
సూర్యాపేట జిల్లా ఖాసీంపేటలో ఎస్సారెస్పీ నీళ్లందక ఎండిన వరి పంట
ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ప్రాజెక్టుల నీటి మీది ఆశతో వరి సాగు చేసిన రైతులతో పాటు బోర్లు, బావుల కింద పంట వేసిన లక్షలాది మంది రైతులు పొట్ట కొచ్చే దశలో ఉన్న వరిని చూసి తల్లడిల్లుతున్నారు.
ప్రాజెక్టుల కింద ఉన్న పొలాలకు వారబందీ ప్రాతిపదికన నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల,ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్ మొదలైన ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని పొదుపుగా కిందకు వదులుతుండడంతో ఆయకట్టు చివర ఉన్న పొలాలకు నీరు అందడం లేదు. దీంతో పలు జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది.
పడిపోతున్న భూగర్భ జలాలు: ఈ ఏడాది మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. చాలాచోట్ల ఏప్రిల్‌లో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నమోదైన భూగర్భ నీటి మట్టాలు ఈసారి మార్చి నెలలోనే ఆ స్థాయికి వెళ్లాయి.
గత నెలాఖరు నాటికే వికారాబాద్ జిల్లాలో 13.67 మీటర్ల లోతుకు వెళ్లగా, ప్రస్తుతం 14 మీటర్లు దాటింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో.. ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 8.32 మీటర్లను మించి 9 మీటర్ల నుంచి ఏకంగా 13 మీటర్ల వరకు వెళ్లింది. ఇక మార్చి రెండో వారం దాటే నాటికి కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భూగర్భ మట్టాలు మరింత అడుగంటినట్లు అధికారులు చెపుతున్నారు.
రికార్డు స్థాయిలో పంటల సాగు
రాష్ట్రంలో ఈ యాసంగిలో అత్యధికంగా 73.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరే 56.13 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ కింద క్వింటాలుకు రూ.500 ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది. సన్నాల సాగు పెరగడంతో సాగునీటి అవసరం మరింత పెరిగింది. పంట కాలం ఎక్కువ కావడంతో నీటి తడులు కూడా ఎక్కువ కావలసి ఉంది.
అయితే ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దేవాదుల వంటి ప్రాజక్టుల కింద పొలాలకు వారబందీ కింద ఒక వారం నీరిచ్చి, మరో వారం బంద్ చేస్తుండడంతో వారం పాటు పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు వేసిన చాలా గ్రామాల్లో పంటను పశువులకు వదిలేశారు. మొక్కజొన్న పంట కూడా సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి ఏకంగా మూడున్నర లక్షల ఎకరాలు అధికంగా సాగైంది.
గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు 8.09 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆరు తడి పంటగా సాగయ్యే మొక్క జొన్నకు వారం, పదిరోజులకు కూడా ఒక తడి నీరు ఇవ్వని పరిస్థితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మొక్కజొన్న, వేరుశనగ కూడా..
నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, మెదక్ మొదలైన జిల్లాల్లో మొక్కజొన్న, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వేరుశనగ పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలో తెలియక నీటిపారుదల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల బాధలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీరు పెద్దపల్లి జిల్లా గుండా మంథని వరకు నిరాటంకంగా వెళ్లేలా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రయతి్నస్తున్నప్పటికీ, వచ్చే నెలలో ఎలా ఉంటుందో చెప్పలేమని ఓ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment