డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల సరఫరాలో వ్యవసాయ శాఖ విఫలం
రైతులకు ఇష్టంలేని కంపెనీల విత్తనాలు అంటగడుతున్న వైనం
తాము కోరుకునే విత్తన ప్యాకెట్ల కోసం గంటల తరబడి లైన్లలో..
కొనుగోలు చేయని విత్తనాలను ప్రోత్సహిస్తున్న అధికారులు
డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేస్తున్న వ్యాపారులు.. రైతుల గగ్గోలు
సాక్షి, హైదరాబాద్: అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాల కోసం రైతులు కోరుతుంటే.. ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమకు కావాల్సిన విత్తనాల కోసం రైతులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు సైతం చేస్తున్నారు.
డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరాలో చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోరుకునే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న విత్తనాలను కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విత్తనాల కొరత లేదని చెబుతున్న అధికారులు... డిమాండ్ ఉన్న విత్తనాల కొరత విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
రైతులు పెద్దగా కొనుగోలు చేయని విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి కొందరు అధికారులు వాటిని మార్కెట్‌లో ప్రోత్సహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఏ రకం విత్తనాలకు డిమాండ్ ఉంటుందో వ్యవసాయశాఖకు తెలుసు.. కానీ వాటిని మార్కెట్‌లో ఎందుకు అందుబాటులో ఉంచలేదో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సీజన్ ముంచుకొస్తున్నా...
రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. చినుకు పడితే చాలు రైతులు తక్షణమే పత్తి విత్తనాలు చల్లేస్తారు. ఇప్పుడు రైతులకు అత్యంత కీలకమైనవి పత్తి విత్తనాలే. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందుగా అధికారులు ప్రణాళిక రచించలేదు.
రాష్ట్రంలో ఈసారి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని భావించారు. గురువారం నాటికి 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే, మిగతా ప్యాకెట్లు కూడా వచ్చే నెల 5 నాటికి జిల్లాలకు చేరతాయని, అందువల్ల కొరతే లేదని వ్యవసాయశాఖ చెబుతోంది.
ఇతర కంపెనీల విత్తనాలనూ కొనుగోలు చేసుకోవాలని పిలుపునిస్తున్న అధికారులు.. దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు నిలదీస్తున్నారు. దిగుబడి తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
నకిలీ విత్తనాల ప్రవాహం...
ప్రభుత్వం అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇదే అదనుగా భావించిన విత్తన దళారులు మూకుమ్మడిగా నకిలీ విత్తనాలను అన్నదాతకు అంటగడుతున్నారు. నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాలకు తరలించారు. ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా నకిలీ విత్తనాల బెడద వేధిస్తూనే ఉంది.
ఇదిలావుంటే, పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేదు. 1.38 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలైన డయాంచ, సన్‌హెంప్, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు కేవలం 79 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. వ్యవసాయశాఖ లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి ఈ సమస్యకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఒక ఉన్నతాధికారి ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాల ని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశిస్తుంటే... మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్లుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఒక ఏఈవోను ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరుగా ఆదేశిస్తూ మరింత గందరగోళపరుస్తున్నారని వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేత ఆరోపించారు.
ఐదో తేదీ నాటికి మిగతా పత్తి విత్తనాలు
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. ఈ మేరకు ఆయన విత్తన కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విత్తన కంపెనీలన్నీ ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని చెప్పారు.
కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, అన్ని విత్తనాల దిగుబడి ఒక్కటేనని ఆయన వివరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment