విమానాశ్రయంలో సీఎం రేవంత్‌కు స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు
అధికారులు, మంత్రులతో సీఎం సమావేశం
పథకాల అమలు, ప్రారంభంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై చర్చ
రాష్ట్రవ్యాప్తంగా 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తి
జీహెచ్‌ఎంసీలో మరికొన్ని రోజులు జరగనున్న వార్డు సభలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించాలన్న దానిపై కీలకభేటీ జరగనుంది. దావోస్ పర్యటన ము గించుకొని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమవుతారు. ఈ నాలుగు పథకాలను జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్రస్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఆ సమావేశంలోనే స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేస్తారని, అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామసభల్లో పేర్లు చదవడంపై కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన చేయడం, అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. మంత్రులతో సమావేశానంతరం పథకాల ప్రారంభానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
నాలుగు రోజుల గ్రామసభలు పూర్తి: ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర మూడు పథకాలకు సంబంధించి గ్రామస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం వార్డు సభలు మరికొన్ని రోజులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు, లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించిన అధికారులు పలు పథకాల కోసం మళ్లీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకున్నారు.
ప్రధానంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాతే పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గత సంవత్సరంలో నిర్వహించిన ప్రజాపాలన సమావేశాల్లో 83 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 30 లక్షల మంది అర్హులుగా తేల్చారని, అందులోనూ తొలి విడతలో భాగంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్ల, గిరిజనులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు సర్టిఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం
యోచిస్తోంది.
⇒ రేషన్‌కార్డులకు సంబంధించి 6.85లక్షల మంది లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో అభ్యంతరాలు వచ్చిన దరఖాస్తులను, గ్రామసభల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలించనున్నారు. ఆ తర్వాతే కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల తుది జాబితా తయారు చేయనున్నారు.
⇒ రైతు భరోసా కోసం ఈనెల 16 నుంచి 20వ తేదీవరకు గ్రామస్థాయిలో సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 10–15 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కావని తేల్చినట్టు తెలిసింది. ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మంది వరకు అర్హులను గుర్తించారని, వీరికి తొలి విడతలో భాగంగా అవసరమయ్యే నిధుల చెక్కును కూడా విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
శంషాబాద్: దావోస్‌లో మూడురోజుల పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్‌లో ఎమ్మెల్యేలు శాలువాలతో సీఎంను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment