Agriculture Department
-
సామాన్యుడి బతుకు.. పెనం నుంచి పొయ్యిలోకి..
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పులు, తగ్గిన పంటల దిగుబడులు, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు... సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏమాత్రం తగ్గకుండా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఏం కొనేటట్టు లేదని.. ఏం తినేటట్టు లేదని వాపోతున్నాడు. దేశవ్యాప్తంగా 14 నెలల గరిష్టానికి నిత్యావసరాల ధరలు చేరుకున్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్పష్టం చేసింది. దేశంలో 70 రకాల పంటల సాగుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 20 నుంచి 25 రకాల పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నట్లు భారత వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా దేశంలో గత పదేళ్లలో 22 రకాల సరుకుల ధరలు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం లెక్కలు వేసింది. మొత్తమ్మీద సగటు వినియోగదారుడు వెచ్చాల కోసం భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి. కాగా, డిసెంబర్ 6న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణంపై సమీక్షించనుందని, ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంతమేర ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. బియ్యం ధరలకు రెక్కలు బాస్మతీయేతర తెల్లబియ్యంపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం రద్దు చేసింది. అలాగే పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించింది. ఆంక్షలు ఎత్తివేయడంతో దేశం నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న తెల్ల బియ్యం, పారా బాయిల్డ్ రైస్‌లో భారత్ వాటా 45 శాతం కాగా, ఇందులో తెలంగాణ, ఏపీలే కీలకం. రాష్ట్రంలో మేలు రకం బియ్యం ధరలు క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.7,500కు చేరుకున్నాయి. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి మేలు రకాల ముడి బియ్యం ధరలు రూ.7వేల పైనే ఉన్నాయి. స్టీమ్డ్ రైస్ క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు లభిస్తున్నాయి. మిల్లుల నుంచి కిరాణా దుకాణాలు, ప్రొవిజనల్ స్టోర్స్, భారీ మాల్స్ వరకు అన్ని చోట్ల ధరలు అటు ఇటుగా ఇలాగే ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండుతున్న నూనె కేంద్ర ప్రభుత్వం ఇటీవలే క్రూడ్ పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. అలాగే రిఫైన్ చేసిన పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఇప్పటికే ఉన్న 12.5 శాతం సుంకాన్ని 32.5 శాతానికి పెంచింది. దీంతో మార్కెట్లో రూ.90 లోపు లభించే లీటర్ పామాయిల్ రూ.130 వరకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె ధరలు రూ.135 నుంచి రూ.150కి చేరాయి. సుంకం పెంచని వేరుశనగ, రైస్‌బ్రాన్, కుసుమ నూనె ధరలను కూడా ఆయా ఉత్పత్తి సంస్థలు విపరీతంగా పెంచడం గమనార్హం. కూర ‘గాయాలే’..! కూరగాయల ధరల్లో ఈ ఏడాది సగటున 30 శాతం వృద్ధి కనిపించింది. అందరూ రోజూ కూరల్లో తప్పకుండా వినియోగించే టమాట, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ధరలు కొంతకాలంగా ఆకాశాన్ని అంటుకున్నాయి. నెలరోజుల క్రితం వరకు ఉల్లిగడ్డ, టమాట ధరలు ఏకంగా కిలో రూ.వందకు చేరాయి. ప్రస్తుతం ఉల్లి రూ.60 వరకు ఉండగా, టమాట ధరలు కొంత తగ్గినట్టు కనిపించినా, ఇప్పటికీ మేలు రకం రూ.50కి తక్కువ లేదు. క్యారట్ కిలో ఏకంగా రూ.120 వరకు ఉండగా, బీట్రూట్ రూ.80, ముల్లంగి రూ. 72, చిక్కుడు రూ.100, వంకాయలు రకాన్ని బట్టి రూ. 70–90 వరకు విక్రయిస్తున్నారు. క్యాప్సికమ్ రూ.90, బెండకాయ రూ.60, బీరకాయ రూ.70, బీన్స్ రూ.70, కాకర రూ.60, దోసకాయ రూ.60 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లు, రైతుబజార్లలో కొంత మేర తక్కువకు విక్రయించినప్పటికీ, చిల్లర వ్యాపారుల వద్ద ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ములక్కాడలు ఒక్కోటి రూ.20కి విక్రయిస్తుండగా, నిమ్మకాయలు కిలోకు రూ.120–140 వరకు ఉన్నాయి. ఆకుకూరల ధరలూ ఆకాశంవైపే చూస్తున్నాయి. కాగా, సబ్బులు, టూత్‌పేస్ట్, షాంపూలు, కాఫీ, టీ పౌడర్, సౌందర్య వస్తువుల ధరలు కూడా మూడు నెలలుగా పెరిగినట్లు తెలుస్తోంది. -
సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ఊతం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రెండు పథకాలు... పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజనగా హేతుబద్దీకరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ఈ రెండు భారీ పథకాలకు ఆమోద ముద్ర వేసింది. రూ.లక్ష కోట్లకుపైగా నిధులతో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం–ఆర్కేవీవై), కృషోన్నతి యోజన(కేవై)ను అమలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుస్థిర వ్యవసాయానికి ఊతం ఇవ్వడానికి, పీఎం–ఆర్‌కేవైవీ, ఆహార భద్రతలో స్వయం సమృద్ధి కోసం కృషోన్నతి యోజనను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు పథకాల మొత్తం వ్యయం రూ.1,01,321 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.69,088 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.32,232 కోట్లు. పీఎం–ఆర్‌కేవీవైకి రూ.57,074 కోట్లు, కృషోన్నతి యోజనకు రూ.44,246 కోట్లు ఖర్చు చేస్తారు. దాదాపు 18 పథకాలను ఈ రెండు పథకాలుగా హేతుబద్దీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని అమలు చేస్తారు. » వంట నూనెల ఉత్పత్తిని భారీగా పెంచి, స్వయం సమద్ధి సాధించడానికి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రూ.10,103 కోట్లతో 2024–25 నుంచి 2030–31 వరకు ఈ కార్యక్రమం అమలు చేస్తారు. 2030–31 నాటికి దేశంలో నూనె గింజల ఉత్పత్తిని 69.7 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచాలని నిర్ణయించింది. » మరాఠి, పాళీ, ప్రాకతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. భారతీయ భాషలకు ప్రాచీన హోదా ఇచ్చే విధానాన్ని 2004 అక్టోబర్ 12న కేంద్ర ప్రారంభించింది. ఇప్పటివరకు తమిళం, సంస్కతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ఈ హోదా లభించింది. »11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధానిత బోనస్ చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 78 రోజులకు గాను మొత్తం రూ.2,028.57 కోట్లు చెల్లించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే శాఖ పనితీరును మరింత మెరుగుపర్చడానికి ప్రోత్సాహకంగా ఉద్యోగులకు ఈ బోనస్ చెల్లిస్తుంటారు. » చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
చెరువులకు జలకళ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్: భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. దీంతో ఈసారి పంటలకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. కోటి పది లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి, నీటిపారుదల శాఖ మొత్తం 19 డివిజన్లుగా విభజించగా, వాటి పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఇచి్చన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,176 చెరువులు ఉంటే.. అందులో 15,608 చెరువులు పూర్తిగా మత్తడి దుంకుతున్నాయి. 5,952 చెరువులు మాత్రం ఇంకా 50 శాతం కంటే తక్కువ నీరు ఉన్నట్టు నీటిపారుదలశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 75 నుంచి 100 శాతం మేరకు నిండిన చెరువులు 8,144 ఉన్నాయి. ఇవికాక 50–75 శాతం మేరకు నిండిన చెరువులు మరో 5,012 వరకు ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాల సీజన్ ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ మధ్యలో పడే వర్షాలకు మిగిలిన చెరువులు కూడా పూర్తిస్థాయిలో నిండుతాయన్న ఆశాభావాన్ని నీటిపారుదలశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వర్షాలతో భూగర్భజల నీటిమట్టం కూడా పెరుగుతుందని, తద్వారా నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. 50 శాతంలోపు నిండిన చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరితే, ప్రాజెక్టులు, రిజర్వాయర్లతోపాటు, అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నిండినట్టు అవుతుందని అంటున్నారు. మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ నుంచి 9.02 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాని ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్‌కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగవనకు 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4.72 లక్షల క్యూసెక్కులు వస్తుంటే.. దిగువకు అంతేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బరాజ్‌లో నుంచి 7.23 లక్షల క్యూసెక్కుల నీరు, సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) నుంచి 7.55 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శాంతిస్తున్న కృష్ణమ్మ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో నీటి ప్రవాహం లేకపోయినా.. క్యాచ్మెంట్ ఏరి యాల్లో పడిన వర్షంతో జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలంలోకి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.16 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే.. దిగువకు పదిగేట్లు ఎత్తి 3.61 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాంలోకి 3.04 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే.. అంతే మొత్తాన్ని ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు వదిలేస్తున్నారు. -
‘నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే’
సాక్షి, హైదరాబాద్: ‘కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల వివరాలు వాస్తవం/సరైనవి. రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు తేలినా లేదా పంట రుణమాఫీకి అర్హత లేదని నిర్ధారణ అయినా.. పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నాను. ఆ మొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది..’ఇది రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు, రుణమాఫీ కోసం ఇవ్వాల్సిన అఫిడవిట్. ఇలా అఫిడవిట్ కోరడంతో పాటు రుణమాఫీ–2024 బ్యాలెన్స్ ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. మార్గదర్శకాలకు రైతులు ఇవ్వాల్సిన అఫిడవిట్‌ను జత చేసింది. ఫొటో తీయాలి..సెల్ఫీ దిగాలి ⇒ పంట రుణం ఉన్న రైతు ఇంటిని ఎంఏవో తప్పనిసరిగా సందర్శించి, రైతు వెల్లడించిన కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్ నంబర్‌తో సహా నమోదు చేసుకోవాలి. ⇒ ఎంఏవోతో సహా ఏ అధికారికీ ఒకటి కంటే ఎక్కువ మండలాలను కేటాయించకూడదు. మండల స్థాయిలో నియమితులైన అధికారి వివరాలను వెంటనే రుణమాఫీ విభాగానికి సమర్పించాలి. ⇒ ఎంఏవో రుణమాఫీ లాగిన్లలో కుటుంబ సభ్యుల వివరాలను అప్లోడ్ చేయడానికి మొబైల్ యాప్ అభివృద్ధి చేయడం జరిగింది. ⇒ మండలంలోని అన్ని బ్యాంకు బ్రాంచీల వారీగా కుటుంబ సభ్యులను నిర్ధారించి రుణం పొందిన రైతుల జాబితా ప్రదర్శించాలి. ⇒ రుణం పొందిన రైతు జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయాలి. ⇒ జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ⇒ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో పాటు వారి వయస్సు నమోదు చేయాలి. కుటుంబ పెద్దతో ఫొటో తీయాలి. ⇒ రైతు సమర్పించే అఫిడవిట్లో అతను అందించిన కుటుంబ సభ్యుల వివరాలు ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా పంచాయతీ కార్యదర్శి లేదా ఏఈవో లేదా ఏఏవో ధ్రువీకరించాలి. ⇒ రైతులు సమర్పించిన అఫిడవిట్‌ను యాప్‌లో అప్లోడ్ చేయాలి. ⇒ డేటా సేకరణ సమయంలో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు రుణం పొందిన రైతుతో ఎంఏవో సెల్ఫీ దిగి యాప్‌లో అప్లోడ్ చేయాలి. వివరాల సేకరణ షురూ రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, సాంకేతిక కారణాలతో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గ్రామాల్లో సర్వే చేపట్టారు. మండలం యూనిట్‌గా రైతుల వివరాలను సేకరిస్తున్నారు. అనేకచోట్ల వివరాలను సేకరిస్తున్నా రైతులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు రుణమాఫీ విషయంపై నిలదీస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న సొమ్ము బ్యాంకులో చెల్లించాలా వద్దా? అని అడుగుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని అన్నారం గ్రామంలో ఎస్బీఐ, గ్రామీణ వికాస్‌బ్యాంక్ సైట్లు ఓపెన్‌కాగా ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. గ్రామంలో 30 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. కానీ ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ ఓపెన్ కాకపోవడంతో 15 మంది రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇంకోవైపు రుణం తీసుకొని మృతి చెందిన రైతుల రుణమాఫీకి సంబంధించి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ల నమోదులో తప్పిదాలను సరిచేయడం కోసం యాప్‌లో ఎలాంటి ఆప్షన్లు లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది. ఇలాంటి వారికి సంబంధించి గ్రామంలో 11 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్‌లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్‌లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్‌లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్‌లో బయోచార్‌పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్‌మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్‌షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్‌రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనెగింజలు, చెరకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లలో సాగైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 879.22 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలను సాగు చేశారని పేర్కొంది. అదేవిధంగా, గత ఏడాది 263.01 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా ఈ ఏడాది 276.91 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఇదే సమయానికి 99.71 లక్షల హెక్టార్లలో పప్పు «ధాన్యాలు సాగు జరగ్గా, ఈ ఏడాది 110.61 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటితో పాటు గతేడాది 174.53 లక్షల హెక్టార్లలో నూనెగింజల సాగవగా ఈసారి 179.69 లక్షల హెక్టార్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ముతక తృణ ధాన్యాలు, చెరకు సాగు కూడా పెరిగింది. సాగు పెరగడంతో పప్పు, నూనెగింజల ధరలు తగ్గొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. -
దేశంలో సాధారణ స్థితికి వరిసాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరించిన రుతు పవనాలు, జోరుగా కురుస్తున్న వర్షాలతో వరి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వరి 23.7 మిలియన్ హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది జూలై 27 నాటికి 21.5 మిలియన్ హెక్టార్లలో సాగైందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ ఐదేళ్ల సగటుతో పోలిస్తే 2.2 శాతం మేర అధికమేనని తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 40.15 మిలియన్ హెక్టార్లలో వరి సాగు కానుందని అంచనా వేసింది. ఇక వేరుశెనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు వంటి నూనెగింజల సాగు గత ఏడాది కంటే 3.8 శాతం ఎక్కువగా, 17.16 మిలియన్ హెక్టార్లలో సాగయ్యాయని వివరించింది. పప్పుధాన్యాల సాగు సైతం 14 శాతం మేర పెరిగి, 10.2 మిలియన్ హెక్టార్లలో సాగైందని వెల్లడించింది. -
మాటకు కట్టుబడి మాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు. రైతుల రుణ మాఫీ పథకంలో భాగంగా గురువారం సచివాలయంలో తొలి విడతగా రూ. లక్ష వరకు మాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇది మరపురాని రోజు ‘నాడు కరీంనగర్లో సోనియాగాంధీ మాట ఇచ్చారు. అనంతరం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా, మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండుసార్లు మాట తప్పారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండోసారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2022 మే 6న వరంగల్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రుణమాఫీ చేస్తామన్నారు. 2023 సెపె్టంబర్ 17న తుక్కుగూడాలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. వారిచ్చిన మాట ప్రకారమే నేడు సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను జమ చేస్తున్నాం. నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజు. రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9ని రుణమాఫీ కటాఫ్‌గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. ముందుగా ఈ రోజు రూ.లక్ష వరకు రుణ విముక్తి కల్పించాం. రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరతాం. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి..’అని సీఎం అన్నారు. రేషన్‌కార్డు ప్రాతిపదిక కాదు ‘కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలనే అపోహ çసృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. పాస్ బుక్‌నే కొలబద్ద. దొంగలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. అందుకే పాసుబుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నాం. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. బ్యాంకు అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు..’అని రేవంత్ చెప్పారు. త్వరలో వరంగల్‌లో రాహుల్‌గాందీతో సభ ‘గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ అప్పులకు మిత్తీగా ప్రతి నెలా రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. రైతు రుణమాఫీలో దేశానికి తెలంగాణ మోడల్‌గా ఉండబోతుంది. 8 నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్‌గాంధీని ఆహా్వనించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఆయన్ను ఆహ్వానిస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర రైతులకు పెద్ద పండుగ: భట్టి రాష్ట్రంలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈ రోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పజెప్పినప్పటికీ రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. కాగా రైతు రుణమాఫీ పురస్కరించుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాం«దీకి ధన్యవాదాలు తెలుపుతు సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమం చివర్లో కొందరు రైతులకు రుణమాఫీ చెక్కులు సీఎం పంపిణీ చేశారు. -
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్‌కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్‌తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
మాఫీ ‘లెక్క’ మారిందా?
సాక్షి, హైదరాబాద్: రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తోంది. రుణమాఫీ ‘లెక్క’ తప్పిందని.. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని, 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమకానున్నాయని కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు రూ.లక్షలోపు పంట రుణాల మాఫీకోసం రూ.19,198.38 కోట్ల నిధులు లెక్కతేల్చితే.. ఇప్పుడు రేవంత్ సర్కారు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి కేవలం రూ.7 వేల కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పైగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది కూడా. అయినా రుణమాఫీ సొమ్ము మూడో వంతుకు తగ్గడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లాలకు ‘మాఫీ’ రైతుల జాబితాలు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ సొమ్మును గురువారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. 11.50 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్లు జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు రైతుల జాబితాను జిల్లాలకు పంపించింది. వీరంతా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. రూ.లక్ష మాఫీ అవుతున్న రైతులు 459 మంది ఉన్నారు. మిగతావారికి అంతకన్నా తక్కువ రుణాలు ఉన్నాయి. గత సర్కారు రుణమాఫీ లెక్కలతో.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్ఎస్ సర్కారు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించి.. 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే.. 2018 నాటి రూ.లక్ష రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లకుపైగా అవసరమవగా.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం రూ.7 వేల కోట్లనే లెక్క వేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో భారీగా పెరిగిన పంట రుణాలు గత ఐదేళ్లలో పంట రుణాలు భారీగా పెరిగినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నివేదిక స్పష్టం చేస్తోంది. 2020–21లో రూ.41,200 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు, 2022–23లో రూ.59,060 కోట్లు, 2023–24లో రూ.64,940 కోట్లు రుణాలు ఇచి్చనట్టు తెలిపింది. సర్కారు రుణమాఫీకి నిర్ణయించిన కటాఫ్ ప్రకారం చూస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రైతులు తీసుకున్న రుణాలు రూ.49,500 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం ఏటా రైతుల నుంచి రుణాల రికవరీ దాదాపు 90శాతం వరకు ఉంటుంది. కానీ తాము గెలిస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ 2022లోనే ప్రకటించిన నేపథ్యంలో.. 2023–24లో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించి ఉండరని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంటే 2022–23లో తీసుకున్న రుణాల్లో కొంత మేరకు, 2023–24లో డిసెంబర్ వరకు తీసుకున్న రుణాల్లో చాలా వరకు చెల్లించకుండా ఉన్నాయని బ్యాంకుల సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా.. దాదాపు రూ.49 వేల కోట్ల మేరకు పంట రుణాల బకాయిలు ఉంటాయని అంచనా. రాష్ట్ర సర్కారు మాత్రం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం రూ.31 వేల కోట్లే అవసరమని అంచనా వేసింది. పీఎం కిసాన్ నిబంధనలు, పాస్‌బుక్కులు, రేషన్‌కార్డుల నిబంధనల వల్ల అర్హులైన రైతుల సంఖ్య బాగా తగ్గి ఉంటుందని.. మాఫీ సొమ్ము అందుకు తక్కువై ఉంటుందని రైతు సంఘాల నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీకి నిధుల అన్వేషణలో సర్కారు! ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్నిరకాల మార్గాలను అన్వేíÙస్తోంది. నిధులు పూర్తి స్థాయిలో సమకూరకపోవడంతోనే మూడు దశల్లో మాఫీ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కు చెందిన భూములు అభివృద్ధి చేసి, తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్ల నుంచి రుణాల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్యాక్స్‌కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని చెప్పి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.5 వేల కోట్ల రుణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మద్యం డిస్టిలరీలకు బ్రూవరీస్ కార్పొరేషన్ చెల్లించాల్సిన బిల్లులను ఐదు నెలలుగా ఆపి ఉంచినట్టు తెలిసింది, ఈ సొమ్మును రుణమాఫీకి మళ్లించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మొత్తం ఐదారు వేల కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు ఈసారి రైతుభరోసా కింద చెల్లించాల్సిన నిధులను కూడా రుణమాఫీకి మళ్లించినట్లు చర్చ జరుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకోగలిగిన రుణాలను కూడా ముందస్తుగా సేకరించడం ద్వారా రూ.ఐదు వేల కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రుణాల మొత్తం భారీగా పెరిగినా.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం రూ.64,940 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం గత ఏడాది డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని లెక్కలు వేసింది. -
'రేషన్' ఉంటేనే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి. -
కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: కుటుంబం యూనిట్‌గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్‌కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. పీఎం కిసాన్ నిబంధనల అమలు యోచన! వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..! బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్‌బుక్‌ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం. గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, కో–ఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
సాగుభూమికే రైతుభరోసా ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతుభరోసా విధివిధానా ల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం కదిలింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో రైతులు, కౌలురైతులు, రైతుసంఘాల నేతలు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతేకాక లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు తెలపొచ్చని మంత్రులు ప్రకటించడంతో పలువురు రైతులు లేఖలు అందించారు. సమావేశంలో మెజారిటీగా వెల్లడైన అంశాలిలా ఉన్నాయి. ⇒ సాగుచేసే వారికే రైతుభరోసా పథకం అమలు చేయాలి. నిజమైన రైతులు ఎవరనేది వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతుబం«ధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన, సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది. ⇒ రైతుబంధు పరిమితి లేకుండా ఎంత భూమి ఉన్నా ఇచ్చారు. అలా కాకుండా పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ⇒ సీజన్ ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో రైతుభరోసా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ బంజరు భూములు, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందింది. రైతుభరోసాలో ఈ భూములు, ఈ కేటగిరీకి చెందిన వారిని తొలగించాలి. ⇒ కౌలు రైతులకు ఉపయోగపడేలా రైతుభరోసా ఉండాలి. రైతుబం«ధు అందక, పంటనష్టం జరిగినా పరిహారం లేక.. ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఎంతో కొంతైనా రైతుభరోసా ఇవ్వాలి. లేదా సబ్సిడీపై విత్తనాలు అందించాలి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించి రైతులు, కౌలు రైతులకూ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి. ⇒ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను అధికారికంగా గుర్తించారు. 2011లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి అర్హులైన వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. గ్రామసభలు నిర్వహించి మళ్లీ కౌలు రైతులను గుర్తించాలి. ⇒ ఒకటి, రెండు ఎకరాలున్న చాలామంది రైతుల భూములు ధరణిలో నమోదు కాలేదు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వీరికి పాత పాస్ పుస్తకాలు ఉన్నా.. ధరణిలో ఎక్కకపోవడంతో కొత్తవి రాలేదు. ఈ రైతులు రైతుభరోసా పథకాన్ని కోల్పోకుండా భూములను ధరణిలో చేర్చేందుకు రైతు సదస్సులు నిర్వహించాలి. ⇒ ఒకే భూమికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు రైతుబంధు తీసుకున్నారు. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారినప్పుడు ఇలా జరిగింది. వీటిని నియంత్రిస్తే అర్హులైన ఎక్కువమంది రైతులకు రైతుభరోసా అందుతుంది. ⇒ విత్తన సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయాలి. గతంలో జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. పంటల బీమాను త్వరితగతిన అమలు చేయాలి. ⇒ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తింపజేయాలి. -
ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్‌రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
వ్యవసాయానికి 64 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.64 వేల కోట్ల మేర అవసరమని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనలను స్వీకరిస్తోంది.పథకాల వారీగా అవసరాలతో..: బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధుల అవసరాలను వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు, రైతుభరోసా కోసం రూ.23 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటల బీమాకు రూ.3 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. దీంతోపాటు రైతుబీమాకు రూ.1,500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల కోసం మిగతా నిధులను కోరారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి దాదాపు వెయ్యి కోట్లు కావాలని కోరినట్టు సమాచారం.వ్యవసాయ యాంత్రీకరణ కీలకంగత పదేళ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. కానీ ప్రభుత్వం నుంచి కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై అందే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. బయట మార్కెట్లో కొనాలంటే.. రైతులు ఆ ధరలు భరించడం కష్టం. కొరత కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2018 వరకు ప్రభుత్వం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చిందని.. ఆ తర్వాత పథకం నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. -
గ్రామాల వారీగా రుణమాఫీ రైతుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా రైతుల జాబితాను బ్యాంకులతో కలిసి అధికారులు తయారు చేయాలని యోచిస్తోంది. అనంతరం గ్రామసభలో చర్చించి తుది జాబితా సిద్ధం చేస్తారని అధికారులు అంటున్నారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో అందులో ఉండాల్సిన అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు తలమునకలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 31 వేల కోట్లు ఖర్చు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన సంగతి విదితమే. రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చి స్తున్నారు. గతంలో రుణమాఫీ అమలు సందర్భంగా విడు దల చేసిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేస్తు న్నారు. దాదాపు అవే మార్గదర్శ కాలు ఉంటాయని వ్యవసాయ శాఖవర్గాలు అంటున్నాయి. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. పాస్‌పుస్తకం జత చేసి బంగారు రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే....అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే..భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే... వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు. ఇప్పు డు కూడా వాటినే అమలు చేయనున్నారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లతో సహా), గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణా లు, బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని నిబంధనలను మాత్రం తీసుకుంటారని, పూర్తిగా దాన్నే రుణమాఫీ పథకానికి వర్తింపజేయరని అంటున్నారు. మార్గదర్శకాల్లో చేర్చాల్సిన అంశాల్లో ముఖ్యాంశాలు.. » రైతులకు రుణమాఫీ అందజేయడానికి అర్హులైన లబ్ధి దారుల డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు పోర్టల్‌ను అభివృద్ధి చేయాలి.» పంట రుణ బకాయిలున్న రైతుల జాబితాను సిద్ధం చేసి వాటిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాటిని చెక్ చేయాలి. రెండు లక్షల వరకు పరిమితమైన రైతుల తుది జాబితాను బ్యాంక్ బ్రాంచీలో సిద్ధం చేయాలి. అందుకు సంబంధించిన ఒక కాపీని జిల్లా కలెక్టర్‌కు పంపాలి.» అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు, బ్యాంకు శాఖల పంట రుణాలు పొందిన బంగారు రుణాలు మాఫీ చేయరు. అయితే ఆయా బ్యాంకులు గ్రామీణ బ్రాంచీలు ఉంటే అక్కడ తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తారు. » కొంతమంది రైతులు ఒకే బ్యాంకుకు చెందిన ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు శాఖల నుంచి పంట రుణాలు తీసుకొని ఉండవచ్చు. అందువల్ల నకిలీ లేదా మల్టీపుల్ ఫైనాన్సింగ్‌ను తొలగిస్తారు. అందుకు జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా మండల స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారు. రుణమాఫీకి అర్హులైన వారందరికీ వ్యవసాయ భూములున్నాయో లేదో ధ్రువీకరిస్తారు. » ఒక రైతు కుటుంబానికి వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నా, పంటరుణం మొత్తం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అర్హత ఉన్న మాఫీ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం విభజిస్తారు. » తహసీల్దార్, ఎంఏఓ, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి అధికారుల బృందం సంబంధిత గ్రామానికి చెందిన ఏఈఓ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు రైతు వివ రాలు సేకరిస్తారు. ఆయా రైతుల సమగ్ర సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. సామాజిక తనిఖీ చేస్తారు. గ్రామసభ నిర్వహించడం ద్వారా బ్రాంచి మేనేజర్ అన్ని అభ్యంతరా లను తీసుకుంటారు. అనంతరం బ్యాంకుల రైతుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. » జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుల వారీగా, రైతుల వారీగా రుణమాఫీకి సంబంధించిన జిల్లా వివరాలు నమోదు చేస్తారు. దాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి పంపిస్తారు. దాన్ని ఐటీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. బ్యాంకుల వారీగా, శాఖల వారీగా, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు పంపిస్తారు. » రుణాలు ఇచ్చిన బ్యాంకులే రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత కచ్చితత్వానికి బాధ్యత వహించాలి. » పంట రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నట్టు లేదా రుణమాఫీకి అర్హులు కాదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతు నుంచి ఒక హామీని వ్యవసాయశాఖ తీసుకోవాలి. -
రుణమాఫీకి పరిమితులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణ మాఫీకి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. అనర్హులకు రుణమాఫీతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని.. అర్హులందరికీ పూర్తి న్యాయం జరిగేలా రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రుణమాఫీ అంశంపై శుక్రవారం తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఈ సమావేశంలోనే పూర్తిస్థాయిలో చర్చించి రుణమాఫీపై ఒక నిర్ణయానికి వస్తారని.. మార్గదర్శకాలకు ఒక రూపం ఇస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయని సమాచారం. ధనికులు, ప్రముఖులను మినహాయిస్తూ.. సీఎం కార్యాలయ వర్గాలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. ధనికులకు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్నా పీఎం కిసాన్ పథకం కింద.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్ పర్సన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న రైతు రుణమాఫీలోనూ ఈ వర్గాలను మినహాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లించే ప్రతీ ఒక్కరినీ కాకుండా.. అధిక ఆదాయమున్న వారిని మాత్రమే మినహాయిస్తారని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరినీ కాకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారని వివరిస్తున్నాయి. ఇలాంటి వారికి రుణమాఫీని మినహాయిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నాయి. ఇక రుణమాఫీకి కటాఫ్ తేదీని కూడా మంత్రివర్గ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తేదీ, లేదా సోనియాగాంధీ పుట్టినరోజును ప్రామాణికంగా తీసుకునే ప్రతిపాదన ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. భూసీలింగ్ ఏదైనా వర్తింపజేస్తారా? ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు కూడా. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం? అందుకు తగ్గట్టుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులేమిటన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతోపాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులపై అధికారులు అధ్యయనం చేశారు. ఆ పథకాల ప్రయోజనాలు, అనుసరించిన విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులు ముంబై వెళ్లి మహారాష్ట్ర రుణమాఫీని అధ్యయనం చేసి వచ్చారు. ఏం చేసినా అసలైన రైతులకు మేలు జరిగేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ రైతుకు ప్రయోజనం కలిగించేలా విధివిధానాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అయితే ధనిక రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉండదన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేసే ప్రతిపాదన ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసాను ఐదు లేదా పదెకరాలకు పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రుణమాఫీకి కూడా అలాంటి పరిమితి విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా తర్జనభర్జన రైతు రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి దాదాపు రూ.35 వేల కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. కటాఫ్ తేదీ, షరతులను బట్టి ఆర్థికభారం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆర్థికభారం తగ్గించుకునేందుకు ఎక్కువ షరతులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా? అన్న సంశయం ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్టు చెప్తున్నారు. ఉద్యోగులను మినహాయిస్తే వారి నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న చర్చ జరుగుతోంది. అలాగే ఐదు లేదా పదెకరాలకే పరిమితి విధిస్తే.. మిగతా రైతుల నుంచి వ్యతిరేకత రావొచ్చని అంటున్నారు. షరతులు పెడితే ఆర్థికంగా పెద్ద మొత్తంలో మిగులు ఉండాలని.. అలాకాకుండా మిగిలేది తక్కువే ఉంటే షరతులు ఎక్కువగా పెట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం కూడా నెలకొంది. ఈ క్రమంలో ‘మినహాయింపుల’పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతూనే ఉంది. మరోవైపు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును సమకూర్చడం సాధ్యంకానందున.. విడతల వారీగా రుణమాఫీ జేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. -
అన్నదాత అడిగేదొకటి..మార్కెట్లో ఉన్నదొకటి..
సాక్షి, హైదరాబాద్: అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాల కోసం రైతులు కోరుతుంటే.. ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమకు కావాల్సిన విత్తనాల కోసం రైతులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు సైతం చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరాలో చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోరుకునే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న విత్తనాలను కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విత్తనాల కొరత లేదని చెబుతున్న అధికారులు... డిమాండ్ ఉన్న విత్తనాల కొరత విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పెద్దగా కొనుగోలు చేయని విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి కొందరు అధికారులు వాటిని మార్కెట్లో ప్రోత్సహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఏ రకం విత్తనాలకు డిమాండ్ ఉంటుందో వ్యవసాయశాఖకు తెలుసు.. కానీ వాటిని మార్కెట్లో ఎందుకు అందుబాటులో ఉంచలేదో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా...రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. చినుకు పడితే చాలు రైతులు తక్షణమే పత్తి విత్తనాలు చల్లేస్తారు. ఇప్పుడు రైతులకు అత్యంత కీలకమైనవి పత్తి విత్తనాలే. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందుగా అధికారులు ప్రణాళిక రచించలేదు. రాష్ట్రంలో ఈసారి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని భావించారు. గురువారం నాటికి 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే, మిగతా ప్యాకెట్లు కూడా వచ్చే నెల 5 నాటికి జిల్లాలకు చేరతాయని, అందువల్ల కొరతే లేదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇతర కంపెనీల విత్తనాలనూ కొనుగోలు చేసుకోవాలని పిలుపునిస్తున్న అధికారులు.. దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు నిలదీస్తున్నారు. దిగుబడి తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల ప్రవాహం...ప్రభుత్వం అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇదే అదనుగా భావించిన విత్తన దళారులు మూకుమ్మడిగా నకిలీ విత్తనాలను అన్నదాతకు అంటగడుతున్నారు. నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాలకు తరలించారు. ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా నకిలీ విత్తనాల బెడద వేధిస్తూనే ఉంది. ఇదిలావుంటే, పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేదు. 1.38 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలైన డయాంచ, సన్‌హెంప్, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు కేవలం 79 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. వ్యవసాయశాఖ లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి ఈ సమస్యకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక ఉన్నతాధికారి ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాల ని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశిస్తుంటే... మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్లుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఒక ఏఈవోను ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరుగా ఆదేశిస్తూ మరింత గందరగోళపరుస్తున్నారని వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేత ఆరోపించారు. ఐదో తేదీ నాటికి మిగతా పత్తి విత్తనాలుమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ మేరకు ఆయన విత్తన కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విత్తన కంపెనీలన్నీ ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, అన్ని విత్తనాల దిగుబడి ఒక్కటేనని ఆయన వివరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా అన్నారు. -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాల నమోదు మొదలవగా, 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.కేవీకే, ఏఆర్ఎస్లలో ఫౌండేషన్, సర్టిఫైడ్ సీడ్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా స్థానాలు (ఏఆర్ఎస్) కేంద్రాల్లో 7,941.35 క్వింటాళ్ల వరి, 2,404.50 క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. బ్రీడర్ సీడ్ కిలో రూ.77.80 చొప్పున, ఫౌండేషన్ సీడ్ (ఎన్‌డీఎల్‌ఆర్7) కిలో రూ.50 చొప్పున, సర్టిఫైడ్, నమ్మదగిన సీడ్ (ఎన్‌డీఎల్‌ఆర్–7) కిలో రూ.42 చొప్పున ధర నిర్ణయించి అందుబాటులో ఉంచారు. బీపీటీ 5204, 2270, 2782, 2595, 2846, 2841, ఎన్‌డీఎల్‌ఆర్ 8, ఎంటీయూ 1262, 1271, 1224, ఎంసీయూ103, ఆర్జీఎల్ 2537 వంటి ఫైన్ వెరైటీస్‌కు చెందిన ఫౌండేషన్ సీడ్ కిలో రూ.45, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.42, ఇతర వరి రకాల ఫౌండేషన్ సీడ్ కిలో రూ.40, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.38 చొప్పున ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచారు. కనీసం 25–30 కేజీల ప్యాకింగ్‌తో విత్తనం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.రూ.450 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వంఖరీఫ్ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా 2.26 లక్షల క్వింటాళ్లు వరి, 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ, నువ్వులు, 30 శాతం సబ్సిడీపై అపరాల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వరి విత్తనాలకు మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పరిధిలోని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రూ.195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది.ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభంఖరీఫ్ సీజన్‌కు సర్టిఫై చేసిన విత్తనాలను సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆర్బీకేల్లో రైతుల రిజిస్ట్రేషన్ మొదలైంది. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ సీడ్స్పంపిణీకి విత్తనాలు సిద్ధంసీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనంతో పాటు అవసరం మేరకు ఏపీ సీడ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – చేవూరు హరికిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
క్రాప్‌లోన్ కట్టాల్సిందే...!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి. భరోసా ఇవ్వని యంత్రాంగం...అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు. అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు. -
పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గత నెల వడగళ్లు, అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రైతులకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే. మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్లు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. -
రైతులకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వరి, మొక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, మినుములు, జీలుగ, జనపనార, పిల్లి పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై అందజేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా ఇతర విత్తనాలకు మూడేళ్ల క్రితమే సబ్సిడీ ఎత్తేయగా ఇప్పుడు సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కేవలం వానాకాలం సీజన్లో అందించే విత్త నాల సబ్సిడీ కోసమే దాదాపు రూ. 170 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 25 కోట్ల మేరకు విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 35–65 శాతం వరకు సబ్సిడీ... గతంలో మాదిరిగానే విత్తనాలకు 35 నుంచి 65 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. సోయాబీన్‌కు 37 శాతం, జీలుగ, పిల్లి పెసర, జనపనార విత్తనాలకు 65 శాతం సబ్సిడీ... కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలకు 35 శాతం వరకు సబ్సిడీ అందించాలని భావిస్తున్నారు. వరి పదేళ్లలోపు పాత విత్తనాల ధర ఎంతున్నా రూ. వెయ్యి సబ్సిడీ ఇవ్వాలని... పదేళ్లకుపైగా ఉన్న వరి విత్తనాలకు రూ. 500 సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తం విత్తన సరఫరాలో వ్యవసాయశాఖ అధికంగా వరి విత్తనాలనే రైతులకు సరఫరా చేయనుంది. రైతు కోరుకొనే విత్తనాలే కీలకం... ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకొనే పరిస్థితి ఉండదు. గత అనుభవాల ప్రకారం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు అధికం. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. కానీ మొక్కజొన్నలో అనేక హైబ్రీడ్ రకాల విత్తనాలున్నాయి. వాటిలో కొన్ని రకాలకు మరింత డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్న విత్తనాలను పెద్దగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడని రైతులు.. ప్రైవేటు డీలర్ల వద్ద తమకు అవసరమైన డిమాండ్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో యథాలాపంగా టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతులు కోరుకొనే రకాల విత్తనాలు ఇవ్వకపోవడం వల్ల గతంలో అనేక సబ్సిడీ విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద మిగిలిపోయాయి. దీనివల్ల ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. 1.21 కోట్ల పత్తి విత్తనాలు అవసరం: మంత్రి తుమ్మల వచ్చే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరా లలో పత్తి సాగు కానుందని... అందుకు 1.21 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. అధికారులు, విత్తన కంపెనీలతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. అన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. వరి 16.50 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. ప్రస్తుత లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎకరాకు రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. వచ్చే రెండుమూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో అప్పటివరకు జరిగే మొత్తం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామ ని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అనుమతి తీసుకొని పరిహారం ప్రకటించొచ్చని అంటున్నారు. 50 వేల ఎకరాల్లో పంటల నష్టం అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, మొక్కజొన్న, జొన్న, పొగా కు, వేరుశనగ, మిర్చి, కూరగాయలు, బొప్పాయి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలకు నీరు లేక ఎండిపోయి దెబ్బతినటంతోపాటు ఈ వర్షాల వల్ల ఉన్న కాస్త ధాన్యం రాలిపోయింది. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ నిర్థారించింది. మిగిలిన జిల్లాల్లోనూ పంటలకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు పంపించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఎక్కడికక్కడ పంట న ష్టం అంచనాలు వేయడంపై దృష్టి సారించినట్టు అధికారులు తెలిపారు. అయితే తీవ్రమైన ఎండల వల్ల ఇటీవల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నా యి. వాటి విషయంలో మాత్రం తాము నష్టాలను అంచనా వేయడం లేదని అధికారులు తెలిపారు. ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలి: పశ్య పద్మ దెబ్బతిన్న పంటలన్నింటినీ సర్వే చేసి నష్టం అంచనా వేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని కోరారు. నష్టం జరిగిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభం, చెట్టు విరిగిపడి రైతు మరణించారని, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి తుమ్మల రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం సంభవించినట్టు తెలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు మూడు రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశముందన్నారు. రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం, మిర్చి సహా ఇతర పంటలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కల్లాల్లోగానీ, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యంగానీ దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. -
జొన్న రైతులకు ప్రభుత్వం బాసట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రీడ్ రకం జొన్నల మార్కెట్ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద వెంటనే హైబ్రీడ్ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. 27,722 టన్నుల హైబ్రీడ్ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్‌కు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ సీజన్లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్ జొన్నల ధర మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా (మోర్ ప్రిఫర్డ్ వెరైటీగా) గుర్తింపు పొందిన హైబ్రీడ్ రకం జొన్నలను 27,722 టన్నులు కొనడానికి అనుమతినిచ్చింది. బుధవారం నుంచి మే 31వ తేదీ వరకు రైతుల నుంచి ఈ రకం జొన్నలను సేకరిస్తారు. ఇప్పటికే కనీస మద్దతు ధరలకు రబీ సీజన్లో పండిన శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలను ఆర్బీకేల ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. తక్కువకు అమ్ముకోవద్దు కనీస మద్దతు ధరకంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకోవద్దు. జొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 27,722 టన్నుల సేకరణకు అనుమతినిచ్చింది. మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల ద్వారా వివరాలు నమోదు చేసుకొని వారి వద్ద ఉన్న హైబ్రీడ్ రకం జొన్నలను అమ్ముకోవచ్చు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ -
వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ♦ ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. ♦ ..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఐఏఎస్‌ల విచారణతో.. వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్‌లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌లో భారీగా ఉల్లంఘనలు! వ్యవసాయశాఖ పరిధిలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్ కార్పొరేషన్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్‌ఫెడ్ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి. ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా.. ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కంపెనీకే టెండర్ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. ♦ 2019–20లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్‌ఫెడ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ♦ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌లో సిద్దిపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్‌ను తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ♦ నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్‌ఫెడ్‌లో రూ.కోటిన్నర, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద కేటాయించారు. ♦ హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ♦ ఇక ఆగ్రోస్‌ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్ కునారిల్లిపోయింది. ♦ ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్‌ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.