ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం. రైతు కష్టాలన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. నాణ్యమైన పురుగు మందులు, ఎరువుల సరఫరా.. పంటల సాగుపై అధునాతన శిక్షణ, సాంకేతికత వినియోగం, యాంత్రీకరణ.. తదితర విధానాలతో సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఆర్బీకేల పనితీరును స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. లక్షలాది మంది రైతులకు సాగును లాభసాటిగా మార్చడంలో ఆర్బీకేల పాత్ర కీలకం.
► సంయుక్త నివేదికలో నీతి ఆయోగ్, యూఎన్‌డీపీ
సాక్షి,అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నాయని నీతి ఆయోగ్, యూఎన్‌డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ప్రశంసించాయి. అధిక దిగుబడులు సాధించేలా, రైతుల సాగు సమస్యలన్నింటికీ ఒకే చోట పరిష్కారం చూపిస్తూ ‘వ్యవసాయం’లో గేమ్ ఛేంజర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడాయి.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సామాజిక రంగాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి.. నీతి ఆయోగ్, యూఎన్‌డీపీ తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ప్రధానంగా రైతుల ఇబ్బందులు తీర్చడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఆర్బీకేల ద్వారా అన్నదాతలకు సరైన సమయంలో సరైన సలహాలు అందుతున్నాయని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఈ నివేదిక కొనియాడింది.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటని, కొన్నేళ్ల క్రితం వరకు వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ రైతుల వ్యవసాయ పద్ధతులు, వివిధ పంటల క్లిష్టమైన దశల గురించి పూర్తి స్థాయి అవగాహనలేని రైతులు డీలర్లపై ఆధారపడ్డారని తెలిపింది. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా ఇన్‌పుట్‌లకు అధికంగా చెల్లించాల్సి రావడంతో పంట చేతికొచ్చే సమయానికి రైతులకు కన్నీళ్లే మిగిలేవని వివరించింది. మరోవైపు.. నాసిరకం దిగుబడులు, దళారుల ఆగడాల కారణంగా గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, ఆర్బీకేల ఏర్పాటుతో రైతులకు ఈ ఇబ్బందులన్నీ తప్పాయని తెలిపింది. ఈ నివేదికలో ఇంకా ఏముందంటే..
దేశంలోనే ఉత్తమ పద్ధతి
► రైతుల ఆదాయం, విజ్ఞానం పెంపొందించడానికి, సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని బదిలీ చేయడంతోపాటు.. ముందుగా పరీక్షించి ధ్రువీకరించిన, నాణ్యమైన ఇన్‌పుట్‌లను గ్రామ స్థాయిలో అందుబాటు ధరలకు అందించడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు సేవలందిస్తున్న ఆర్బీకే వ్యవస్థ దేశంలోనే మొదటి ఉత్తమ పద్ధతి.
► ఆర్బీకేలు నాలుగు అంశాల్లో ప్రధానంగా పని చేస్తున్నాయి. ముందుగా.. పరీక్షించిన నాణ్యమైన ఇన్‌పుట్ల సరఫరా, నకిలీ విత్తన వ్యాప్తిని అరికట్టడం, ప్రైవేటు ఔట్‌లెట్లలో అధిక ధరలకు ఇన్‌పుట్‌ల అమ్మకాలు నిరోధించడం, విత్తన సీజన్‌కు ముందే ఇన్‌పుట్‌లు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పని చేస్తున్నాయి.
పనితీరు నిజంగా అద్భుతం
► సేవల బట్వాడా, సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిలో ఆర్బీకేల పనితీరు నిజంగా అద్భుతం. రైతులకు అవసరమైన సేవలను అందించడమే కాకుండా సామర్థ్యం పెంపుదలకు అవసరమైన విజ్ఞానాన్నీ ఆర్బీకేలు రైతులకు పంచుతున్నాయి.
► వ్యవసాయ యాంత్రీకరణ, ఈక్రాప్.. ఉచిత పంటల బీమా నమోదు, సీడ్–టు–సీడ్ శిక్షణ కార్యక్రమం, శాస్త్రవేత్తల శిక్షణలు, ఫీల్డ్ డయాగ్నస్టిక్ సందర్శనలు, సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లు, కరపత్రాలను ఉపయోగించడం, పంటలపై సమాచార వ్యాప్తి కోసం పుస్తకాలు, వీడియో మెటీరియల్‌తో కూడిన లైబ్రరీలను నిర్వహిస్తుండటం విశేషం.
కాల్ సెంటర్ ద్వారా సలహాలు
► వ్యవసాయ పద్ధతుల్లో కాల్‌సెంటర్ ద్వారా ఆర్బీకేలు రైతులకు సలహాలూ అందిస్తున్నాయి. ఇందుకోసం కాల్ సెంటర్ నిర్వహణతో ఉత్తమ పద్ధతులను అవలంబించడంలో సహాయం చేయడానికి, మద్దతు ప్యాకేజీ, దేశీయ డిమాండ్–సరఫరా అంతరాన్ని పరిష్కరించడం కోసం అగ్రి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేశారు.
► తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. రైతులకు మద్దతు ధర, ప్రోత్సాహం అందించడానికి అన్ని ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతులకు ఎంతో లాభం. రవాణా ఖర్చులు తగ్గించడంలోనూ ఆర్బీకేల పాత్ర ప్రశంసనీయం.
► పంటల కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలను ప్రకటించిన తర్వాత రైతులు తమ పంటను గ్రామంలోనే విక్రయించుకోగలుతున్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment