మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్కారు కసరత్తు
జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉండేలా చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 643 మంది అధ్యాపకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు మంత్రి అనుమతి ఇచ్చారు. అవసరమైతే మరో విడతలోనూ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మరోవైపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
2 వారాల్లో 3,967 పోస్టులకు నోటిఫికేషన్లు
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందిని భర్తీ చేశారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులు, 18 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులు భర్తీ చేశారు.
గత రెండు వారాల్లో 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ఈ నెల 17వ తేదీన మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు, రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1,600 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా మని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment