సాక్షి, హైదరాబాద్: ఆరు రోజుల్లోనే గృహలక్ష్మి పథకానికి సంబంధించి రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల ఐదో తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్దిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలన్నది ఉద్దేశం. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ కసరత్తు పూర్తి చేయాలనే అక్టోబర్ 5 డెడ్‌లైన్‌గా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
దరఖాస్తులు 15 లక్షలు..అర్హత ఉన్నవి 11లక్షలు
సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించి.. వారే ఇళ్లు నిర్మించుకునేలా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లు, సీఎం కోటాలో మరో 43 వేల ఇళ్లు మొత్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహా్వనించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు. వాటి నుంచి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది.
ఏ ఊరు.. ఎవరు లబ్ధిదారులు
నియోజకవర్గంలో ఏఏ ఊళ్ల నుంచి ఎవరెవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని గతంలోనే మౌఖికంగా ఆదేశాలందాయి. ఇప్పుడు అధికారులకు ఎమ్మెల్యేలు అందించే వివరాల ఆధారంగా జాబితాలు రూపొందుతున్నాయి.
ఏఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వేగంగా వివరాలు అందిస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో జాబితాలు అంత వేగంగా సిద్ధమవుతున్నాయి. శుక్రవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందితో జాబితా సిద్ధమైంది. మిగతా లబ్దిదారుల జాబితా వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం లోపు ఖరారు చేయాలని తాజాగా సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖికంగా అదేశాలందినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆ పనిలో వేగం పెంచారు.
ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ
గతంలో అందిన దరఖాస్తులే కాకుండా ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిసింది. అందిన దరఖాస్తులు కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ‘అవసరం’అని భావిస్తే, ఆయా ప్రాంతాల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకొని జాబితాలో పేరు చేరుస్తున్నట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేది నిరంతర ప్రక్రియే అన్న మాటతో ఈ తంతు కానిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment