Rythu Bharosa
-
ఎకరంలోపు రైతులకు ‘తొలి’ భరోసా
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది. గత నెల 26న రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.593 కోట్లు జమ చేశారు. దీంతో ఇప్పటివరకు దాదాపుగా 21.45 లక్షల మంది రైతులకు రూ.1,126.54 కోట్ల మొత్తాన్ని రైతుభరోసా కింద అందజేసినట్లయింది. 72 లక్షల మందికి పైగా రైతులకు... రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతు భరోసాకు అర్హత గలదిగా తేల్చారు. 72 లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నింటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా రెండు, మూడు ఎకరాల ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులివ్వగా, ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు మలివిడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయ యోగ్యం కాని భూములు 2.50 లక్షల ఎకరాలు! రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు అటు ఇటుగా రెండున్నర లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించగా, 21 నుంచి 24వ తేదీ వరకు సాగిన గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ వెంచర్లుగా, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తొలుత వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. కూడికలు, తీసివేతల తరువాత సాగు యోగ్యం కాని భూముల విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం రైతులకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1,126.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటికే రైతుబంధు (కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో) కింద రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3000 కోట్లు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కోనుగోలు చేశాం. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.10,547 కోట్లు వెచ్చించి సేకరించాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కింద రూ.1,154 కోట్లు రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
రైతుభరోసాపై చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా విషయంలో చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత.. అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులందరికీ ఎకరాకు రూ.7,500 చొప్పున రైతుభరోసా ఇస్తామని ప్రకటించి దానిని రూ.6 వేలకు కుదించిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా విదిల్చి, ఇచ్చిన మాట మీద నిలబడ్డట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుండగా ఇందులో 21,45,330 మందికి రైతు భరోసా ఇచ్చినట్లు చెప్తోంది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏమిటి. 2023 వానాకాలానికి సంబంధించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతుబంధును ఇచ్చిoది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీరి సంఖ్యను 21,45,330 మందిగా గుర్తించింది. అంటే ఎకరాలోపు భూమి ఉన్న 1,09,851 మంది రైతులకు కోత విధించింది’అని హరీశ్‌రావు అన్నారు. లక్ష మందికి పైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేసారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 415 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. -
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు ఇవాళ రైతుభరోసా నిధులు జమ కానున్నట్లు సమాచారం. నాలుగు పథకాల అమలులో భాగంగా.. గణతంత్ర దినోత్సవంనాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఆరోజు సెలవు రోజు కావడంతో.. ఆ మరుసటిరోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగుభూమికి రూ.569 కోట్లను చెల్లించింది. ఇక భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా రూ.6 వేల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థికశాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవుతుండడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా ఆపొద్దు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా డబ్బులు నిలిపి వేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇది కొనసాగుతున్న పథకమే.. ఎన్నికల పేరుతో రైతుల పొట్టకొట్టకండి అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ ప్రకటనలో.. ‘రైతు భరోసా డబ్బులు వేయండి. ఇది కొనసాగుతున్న పథకమే. ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితం. రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగొట్టారు. అసలే అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాల్సిందే. రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందే.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రైతు కూలీల అకౌంట్స్‌లో వేయాల్సిందే. ఎన్నికల కోడ్ సాకుతో ఆపితే ఊరుకునేది లేదు. ప్రభుత్వ చేతకానితనాన్ని ఎన్నికల కోడ్ పేరుతో ముడి పెట్టకండి. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను కొనసాగించండి. అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి లేఖ పంపిస్తాం. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అవసరమైతే అందరం కలిసి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేద్దాం’ అని కామెంట్స్ చేశారు. -
నాలుగు పథకాలు.. ఒక్కరోజు లబ్ధిదారులు 6,15,677 మంది
సాక్షి, హైదరాబాద్: నాలుగు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజునే 6,15,677 మందికి లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థికశాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం ఉదయం నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి ఈ నిధులు జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన 563 రెవెన్యూ గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కొత్తగా ఆహారభద్రత కార్డులను జారీ చేసింది. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు పత్రాలను అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబసభ్యుల నమో దు ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పింది. రైతుభరోసా 9.48 లక్షల ఎకరాలకు.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్లు విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలివిడతగా రూ.6 వేల చొప్పు న పెట్టుబడి సాయం అందింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 18,180 కుటుంబాలకు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద తొలి రోజున 18,180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలిరోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రేషన్‌కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. పాత రేషన్‌కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చాలంటూ వేలాది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. 1,03,674 మంది పేర్లను పాత రేషన్‌కార్డుల్లో చేర్చారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి రోజునే అర్హులైన 72 వేల మందికి ఇళ్ల పత్రాలను ప్రభుత్వం అందజేసింది.చరిత్రలో ప్రప్రథమం.. దేశానికే ఆదర్శం : మంత్రి సీతక్క ఏ ఆస్తి లేని కూలీలకు భరోసాగా తెలంగాణ సర్కార్ ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. చరిత్రలోనే ప్రప్రథమంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మండలంలో ఒక రెవెన్యూ గ్రామానికి : తుమ్మల రైతుభరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో రెవెన్యూ గ్రామం చొప్పున విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అవి సోమవారం రైతుల అకౌంట్లలో జమ అయ్యాయన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు -
సాగు యోగ్యం కాని భూములు 2.10 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ‘రైతు భరోసా’ పథకం కింద ఎన్ని లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వానికో స్పష్టత వచ్చింది. రైతుల వద్ద ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్క తేలింది. రాష్ట్రంలోని 10,277 గ్రామాల్లో 2,10,864 ఎకరాల విస్తీర్ణంలోని భూములు సాగు యోగ్యమైనవి కావని గుర్తించారు. అంటే ఇవి ‘రైతు భరోసా’కు అర్హత లేనివని నిర్ధారించారన్నమాట. అయితే గ్రామసభల్లో వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీటిలో 5 నుంచి 10 శాతం వరకు భూములను వ్యవసాయానికి యోగ్యమైనవిగా నిర్ధారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటీ రెండురోజుల్లో పూర్తిస్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కను నిర్ధారించుకుని,ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. తర్జన భర్జనల అనంతరం తెరపైకి ‘యోగ్యత’ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుబంధు (పస్తుతం రైతు భరోసా) పథకం కింద గుట్టలు, కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, క్వారీలకు కూడా పెట్టుబడి సాయం అందించారని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా ఎవరికి వర్తింప జేయాలనే విషయమై సిఫారసు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. ఈ మేరకు చర్చోప చర్చలు, కూడికలు, తీసివేతలు జరిపిన మంత్రులు.. తొలుత సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందజేయాలని, ఎకరాకు ఒక సీజన్‌కు రూ. 6,000 చొప్పున అందించాలంటూ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఏ సీజన్‌కు ఆ సీజన్లో సాగైన భూములకే రైతుభరోసా అమలు చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత నాలుగేళ్లుగా సాగులో లేని భూముల వివరాలను క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు పంపించి సర్వే చేయాలని ఆదేశించారు. గత కొన్నేళ్లుగా సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడంతో పాటు కాలేజీలు, కోళ్ల ఫారాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, గుట్టలు, కొండలు, ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న భూముల ఫ్రీజింగ్ (రైతు పట్టా పాస్ పుస్తకాల్లో సాగు యోగ్యం కాని భూములుగా నిర్ధారించడం)కు కూడా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఫీల్డ్ సర్వే చేశారు. కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా? రాష్ట్రంలోని 600 గ్రామీణ మండలాల్లోని 10,622 గ్రామాలకు గాను వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్న 10,277 గ్రామాల్లో సర్వే నిర్వహించిన అధికారులు.. వాటిలో 2,10,864 ఎకరాలు వ్యవసాయ యోగ్యత లేని భూములని తేల్చారు. గతసారి ‘రైతుబంధు’ పథకం కింద 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. 2023 జూన్ 26న పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి జమ ప్రారంభం కాగా, ఆ సీజన్లో రూ.7,624 కోట్లను 68.99 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ లెక్కన 2 లక్షల పైచిలుకు ఎకరాలను వ్యవసాయ యోగ్యం కాని భూములుగా నిర్ణయిస్తే కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా అందే అవకాశం ఉందని అధికారులంటున్నారు. హైదరాబాద్ శివార్లలో రియల్ వెంచర్లు, కళాశాలలు! హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రియల్ వెంచర్లుగా, కళాశాలలు, కోళ్ల ఫారాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిర్వహించిన సర్వేలో.. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ యోగ్యం కాని పట్టా భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు తేలింది. ఈ జిల్లాలో 28,287 ఎకరాల సాగు యోగ్యం కాని భూములకు ఇప్పటివరకు 11 విడతల్లో రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందినట్లు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా తరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని 18,190 ఎకరాలను వ్యవసాయ యోగ్యత లేని పట్టా భూములుగా తేల్చారు. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా (14,444 ఎకరాలు), సంగారెడ్డి జిల్లా (12,174 ఎకరాలు), నల్లగొండ (12,040 ఎకరాలు) ఉన్నాయి. మెదక్, మహబూబాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కామారెడ్డి, తదితర జిల్లాల్లో కూడా సాగుయోగ్యం కాని భూములకు రైతుబంధు అందినట్లు తేలింది. ఈ భూములన్నిటినీ ఇప్పుడు ఫ్రీజ్ చేయడంతో వాటికి రైతుభరోసా అందే అవకాశం లేదు. -
మార్చిలోగా అర్హులందరికీ పథకాలు అమలు: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలను అందజేస్తాం. అప్పటివరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున జనవరి 26 అర్ధరాత్రి నుంచే టకీటకీమని రైతుల ఖాతాల్లో పడతాయి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి బంధముందో, రైతుకు కాంగ్రెస్‌కు మధ్య అలాంటి బలమైన అనుబంధముంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ప్రకటించారు. రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిలను ఒక్క కలం పోటుతో రద్దుచేశారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్..సోనియాగాంధీ నేతృత్వంలో రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపారు. ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ గత ఆగస్టు 15 నుంచి 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం..’అని సీఎం పేర్కొన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పథకాలను ఆయన ప్రారంభించారు. లబి్ధదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మా కొడంగల్ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా? ‘కాంగ్రెస్ పాలనలో 2004–2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాం. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే వైఎస్సార్ గుర్తొస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 36 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే కేసీఆర్‌కు కడుపుమండి సీబీ సీఐడీ విచారణ చేయించారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ ఊరిలోనైనా వచ్చాయా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఊరికో కోడి, ఇంటికో ఈక కూడా ఇవ్వలేదు. మేం రానున్న నాలుగేళ్లలో ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 15 నుంచి 20 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తాం. కొడంగల్‌లో పరిశ్రమలు పెడతామంటే కేసీఆర్ మనుషులు అడ్డుపడుతున్నారు. అధికారులపై దాడులు చేయించి చంపాలని చూస్తారా? మా కొడంగల్ బిడ్డలు ఎప్పటికీ బస్టాండుల్లో లుంగీలు కట్టుకుని ఖాళీగా ఉండాలా? డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా?..’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజాపాలనలో ఎవరైనా ప్రజల వద్దకే వస్తారు ‘ప్రతి ఆరునెలలకు ఒకసారి గ్రామాలకు అధికారులు రావడం ఎప్పుడైనా చూశారా? కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో ఎప్పుడైనా గ్రామాలకు వచ్చారా? కానీ మా హయాంలో ఇప్పటివరకు మూడుసార్లు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చారు. గతంలో ఫాంహౌస్, గడీలకే పరిమితమైన పాలనను మేం ప్రజల మధ్యకు తెచ్చాం. ప్రజాపాలనలో ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అయినా సరే..ప్రజల వద్దకే వస్తారు..’అని రేవంత్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత లేకపోతే పదవి ఎందుకు? ‘గత 13 నెలల్లో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక్కసారైనా శాసనసభకు వచ్చాడా? సర్పంచ్ కొన్నిరోజులు లేకపోతేనే ఊరు విడవమని అంటరు. అలాంటిది ఆయన్ను ఏమనాలి? ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా? అలాంటప్పుడు ఆ పదవి ఎందుకు? అధికారం ఉంటే కొల్లగొడతారు కానీ ప్రతిపక్ష బాధ్యత వద్దు. కేసీఆర్ మేధావినని, 80 వేల పుస్తకాలు చదివానని చెప్తడు. కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటడు. కానీ ప్రజలకు రేషన్కార్డులివ్వాలన్న జ్ఙానం లేదు. పదేళ్లలో ఒక్కరికీ రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు..’అని సీఎం విమర్శించారు. 12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలు: సీఎస్ బడుగు, బలహీన వర్గాల కోసం ఒకే రోజున నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషకరమని సీఎస్ శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో 12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్యరాజ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు ఫరి్ణకారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీలా దోచుకోవడంలో పోటీపడం ‘కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు తిరుపతిరెడ్డి అన్న ఎప్పుడూ అండగా ఉంటడు. పదవి ఉన్నా లేకపోయినా ఏ ఇంట్లో ఇబ్బంది ఉన్నా చూసుకుంటడు. ఆయనకు ఏ పదవి ఉన్నదని కేటీఆర్ అంటున్నడు. మీ ఇంట్లో అందరూ పదవులు తీసుకున్నరు. మేం ఏ పదవీ తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే తప్పు పడుతున్నరు. పదవులు తీసుకొని కుటుంబమంతా దోచుకోవడం తప్పా?.. ఏ పదవులూ తీసుకోకుండా సేవ చేయడం తప్పా?. మీలా దోచుకోవడంలో పోటీపడం. మీకు మాకు తేడా ఉంది. మాది దోచుకునే కుటుంబం కాదు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
ఇవాళ అర్ధరాత్రి నుంచే ‘రైతుభరోసా’ డబ్బులు: సీఎం రేవంత్
సాక్షి,మహబూబ్‌నగర్:గతంలో కొడంగల్ నియోజకవర్గం వివక్షకు గురైంది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొడంగల్‌వైపు చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో నాలుగు కొత్త పథకాలను ఆదివారం(జనవరి26) రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. భూమికి, విత్తనానికి ఎంత సంబంధం ఉందో రైతుకు, కాంగ్రెస్‌కి అంతే అనుబంధం ఉంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం.వ్యవసాయం అంటే దండగ కాదు పండగ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో 10 లక్షల లబ్ధి. 70 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలిచ్చాం. 13 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.సర్పంచ్ ఊళ్లో లేకపోతే పదవి నుంచి దిగిపో అంటాం. మరి ప్రతిపక్షనేత సభకు రాకపోతే ఏమనాలి. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు రేషన్ కార్డులివ్వాలనిపించలేదు.పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతిరెడ్డి ప్రజాసేవ చేస్తున్నాడు..ఏ పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజా సేవ చేస్తుంటే విమర్శిస్తున్నారు. వాళ్లలా కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి మేము దోచుకోవడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటారు. పదవి ఆశించకుండా ప్రజాసేవ చేస్తుంటే వాళ్లకు కడుపు మంట వస్తోంది. అందుకే వారి కడుపు మంట తగ్గడానికి ఈనో ప్యాకెట్లు పంపుతున్నాం’అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. -
Telangana: 4 పథకాలు నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కారు్డల జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని.. తొలిరోజున ఆ గ్రామంలో పూర్తి శాచురేషన్ పద్ధతిలో పథకాలను వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలను ఇవ్వాలని ఆలోచనతో ఉన్నామని.. దీనిపై ఎలాంటి పరిమితి లేదని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను మార్చి 31 కల్లా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పథకాల అమలుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పలువురు మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో సహచర మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సమావేశం వివరాలను వెల్లడించారు.అర్హత ఉన్న అందరికీ పథకాలు..‘‘లక్షల మంది తమ పేర్లు లేవంటూ గ్రామసభల్లో దరఖాస్తులు పెట్టుకోవడంతో పరిశీలన కోసం మార్చి వరకు సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరు. రైతు భరోసా కింద వ్యవసాయోగ్యమైన ప్రతి ఎకరానికి సాయం చేస్తాం. ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేస్తాం. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహిస్తున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన లక్షలాది దరఖాస్తులను క్రోడీకరించి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన రోజు కావడంతో ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. తనతో సహా సీఎం, మంత్రులు స్వయంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. భూమి లేని కూలీలందరూ ఉపాధి హామీ పనులకు వెళ్తారని ఓ ప్రశ్నకు బదులుగా భట్టి పేర్కొన్నారు.70శాతానికిపైగా జనాభాకు సన్నబియ్యం: ఉత్తమ్ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో అర్హులందరికీ పథకాలను అందిస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గతంలో దరఖాస్తులిచ్చినా, సామాజిక ఆర్థిక సర్వే, గ్రామసభ, ప్రజాపాలనలో ఇచ్చినా అర్హత ప్రకారం పరిశీలించి రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారు. స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి చొరవ తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నమని చెప్పారు. కొత్త రేషన్కార్డులిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తామని.. రాష్ట్ర జనాభాలో 70–72శాతం మందికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వబోతున్నాని తెలిపారు.రబీకి ముందే రైతు భరోసా..: తుమ్మలతమ సర్కారు ఒకే ఏడాదిలో రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లను నేరుగా జమ చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. రబీ సీజన్‌కు ముందే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చబోతున్నామని తెలిపారు.అనర్హులకు ఇళ్లు ఇస్తే రద్దు: పొంగులేటి శ్రీనివాసరెడ్డిఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే వాటిని రద్దు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనర్హులు లబ్ధిపొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎక్కడా అవినీతి, పైరవీలకు స్థానం లేకుండా పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 606 మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇళ్లను ఇవ్వబోతున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ జనవరి 26న ఒకేసారి పథకాలను ఇవ్వాలని అనుకున్నామని.. కానీ గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించాల్సి ఉండటంతో తొలుత ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. గ్రామసభల్లో కొంత మంది, కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. పథకాలను పూర్తిస్థాయిలో ఎప్పుడు, ఎక్కడ అమలు చేస్తారన్న షెడ్యూల్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపారు. -
రేపు తెలంగాణలో నాలుగు పథకాలు ప్రారంభం
-
రేషన్ కార్డులు, కొత్త పథకాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్‌కార్డులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. ఇలా నాలుగు పథకాలను రేపు(ఆదివారం)లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు సీఎం తెలిపారు.తెలంగాణలో రేపు ప్రారంభించే నాలుగు పథకాలపై సీఎం రేవంత్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లుగా గ్రామ సభలు లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ ఒకటి, రెండు రోజులు ఆలస్యం అయినా రేషన్ కార్డులు వస్తాయి. అధికారులు సమయస్పూర్తితో ప్రజలకు సమాధానం చెప్పాలి. చివరి లబ్దిదారుడి పేరు లిస్టులో చేర్చే వరకు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.రేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయండి. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండల స్థాయి అధికారులను నియమించాలి. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. మార్చి 31లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. -
రైతు భరోసాకు సర్వం సిద్ధం.. వాళ్లకే పెట్టుబడి సాయం..!
-
Telangana: సర్కారు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధులను అన్వేషించే పనిలో ఆర్థిక శాఖ పడింది. ఆయా పథకాల అమలు కోసం తక్షణమే ఎన్ని నిధులు అవసరం? ఏ నెలలో ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది? వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రతిపాదించాల్సి ఉంటుంది? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లకు తోడు కొత్త పథకాలకు కలిపి నిధుల సమీకరణ ఎలా? రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో రుణాలు ఏ మేరకు సాధ్యమవుతాయనే లెక్కలు వేసుకుంటోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతోపాటు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డుల జారీతో పెరిగే సబ్సిడీ వ్యయం కలిపి తక్షణమే రూ.10 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాబడులకు తోడు అప్పులతో.. పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వస్తున్న రాబడులకు తోడు గణనీయంగానే అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం సమకూరుతోంది. వచ్చే మూడు నెలల్లో అదనంగా నెలకు మరో రూ.2వేల కోట్ల వరకు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రూ.30 వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు ద్వారా సేకరించనుంది. ఈ మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెలా రూ.10 వేల కోట్ల చొప్పున కావాలని ఆర్బీఐకి ఇండెంట్ కూడా పెట్టింది. మొత్తంగా సమకూరే నిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఖర్చుతోపాటు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూనే కొత్త పథకాలకు నిధులను సమకూర్చడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే గత రెండు నెలలుగా పెద్ద పెద్ద బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్టు తెలిసింది. వచ్చే మూడు నెలలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామని, ప్రస్తుతానికి నిధుల లోటు లేకుండా సర్దుబాటు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ సిద్ధమైందని వెల్లడించారు.మొత్తంగా రూ.45 వేల కోట్ల దాకా...ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతోంది. రైతు భరోసా కింద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇక భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తొలి విడత సాయంగా రూ.6 వేల చొప్పున ఇచ్చేందుకు మరో రూ.600 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ పథకం కింద 10 లక్షల మంది రైతు కూలీలు లబ్ధిపొందుతారని అంచనా. ఈ రెండు పథకాలకు ఈనెల 31లోపు నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.8,800 కోట్లను ఖజానాకు సమకూర్చడం కోసం ఆర్థిక శాఖ రెండు నెలలుగా కార్యాచరణ అమలు చేస్తోంది. ⇒ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలోపు గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.10లక్షలలోపు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ⇒ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (తొలి విడతలో స్థలమున్న పేదలకు రూ.5 లక్షల సాయం) కోసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకుపైగా అవసరమని భావిస్తున్నారు. దశల వారీగా ఈ నిధులు విడుదల చేసే నేపథ్యంలో... ఏ నెలలో ఎంత అవసరమన్న దానిపైనా ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంటోంది. ⇒ ఇక జనవరి 26 నుంచే కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కార్డుల జారీ పూర్తయ్యాక మార్చి నెల నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షల వరకు రేషన్‌కార్డులు ఉండగా.. మరో 10లక్షల వరకు కొత్తవి జారీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. మొత్తమ్మీద కోటి కార్డులకు గాను ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇచ్చేందుకు గణనీయంగా నిధులు కావాలి. ⇒ మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి నెలాఖరు)లోనే రూ.45 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు నిధులు సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు వివరిస్తున్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
భూభారతిలో నమోదైన భూములకే భరోసా
సాక్షి, హైదరాబాద్: భూభారతి (ధరణి) పోర్ట ల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టా భూమి గల రైతులకు ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగి స్తారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసే ‘ఆర్ఓఎఫ్ఆర్’ పట్టాదారులకు సైతం రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. రైతులకు ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం అందించే రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు కానుండగా, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేలు సాయంగా అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు కానుంది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. డీబీటీ విధానంలో జమఈ నెల 26వ తేదీ నుంచి మొదలుపెట్టి వ్యవ సాయ యోగ్యమైన భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున జమ చేయ నున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో అమలయ్యే ఈ పథకానికి సాయాన్ని ఆర్బీఐ నిర్వహించే ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీ టీ)’ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బాధ్యత తీసుకొంటారు. పథ కానికి సంబంధించిన లోటుపాట్లపై వ్యవసాయ సంచాలకులు ఎప్పటికప్పు డు తగిన చర్యలు తీసుకుంటారు. వ్య వసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిర త్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించేలా చూడటమే రైతుభరోసా ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.10 లక్షల కుటుంబాలకు ఆత్మియ భరోసా! ‘ఇందిరమ్మ ఆత్మియ భరోసా’ పథకం కింద 10 లక్షల వ్యవసాయ కూలీ కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 29 లక్షల కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు. ఇందులో కనీసం 10 రోజులు పనిచేసిన కుటుంబాలు 11 లక్షలు ఉండగా, కనీసం ఒకరోజు పని చేసిన కుటుంబాలు 15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 20 రోజుల పనిని ప్రామాణికంగా తీసుకుంటే 10 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మియ భరోసా కింద లబ్ధి చేకూరే చాన్స్ ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,200 కోట్లు వెచ్చించనుంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసాగ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూ మిలేని వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించేందుకే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరో సా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లో నమోదు చేయబడి, 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి ప్రతి విడతకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయాన్ని డీబీటీ పద్ధతిలో కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ (కమిషనర్) నోడల్ విభాగంగా, జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. -
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా(Rythu Bharosa) మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ (Telangana Government) విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్లు ప్రకటించింది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చేనెల 15 నుంచి 28వ తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’లోపభూయిష్టంగా ఉందని అన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! ప్రజాపాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే.. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన అర్హులను ఈనెల 26న గ్రామసభల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అదేరోజు రైతుభరోసాతో పాటు తెల్లరేషన్ కార్డుల ప్రక్రియ, భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఈ పథకాలకు అర్హుల గుర్తింపునకు ఈనెల 16 నుంచి కసరత్తు చేపట్టనున్నట్లు తెలిపారు. -
యోగ్యతకే భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పంట వేసినా, వేయకపోయినా.. వ్యవసాయ యోగ్య మైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా అందుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని చెప్పారు. రైతుభరోసాతోపాటు భూమి లేని నిరుపేద కూలీల కుటుంబాలకు ఏటా రూ.12 వేల నగదు సాయం అందించే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి ఈనెల 26 నుంచి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న భూమిలేని కుటుంబాలకు ‘ఆత్మీయ భరోసా’ పథకం వర్తిస్తుందని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ సుదీర్ఘంగా మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, అవసరమైన వివరాల సేకరణ, లబ్ధిదారుల జాబితాల తయారీ మొదలైన అంశాలను చర్చించారు. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వారు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. సీఎం రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే...‘‘వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా చెల్లించాలి. వ్యవసాయానికి అక్కరకు రాని భూములను గుర్తించి, వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలి. రియల్ ఎస్టేట్ భూములతోపాటు లేఅవుట్ చేసిన వాటిని, వ్యవసాయేతర అవసరాలకోసం ‘నాలా’ కన్వర్షన్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు రైతుభరోసా అనర్హత జాబితాలోకి వస్తాయి.ఈ మేరకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డీటీసీపీ లేఅవుట్ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందించాలి. విలేజ్ మ్యాప్‌లతోపాటు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అనర్హమైన భూములను ధ్రువీకరించుకుని, గ్రామసభలో ప్రచురించాలి. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలి. అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లపై ఉంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికో నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా పంట పెట్టుబడి సాయం అందించారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదు.ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..రాష్ట్రంలో భూమిలేని నిరుపేద ఉపాధి కూలీల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ఏటా రూ.12 వేలు నగదు సాయం అందిస్తాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏళ్లకేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డులతోపాటు గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. గతంలో ఉన్న అర్హత నిబంధనల ప్రకారమే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ఒక కుటుంబానికి ఒకేచోట రేషన్‌కార్డు ఉండాలి. వేర్వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ‘వన్ రేషన్.. వన్ స్టేట్’విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో వెల్లడించాలి.నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు..ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించాం. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశాం. అర్హుల జాబితాలను వెంటనే సిద్ధం చేయాలి. పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రుల ఆమోదంతో అర్హుల జాబితాలను గ్రామసభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు సభల్లో ప్రదర్శించాలి.లబ్ధిదారుల ఎంపికకు సేకరించిన వివరాలు, తయారు చేసిన జాబితాలను వెల్లడించాలి. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా వివిధ పథకాలకు సంబంధించి సన్నద్ధత పనులను పూర్తి చేయాలి. జిల్లా ఇన్చార్జి మంత్రుల సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయినందున ఈ జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యముంది. ఈ రోజున నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లదే..మా ప్రభుత్వానికి పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్లలాంటివి. ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉంది. జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వారే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లే. ప్రభుత్వ పని తీరుకు అదే కొలమానం అవుతుంది. కొందరు కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పనిచేయాలని అనుకుంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని గతంలో మేం సూచించాం. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జనవరి 26 తర్వాత జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలుజనవరి 26 తరువాత జిల్లాల్లో పర్యటిస్తా. ఆకస్మిక తనిఖీలు చేస్తా. ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవు. కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేయాలి. మహిళా ఐఏఎస్ అధికారులతోపాటు ఐపీఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టళ్లను విజిట్ చేయాలి. అక్కడే రాత్రి బస చేయాలి. విద్యార్థుల అవసరాలను, ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించాలి. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలి. -
కోటి ఎకరాలకు ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న రైతుభరోసా పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున సాగు ‘యోగ్యమైన’భూములకు రైతుభరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించి అందుకు అనుగుణంగా ఆర్థిక లెక్కలు వేసుకుంటోంది. సాగు ‘యోగ్యత’ప్రకారం సగటున రాష్ట్రంలో కోటి ఎకరాలకు రైతుభరోసా పరిమితం అయ్యే అవకాశం ఉంది. రైతుల వద్ద ఉన్న సాగుయోగ్యమైన పట్టా భూములనే పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవం నాటికి పూర్తిస్థాయి లెక్కలుకట్టి ఎకరాకు రూ. 6 వేల చొప్పున యాసంగికి రూ. 5,500 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు అమలు.. రాష్ట్రంలో సాగుచేసే భూములు 1.48 కోట్ల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇందులో వానాకాలం సీజన్‌ను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్క జొన్నతోపాటు వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు రికార్డు ఉంది. ఇంతకు మించి ఏ సీజన్లోనూ పంటల విస్తీర్ణం పెరగలేదు. మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు మొదలు అన్ని రకాల ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. మొత్తం 1.48 కోట్ల ఎకరాల్లోనే ‘పార్ట్–బీ’కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయానికి పార్ట్–బీని మినహాయించారు. అయినా 1.52 కోట్ల ఎకరాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. అంటే 1.30 కోట్ల ఎకరాల సాగుభూమితోపాటు మరో 22 లక్షల ఎకరాల సాగులో లేని భూమికి కూడా రైతుబంధు లభించింది. రెండు సీజన్లలో రైతుబంధు దక్కిన సాగులో లేని భూమి 97.51 లక్షల ఎకరాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల రైతుబంధు పథకం లెక్కలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2023–24 సంవత్సరంలో ప్రభుత్వం రెండు సీజన్లకు కలిపి 97.51 లక్షల ఎకరాల్లోని సాగులో లేని భూమికి రూ. 4,875.62 కోట్లు చెల్లించిందని తెలిపారు. అంటే సగటున ఒక సీజన్‌కు 48.70 లక్షల ఎకరాలకుగాను రూ. 2,438 కోట్లు చెల్లించినట్లు చెప్పడం గమనార్హం. ఇందులో యాసంగి సీజన్లో సాగు చేయని భూముల లెక్కలు కూడా ఉన్నాయి. కొత్త పథకంలో వానాకాలంలో సాగై యాసంగిలో సాగు చేయని భూములకు కూడా రైతుభరోసా ఇవ్వనున్నారు. అయితే రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకొని ‘పార్ట్–బీ’కేటగిరీ భూములతోపాటు రాళ్లు, రప్పులు, కొండలు, గుట్టలు, రోడ్లు, నాలా మార్పిడి తదితర వివాదాస్పద భూములన్నింటినీ తొలగించి రైతుకు సంబంధించిన సాగు చేసే పట్టా భూములనే లెక్కతేల్చి పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం కోటి ఎకరాలలోపు భూములనే సాగుయోగ్యమైన పట్టా భూములుగా వ్యవసాయ శాఖ తేలి్చనట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి తుది జాబితాను ప్రభుత్వం రూపొందించనుంది. -
రైతు భరోసా కుదింపు వంచనే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుభరోసా సాయాన్ని ఎకరానికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు రూ. 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రామగ్రామాన ఎండగట్టేందుకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతోపాటు రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని కోరారు. నాడు బిచ్చం అన్నావు.. నేడు ముష్టి వేస్తున్నావా? ‘ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ రైతులకు ఏటా రూ. 10 వేలు ఇస్తే దాన్ని రేవంత్ ‘బిచ్చం’అన్నాడు. మరి నువ్వు ఇప్పుడు పెంచిన మొత్తం మాటేమిటి? రైతులకు ముష్టి వేస్తున్నావా? తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన మోసంతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఎక్కడ? ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలి. మేనిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు రైతుభరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ రైతుబంధుగా నిలిస్తే రేవంత్ రాబందుగా మిగులుతారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రకటన చేశారు. ఎన్నికల తరువాత ఎత్తేసే కుట్ర జరుగుతుంది. రైతుబంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి కాదు... రేవంత్ మానసిక పరిస్థితి బాగాలేదు ‘రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు.. దివాలా తీసింది రేవంత్‌రెడ్డి మెదడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది ఆయనే. రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. సంవత్సరంలో రూ. లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు. 2014లో రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లతో మాకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే 2023లో రూ. 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేం రాష్ట్రాన్ని అప్పగించాంం. అప్పుల పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అన్యాయం చేస్తున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగుల పరిస్థితులు బాగుండేవంటూ రేవంత్‌రెడ్డి తెలంగాణను కించపరిచారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ పాలనలో అత్యధిక జీతాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. -
‘రేవంత్‌ను వదలిపెట్టం’
సాక్షి,తెలంగాణ భవన్ : మోసానికి, నయ వంచనకు కాంగ్రెస్ (Congress) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) మండిపడ్డారు. ప్రస్తుత, రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మోసం,నయ వంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ మోస పూరిత హామీలు ఇచ్చింది. సోనియా గాంధీ మాటగా రూ.15 వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ రైతు బంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా (Rythu bharosa) కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రూ.12 వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోంది. దేశంలోనే కేసీఆర్ రైతుబంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా మిగిలిపోతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. 👉చదవండి : రైతు భరోసాపై రేవంత్ పేచీ..ఓడ దాటేంత వరకు ఓడ మల్లన ..ఓడ దాటగా బోడ మల్లన అన్నటుగా కాంగ్రెస్ ప్రభుత్వ నైజం మరోసారి బయట పడింది. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను కించ పరిచేలా, చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారు. పథకాలు హామీల విషయంలో రేవంత్‌వి దివాలాకోరు మాటలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితే బాగలేదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని రైతులను,మహిళలను,ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి పోయాయి. రుణ మాఫీ, రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్పితే ..రైతుల గురించి పట్టించుకోవడం లేదు. రూ.5,493 కోట్ల రెవెన్యూ సర్ప్లేస్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించాం. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు ఎగ్గొట్టేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి.ప్రతి రైతుకు రూ.17,500 ఎకరాకి ఇచ్చే వరకు రేవంత్‌ను వదిలి పెట్టం.రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరసనలురైతులకు సంఘీ భావంగా రేపు అన్ని జిల్లాలో, నియోజక వర్గాల్లో, మండలాల్లో నిరసనలు చేపడుతాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకే ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ డ్రామా ఆడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పధకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టె ప్రయత్నం చేస్తోంది’ అని కేటీఆర్ ఆరోపించారు. -
కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ మంత్రివర్గం
-
మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇదే సమయంలో రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వంమోసానికి మారు పేరు కాంగ్రెస్ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వంఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దంరాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకంప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలుసిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు.. మోసగాళ్ల బెదిరింపుల మేళాఅబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్.. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అంటూ కామెంట్స్ చేశారు.అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి మారు పేరు కాంగ్రెస్ ధోకాలకు కేరాఫ్… pic.twitter.com/oE7ziV5UlI— KTR (@KTRBRS) January 5, 2025 -
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్‌కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్‌కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్‌గా హోదా పెంపు. -
రైతు భరోసాపై రేవంత్ పేచీ..
సిరిసిల్ల టౌన్: రేవంత్‌రెడ్డి సీఎం అంటే చీఫ్ మినిస్టర్‌గా కాకుండా కటింగ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విమర్శించారు. సంక్షేమ పథకాలకు కోతలుపెట్టడం తప్ప ఏడాదిలో చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు గగ్గోలు పెడుతున్నట్టుగా పర్రె (పగులు) వచ్చిpది మేడిగడ్డ బ్యారేజీకి కాదని.. సర్కారు పుర్రెకే పర్రె వచ్చిందని ఇటీవల మేడిగడ్డ వద్ద భూకంపం వచ్చినా పటిష్టంగా నిలిచిన బ్యారేజీపై కాంగ్రెస్ సర్కారు అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బ్యారేజీకి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తే.. కోటిన్నర ఎకరాలకు రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందనే సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శనివారం సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రైతులను దొంగలుగా చిత్రీకరిస్తారా? ‘‘కేసీఆర్ రైతుబంధు పథకాన్ని పదేళ్లపాటు ఇచ్చి.. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. మీరేమో డిక్లరేషన్ ఇవ్వాలంటూ రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మా ప్రభుత్వం ఠంఛన్‌గా రైతుబంధు ఇచ్చిoది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ మాత్రం అనేక పేచీలు పెడుతోంది..’’అని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రధాన ప్రతిపక్షంపై నోరుపారేసుకోవడం, తనపై, కేసీఆర్‌పై కేసులు పెట్టడానికి కుట్రలు చేయడం తప్ప ఏడాదిగా సీఎం రేవంత్ పేదలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి..రేవంత్ సర్కారు ఇప్పటికే ఒక్కో రైతుకు రైతుభరోసా కింద రూ.17,500, వృద్ధులకు ఒక్కొక్కరికి పింఛన్లలో రూ.30వేల చొప్పున బకాయిపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ వాళ్లను దీనిపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, పుట్ట మధు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పేరుతో ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రైతుల ఆశలను అడియాశలు చేసింది. రైతు భరోసా పథకాన్ని రైతు గుండె కోతగా మార్చారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.6 వేలకు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. మోసానికి పర్యాయపదం రేవంత్‌రెడ్డి అనే విషయం నగ్నంగా బయటపడింది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కేబినెట్లో కౌలు రైతుల ఊసేలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా గుండెకోత మిగిల్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘కౌలు రైతులకు కూడా రెండు వ్యవసాయ సీజన్లలో కలిపి ఎకరా కు రూ. 15 వేలు పంట పెట్టుబడి సహాయం అందిస్తా మని కాంగ్రెస్ ప్రమాణం చేసింది. కానీ తాజా కేబినెట్ సమావేశంలో ఈ అంశమే చర్చించలేదు. కౌలు రైతులకు గుండె కోత కలిగిస్తూ దారుణంగా ధోకా చేశారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు’అని హెచ్చరించారు.