ఆదివారం నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కు ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
నాలుగు పథకాలు అమలు చేస్తాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా
26వ తేదీ రాత్రి నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి
రైతుకు కాంగ్రెస్‌కు మధ్య బలమైన అనుబంధముంది
ఇందిరమ్మ ఇళ్లు అంటేనే వైఎస్సార్ గుర్తొస్తారన్న ముఖ్యమంత్రి
ఒక్క కొడంగల్‌లోనే 20 వేల వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ
నారాయణపేట జిల్లా చంద్రవంచ సభలో ప్రసంగం
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం.. లబి్ధదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు పంపిణీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలను అందజేస్తాం. అప్పటివరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున జనవరి 26 అర్ధరాత్రి నుంచే టకీటకీమని రైతుల ఖాతాల్లో పడతాయి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి బంధముందో, రైతుకు కాంగ్రెస్‌కు మధ్య అలాంటి బలమైన అనుబంధముంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ప్రకటించారు. రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిలను ఒక్క కలం పోటుతో రద్దుచేశారు.
నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్..సోనియాగాంధీ నేతృత్వంలో రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపారు. ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ గత ఆగస్టు 15 నుంచి 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం..’అని సీఎం పేర్కొన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పథకాలను ఆయన ప్రారంభించారు. లబి్ధదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
మా కొడంగల్ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా?
‘కాంగ్రెస్ పాలనలో 2004–2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాం. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే వైఎస్సార్ గుర్తొస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 36 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే కేసీఆర్‌కు కడుపుమండి సీబీ సీఐడీ విచారణ చేయించారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ ఊరిలోనైనా వచ్చాయా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఊరికో కోడి, ఇంటికో ఈక కూడా ఇవ్వలేదు.
మేం రానున్న నాలుగేళ్లలో ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 15 నుంచి 20 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తాం. కొడంగల్‌లో పరిశ్రమలు పెడతామంటే కేసీఆర్ మనుషులు అడ్డుపడుతున్నారు. అధికారులపై దాడులు చేయించి చంపాలని చూస్తారా? మా కొడంగల్ బిడ్డలు ఎప్పటికీ బస్టాండుల్లో లుంగీలు కట్టుకుని ఖాళీగా ఉండాలా? డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా?..’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ప్రజాపాలనలో ఎవరైనా ప్రజల వద్దకే వస్తారు
‘ప్రతి ఆరునెలలకు ఒకసారి గ్రామాలకు అధికారులు రావడం ఎప్పుడైనా చూశారా? కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో ఎప్పుడైనా గ్రామాలకు వచ్చారా? కానీ మా హయాంలో ఇప్పటివరకు మూడుసార్లు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చారు. గతంలో ఫాంహౌస్, గడీలకే పరిమితమైన పాలనను మేం ప్రజల మధ్యకు తెచ్చాం. ప్రజాపాలనలో ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అయినా సరే..ప్రజల వద్దకే వస్తారు..’అని రేవంత్ పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతగా బాధ్యత లేకపోతే పదవి ఎందుకు?
‘గత 13 నెలల్లో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక్కసారైనా శాసనసభకు వచ్చాడా? సర్పంచ్ కొన్నిరోజులు లేకపోతేనే ఊరు విడవమని అంటరు. అలాంటిది ఆయన్ను ఏమనాలి? ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా? అలాంటప్పుడు ఆ పదవి ఎందుకు? అధికారం ఉంటే కొల్లగొడతారు కానీ ప్రతిపక్ష బాధ్యత వద్దు. కేసీఆర్ మేధావినని, 80 వేల పుస్తకాలు చదివానని చెప్తడు. కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటడు. కానీ ప్రజలకు రేషన్‌కార్డులివ్వాలన్న జ్ఙానం లేదు. పదేళ్లలో ఒక్కరికీ రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు..’అని సీఎం విమర్శించారు.
12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలు: సీఎస్
బడుగు, బలహీన వర్గాల కోసం ఒకే రోజున నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషకరమని సీఎస్ శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో 12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్యరాజ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు ఫరి్ణకారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీలా దోచుకోవడంలో పోటీపడం
‘కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు తిరుపతిరెడ్డి అన్న ఎప్పుడూ అండగా ఉంటడు. పదవి ఉన్నా లేకపోయినా ఏ ఇంట్లో ఇబ్బంది ఉన్నా చూసుకుంటడు. ఆయనకు ఏ పదవి ఉన్నదని కేటీఆర్ అంటున్నడు. మీ ఇంట్లో అందరూ పదవులు తీసుకున్నరు. మేం ఏ పదవీ తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే తప్పు పడుతున్నరు. పదవులు తీసుకొని కుటుంబమంతా దోచుకోవడం తప్పా?.. ఏ పదవులూ తీసుకోకుండా సేవ చేయడం తప్పా?. మీలా దోచుకోవడంలో పోటీపడం. మీకు మాకు తేడా ఉంది. మాది దోచుకునే కుటుంబం కాదు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment