యోగ్యతకే భరోసా | CM Revanth Reddy Meeting With District Collectors: Telangana | Sakshi
Sakshi News home page

యోగ్యతకే భరోసా

Published Sat, Jan 11 2025 1:29 AM | Last Updated on Sat, Jan 11 2025 1:29 AM

CM Revanth Reddy Meeting With District Collectors: Telangana

అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకూడదు.. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

సాగు యోగ్యంకాని భూముల జాబితా రూపొందించాలి.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలి

భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’

2023–24లో కనీసం 20 రోజులు ఉపాధి హామీ చేసినవారు దీనికి అర్హులు

26 నుంచి వీటితోపాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ 

11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలు సన్నద్ధత పనులు పూర్తి చేయాలి

కలెక్టర్లు ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో అర్హుల జాబితాలను విడుదల చేయాలి

24వ తేదీకల్లా గ్రామ, వార్డు సభలను పూర్తి చేయాలని ఆదేశం

ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం వ్యాఖ్య

మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టళ్లను విజిట్‌ చేయాలని సూచన

జనవరి 26 తర్వాత జిల్లాల్లో పర్యటనలు, తనిఖీలు చేస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పంట వేసినా, వేయకపోయినా.. వ్యవసాయ యోగ్య మైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా అందుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని చెప్పారు. రైతుభరోసాతోపాటు భూమి లేని నిరుపేద కూలీల కుటుంబాలకు ఏటా రూ.12 వేల నగదు సాయం అందించే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి ఈనెల 26 నుంచి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. 

ఉపాధి హామీ పనులకు వెళ్తున్న భూమిలేని కుటుంబాలకు ‘ఆత్మీయ భరోసా’ పథకం వర్తిస్తుందని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, అవసరమైన వివరాల సేకరణ, లబ్ధిదారుల జాబితాల తయారీ మొదలైన అంశాలను చర్చించారు. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వారు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. సీఎం రేవంత్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే...

‘‘వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా చెల్లించాలి. వ్యవసాయానికి అక్కరకు రాని భూములను గుర్తించి, వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలి. రియల్‌ ఎస్టేట్‌ భూములతోపాటు లేఅవుట్‌ చేసిన వాటిని, వ్యవసాయేతర అవసరాలకోసం ‘నాలా’ కన్వర్షన్‌ అయిన భూములు, మైనింగ్‌ భూములు, గోదాములు, ఫంక్షన్‌ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు రైతుభరోసా అనర్హత జాబితాలోకి వస్తాయి.

ఈ మేరకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డీటీసీపీ లేఅవుట్‌ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందించాలి. విలేజ్‌ మ్యాప్‌లతోపాటు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అనర్హమైన భూములను ధ్రువీకరించుకుని, గ్రామసభలో ప్రచురించాలి. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలి. అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లపై ఉంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలి. గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా పంట పెట్టుబడి సాయం అందించారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదు.

ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
రాష్ట్రంలో భూమిలేని నిరుపేద ఉపాధి కూలీల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ఏటా రూ.12 వేలు నగదు సాయం అందిస్తాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏళ్లకేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డులతోపాటు గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. గతంలో ఉన్న అర్హత నిబంధనల ప్రకారమే కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తాం. ఒక కుటుంబానికి ఒకేచోట రేషన్‌కార్డు ఉండాలి. వేర్వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ‘వన్‌ రేషన్‌.. వన్‌ స్టేట్‌’విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో వెల్లడించాలి.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు..
ఇందిరమ్మ యాప్‌ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించాం. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశాం. అర్హుల జాబితాలను వెంటనే సిద్ధం చేయాలి. పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో అర్హుల జాబితాలను గ్రామసభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు సభల్లో ప్రదర్శించాలి.

లబ్ధిదారుల ఎంపికకు సేకరించిన వివరాలు, తయారు చేసిన జాబితాలను వెల్లడించాలి. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా వివిధ పథకాలకు సంబంధించి సన్నద్ధత పనులను పూర్తి చేయాలి. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్‌ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయినందున ఈ జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యముంది. ఈ రోజున నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లదే..
మా ప్రభుత్వానికి పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్లలాంటివి. ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉంది. జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వారే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లే. ప్రభుత్వ పని తీరుకు అదే కొలమానం అవుతుంది. కొందరు కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పనిచేయాలని అనుకుంటున్నారు. 

క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని గతంలో మేం సూచించాం. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలి..’’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జనవరి 26 తర్వాత జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు
జనవరి 26 తరువాత జిల్లాల్లో పర్యటిస్తా. ఆకస్మిక తనిఖీలు చేస్తా. ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవు. కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేయాలి. మహిళా ఐఏఎస్‌ అధికారులతోపాటు ఐపీఎస్‌ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టళ్లను విజిట్‌ చేయాలి. అక్కడే రాత్రి బస చేయాలి. విద్యార్థుల అవసరాలను, ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించాలి. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement