నవంబర్ మొదటివారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
జనవరి, ఏప్రిల్‌లో మెయిన్స్
సిలబస్ కుదింపుపై తర్జనభర్జన
గత ఏడాది తగ్గిన సిలబస్
పరీక్ష కేంద్రాల పెంపు అంశంపై పరిశీలన
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2025 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వెలువడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో రెండో విడత మెయిన్స్‌ను ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు పంపుతారు. అడ్వాన్స్‌డ్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే వీలుంది.
ఈ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఏయే కేంద్రాలను ఎంపిక చేయాలనే సమాచారాన్ని ఎన్‌టీఏ సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటినుంచీ తెలంగాణ వ్యాప్తంగా 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి పరీక్ష కేంద్రాలను కుదించారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను 17 పట్టణాలకే పరిమితం చేశారు. కాగా, గత ఏడాది జేఈఈ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఈ సంవత్సరం పరీక్ష కేంద్రాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
సిలబస్‌పై కసరత్తు..
గత సంవత్సరం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు కూడా పరీక్ష సిలబస్‌ను తగ్గించారు. 2020లో కరోనా కారణంగా 8 నుంచి 12వ తరగతి వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్లను తీసివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్‌ఈతో పాటు ఇతర జాతీయ సిలబస్ ఉండే విద్యార్థులకు జేఈఈలో ఆయా చాప్టర్లను తొలగించాలనే డిమాండ్ వచ్చింది.
ఈ కారణంగా గత సంవత్సరం కొన్ని చాప్టర్లను ఇవ్వలేదు. అయితే, ఈ ఏడాది ఆ సమస్య లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాత సిలబస్‌ను మళ్లీ కలపడమా? లేదా ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిర్వహించడమా? అనే దానిపై ఎన్‌టీఏ, ఇతర కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment