సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్‌కార్డులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. ఇలా నాలుగు పథకాలను రేపు(ఆదివారం)లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు సీఎం తెలిపారు.
తెలంగాణలో రేపు ప్రారంభించే నాలుగు పథకాలపై సీఎం రేవంత్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లుగా గ్రామ సభలు లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ ఒకటి, రెండు రోజులు ఆలస్యం అయినా రేషన్ కార్డులు వస్తాయి. అధికారులు సమయస్పూర్తితో ప్రజలకు సమాధానం చెప్పాలి. చివరి లబ్దిదారుడి పేరు లిస్టులో చేర్చే వరకు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
రేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయండి. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండల స్థాయి అధికారులను నియమించాలి. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. మార్చి 31లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment