్సీ), షేక్ ఖాజా(ముతవల్లీ)లను నియమించింది. మహ్మద్ నసీర్(ఎమ్మెల్యే), సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇస్మాయేల్ బేగ్‌లను వక్ఫ్‌బోర్డు సభ్యులుగా నామినేట్ చేసింది. తలా తోకలేని జీవో విడుదల చేసిన ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు కమిటీ నియామకంలో కూటమి ప్రభుత్వం తలాతోక లేని జీవో ఇచ్చిందని ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా శుక్రవారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పునర్నియామక జీవో ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదన్నారు. పునర్నియామకం అంటే గత జీవో ఏ సెక్షన్ల కింద సభ్యుల నియామకం జరిగిందో అదే సెక్షన్ల మేరకు సభ్యుల నియామకం చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిoదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంపీ, అడ్వకేట్, మహిళా, అధికారిక విభాగాల నుంచి సభ్యులకు చోటు లేకుండా చేశారని నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘లగచర్ల’లో మళ్లీ భూసేకరణ..నోటిఫికేషన్ విడుదల
సాక్షి,వికారాబాద్: లగచర్లలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారమే లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్ పారిశ్రామిక పార్క్ కోసం భూ సేకరణ నోటీస్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.2013 చట్టం సెక్షన్ 6(2) కింద భూసేకరణను నోటిఫికేషన్ ఇచ్చారు.కాగా,వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించిన విషయం తెలిసిందే. భూ సేకరణ విషయమై గగ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది.ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిందని అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: లగచర్ల ‘ఫార్మా’ రద్దు -
ఏపీలో నిరుద్యోగులు గందరగోళం
-
నేడు స్ట్రే వేకెన్సీ ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: యాజమాన్య కోటా ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ సీట్లను ఆరోగ్య విశ్వ విద్యాలయం శనివారం కేటాయించనుంది. స్ట్రే వేకెన్సీ ప్రవేశాల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. రాత్రి 9 గంటలకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన వారు నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, స్ట్రే వేకెన్సీ రౌండ్ 1కు 18 సీ కేటగిరి సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
నెలాఖరుకు జేఈఈ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2025 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వెలువడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో రెండో విడత మెయిన్స్‌ను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు పంపుతారు. అడ్వాన్స్‌డ్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే వీలుంది. ఈ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఏయే కేంద్రాలను ఎంపిక చేయాలనే సమాచారాన్ని ఎన్టీఏ సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటినుంచీ తెలంగాణ వ్యాప్తంగా 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి పరీక్ష కేంద్రాలను కుదించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను 17 పట్టణాలకే పరిమితం చేశారు. కాగా, గత ఏడాది జేఈఈ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఈ సంవత్సరం పరీక్ష కేంద్రాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు.సిలబస్‌పై కసరత్తు.. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు కూడా పరీక్ష సిలబస్‌ను తగ్గించారు. 2020లో కరోనా కారణంగా 8 నుంచి 12వ తరగతి వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్లను తీసివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈతో పాటు ఇతర జాతీయ సిలబస్ ఉండే విద్యార్థులకు జేఈఈలో ఆయా చాప్టర్లను తొలగించాలనే డిమాండ్ వచ్చింది. ఈ కారణంగా గత సంవత్సరం కొన్ని చాప్టర్లను ఇవ్వలేదు. అయితే, ఈ ఏడాది ఆ సమస్య లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాత సిలబస్‌ను మళ్లీ కలపడమా? లేదా ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిర్వహించడమా? అనే దానిపై ఎన్టీఏ, ఇతర కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
వైద్య, ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కొలువుల జా తర కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా...మరో 6,500 పో స్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 99 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీ సర్ పోస్టులకు, ఈ 272 పోస్టులు అదనం అని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మొత్తం నర్సింగ్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొంది. నవంబర్ 23న ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తంగా 732 ఫార్మసిస్ట్ పోస్టులు: గత నెల 24న 633 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖా స్తుల ప్రక్రియ మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, మొత్తం పోస్టు ల సంఖ్య 732కు పెరిగిందని తెలుపుతూ శుక్రవారం బోర్డు ప్రకటించింది. ఈ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచి్చంది. నవంబర్ 30న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీలవారీగా ఖాళీల సం ఖ్యను బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov. in/MHSRB/home.htm లో అందుబాటులో ఉంచారు. -
బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు
సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించిన టెండర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్న విషయం మరోసారి బహిర్గతమైంది. అయిన వారికి కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు మార్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది మరోసారి వెల్లడైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు నిర్వహించిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పుడు అదే టెండర్ నిబంధనలతో తాజాగా పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు ఈనెల 7న (సోమవారం) టీటీడీ మార్కెటింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం సీఎం చంద్రబాబు బండారాన్ని బయటపెట్టింది. చంద్రబాబు ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనన్న విషయాన్ని స్పష్టం చేసింది. స్వచ్ఛత కోసం ప్రమాణాలు పెంపు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు టీటీడీ మార్కెటింగ్ విభాగం ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహిస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు ఆర్నెల్లకు ఓ సారి టెండర్లు పిలుస్తుంది. నెయ్యిలో తేమ శాతం 0.3 శాతానికి మించకూడదని, బూటిరో రిఫ్రాక్టో (బీఆర్) మీటర్ రీడింగ్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 40–43 మధ్య ఉండాలని, ఆర్ఎం వాల్యూ కనిష్టంగా 26 ఉండాలని, బౌడౌన్, మినరల్ ఆయిల్, ఫారిన్ కలర్స్ టెస్టుల్లో నెగెటివ్ రావాలని, మెల్టింగ్ పాయింట్ 27–37 డిగ్రీల మధ్య ఉండాలనే ఎనిమిది ప్రమాణాలతో 2019 మే 29 వరకూ టెండర్లు పిలిచేవారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు మరో తొమ్మిది ప్రమాణాలను అదనంగా చేర్చింది. మొత్తం 17 ప్రమాణాలతో రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి, శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా చేశారని టీటీడీ అధికారవర్గాలే చెబుతున్నాయి. నిబంధనలు మరింత కఠినతరం భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈమేరకు 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు సమావేశంలో తీరా>్మనాన్ని ఆమోదించి అమలు చేశారు. ఆవు నెయ్యి సేకరణ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం ఐదేళ్లు వరుసగా డెయిరీలో నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండాలని, జాతీయ డెయిరీలైతే రోజుకు 4 లక్షల లీటర్లు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే రోజుకు 2 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలైతే రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తుండాలని నిబంధనలు పెట్టారు. జాతీయ డెయిరీలైతే నెలకు 360 టన్నులు లేదా ఏడాదికి 5 వేల టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసి ఉండాలని, రూ.500 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని షరతు విధించారు. 1,500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే నెలకు 180 టన్నులు లేదా ఏడాదికి 2,750 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండి, రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. రాష్ట్రంలోని డెయిరీలకైతే నెలకు 90 టన్నులు లేదా ఏడాదికి 1,500 టన్నుల ఆవు నెయియని ఉత్పత్తి చేసి ఉండి.. రూ.వంద కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు విధించారు. వాటిని నిక్కచ్చిగా అమలుచేయడంతో కాంట్రాక్టు పొందిన డెయిరీలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయి. ఇదే నిబంధనలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణలో 2024 మార్చి 12న టీటీడీ పిలిచిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పుడూ అవే నిబంధనలతో టీటీడీ టెండర్లు పిలవడం గమనార్హం. -
AP: కొత్త మద్యం పాలసీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నోటిఫికేషన్లో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజును నిర్ణయించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ లిక్కర్ మాల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ ఇన్‌సర్వీస్, నాన్ సర్వీస్ కోటా, యాజమాన్య కోటా ప్రవేశాల కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ–2024 అర్హత సాధించిన వైద్యులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ ఐదు నుంచి ఏడో తేదీల మధ్య దరఖాస్తుకు అవకాశం కల్పించారు. https:// drntr.uhsap.in వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 9000780707, 8008250 842 ఫోన్ నంబర్లను సంప్రదించాలి్సందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. -
రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్పీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అనుమతిస్తేనే టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో హైకోర్టు ప్రిలిమ్స్‌ను మాత్రమే రద్దు చేసిందని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందకే వస్తుందన్నారు.రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెయిన్స్‌కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనను ప్రభుత్వం తప్పుబట్టింది. టీఎస్పీఎస్సీకి అన్ని అధికారా లుంటాయని స్పష్టం చేసింది. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 6 శాతం ఎస్టీ రిజర్వేషన్లే అమలు చేయాలి: పిటిషనర్లు గ్రూప్–1కు రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని, తాజా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది జొన్నలగడ్డ సు«దీర్ వాదనలు వినిపించారు. ‘టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు 2022, ఏప్రిల్ 26న తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతమే ఉన్నాయి. ఆ తర్వాత 10 శాతానికి పెంచారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 6 శాతమే అమలు చేయాలి. లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది..’అని చెప్పారు. రీనోటిఫికేషన్‌తో అభ్యర్థులకు లబ్ధి: ప్రభుత్వం ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘టీఎస్పీఎస్సీ చట్టబద్ధమైన సంస్థ. నియామకాలకు సంబంధించి ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం కమిషన్‌కు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 2024 ఫిబ్ర వరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీ నోటిఫికేషన్‌తో ఎవ రికీ నష్టం కలుగలేదు. పైగా 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు..’అని తెలిపారు. అనంతరం సమయం ముగియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
త్వరలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 643 మంది అధ్యాపకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మంత్రి అనుమతి ఇచ్చారు. అవసరమైతే మరో విడతలోనూ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మరోవైపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 2 వారాల్లో 3,967 పోస్టులకు నోటిఫికేషన్లు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందిని భర్తీ చేశారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులు, 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులు భర్తీ చేశారు. గత రెండు వారాల్లో 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ఈ నెల 17వ తేదీన మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు, రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1,600 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా మని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు,వివరాలివీ.. » మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్–1లో 79, జోన్–2లో 53, జోన్–3లో 86, జోన్–4లో 98, జోన్–5లో 73, జోన్–6లో 154, జోన్–7లో 88 పోస్టులు ఉన్నాయి. » ఈ పోస్టులకు పేస్కేల్ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. » రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. » ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజి్రస్టేషన్ చేసి ఉండాలి. » ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. » అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్సీసీ, ఎక్స్ సర్విస్‌మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. » రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. » పూర్తి వివరాలను అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో.. యాజమాన్య కోటాకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల యాజమాన్య కోటా.. గత ఏడాది ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్.. స్వీమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్ల ఎన్ఆర్ఐ కోటాలో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. నీట్ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇందుకు ఈనెల 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు గడువు విధించారు. అలాగే, శుక్రవారం (16వ తేదీ) సా.7 గంటల నుంచి ఆదివారం (18వ తేదీ) రాత్రి 9 గంటల వరకూ ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉండదని.. ఈ సమయంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని వర్సిటీ వెల్లడించింది. ఈ వ్యవధిలో కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని తెలిపారు. ఏపీ ఆన్లైన్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ సర్వర్లు మెయింటెనెన్స్‌లో ఉండడంవల్ల ఈ అంతరాయం ఉంటుందని సమాచారం. యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు సమయంలో విద్యార్థులు రూ.10,620ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.30,620ల ఆలస్య రుసుముతో 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 23వ తేదీ సా.6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో నియమ నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168.. సాంకేతిక సమస్యలపై 9000780707 నెంబర్లను సంప్రదించాల్సిందిగా రిజి్రస్టార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. దళారుల మాటలు నమ్మొద్దు.. నీట్ యూజీ మెరిట్ స్కోర్ ఆధారంగా నియమ నిబంధనలకు లోబడి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపు ఉంటుందని.. తల్లిదండ్రులు, విద్యార్థులు దళారుల మాయమాటలు నమ్మొద్దని రాధికారెడ్డి సూచించారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ 225.. ఎన్ఆర్ఐ కోటా 95 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచితంగా అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి0ది. అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కి ఎంబీబీఎస్ సీట్లను అమ్మకానికి పెట్టారు. మరోవైపు.. స్విమ్స్‌లో 23, ఎన్ఆర్ఐ–ప్రైవేట్, మైనారిటీ వైద్య కళాశాలల్లో 1,078 బీ–కేటగిరి, 472 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. దంత వైద్య కళాశాలల్లో 489 బీ–కేటగిరి, 211 ఎన్ఆర్ఐ బీడీఎస్ సీట్లున్నాయి. -
ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వినర్ కోటా ప్రవేశాల కోసం విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 16 సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://apuhs&ugadmissions.aptonline.in లో దరఖాస్తులు సమర్పించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2,950, ఎస్సీ, ఎస్టీలు రూ.2,360 దరఖాస్తు రుసుం చెల్లించాలి. నియమ, నిబంధనలకు సంబంధించి సందేహాల నివృత్తికి 8978780501, 7997710168 నంబర్లను, రుసుం చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలకు 9000780707 నంబర్‌ను సంప్రదించాలని వర్సిటీ రిజి్రస్టార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయం రూపొందిస్తుంది. తుది మెరిట్ జాబితా ప్రకటించాక కన్వినర్ కోటాలో అన్ని దశలకు కలిపి ఒకేసారి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం వివిధ దశలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రం నుంచి 43,788 మంది నీట్ యూజీ–2024లో అర్హత సాధించారు. ఉస్మానియా కోటా రద్దు జీవో 513 ప్రకారం.. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కోటాను రద్దు చేసినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం వరకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), ఓయూ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది నుంచి 36 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఏపీ విద్యార్థులకే కేటాయించనున్నారు. మెరిట్ ఆధారంగా ఏయూ, ఎస్వీయూ విద్యార్థులతో సీట్లను భర్తీ చేయనున్నారు. అప్లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలు 4 నీట్ యూజీ– 2024 ర్యాంక్ కార్డ్ 4 పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) 4 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 4 ఇంటర్మిడియెట్ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు 4 విద్యార్థి తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, సంతకం 4 ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (ఇంటర్/10+2) 4 కుల ధ్రువీకరణ 4 ఆధార్ కార్డు 4 దివ్యాంగ ధ్రువీకరణ పత్రం -
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. -
Telangana: రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను కేబినేట్ ఆమోదించిందని పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేరళలో వయనాడ్‌లో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడంతోపాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం.క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్‌కు, సిరాజ్‌కు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందిగౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు -
TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో, దీనికి సంబంధించిన విధివిధానాలను ఆర్టీసీ అధికారులు రూపొందించనున్నారు. మరోవైపు.. ఆర్టీసీ ఖాళీల భర్తీపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా..‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని రూట్స్‌లో బస్సులు సరిగా లేకపోవడంతో ప్రజలు బస్సులు నడపాలని కోరారు. దీంతో, ప్రభుత్వం ఆర్టీసీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం పోస్టులు 435 కాగా, అందులో 351 ప్రాథమికఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మరో 80 పోస్టులు డీఎంఈ పరిధిలో ఆస్పత్రుల్లో ఆర్ఎంఓ పోస్టులు. ఐపీఎంలో భర్తీ చేసే పోస్టులు నాలుగు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. బోర్డు వెబ్సైట్( https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల రెండో తేదీన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ అదే నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.58,850 నుంచి రూ.1,37,050 మధ్య ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధితశాఖ నుంచి ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అర్హులు కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 80 పాయింట్లు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు.అంటే ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80 శాతంగా మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు సంబంధించి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కులశాతాన్ని పరిగణనలోకి తీసుకొని 80 శాతంగా మార్చుతారు. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. అక్కడ పనిచేస్తున్నట్టు అనుభవ ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాలి. అనుభవ ధ్రువ పత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఇతర ముఖ్యాంశాలు... » ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు సాఫ్ట్‌కాపీని దగ్గర ఉంచుకోవాలి. » ఆధార్ కార్డు, పదోతరగతి సర్టిఫికెట్ (పుట్టిన తేదీ రుజువుకు), ఎంబీబీఎస్ సమగ్ర మార్కుల మెమో, సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజి్రస్టేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రాలు, స్థానికతను తెలియజేసే స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి), ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీల విషయంలో నాన్–క్రీమిలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ఆదాయ, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ కేటగిరీ వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, మాజీ సైనికులు వయస్సు సడలింపునకు సరీ్వస్ సర్టిఫికెట్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కోసం సర్వీస్ సర్టిఫికోట్ అప్లోడ్ చేయాలి. » నోటిఫికేషన్ తేదీ నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత చదివి ఉండాలి. సరి్టఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో, ఏదైనా దరఖాస్తుదారుడు అవసరమైన అర్హత కాకుండా ఇతర అర్హతలు ఉంటే (అర్హతకు సమానమైనవి) వాటిని ’నిపుణుల కమిటీ’కి సిఫార్సు చేస్తారు. నిపుణులకమిటీ’ నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయిస్తుంది.» తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దర ఖాస్తుదారులు ఎలాంటి రిజర్వేషన్లకు అర్హులు కారు. » పోస్టులను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. » మల్టీ జోన్–1లో జిల్లాలు: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్. » మల్టీ జోన్–2 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ -
26 నుంచి కొత్త టెలికం చట్టం
న్యూఢిల్లీ: టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 కింద కొన్ని నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885.. వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం, 1993.. టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం, 1950 స్థానంలో కొత్త చట్టం పాక్షికంగా అమలు కానుంది. ‘‘ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 అమలు తేదీని జూన్ 26గా నిర్ణయించడమైనది. నాటి నుంచి చట్టంలోని 1, 2, 10 నుంచి 30 వరకు, 42 నుంచి 44 వరకు, 46, 47, 50 నుంచి 58 వరకు, 61, 62 సెక్షన్లు అమల్లోకి వస్తాయి’’అని ప్రభుత్వ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కొత్త చట్టంలోని నిబంధనల కింద కేంద్ర సర్కారు జాతి భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలికమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను తన ఆ«దీనంలోకి తీసుకోవడంతోపాటు నిర్వహించగలదు. స్పామ్, హానికారక కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి (సమాచారం) వినియోగదారులకు రక్షణ కలి్పంచడం తప్పనిసరి. -
లోక్ సభ స్పీకర్ ఎన్నిక..
-
ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు పార్టీ కూడా మారారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. భంగపడ్డ నేతలు పార్టీకి వ్యతిరేకంగా అడుగు వేస్తారా? కలిసి నడుస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇక టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హస్తం’ నేతలు అలక వీడేదెప్పుడో! ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హస్తం నాయకత్వం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాగా, టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్‌జాదవ్ ఇంకా ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేయనున్నారు. ఇదేరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆదిలాబాద్ పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం సమావేశం కానుండగా, అప్పటికైనా నేతలు అలక వీడుతారో.. లేదో వేచి చూడాలి. కమలంలో ‘తిరుగుబాటు’ తప్పదా? బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో అసమ్మతి చోటుచేసుకుంది. ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్‌లో చేరారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సైలెంట్‌గా ఉన్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి ఆరోజు ఆదిలాబాద్‌కు రానున్నారు. పార్టీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు పార్టీలో నిరాశ ఎదురు కాగా బీజేపీ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 24న ఆయన కూడా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీ–ఫాం అందుకున్న సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరు ఖరారై చాలా రోజులైంది. ఓ దశలో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత గందరగోళం కనిపించింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా అభ్యర్థి మార్పు లేదని స్పష్టమైంది. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆత్రం సక్కు బీ–ఫాం అందుకున్నారు. ఈ నెల 23న లేదా 24వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఆధార్) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్ శ్యామ్‌లాల్‌నాయక్ నామినేషన్ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పకడ్బందీ బందోబస్తు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వంద మీటర్ల పరిధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశా రు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంట ల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా కలెక్టరేట్‌కు వెళ్లే రోడ్డుమార్గాన్ని మూసివేసి ట్రా ఫిక్‌ను మళ్లించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలు క్షుణ్ణంగా తని ఖీ చేసి ఐదుగురినే లోనికి అనుమతించారు. గడవు ముగిసేవరకూ ముగ్గురు సీఐలు అ క్కడే విధులు నిర్వహించారు. ఆదిలాబాద్ డీ ఎస్పీ జీవన్‌రెడ్డి బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్‌ను వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. ఇవి చదవండి: TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్.. ఈసీ కీలక నిర్ణయం -
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ.. ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇంకా ఇతర అప్డేట్స్