
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులు మొదలయ్యాయి. పలు చోట్ల వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో గాలి దుమారంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి ములగు భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.

హైదరాబాద్‌లో హైడ్రా డిజాస్టర్ టీం అప్రమత్తమైంది. మొదలైన భారీ గాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ప్రజలను అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్ నగర్, రావిరాల,తుక్కుగూడ, శ్రీనగర్, ఇమామ్ గూడా, హర్షగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్‌లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వికారాబాద్, సంగారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రెండు జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.
