నాడు: టీడీపీ హయాంలో విత్తనాల కోసం పడరాని పాట్లు పడేవారు. ఎండనక, వాననక.. రేయనకా పగలనక రైతులు నిద్రహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడితేగానీ కాసిన్ని గింజలు దొరికేవి కావు. తమకు అనుకూలంగా ఉన్న వారు, కాస్త పలుకుబడి ఉన్న వారికి ఇవ్వగా మిగిలినవే సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. విత్తనాల కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిల్చొనే సందర్భంలో ఎండలు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి చనిపోవడం అప్పట్లో సర్వసాధారణం.
నేడు.. కానీ, ఇప్పుడు చూద్దామంటే ఎక్కడా ఒక్క క్యూలైన్ కన్పించడంలేదు. విత్తనం దొరకలేదని కానీ, నాసిరకం విత్తనంవల్ల పంటలను కోల్పోయామని కానీ ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన దాఖలాల్లేవు. పైగా ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో సకాలంలో అన్నీ అందుతున్నాయి. విత్తనాల కొరత అనే ఊసేలేదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యంలేదు. పక్కాగా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి.
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. నిజానికి ఇదొక విప్లవాత్మక మార్పు. ఈ రాష్ట్రంలో మాదిరిగా ఆర్బీకేలుగానీ, విత్తు నుంచి విక్రయం వరకూ రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. అయినా, బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు ‘శనగ విత్తన పంపిణీలో డొల్లతనం’ అంటూ రైతులను తప్పుదారి పట్టించేలా ఆదివారం అసత్యాలతో ఓ రుచీపచీలేని కథనాన్ని వండివార్చింది. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. ‘పచ్చ’కామెర్ల ‘ఈనాడు’కు ఇవేవీ కనపడవు. ఆ పత్రిక కక్కిన విషంపై ఈ ‘ఫ్యాక్ట్‌చెక్’..
ఆరోపణ: రాయితీ విత్తనంతో ఒరిగేదేంటి?
వాస్తవం: 2023–24 సీజన్‌లో ఇప్పటికే 10.90 లక్షల మంది రైతులకు రూ.204.15 కోట్ల సబ్సిడీతో 5.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా 80 శాతం రాయితీపై 96,392 మంది రైతులకు రూ.21.44 కోట్ల సబ్సిడీతో 24,635 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. అలాగే, ముందస్తు రబీ కోసం 2.96 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని కూడా సిద్ధంచేశారు. సీజన్‌లో సబ్సిడీ విత్తన ధరలను ఏటా రాష్ట్రస్థాయి ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయిస్తుంది.
అదే రీతిలో మొన్న సెప్టెంబర్ 15 నాటికి స్థానిక మార్కెట్ ధరలను అనుసరించి విత్తన శుద్ధి, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, తాలు మినహాయింపు, ప్రాసెసింగ్ నష్టం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని శనగ విత్తన ధరలను నిర్ణయించారు. జేజీ–11 రకానికి క్వింటాకు రూ.8,100, కేఏకే–2 రకానికి రూ.14,050 చొప్పున నిర్ణయించారు. గత ఏడాది 25 శాతం రాయితీపై ఎకరాకు 25 కేజీలు సరఫరా చేయగా, ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చిన్న, సన్నకారు రైతులకు 40 శాతం రాయితీపై ఎకరాకు 40 కేజీల చొప్పున విత్తన సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరోపణ: నాసిరకం అంటూ తిరుగుటపా?
వాస్తవం: వ్యవసాయశాఖ నుంచి 2,59,660 క్వింటాళ్ల జేజీ–11 రకం, 36,313 క్వింటాళ్ల కేఏకే–2 రకం విత్తనం కోసం ఇండెంట్ రాగా.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం తదితర జిల్లాలకు 1.30 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 85,598 మంది రైతులకు 68,655 క్వింటాళ్ల విత్తనాన్ని వాటి ద్వారా సరఫరా చేశారు. వైఎస్సార్ జిల్లాలో 74,120 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా.. ఇప్పటికే 61,670 క్వింటాళ్లు సిద్ధంచేశారు.
విత్తనం కోసం ఆర్బీకేల్లో 41,746 మంది రైతులు తమ వివరాలను నమోదు చేయగా, ఇప్పటికే 45వేల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన విత్తనాల్లో సన్నగింజ, మట్టిగడ్డలు, పుల్లలతో సరఫరా చేస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయని, నాణ్యత బాగోలేదని ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన, తీసుకున్న విత్తనాన్ని వెనక్కి ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. అయినా సరే.. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు రైతులను రెచ్చగొట్టే ధోరణిలో రోజుకో తప్పుడు కథనాన్ని ప్రచురిస్తుండడంపట్ల రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
ఆరోపణ: సన్నగింజ.. మట్టిగడ్డలు.. పుల్లలే..
వాస్తవం: సాధారణంగా విత్తన నాణ్యత ప్రమాణాలను నాలుగు దశలలో పరీక్షించిన తర్వాత ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా సర్టిఫై చేసిన సీడ్‌ను ఆ తర్వాత ఏపీ సీడ్స్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. చివరగా.. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ముందు సంబంధిత ఆర్బీకే ఇన్‌చార్జి, ఆయా గ్రామాల అభ్యుదయ రైతుల సమక్షంలో మొలక, భౌతిక పరీక్షలు నిర్వహించి నాణ్యత బాగుందని నిర్థారించిన తర్వాతే రైతులకు సరఫరా చేసేందుకు అనుమతిస్తారు. ఇదేరీతిలో అత్యంత శాస్త్రీయంగా, విత్తన నాణ్యతను పరీక్షించిన తర్వాతే విత్తన పంపిణీకి అనుమతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment