రైతు భరోసాపై రేవంత్‌ పేచీ.. | KTR comments over revanth reddy on Rythu Bharosa | Sakshi
Sakshi News home page

రైతు భరోసాపై రేవంత్‌ పేచీ..

Published Sun, Jan 5 2025 4:37 AM | Last Updated on Sun, Jan 5 2025 4:37 AM

KTR comments over revanth reddy on Rythu Bharosa

సంక్షేమ పథకాలకు కోతపెట్టడం తప్ప ఏమీ చేయడం లేదు: కేటీఆర్‌ 

భూకంపం వచ్చినా మేడిగడ్డ బ్యారేజీకి ఏమీ కాలేదు 

కోటిన్నర ఎకరాలకు రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందనే రిపేర్లు చేయకుండా కుట్ర 

పంటలపై డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ రైతులను దొంగలుగా చిత్రీకరిస్తారా? అని మండిపాటు 

స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపు 

సిరిసిల్ల టౌన్‌: రేవంత్‌రెడ్డి సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌గా కాకుండా కటింగ్‌ మాస్టర్‌లా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు విమర్శించారు. సంక్షేమ పథకాలకు కోతలుపెట్టడం తప్ప ఏడాదిలో చేసిందేమీ లేదని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ సర్కారు గగ్గోలు పెడుతున్నట్టుగా పర్రె (పగులు) వచ్చిpది మేడిగడ్డ బ్యారేజీకి కాదని.. సర్కారు పుర్రెకే పర్రె వచ్చిందని ఇటీవల మేడిగడ్డ వద్ద భూకంపం వచ్చినా పటిష్టంగా నిలిచిన బ్యారేజీపై కాంగ్రెస్‌ సర్కారు అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. 

బ్యారేజీకి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తే.. కోటిన్నర ఎకరాలకు రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందనే సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శనివారం సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. 

రైతులను దొంగలుగా చిత్రీకరిస్తారా? 
‘‘కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని పదేళ్లపాటు ఇచ్చి.. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. మీరేమో డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మా ప్రభుత్వం ఠంఛన్‌గా రైతుబంధు ఇచ్చిoది. 

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌ సర్కార్‌ మాత్రం అనేక పేచీలు పెడుతోంది..’’అని కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రధాన ప్రతిపక్షంపై నోరుపారేసుకోవడం, తనపై, కేసీఆర్‌పై కేసులు పెట్టడానికి కుట్రలు చేయడం తప్ప ఏడాదిగా సీఎం రేవంత్‌ పేదలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ వాళ్లను నిలదీయండి..
రేవంత్‌ సర్కారు ఇప్పటికే ఒక్కో రైతుకు రైతుభరోసా కింద రూ.17,500, వృద్ధులకు ఒక్కొక్కరికి పింఛన్లలో రూ.30వేల చొప్పున బకాయిపడ్డారని కేటీఆర్‌ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ వాళ్లను దీనిపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, నాఫ్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, పుట్ట మధు, ఇతర నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement