17.03 లక్షల రైతుల ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా జమ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది. గత నెల 26న రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.593 కోట్లు జమ చేశారు. దీంతో ఇప్పటివరకు దాదాపుగా 21.45 లక్షల మంది రైతులకు రూ.1,126.54 కోట్ల మొత్తాన్ని రైతుభరోసా కింద అందజేసినట్లయింది.
72 లక్షల మందికి పైగా రైతులకు...
రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతు భరోసాకు అర్హత గలదిగా తేల్చారు. 72 లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నింటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా రెండు, మూడు ఎకరాల ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులివ్వగా, ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు మలివిడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
వ్యవసాయ యోగ్యం కాని భూములు 2.50 లక్షల ఎకరాలు!
రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు అటు ఇటుగా రెండున్నర లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించగా, 21 నుంచి 24వ తేదీ వరకు సాగిన గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది.
హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ వెంచర్లుగా, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తొలుత వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. కూడికలు, తీసివేతల తరువాత సాగు యోగ్యం కాని భూముల విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది.
రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం
రైతులకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1,126.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటికే రైతుబంధు (కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో) కింద రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3000 కోట్లు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
గతంలో ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కోనుగోలు చేశాం. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.10,547 కోట్లు వెచ్చించి సేకరించాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కింద రూ.1,154 కోట్లు రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం.
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment