
భూగర్భజలాలు శుద్ధి చేయకుండా తాగితే ప్రమాదకరం
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని భూగర్భజలాలు శుద్ధిచేయకుండా తాగునీటికి ఉపయోగించడం ఏమాత్రం సురక్షితం కాదని తాజా అధ్యయనం తేల్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) ప్రమాణాల కంటే కూడా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ మోతాదులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27.48 శాతం మేర భూగర్భ నీటి నమూనాలను పరిశీలించగా నైట్రేట్ స్థాయిలు లీటర్‌కు 45 మిల్లీగ్రాముల నిర్దేశిత ప్రమాణాలకన్నా అధికంగా ఉన్నట్లు నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా–2024 నివేదికలో వెల్లడైంది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతుండటం వల్ల నైట్రేట్స్ మోతాదు, గాఢత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల్లేక మురుగునీరు భూగర్భజలాల్లో చేరుతుండటం కూడా నైట్రేట్స్ మోతాదు పెరుగుదలకు కారణమవుతోందని నివేదిక విశ్లేషిoచింది.
దేశవ్యాప్తంగా నైట్రేట్స్ మోతాదులు ఎక్కువగా ఉన్న 15 జిల్లాల్లో రంగారెడ్డి మూడో స్థానంలో నిలవగా ఆదిలాబాద్ 11వ స్థానంలో, సిద్దిపేట 12వ స్థానంలో నిలిచాయి.
రసాయన ఎరువుల అధిక వాడకంతో..
రాష్ట్రంలో వరిసాగు అధికం కావడంతో అధిక మోతాదులో ఎరువు మందులు వాడుతున్నారని.. అందులో సుమారు 30 శాతం పంటలు పీల్చుకుంటే మిగతా 70 శాతం మాత్రం నీటినిల్వ కారణంగా నెమ్మదిగా భూగర్భజలాల్లో కలుస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా నైట్రేట్ అధికంగా ఉన్న నీరు తాగేందుకు అనువైంది కాదంటున్నారు.
ఢిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–సేŠట్‌ట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్–2024 నివేదిక ప్రకారం 2021–22లో తెలంగాణలో ప్రతి హెక్టార్‌కు 297.5 కిలోల ఎరువులను రైతులు వినియోగిస్తున్నారని వారు వెల్లడించారు. అలాగే ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా–2022–23 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలో 2021–22 నుంచి 2022–23 మధ్య ఎరువుల వినియోగంలో 4.7 శాతం వృద్ధి నమోదైనట్లు తేలిందని చెప్పారు.
నైట్రేట్లు భూగర్భజలాల్లోకి చేరితే వాటిని శుద్ధి చేయడం మరింత కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చెరువులు, కాలువల్లోని కలుíÙతాలనే సరైన పద్ధతుల్లో శుద్ధి చేయలేకపోతున్న నేపథ్యంలో ఇక భూగర్భజలాల్లో కలిసే నైట్రేట్లను శుద్ధి చేయడం ఇబ్బందేనని అంటున్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో ఏటా పండిస్తున్న మూడు పంటల్లో ఎకరానికి 10–15 బస్తాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నారని వివరించారు.
దీనివల్ల విత్తనం, నేల వంటివి బలహీనంగా ఉండటమే కాకుండా రసాయన ఎరువుల అవశేషాలు పంటల్లోకి చేరుతున్నాయని.. వాటిని మనం ఆహారంగా తీసుకుంటుండటంతో మన శరీరంలోకి సైతం కెమికల్స్ ప్రవేశిస్తున్నాయని వివరిస్తున్నారు.
మురుగు శుద్ధిపై పర్యవేక్షణ ఏదీ?
హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి మెరుగుపడట్లేదు. దీనిపై స్వతంత్ర సంస్థతో ఇప్పటిదాకా పర్యవేక్షణే లేదు. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల సంఖ్య పెరుగుతున్నా సమర్థంగా శుద్ధిచేయక మురుగునీరంతా భూగర్భజలాల్లో చేరడం వల్ల నైట్రేట్ శాతం పెరుగుతోంది. – ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త
నైట్రేట్లతో కేన్సర్ ముప్పు..
పంటల ఉత్పాదకతను పెంచేందుకు రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. అవే నీటిని పంటల సాగుకు ఉపయోగిస్తుండటంతో హెవీ మెటల్స్, కలుషితాలు నేరుగా వాటిలో కలుస్తున్నాయి. చేపల ద్వారా కూడా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. శరీరంలో నైట్రేట్ల శాతాలు పెరిగితే కేన్సర్‌కు దారితీస్తుంది. పంజాబ్‌లో కేన్సర్ కేసుల పెరుగుదలకు పంటల కోసం అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగమే కారణమని తేలింది. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment