పంచాయతీ, పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు
గ్రామాల్లో పెరుగుతున్న హడావుడి..
ఎమ్మెల్యేలపైనే పూర్తి భారం వేసిన అధికార కాంగ్రెస్
లీడర్లు, కేడర్‌ను కదిలించే పనిలో గులాబీ దళం
సంస్థాగత మార్పుల ప్రక్రియలో బీజేపీ
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో కేడర్‌ను కదిలించే పనిలో పడ్డాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ అధిష్టానాలు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కూడా కదలిక కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వారంలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు దిశలో డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
కాంగ్రెస్‌కు కీలకం: అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు కీలకం మారాయి. రాష్ట్రంలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం, తమ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నెలరోజులుగా ఈ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేల భుజాలపై పెట్టింది. కనీసం 80 శాతం స్థానాలు గెలిపించాలని ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు నిర్దేశించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు ఎన్నికల బిజీలో పడిపోయారు.
ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్‌ఎస్ ఆశలు
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా స్థానిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో పడిపోయిన ఆ పార్టీ.. స్థానిక ఎన్నికల్లోనైనా పట్టు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. కేడర్, లీడర్లను చైతన్యపరిచే పనిలో పడింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. వికారాబాద్, సిర్పూర్ సమావేశాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరికి టికెట్లు ఇచ్చినా అందరూ కలసి పనిచేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment