ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం | Toxic heavy metals in agricultural soil | Sakshi
Sakshi News home page

ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం

Published Thu, Apr 24 2025 3:48 AM | Last Updated on Thu, Apr 24 2025 3:48 AM

Toxic heavy metals in agricultural soil

24.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో విషపూరిత భార లోహాలు

140 కోట్ల మంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం 

 అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి

భూమి..మన మనుగడకు మూలాధారం. మనం తినే 95% ఆహారానికే కాదు..అనుదినం తాగే నీటికి కూడా ప్రధాన వనరు భూమి. అయితే ఈ భూమిలో దాదాపు 15% విస్తీర్ణం మేర విషతుల్యమైన భార లోహాలతో కలుషితమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ కాలుష్యం అపరిమితంగా ఉంది. ఆర్సెనిక్, లెడ్‌ తదితర భార లోహాలు పరిమితికి మించి సాగు భూమిని కలుషితం చేసి ఆహార వ్యవస్థల్లోకి చేరిపోయాయి. సుమారు 140 కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి భార లోహాల కాలుష్యం

» అమెరికన్‌ అసోసియేషన ఫర్‌ ద అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఏఏఏఎస్‌) ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్య యనానికి చైనాలోని సింగువా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డా. దేయీ హౌ నేతృత్వం వహించారు. ఈ పరిశోధన ఫలితాలపై వ్యాసం ప్రసిద్ధ ‘సైన్స్‌’జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతీయ అధ్యయనాల గణాంకాలను సేకరించి, మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికత ద్వారా విశ్లేషించారు.  
»  ప్రపంచవ్యాప్త సాగు భూమిలో కనిష్టంగా14% గరిష్టంగా 17% విస్తీర్ణంలో ఈ కాలుష్యం ఉంది. సుమారు 24.2 కోట్ల హెక్టార్ల నేలల్లో భార లోహ కాలుష్యం తిష్ట వేసిందని అధ్యయనం తేల్చింది.

ఆర్సెనిక్, కాడ్మియం, కోబాల్ట్, క్రోమియం,రాగి, నికెల్, సీసం వంటి భార లోహాలు అపరిమిత స్థాయిలో సాగు భూమిలో ప్రజారోగ్యానికి తీరనిహాని కలిగించే స్థాయిలో ఉన్నాయని అధ్యయనంతెలిపింది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

భార లోహాలతో ముప్పేమిటి?
శిలలు, మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే లోహాలు, మెటలాయిడ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని నేలల్లో ఉంటాయి. ఇతర లోహాలతో పోల్చితే ఈ లోహాల బరువు అణుస్థాయిలో అధికంగా ఉంటుంది. అందుకే వీటిని భార లోహాలు అంటారు. అవి మన కంటికి కనిపించవు. సేంద్రియ పదార్థం మాదిరిగా కాలగమనంలో భార లోహాలు విచ్ఛిన్నం కావు. ఒక్కసారి మట్టిలో ఇవి కలిశాయంటే దశాబ్దాల కాలం వరకూ పోవు. వీటిని మట్టిలో నుంచి పంట మొక్కల వేర్లు గ్రహిస్తాయి. అవి ఆ పంటల ధాన్యాలు, పూలు, కాయల్లోకి చేరుతాయి. ఆ విధంగా ఆహార చక్రం ద్వారా మనుషుల దేహాల్లోకి చేరుతున్నాయి.  

» ఈ సమ్మేళనాలు పరిమితికి మించి దేహంలోకి చేరితే మనుషులు, జంతువులు, ఇతర జీవులకు ఆరోగ్యపరంగా తీరని హాని జరుగుతుంది. అయితే, వీటి ప్రతికూల ప్రభావం వెంటనే తెలియదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏయే దేశాల సాగు భూముల్లో ఏయే మోతాదుల్లో భార లోహాలు ఇప్పటికే మితిమీరి ఉన్నాయనే వివరాలు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉన్నాయి. ఇక ముందూ దశాబ్దాల పాటు ఉంటాయి.  
» జింక్, రాగి వంటివి భార లోహాలైనప్పటికీ అత్యల్ప మోతాదులో మనకు సూక్ష్మపోషకాలుగా మనకు అవసరమే. అయితే, ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నా కేన్సర్, కిడ్నీ, ఎముకల పటుత్వం క్షీణించటంతో పాటు పిల్లల్లో డిజార్డర్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.  

యురేసియా దేశాలకు అధిక ముప్పు 
యురేసియా తక్కువ అక్షాంశ ప్రాంతంలోని సాగుభూముల్లో భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. దక్షిణ ఐరోపా, మధ్య ప్రాచ్య, దక్షిణాసియా, దక్షిణ చైనా ప్రాంత దేశాలకు ఈ బెడద అధికం. గ్రీకు, రోమన్, పర్షియన్, చైనా తదితర పురాతన నాగరికతలు విలసిల్లిన ప్రాంతం ఈ హైరిస్క్‌ జోన్‌లోనే ఉంది. గనుల తవ్వకం, లోహాలను కరిగించటం, వ్యవసాయం వంటి మానవ కార్యకలాపాలతోపాటు లోహ సంపన్న సహజ రాతి శిలలు ఉండటం, ఇవి తక్కువ వర్షపాత ప్రాంతం కావటమే ఈ కాలుష్యానికి కారణమని పరిశోధకులు విశ్లేషించారు.  
»   అన్నిచోట్లా సాగు భూముల్లో ఈ ఏడు భార లోహాలు ఉన్నాయని కాదు.. కనీసం ఏదో ఒక రకమైనా అపరిమిత మోతాదులో పోగుపడినట్టు శాస్త్రబద్ధమైన అధ్యయనంలో గుర్తించామని డా. దేయీ హౌ స్పష్టం చేశారు. వీటిల్లో కాడ్మియం కాలుష్యం అత్యధికంగా ఉంది. ప్రపంచ నేలల్లో కనీసం 9% భూమిని కలుషితం చేసింది. ఉత్తర, మధ్య భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనాతో పాటు ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో కొన్ని ప్రాంతపు నేలల్లో కాడ్మియం ఎక్కువగా ఉంది.  
»  ఆర్సెనిక్‌ బెడద దక్షిణ చైనా, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంది. నికెల్, క్రోమియం కాలుష్యం మధ్య ప్రాచ్యం, సబార్కిటిక్‌ రష్యా, తూర్పు ఆఫ్రికాలో ఎక్కువ. కోబాల్ట్‌ కాలుష్యానికి ప్రధాన కారణం గనుల తవ్వకం. జాంబియా, కాంగో, ఇథియోపియాల్లో ఇది అధికం.  
»  ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తుల వాణిజ్యం విస్తృతంగా జరుగుతున్నందున, ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మాత్రమే ముప్పు పరిమితమైందని భావించడానికి లేదు. కాబట్టి, భార లోహాల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు భూముల స్థితిగతులపై పర్యవేక్షణకు అంతర్జాతీయంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని డా. దేయీ హౌ సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement