పథకాల అమలుపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభం
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో కార్యక్రమం
చంద్రవంచలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పలుచోట్ల మంత్రులు
ఆ గ్రామాల్లో 100% లబ్ధిదారులకు వెంటనే మంజూరు
దరఖాస్తుల క్రోడీకరణ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ వర్తింపు
మార్చి 31లోగా నాలుగు పథకాలు పూర్తిగా అమలు
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలో నిర్ణయాలు
వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కారు్డల జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని.. తొలిరోజున ఆ గ్రామంలో పూర్తి శాచురేషన్ పద్ధతిలో పథకాలను వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలను ఇవ్వాలని ఆలోచనతో ఉన్నామని.. దీనిపై ఎలాంటి పరిమితి లేదని చెప్పారు.
ఈ మొత్తం ప్రక్రియను మార్చి 31 కల్లా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పథకాల అమలుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పలువురు మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో సహచర మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సమావేశం వివరాలను వెల్లడించారు.
అర్హత ఉన్న అందరికీ పథకాలు..
‘‘లక్షల మంది తమ పేర్లు లేవంటూ గ్రామసభల్లో దరఖాస్తులు పెట్టుకోవడంతో పరిశీలన కోసం మార్చి వరకు సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరు. రైతు భరోసా కింద వ్యవసాయోగ్యమైన ప్రతి ఎకరానికి సాయం చేస్తాం. ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేస్తాం. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహిస్తున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన లక్షలాది దరఖాస్తులను క్రోడీకరించి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన రోజు కావడంతో ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. తనతో సహా సీఎం, మంత్రులు స్వయంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. భూమి లేని కూలీలందరూ ఉపాధి హామీ పనులకు వెళ్తారని ఓ ప్రశ్నకు బదులుగా భట్టి పేర్కొన్నారు.
70శాతానికిపైగా జనాభాకు సన్నబియ్యం: ఉత్తమ్
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో అర్హులందరికీ పథకాలను అందిస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గతంలో దరఖాస్తులిచ్చినా, సామాజిక ఆర్థిక సర్వే, గ్రామసభ, ప్రజాపాలనలో ఇచ్చినా అర్హత ప్రకారం పరిశీలించి రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారు.
స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి చొరవ తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నమని చెప్పారు. కొత్త రేషన్‌కార్డులిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తామని.. రాష్ట్ర జనాభాలో 70–72శాతం మందికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వబోతున్నాని తెలిపారు.
రబీకి ముందే రైతు భరోసా..: తుమ్మల
తమ సర్కారు ఒకే ఏడాదిలో రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లను నేరుగా జమ చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. రబీ సీజన్‌కు ముందే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చబోతున్నామని తెలిపారు.
అనర్హులకు ఇళ్లు ఇస్తే రద్దు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే వాటిని రద్దు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనర్హులు లబ్ధిపొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎక్కడా అవినీతి, పైరవీలకు స్థానం లేకుండా పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 606 మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇళ్లను ఇవ్వబోతున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుందని తెలిపారు.
అర్హులైన వారందరికీ జనవరి 26న ఒకేసారి పథకాలను ఇవ్వాలని అనుకున్నామని.. కానీ గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించాల్సి ఉండటంతో తొలుత ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. గ్రామసభల్లో కొంత మంది, కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. పథకాలను పూర్తిస్థాయిలో ఎప్పుడు, ఎక్కడ అమలు చేస్తారన్న షెడ్యూల్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment