
సాక్షి, అమరావతి: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అకడమిక్ సర్వీసెస్‌లో 78 ఉద్యోగాలు.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో 156 ఉద్యోగాలు.. ఇదీ ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ప్రకటనలు. ఏకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించి మరీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, సంస్కృత అకాడమీలో ఉద్యోగాల కల్పన పేరిట యువతను మోసగించేందుకు ఓ ముఠా వేసిన ఎత్తుగడ ఇది.
సామాజికమాధ్యమాల్లో ఓ నకిలీ వెబ్‌సైట్ (https:// teluguacademy.org.recruitment), ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వైరల్ అవుతున్న విషయాన్ని గుర్తించిన అకాడమీ వెంటనే అప్రమత్తౖమెంది. తాము ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని అకాడమీ డైరెక్టర్ వి.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు నకిలీ నోటిఫికేషన్‌ను ఎవరూ విశ్వసించవద్దని కోరారు. ఆ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయడంగానీ ఫీజుల రూపంలో నగదు చెల్లించడంగానీ చెయ్యొద్దని కూడా ఆయన తెలిపారు.
తమ అకాడమీకి ఇప్పటివరకు ఎటువంటి వెబ్‌సైట్ లేదని స్పష్టంచేశారు. యువతకు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ఆంజనేయులు (ఫోన్ నంబర్: 9849616999)ను సంప్రదించాలని సూచించారు. ఇక రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ పేరుతో ఉద్యోగాల భర్తీకి నకిలీ నోటిఫికేషన్ ఇవ్వడంపై రామకృష్ణ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment