ration card
-
డిజిటల్ రేషన్ కార్డు: ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్రం.. డిజిటల్ ఇండియా కింద ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవల క్యూఆర్ కోడ్ పాన్ కార్డు (పాన్ 2.0) గురించి ప్రస్తావించింది. కాగా ఇప్పటికే డిజిటల్ రేషన్ కార్డును తీసుకురాడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది. ఇంతకీ ఈ డిజిటల్ రేషన్ కార్డును ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ రేషన్ కార్డు అనేది.. సాధారణ రేషన్ కార్డుకు డిజిటల్ వెర్షన్. దీనిని ఉపయోగించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఆన్లైన్లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే..•ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'మేరా రాషన్ 2.0' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.•మేరా రాషన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత, ఓపెన్ చేస్తే స్క్రీన్‌పైన ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయమని ఉంటుంది.•ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.•మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత వెరిఫై క్లిక్ చేయాలి.•ధ్రువీకరించిన తరువాత.. మీ డిజిటల్ రేషన్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!డిజిటల్ రేషన్ కార్డు ఉపయోగాలు•ఫిజికల్ రేషన్ కార్డు పోయినప్పటికీ.. దీనిని రేషన్ షాపుల్లో ఉపయోగించవచ్చు.•రేషన్ కార్డు ఎక్కడైనా పోతుందేమో అని భయం అవసరం లేదు.•డిజిటల్ రేషన్ కార్డు కాబట్టి.. మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. -
విజయోత్సవానికి రెడీ.. ఏడాదైనా గూడేది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్న సందర్భంగా ‘ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల’ పేరిట సంబురాలకు శ్రీకారం చుట్టింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజయోత్సవాలు సరే.. ఈ ఏడాదిలో సొంత గూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఎందరు బడుగులకు ఇళ్లు ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు పేదలకు ఒక్క ‘ఇందిరమ్మ’ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో అదిగో అనడమే తప్ప.. పేదలకు ‘గూడు’ఎప్పటివరకు దక్కుతుందో చెప్పలేకపోతోందన్న ఆగ్రహం కనిపిస్తోంది.సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం గందరగోళంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనకు ఏడాది దగ్గరపడి, విజయోత్సవాలు ప్రారంభమైనా.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అదిగో, ఇదిగో అంటూ ప్రకటనలు వెలువడినా.. ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందంటూ ప్రకటనలు వచ్చాయి. పండుగ దాటి 20 రోజులు గడుస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 ఇళ్లను ఈ ఏడాది నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నిర్మించడం ఏమోగానీ, మంజూరైనా చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కారు తొలి ఏడాది కరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హడావుడిగా దరఖాస్తులు స్వీకరించినా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత ఏడాది డిసెంబర్–జనవరిలలో ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందాయి. దీనిలో రేషన్‌కార్డు లేని 30లక్షల దరఖాస్తులను పక్కనబెట్టిన అధికారులు.. మిగతా 50 లక్షల దరఖాస్తులను స్రూ్కటినీ చేయాలని నిర్ణయించారు. కానీ ప్రక్రియ ముందుకు కదలలేదు. ఏడాది అవుతుండటంతో దరఖాస్తులు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఉత్తర్వులు వెలువడి ఎనిమిది నెలలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. మంత్రులందరినీ వెంటబెట్టుకుని అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంతో.. పథకం పట్టాలెక్కినట్టే అనే భావన అప్పట్లో నెలకొంది. ఇది జరిగి ఎనిమిది నెలలైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎన్నికల కోడ్ ముందుండగా.. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడానికి మూడు నెలల ముందే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. పథకాన్ని ప్రారంభించే నాటికే లబ్ధిదారుల జాబితా రూపొందించి ఉంటే... భద్రాచలం వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించే వీలుండేది. అదే జరిగితే కొంత మేరకైనా ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేది. అయితే భద్రాచలం సభ ముగిసిన వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి.. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను చేపట్టలేని పరిస్థితి నెలకొంది. నిజానికి ఎన్నికల కోడ్ వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, అయినా దరఖాస్తుల స్రూ్కటినీ చేపట్టకుండా కాలయాపన చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊసే లేని గ్రామ సభలు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే ఉంటుందని మార్చిలో విడుదల చేసిన మార్గదర్శకాల ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు గ్రామసభల ఊసే లేదు. దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అర్హుల జాబితా ఆధారంగా గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులకు కూడా ఎలాంటి స్పష్టత లేకపోవటంతో యావత్తు పథకం నిర్వహణ గందరగోళంగా మారింది. మరోవైపు గ్రామసభలతో సంబంధం లేని ఇందిరమ్మ కమిటీల ఎంపికను మాత్రం హడావుడిగా చేపట్టడం గమనార్హం. ఈ కమిటీలు కూడా నెల రోజులుగా చేసే పనేమీ లేక ఖాళీగా ఉండిపోయాయి. 50 లక్షల దరఖాస్తులు... ఇంటింటి వెరిఫికేషన్ జరిగేదెప్పుడు? పేదల ఇళ్ల పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని.. లేకుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులను ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఆ మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆవాస్ యోజన నిధులను విడుదల చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర నిధులను రాబట్టాలని, మార్గదర్శకాలు పాటించాలని కాంగ్రెస్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది. అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి, వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. అలా 50 లక్షల దరఖాస్తులను వెరిఫై చేసే బాధ్యతను సుమారు 13 వేల మంది గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. మొదలైనా దాదాపు రెండున్నర నెలల సమయం పడుతుందని అంచనా. అంటే వచ్చే ఫిబ్రవరికి గాని అర్హుల జాబితా సిద్ధం కాదు. ఇక ఆ జాబితాలలో ఏవైనా లోపాలుంటే పరిశీలించి సరిదిద్దాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తారని సమాచారం. దాని కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చివరగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి గానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సొంత జాగా.. రేషన్ కార్డూ ఉండాల్సిందే?
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్‌కార్డు కూడా ఉన్నవారినే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. గత మార్చిలో ఈ పథకాన్ని భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కానీ, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చంది. అధికారికంగా ఇందిరమ్మ పథకాన్ని లాంచ్ చేసే సమయంలో జారీ చేసిన ఉత్తర్వులో.. సొంత జాగా ఉండాలన్న అంశాన్ని స్పష్టంగా వెల్లడించింది. సొంత జాగా లేని నిరుపేదలకు స్థలం ఇచ్చి మరీ ఇల్లు నిర్మించి ఇస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం, ఈ సంవత్సరానికి మాత్రం సొంత జాగా ఉన్నవారికే కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పుడు దానితోపాటు రేషన్‌కార్డుతో కూడా ముడిపెట్టాలని భావిస్తోంది. ఈ నిబంధన వల్ల.. రేషన్‌కార్డు లేనివారిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దారిద్య్ర రేఖ(బీపీఎల్)కు దిగువ ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటోంది. బీపీఎల్‌ను ధ్రువీకరించేది రేషన్‌కార్డే అయినందున, అది ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించే నాటికి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ప్రజాపాలనలో వచి్చన దరఖాస్తులు 80 లక్షలుగత డిసెంబరు, ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించగా, వాటిల్లో రేషన్‌కార్డు లేనివారికి సంబంధించినవి ఏకంగా 30 లక్షలు ఉన్నట్టు తేలింది. దీంతో వాటన్నింటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతానికి మిగతా దరఖాస్తులనే పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దసరా ముందు రోజు ఇందిరమ్మ కమిటీ మార్గదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఆధారంగా కమిటీ సభ్యులను నియమించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే హైకోర్డులో వేసిన పిటిషన్ ఆధారంగా కేసు నడుస్తోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో.. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగానే, దరఖాస్తుదారులకు సొంత జాగా ఉందా లేదో పరిశీలించటంతోపాటు రేషన్‌కార్డు వివరాలు కూడా సేకరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా రేషన్‌కార్డు అంశాన్ని వెల్లడించనప్పటికీ, మొదటి దఫా ఇళ్ల నిర్మాణంలో రేషన్‌కార్డు తప్పనిసరి అన్నవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేషన్‌కార్డు వివరాలను జత చేయని పక్షంలో.. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనని ఎలా ధ్రువీకరించారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. -
రేషన్ కార్డులకు సన్న బియ్యం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లలో సన్నబియ్యం నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నులు కూడా లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమయ్యే సన్న బియ్యాన్ని ఎలా సేకరించాలనే విషయమై సంస్థ తర్జన భర్జన పడుతోంది. ఖరీఫ్ పంట అక్టోబర్ నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎంత మేరకు ధాన్యం వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. వచి్చన సన్నాలను మరాడించి సన్న బియ్యంగా జనవరి నుంచి రేషన్ దుకాణాలకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రేషన్‌కార్డులు 89.96 లక్షలున్నాయి. ఈ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నెలకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బియ్యం అవసరం. అంటే ఏడాదికి 21.60 ఎల్ఎంటీల సన్నబియ్యం కావాలి. ఇవికాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి కలిపి ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. అంటే ఏటా సన్నబియ్యం 24 ఎల్ఎంటీలు అవసరమవుతుంది. ఇందుకోసం 36 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు గత ప్రభుత్వ హయాం నుంచే సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం కొరత ఏర్పడటంతో గత మే నెలలో 2.2 ఎల్ఎంటీ సన్న బియ్యం కొనుగోలు కోసం టెండర్లను ఆహా్వనించిన ప్రభుత్వం తరువాత వెనకడుగు వేసింది. ఖరీఫ్‌లో వచ్చే సన్న ధాన్యం 5 ఎల్ఎంటీ లోపే.. రాష్ట్రంలో సగటున ఏటా కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. ఇందులో ఖరీఫ్‌లో మాత్రమే రైతులు సన్నాలను పండిస్తున్నారు. ఈ సీజన్లో పౌరసరఫరాల శాఖ 50 నుంచి 60 ఎల్ఎంటీల ధాన్యం మాత్రమే సేకరించగలుగుతోంది. ఇందులో 5 ఎల్‌ఎంటీలే సన్నాలు ఉంటున్నాయి. రైతులు ఈ సీజన్లో సన్నాలను పండించినప్పటికీ, తమ అవసరాలకు నిల్వ చేసుకుంటుండటంతో మార్కెట్‌కు రావట్లేదు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో పండే మేలు రకం సన్న ధాన్యం నేరుగా మిల్లులకు వెళ్లడం లేదంటే బియ్యంగా మార్చి విక్రయించడం జరుగుతోంది. రబీలో వచ్చే మరో 70 ఎల్ఎంటీల ధాన్యంలో సన్నాలు నిల్. రాష్ట్ర వాతావరణం రీత్యా రబీలో సన్న ధాన్యం పండిస్తే, నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాల పంట పంట కావడంతో రైతులు దొడ్డు ధాన్యాన్నే పండిస్తున్నారు. ఈ ఖరీఫ్సీజన్పై సర్కార్ ఆశరూ.500 బోనస్ ప్రకటనతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలను రైతులు అధికంగా పండించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,320 ఉండగా, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తే ఆ మొత్తం రూ. 2,820 అవుతుంది. కాగా 30 రకాలను రూ. 500 బోనస్ ఇచ్చే ఫైన్ వెరైటీలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైన్ వెరైటీల్లో అధిక డిమాండ్ ఉన్న హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి రకాలు అధిక ధరలకు అమ్ముడుపోయినా, మిగతా వెరైటీలకు డిమాండ్ లేకపోవడంతో అవి మార్కెట్‌కు వస్తాయని భావిస్తోంది. అక్టోబర్ చివరి నుంచి ధాన్యం సేకరణ చేపట్టి, సన్నాలను వెంటవెంటనే మిల్లింగ్ చేస్తే జనవరి నాటికి రేషన్ దుకాణాలకు పంపవచ్చని ఓ అధికారి చెప్పారు. -
రూ.500 సిలిండర్‌కు అర్హులు 42.90 లక్షలేనా?
సాక్షి, హైదరాబాద్: రూ.500 లకే గ్యాస్ సిలిండర్ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 42,90,246 కుటుంబాలకే అందుతోంది. మొదటివిడత ప్రజాపాలనలో భాగంగా అన్ని జిల్లాల్లో కోటి ఐదు లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 89,21,269 దరఖాస్తులను కంప్యూటరైజ్ చేశారు. కానీ ఇందులో సగానికన్నా తక్కువ 42.90 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు అర్హులుగా ఎంపిక చేశారు.వీరికి గత ఏప్రిల్ నుంచి ఆగస్టు 15 వరకు 56,46,808 గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని భరించింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలకు రూ.168.17 కోట్లు చెల్లించింది. రేషన్‌కార్డు (ఆహారభద్రత కార్డు) ఉన్న ప్రతీ కుటుంబానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల్లో ఇచి్చన హామీని నెరవేర్చాలనే తొందరలో లబి్ధదారుల ఎంపికలో సరైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డు ఉన్నా... రాష్ట్రంలో భారత్, ఇండేన్, హెచ్పీలకు చెందిన కోటి 30 లక్షలకు పైగా గృహావసర (డొమెస్టిక్) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 33 జిల్లాల్లో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మినహా రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్న వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలే అని ప్రభుత్వం భావిస్తే మహాలక్ష్మి పథకం కనీసం 70 లక్షల కుటుంబాలకైనా వర్తించాలి.కానీ ప్రస్తుతం కేవలం 42.90 లక్షల కుటుంబాలకు మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్‌ను అందిస్తుండడాన్ని బట్టి మహాలక్ష్మి పథకానికి రేషన్‌కార్డుతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 500 సిలిండర్ పథకాన్ని వర్తింపజేయాలని రేషన్‌కార్డుదారులంతా కోరుతున్నారు. కాగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తే లబి్ధదారుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. -
మళ్లీ ‘ప్రజాపాలన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు జారీ చేయడమే ఎజెండాగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇక నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా రెండు కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఇదే ఎజెండాగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానాన్ని అనుసరిస్తున్నారని ఇటీవల విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని.. అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించే సాయానికి ఈ డిజిటల్ హెల్త్ కార్డే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న అంశంపై సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, రసాయనాల స్ప్రే వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. పనిచేయని ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలి్పంచాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. డెంగీ, చికెన్‌గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సూచించారు. -
ఆరోగ్యశ్రీ కార్డుల కోసం కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ కార్డుల ఎంపికకు మార్గదర్శకాల తయారీ కోసం త్వరలోనే ఒక కమిటీని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలి? పాత కార్డుల అప్డేట్, కొత్త పేర్ల ఎంట్రీ, సవరణలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతోపాటు రేషన్ కార్డుతో లింక్ కట్ చేస్తూ అందరికీ స్కీమ్ వర్తించేలా నిబంధనలు ఎలా ఉండాలనే అంశాలపై ఈ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను తయారు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి తర్వాత ఈ కమిటీ ఏర్పాటుపై స్పష్టత రానుంది.రేషన్ కార్డునే పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రభుత్వం హామీయిచ్చినట్లు రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా బీపీఎల్ కుటుంబాలను ఆదాయ ధ్రువీకరణ పత్రం ద్వారా గుర్తిస్తూనే, క్షేత్రస్థాయి కమిటీ ద్వారా విచారణ చేయించనున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏమిటి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైచిలుకుమంది ఆరోగ్య శ్రీ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా, మరో 11 లక్షల దరఖాస్తులు మెంబర్ అడిషన్ (అదనపు సభ్యులు చేర్పులు) కోసం పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కార్డులు ఉన్నోళ్లకు అప్డేట్ చేస్తూనే, కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు 89.96 లక్షల కుటుంబాలకు మళ్లీ కొత్త కార్డులు ఇస్తూనే, ఇప్పటి వరకు అసలు పొందని వాళ్లకీ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ప్రతి ఏటా దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు అవుతుండగా, కొత్త కార్డుల ద్వారా మరో రూ.నాలుగైదు వందల కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులపై ఉప సంఘం ఏర్పాటుచైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ ఉప సంఘంలో సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌గా ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ వ్యవహరిస్తారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎలాంటి మార్గదర్శకాలను అమలు చేయాలనే అంశంతో పాటు అర్హుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని ఈ సబ్ కమిటీ నిర్ణయిస్తుంది. -
వేర్వేరుగా రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా ఇస్తామన్నారు. రేషన్‌కార్డు నిబంధనలతో పోలిస్తే.. ఆరోగ్యశ్రీ కార్డు నిబంధనలు కాస్త భిన్నంగా ఉండడంతో ఈ మేరకు నిర్ణయించామని చెప్పారు. అతి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం రేషన్ కార్డులపై భేటీ అవు తుందని, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభు త్వానికి నివేదించిన తర్వాత మార్గదర్శకాలు జారీ చేస్తామ న్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి నుంచి నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులు భద్రంగా ఉన్నా, మరింత లోతైన సమా చారం కోసం దరఖాస్తుల స్వీకరణ అనివార్యమని మంత్రి వెల్లడించారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు తాతా మధుసూదన్, వాణీదేవి, జీవన్‌రెడ్డి తదితరులు లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందిస్తూ పైవిధంగా సమాధానమి చ్చారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కకార్డు కూడా జారీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేల సాయం చేస్తామ ని చెప్పినా, అమలు కాలేదంటూ వాణీదేవి తదితరులు సభలో ప్రస్తావించగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.7,500 కోట్లు రైతులకు అందించినట్టు వెల్లడించారు. రైతుభరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, ఈ అంశంపై మంత్రివర్గంతోపాటు అన్నిరంగాల నిపుణులు, ప్రజాసంఘాల అభిప్రాయాలను సేకరిస్తున్నా మన్నారు. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాతే రైతుభరోసా అమలు చేస్తామని చెప్పారు. అర్హత ఉన్న రైతులకే భరోసా దక్కుతుందని, గత ప్రభుత్వం రైతులు కాని వారికి కూడా సాయం చేసిందన్నారు. కానీ ఈసారి సాగుచేసే రైతులకు తప్ప కుండా భరోసా అందిస్తామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ గృహలక్ష్మి పథకం కింద రూ.5 లక్షల సాయం అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం కింద పేదలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గృహజ్యోతి నిరంతర ప్రక్రియ: ఉపముఖ్యమంత్రి భట్టిరెండువందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ అందిస్తున్నామని, మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండలిలో స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుందన్నారు. చెల్లుబాటు ఆహారభద్రత, రేషన్‌కార్డులున్నవారు ఈ పథకా నికి అర్హులని, ఇతరత్రా కారణాలతో ఒక్కోసారి 200 యూని ట్ల కంటే ఎక్కువ బిల్లు వచ్చినప్పుడు జీరో బిల్లు రాదని, ఆ తర్వాతి నెలలో 200 కంటే తక్కువ బిల్లు వస్తే తిరిగి జీరో బిల్లు అమలవుతుందన్నారు. ఈ పథకం కింద అర్హులుంటే ఎప్పటికప్పుడు వారికి పథకాన్ని వర్తింపజే స్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1.79కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందారని, రూ.2వేల కోట్లు ఖర్చు చేసి నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పు డు మిగులు బడ్జెట్‌తో ఉంటే..పదేళ్లలో అప్పులపాలు చేసి ఆర్థిక వ్యవ స్థను అస్తవ్యస్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవ స్థను గాడిన పెడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్నామని, ఒక్కో సమస్యను పరిష్క రిస్తున్నట్టు వివరించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేత నాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.గుండు సున్నా వచ్చినా.. బుద్ధి మారకుంటే ఎలా? శాసనసభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ విమర్శలు అభిప్రాయాలు తీసుకుందామనుకుంటే.. వివాదాలు రేపుతున్నారు బయటికి పంపిస్తే.. బతుకు జీవుడా అంటూ వెళ్లిపోదామనుకుంటున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: అందరి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించి ముందుకెళ్లే మంచి సంప్రదాయాన్ని అసెంబ్లీలో నెలకొల్పుదామనుకుంటే.. బీఆర్ఎస్ సభ్యులు సభను దురి్వనియోగం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ ఏదో పోరాటం చేసినట్టు, ఆ పోరాటానికి ఢిల్లీ దద్దరిల్లినట్టు, పదేళ్లు చెమటోడ్చి తెలంగాణ అభివృద్ధిని ఆకాశంలోకి తీసుకెళ్లినట్టు చెప్పే ప్రయత్నం మంచిది కాదు. కాంగ్రెస్ రూ.14,500 కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించింది. అప్పుడు ఏడాదికి రూ.6,500 కోట్లు అప్పులు కట్టాల్సి వచ్చేది. అదే ఇప్పుడు నెలకు రూ.6, 500 కోట్లు అప్పుల కింద కడుతున్నాం. మిత్తీలు కట్టీ కట్టీ నడుము వంగిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పెట్టి వెళ్లారు. ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నారు. కేన్సర్, ఎయిడ్స్ లాంటి రోగాలున్నా కూడా ఎర్రగా, బుర్రగా ఉన్నాను కాబట్టి పెళ్లి పిల్లను చూడాలని అడిగినట్టు ఉంది..’’అని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఎక్కడి బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అసలు విషయాలను పక్కనపెట్టి వివాదాలు రేపితే అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తారనే ఉద్దేశంతో, బతుకు జీవుడా అంటూ వెళ్లిపోవాలని బీఆర్ఎస్ సభ్యులు చూస్తున్నారని విమర్శించారు. ‘‘అలా పంపవద్దు, బీఆర్ఎస్ వారు ప్రజలకు సమాధానం చెప్పించాల్సిందే. అన్ని వివరాలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బయటపెడతా..’’అని రేవంత్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చినా కూడా బుద్ధి మారకపోతే ఎలాగని వ్యాఖ్యానించారు. -
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు లేకపోయినా బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి 11.50 లక్షల మందికి సంబంధించిన లక్షలోపు రుణాలు దాదాపు రూ.6,800 కోట్లు ఒకేసారి మాఫీ చేస్తారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వ మార్గదర్శకాలే.. ‘రుణమాఫీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారని నిర్ధారించేందుకు రేషన్‌కార్డు ఒక్కటే ప్రామాణికం. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారో గుర్తించేందుకే ఇది తప్పనిసరి. రేషన్‌కార్డులు లేని రుణ ఖాతాలు 6 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి రుణమాఫీ చేస్తారు. రేషన్‌కార్డులు లేనివారికి రుణమాఫీ జరగదని చేస్తున్న ప్రచారం తప్పు.రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుంది..’అని తుమ్మల వివరణ ఇచ్చారు.ఆ రుణాలు మాఫీ కావు: ‘బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్‌బుక్ తాకట్టుపెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేస్తాం. కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ కావు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఆదాయం పన్ను చెల్లించే బడా వ్యక్తులను గుర్తించేందుకు వినియోగించుకుంటాం. ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల్లో ఉన్న అధికారులకు రుణమాఫీ ఉండదు. నెలకు లక్ష రూపాయలకు పైన వేతనం పొందేవారికి రుణమాఫీ వర్తించదు. ఇలాంటివి 17 వేల అకౌంట్లను గుర్తించాం. మహిళా గ్రూపు అప్పులకు మాఫీ వర్తించదు’అని మంత్రి చెప్పారు.రీషెడ్యూల్డ్ రుణాలు కూడా ..‘గత ప్రభుత్వంలో తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రూ.1,400 కోట్లు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కు వచ్చాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లోని తమ అప్పును రీషెడ్యూల్ చేసుకున్నారు.ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతాయి. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది. అందులో మహిళలకు తొలి ప్రాధాన్యతనిస్తాం. రాష్ట్రంలో 39 లక్షల కుటుంబాలకు సంబంధించి 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి..’అని తుమ్మల తెలిపారు. -
రుణమాఫీ-రేషన్‌కార్డ్ రూల్‌పై సీఎం రేవంత్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రైతు రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. కలెక్టర్లతో ఇవాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి పాస్ బుక్‌ల ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన అని తెలిపారు.ఇదిలా ఉంటే.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజు సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. అదే రోజు.. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులో సంబురాలు నిర్వహించాలని, వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం రేవంత్ సూచించారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
'రేషన్' ఉంటేనే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
ఎన్నికల వింత హామీ.. రేషన్ కార్డుపై విదేశీ మద్యం!
రాబోయే లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీ పోరును తలపిస్తున్నాయి. రాజకీయ నేతలు వీలైనన్ని వాగ్దానాలు చేస్తూ, హామీలనిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఎన్నికల వింత వాగ్దానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన వనితా రౌత్ తనను ఎంపీని చేస్తే, రేషన్ కార్డులపై విదేశీ మద్యం అందజేస్తానని, నిరుద్యోగ యువతకు మద్యం కాంట్రాక్టులు కేటాయిస్తానని హామీనిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వనితా రౌత్ చేస్తున్న వాగ్దానాలను ఇంతకు ముందు ఏ అభ్యర్థి కూడా చేసివుండరు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రతి గ్రామంలో బార్లను తెరుస్తానని, తనకు వచ్చే ఎంపీ నిధులతో పేదలకు ఉచితంగా మద్యం అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు. దీనికి ముందు వనితా రౌత్ 2019లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే 2019లోనే చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ అసెంబ్లీ నుంచి కూడా ఎన్నికల్లో పోటీకి చేశారు. ఆ సమయంలోనూ ఆమె ప్రజలకు ఇటువంటి హామీలనే ఇవ్వడం విశేషం. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
హామీ ప్రకారం గ్యారంటీల అమలు
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ గృహజ్యోతి పథకం ఫేమస్ అని, కేసీఆర్ ప్రభుత్వ 24 గంటల కరెంట్ మొత్తం బోగస్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. ఇ చ్చిన హామీ ప్రకారం 90 రోజుల్లోపే నాలుగు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్.. నేతలు నేడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 25 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ, గ్రూప్–1 నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు.. ఈనెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని.. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే మామిల్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. రూ. వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. బైక్ నడిపిన మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని బైక్‌పై ఎక్కించుకుని పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగారు. హైదర్‌ఖాన్‌గూడ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ హరిచందనతో కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన తిప్పర్తి మండలం మర్రిగూడ, కనగల్ మండలాల్లోని పలువురు గృహజ్యోతి లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి బిల్లుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ బచ్చా.. ఆయనతో పోటీ ఏంటి! ‘కేటీఆర్ ఒక బచ్చా.. ఆయన తండ్రి చాటు కొడుకు. ఆయనతో నాకు, సీఎం రేవంత్‌కు పోటీ ఏంటి’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా.. కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారా? అని మీడియా అడగ్గా పైవిధంగా స్పందించారు. ‘కేటీఆర్.. కేసీఆర్ సీఎం అయి, టికెట్ ఇస్తే అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిండు. మా లెక్క కష్టపడి రాలేదు’అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంఎల్సీగా, ఎంపీగా అయి, ముఖ్యమంత్రి వరకు ఎదిగారన్నారు. తాను కూడా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో కొట్లాడి ఎమ్మెల్యే అయ్యానని, తమది వ్యవసాయ కుటుంబమని.. కేటీఆర్ తండ్రి వ్యవసాయం చేయడం లేదని స్పష్టం చేశారు. అలాంటి బచ్చాతో మాకు పోటీయా? అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ టికెట్ల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని, నల్లగొండ, భువనగిరిలో తమ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులే మోదీ కంటే అత్యధిక మెజారీ్టతో విజయం సాధిస్తారని అన్నారు. -
Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్‌కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్ అర్హతకు సమస్యగా తయారైంది. 10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కనెక్షన్ దారులు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. ఉజ్వలకు వర్తింపు ? ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్‌పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్ పథకం 2014 నవంబర్ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది. -
‘గ్యారంటీ’గా ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘గ్యారంటీ’గా రావాలంటే.. రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వాటి కోసం అర్హులైన లక్షలాది కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి రేషన్‌కార్డు నిబంధన లేదు. అయితే, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకానికి మాత్రం రేషన్‌కార్డు తప్పనిసరి చేశారు. ఇటీవల మరో రెండు గ్యారంటీలు..రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీల అమలుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ పథకాలకు కూడా రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకొంది. దీంతో రేషన్‌కార్డు లేని అర్హులైన లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా రేషన్‌కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. కానీ కొత్త కార్డుల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ప్రకటించడం కానీ, ఎప్పటి నుంచి కార్డులు జారీ చేస్తారన్న సమాచారం ఇవ్వడం కానీ చేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు ప్రక్రియలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు ఆధార్, రేషన్‌కార్డు నంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ సందేశాలు పంపిస్తుండటంతో రేషన్ కార్డులు రానివారు ఆందోళనకు గురవుతున్నారు. 20 లక్షల దరఖాస్తులు.. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోనే ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి గ్రామం, పట్టణం నుంచి వార్డుల వారీగా 1.28 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా రేషన్‌కార్డుల కోసం అర్హులైన కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో రేషన్‌కార్డుల కోసం కూడా విడిగా దరఖాస్తులు స్వీకరించారు. అలా సుమారు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అనధికారిక లెక్క. కాగా పౌరసరఫరాల శాఖ.. కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తమకు అందలేదని స్పష్టం చేస్తుండటంతో ప్రజాపాలనలో ప్రజలు రేషన్‌కార్డుల కోసం చేసిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాపాలనలో వచ్చిన 1.28 కోట్ల దరఖాస్తుల్లో కూడా రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ లేకుండా అందజేసినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయడం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తెలుపు, గులాబీ కార్డులను జారీ చేసింది. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు రకాల కార్డులను రద్దు చేసి, ఆహార భద్రతా కార్డు పేరుతో కొత్త కార్డులు జారీ చేసింది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. మొత్తం 90.14 లక్షల కార్డుల ద్వారా 2.83 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కొత్తగా పెళ్లిళ్లయి కుటుంబాల నుంచి వేరుపడిన వాళ్లు, వివిధ కారణాల వల్ల కార్డులు పొందలేని వాళ్లు లక్షల సంఖ్యలో ఇప్పుడు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా రేషన్‌కార్డుల్లో పుట్టిన పిల్లల పేర్లు చేర్చడానికి కూడా లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వెంటనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ, కార్డుల్లో అడిషన్స్ (చేర్పులు) చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
రేషన్‌కార్డే ప్రామాణికం! లేకపోతే నో
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ నెలలోనే అమలు చేయాలని భావిస్తున్న మరో రెండు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు హామీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు కూడా ప్రారంభించింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్ శాఖ, రూ 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, నేరుగా వినియోగదారుల నుంచి అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకోవాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కోత తప్పదా? రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ (గృహ వినియోగ) గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 1.23 కోట్ల గృహావసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద జారీ అయిన ఆహార భద్రతా కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డులు కలిపి 90,14,263 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వీరందరికీ రెండు గ్యారంటీలను అమలు చేయాల్సి వస్తే ఎలాంటి అభ్యంతరాలు, నిబంధనలు లేకుండా అమలు చేయాలి. కానీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా పరిగణించాలని భావిస్తే మాత్రం గణనీయంగా కోత తప్పదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారుడి ఆర్థిక, సామాజిక స్థితి గతులను కూడా పరిగణనలోకి తీసుకొని రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమం ఓవైపు సాగుతుండగా, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ తరఫున మరోసారి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సాగనున్నట్లు సమాచారం. బిల్లులు ఎవరు కడితే వారి పేరుపైనే.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం నుంచే విద్యుత్ శాఖ రంగంలోకి దిగనుంది. ఈనెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చే వ్యక్తి బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్ నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఆ బిల్లుకు సంబంధించి ఉన్న ఇంటి యజమాని ఆధార్, రేషన్‌కార్డు (ఆహారభద్రతా కార్డు), ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ ఇంటి యజమాని కాకుండా అద్దెకు ఉన్న వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్టయితే, ఆ కిరాయిదారు పేరు మీద మీటర్‌ను యాక్టివేట్ చేస్తారు. రేషన్‌కార్డు లేని వారి నుంచి వివరాలు తీసుకోరు. ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయనుంది. ఉచిత విద్యుత్ పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. ఏడాదికి ఆరు సిలిండర్లు! గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి.. సిలిండర్ బుక్ చేసినప్పుడు డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవైసీ తరహాలో లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు గ్యాస్ సిలిండర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు ఆర్థిక స్థోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలావుండగా ఒక కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రూ.500 చొప్పున సరఫరా చేయాలనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. అయితే ఒక పేద కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంవత్సరానికి 6 సిలిండర్లు రూ.500 చొప్పున ఇచ్చినా రేషన్‌కార్డుల లెక్క ప్రకారం ఏడాదికి రూ.3,245 కోట్లు సబ్సిడీ రూపంలో వెచ్చించాల్సి వస్తుందని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. -
Andhra Pradesh:కొత్త రేషన్ కార్డులొచ్చాయ్
సాక్షి, భీమవరం: క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన వారందరికీ ఎప్పటికప్పుడు తెల్లరేషన్ కార్డుల మంజూరుచేయడం ద్వారా ఇంటింటా సంక్షేమ కాంతులు నింపుతోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. తాజాగా జిల్లాలో 4,935 రేషన్‌కార్డులు మంజూరు కాగా మొత్తం తెల్లరేషన్ కార్డుల (బియ్యం కార్డులు) సంఖ్య 5,70,956 చేరింది. ఈనెల నుంచే కొత్త కార్డుదారులకు ప్ర భుత్వం రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభించడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో తెల్లరేషన్ కార్డులదే ప్రధానపాత్ర. గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెట్టేందుకు అరకొరగా రేషన్‌కార్డులు మంజూరు చేసింది. దీంతో కొత్త కార్డుల కోసం పేదలు అప్పటి జన్మభూమి కమిటీలు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ సర్కారు రేషన్‌కార్డుల మంజూరుకు నిబంధనలను సరళతరం చేసింది. కుటుంబంలో ఎవరైనా ఉద్యోగి ఉంటే వారి వల్ల తల్లిదండ్రులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్న ఉద్దేశంతో కార్డు నుంచి వారిని తొలగించే వీలు కల్పించింది. కొత్తగా పెళ్లయిన వారుంటే స్పిట్లింగ్ ద్వారా కార్డుల మంజూరుకు వెసులుబాటు ఇచ్చింది. ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తుండటంతో జిల్లాలో కార్డుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉచితంగా బియ్యం పునర్విభజన అనంతరం జిల్లాలో 5,53,519 రేషన్‌కార్డులు ఉండగా గతేడాది జనవరిలో 3,090, జూలైలో 9,372 కొత్త కార్డులు మంజూరయ్యాయి. తాజాగా ఈనెలలో 4,935 కార్డుల మంజూరు చేయడంతో జిల్లాలో కార్డుదారుల సంఖ్య 5,70,916కు పెరిగింది. వీటిలో 31,944 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం ఉచితంగా, రూ.13.50కు కిలో పంచదార అందిస్తున్నారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార, రూ.16కు కిలో గోధుమ పిండిలతో పాటు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దకే సరఫరా రేషన్ డిపోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందిస్తోంది. తూకంలో కచ్చితత్వం, ఈపోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడంతో సరుకుల అక్రమ రవాణకు తెరదించింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎక్కడైనా సమస్యలుంటే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఎండీయూ వాహనాలపై 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను ముద్రించింది. ఎండీయూ వాహనాలు క్రమం తప్పకుండా నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. వలంటీర్ సాయంతో త్వరితగతిన.. మా ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు కావడం, వారు ఆదాయపు పన్ను పరిధిలో ఉండటంతో 8 నెలల క్రితం రేషన్ కార్డు రద్దయ్యింది. నేను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే వలంటీర్ సాయంతో కొత్త రేషన్ కార్డు పొందాను. కొత్త రేషన్ కార్డుతో పాటు ఈనెల రేషన్ సరుకులు కూడా ఇచ్చారు. అసలే వృద్ధాప్యం, ఆపై ఒంటరిగా ఉంటున్న నాకు రేషన్ సరుకులు అందడం ఆనందంగా ఉంది. –కల్లేపల్లి పుష్పావతి, తేతలి, తణుకు మండలం -
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు 40 రోజులే గడువు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెల రోజులు పూర్తి అయిపోయాయి. నెల రోజుల పాలన పూర్తయినందుకు కాంగ్రెస్ నేతలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నా.. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలకు చెప్పిన గడువు దగ్గరపడుతోందనే ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రజలకిచ్చిన 14 హామీల్లో ఇప్పటివరకు కేవలం రెండు మాత్రమే అమలు కాగా మిగిలిన నాలుగు గ్యారంటీల్లోని 12 హామీల అమలు పెండింగ్‌లో ఉండటంతో.. మిగిలిన 70 రోజుల్లో ఇవి అమల్లోకి వస్తాయా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికల కోడ్ (షెడ్యూల్) అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని, అదే జరిగితే ప్రభుత్వానికి నికరంగా మిగిలిన గడువు 40 రోజులే అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కోడ్ వస్తే కష్టమే! ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్యారంటీల అమలు సాధ్యం కాదని, షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ముందే తెలుసు కనుక, ఆ పేరిట గ్యారంటీల అమలును వాయిదా వేస్తే ప్రజలు హర్షించరనే భయం పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అమలు చేయాల్సిన హామీల్లో మరికొన్నిటిని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటిస్తుందనే ఆశాభావంలో ప్రజలు ఉన్నారు. అదే సమయంలో పింఛన్లు, రైతుబంధుకు సంబంధించిన డేటా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, ఈ సమాచారం ఆధారంగా వెంటనే చేయూత పింఛన్లు రూ.4 వేలకు (దివ్యాంగులకు రూ.6 వేలు) పెంచి ఇచ్చేందుకు, పెంచిన రైతుభరోసా మొత్తాన్ని జమ చేసేందుకు అవకాశం ఉన్నా ప్రజా పాలన పేరిట అన్ని పథకాలను ఒకేగాటన కట్టి తాత్సారం ఎందుకనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినవారి జాబితా కూడా సర్కారు వద్ద రెడీగానే ఉందని అంటున్నారు. ఇప్పటికి దరఖాస్తుల ప్రక్రియే పూర్తి 100 రోజుల గడువు ప్రకారం చూస్తే మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మార్చి 15వ తేదీ వరకు గడువుంది. అది లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకపోతే. లేదంటే ప్రకియ మొత్తాన్ని వేగవంతం చేసి ఎన్నికల కోడ్ వచ్చే నాటికే గ్యారంటీల్లో పేర్కొన్న అన్ని పథకాలను అమల్లోకి తేవాల్సి ఉంది. ప్రస్తుతం ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే ముగిసింది. ఈ నెల 17 వరకు ఈ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరణ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మిగిలే కాలంలో 12 పథకాల అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేయడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ పథకాలను వర్తింపజేసినప్పుడే మొత్తం ఆరు గ్యారంటీలు అమలైనట్టని, కానీ మిగిలిన సమయం ఇందుకు సరిపోయే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ లాంటి పథకాల అమలు పారదర్శకంగా చేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వచ్చే సందేహాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లడం అంత సులభమేమీ కాదని వారంటున్నారు. మరోవైపు ఆర్థికంగా ప్రభుత్వంపై భారీగా భారం పడే కొన్ని పథకాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రైతుబంధు అమలు కోసమే ప్రభుత్వం దగ్గర నిధుల్లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాల అమలుకు ఖజానా సహకరిస్తుందా? అనే అనుమానాలు ఇటు అధికార వర్గాలు, అటు పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శకాలపై చర్చోపచర్చలు ఆరు గ్యారంటీల అమలుతో పాటు వాటిని అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాల ఖరారు విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంభిస్తుందనేది రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రజలు, అధికార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మార్గదర్శకాల ఖరారు కూడా అంత సులభమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రధానంగా చర్చకు వస్తోంది. సాధారణంగా పేదలకు అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డునే గీటురాయిగా తీసుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించింది. ఆ మేరకు కొత్తగా కార్డులు ఇస్తారా? పాత కార్డుల ఆధారంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ అంత సులభమేమీ కాదని, కేంద్ర ప్రభుత్వ పరిమితుల మేరకు ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. మిగిలిన గడువులోగా కొత్త కార్డులు కూడా జారీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. సోమవారం జరిగే కీలక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నెలకు రూ.2,500 నగదు సాయం విషయంలో మహిళల అర్హతను ఎలా నిర్ణయిస్తారనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కుటుంబంలో ఒక మహిళకు ఇస్తారా? ఎంతమంది మహిళలున్నా ఇస్తారా? అసలు ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ధారిస్తానే సందేహాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆరు గ్యారంటీల్లో చెప్పినప్పటికీ ఏడాదికి ఇన్ని సిలిండర్లేనన్న పరిమితి విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు రేషన్‌కార్డును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుందని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు కావాల్సిన పథకాలివే: – నెలకు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం – రూ.500కే గ్యాస్ సిలిండర్ – రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం – వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు – వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ – గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం – ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం – విద్యాభరోసా కింద విద్యార్థులు చదువుకునేందుకు రూ.5 లక్షల విలువైన కార్డు – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు – చేయూత కింద పింఛన్లు రూ.4 వేలకు పెంపు -
ఆన్‌లైన్‌లోకి.. ప్రజాపాలన దరఖాస్తులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో రోజూ 30 కేంద్రాల ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద సాయం చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ► బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో ఈ నెల 5వ తేదీ నాటికి 50 వేల అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు. ► జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నాటికి 3.80 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ► వచి్చన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా 60 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు. ► వీరికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ► ఇప్పుడు ఉన్న డీటీపీ ఆపరేటర్లు సరిపోకపోతే ప్రైవేటు వాళ్లను నియమించాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ► పలు పథకాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారనే మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. ► వచ్చేనెల నుంచి మహిళలకు రూ. 2,500లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ► అధికారులు అర్జీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు.. లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేస్తారు.. దీనికి ప్రాతిపదిక ఏమిటీ.. ఏయే అర్హతలు చూస్తారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుల్లో దేనిని పరిగణలోనికి తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ► దరఖాస్తు చేసుకున్నవారంతా తమకు లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దరఖాస్తులు 80 శాతం తెల్లరేషన్‌కార్డు కోసమే పెట్టుకోగా, ఆ తర్వాత స్థానం రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకున్నారు. ► అయితే తెల్ల రేషన్‌కార్డు లేనివారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే తమకు పథకాలు అందవేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. గడువులోగా నమోదు పూర్తిచేస్తాం ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం డీటీపీలకు జోనల్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలు ఇచి్చన దరఖాస్తులను ఎలా నమోదు చేయాలనే విషయంపై అవగాహన పెంచుకుంటారు. దానికి సంబంధించిన పోర్టల్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచే నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెలత 17వ తేదీ లోపు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా నిరీ్ణత సమయంలో పూర్తిచేస్తాం. ఇందుకోసం రెండు రోజుల నుంచే పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న ఆపరేటర్లతో పాటు కొత్తగా వచి్చన వారితో నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడతాం. – ప్రశాంతి, డీసీ, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ -
నేటితో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: ఆరు గ్యారంటీల పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ప్రజాపాలనలో భాగంగా పదిరోజులుగా అర్జీలను తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో 150 వార్డుల్లోని 600 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీ పథకాలతోపాటు ఇతరత్రా పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం నాటికి 21,52,178 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,53,100 వరకు కొత్త రేషన్ కార్డు, ఇతరత్రా అర్జీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. తొలి రెండు రోజులు దరఖాస్తుల తాకిడి అధికంగా కనిపించి క్రమంగా తగ్గుముఖం పట్టింది. గ్రేటర్లో 40 లక్షలపైగానే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలకుపైనే కుటుంబాలు ఉన్నట్లు పలు సర్వే సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో ఆదాయ వర్గాలకు సంబంధించిన 10 లక్షలు మినహా మిగిలిన 30 లక్షల కుటుంబాలు పేద, మధ్యతరగతి వర్గాలే. సంపన్న వర్గాలు మినహా మిగతా కుటుంబాలకు ఆరు గ్యారంటీల పథకాల్లో మహాలక్షి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 500 వంట గ్యాస్ రాయితీ, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవంగా మహా నగర పరిధిలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 17.21 లక్షల వరకు ఉన్నాయి. మరో పది లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. మిగిలిన 2.79 కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించిన వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు సమాచారం. చివరి రోజు శనివారం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మళ్లీ నాలుగు నెలల తర్వాతే.. ఈసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని కుటుంబాలు రెండోసారి జరిగే కార్యక్రమంలో అర్జీలు సమర్పించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మరో నాలుగు నెలల తర్వాత రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది. మొదటి విడత ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీల ప్రక్రియ తక్షణమే ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డాటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. డాటా ఎంట్రీలో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, తెల్లరేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు సమాచారం. -
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ 'దేవేంద్ర సింగ్ చౌహాన్' ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో రేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఈ-కేవైసీ తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు ఇంకా ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తూ మరో నెల రోజులు అవకాశం కల్పించారు. రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గడువును 2024 జనవరి 31 పొడిగించారు. ఈ గడువు లోపల ఈ-కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గత రెండు నెలలుగా రేషన్ డీలర్లు ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీని కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తులు వంటివి తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే.. నిర్దిష్ట గడువు లోపల ఈ-కేవైసీ అప్డేట్ పొందని రేషన్ కార్డులను, నకిలీ రేషన్ కార్డులుగా గుర్తించి.. వాటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే ప్రజలు అప్పటి వరకు పొందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. 2023 డిసెంబర్ 30 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు 70.80 శాతం అని తెలుస్తోంది. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో (87.81 శాతం) ముందు వరుసలో ఉన్నట్లు.. అతి తక్కువ నమోదైన జిల్లాలో వనపర్తి (54.17 శాతం) ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ!
కరీంనగర్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం అర్జీల స్వీకరణ జాతరను మరిపిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లలో దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం ఎక్కువ అర్జీలొచ్చాయి. ఈ నెల 28న ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు 28,452 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం 48,230 వేల దరఖాస్తులు రాగా.. శనివారం 46 గ్రామాలతో పాటు 22 డివిజన్లలో ‘ప్రజాపాలన’ నిర్వహించనున్నారు. రేషన్‌కార్డు లేనివారికి అవకాశం! రేషన్‌కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశఽం కల్పించింది. వీరి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులేనివారు ఆధార్ కార్డులను జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన దరఖాస్తుఫారం నింపే క్రమంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. మహాలక్ష్మి పథకానికి కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉండటంతో ఒకే దరఖాస్తులో వివరాలు రాయాలా.. వేర్వేరు అందించాలా అన్న అయోమయానికి గురయ్యారు. రైతుభరోసాలో కౌలు రైతులు దరఖాస్తు చేసినప్పటికి ఫారంలో భూ యజమాని పట్టా పాసుపుస్తకం వివరాలు అందించలేకపోయారు. సబ్ మీటర్ లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నవారు గృహజ్యోతికి కాలం పూరించే క్రమంలో సర్వీస్ నంబర్ లేకుండా దరఖాస్తు అందించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు సైతం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. కరీంనగర్లో ఎక్కువ కొత్తపల్లిలో తక్కువ కరీంనగర్ సిటీలో అత్యధిక దరఖాస్తులు 15,551 రాగా.. కొత్తపల్లి మున్సిపాలిటీలో అత్యల్పంగా 332 వచ్చాయి. చొప్పదండి మున్సిపాలిటీలో 843, హుజూరాబాద్‌లో 1,956, జమ్మికుంటలో 1,955 దరఖాస్తులు వచ్చాయి. మండలాలవారీగా చూస్తే ఇక చిగురుమామిడి మండలంలో 1,253, చొప్పదండిలో 1,928, ఇల్లందకుంటలో 1,158, గంగాధరలో 2,311, గన్నేరువరం 1,391, హుజూరాబాద్ 1,826, జమ్మికుంట 2,067, కరీంనగర్ రూరల్ 1,605, కొత్తపల్లి 2,587, మానకొండూరు 2,170, రామడుగు 1,952, శంకరపట్నం 1,320, తిమ్మాపూర్ 1,458, సైదాపూర్ 2,183, వీణవంక మండలంలో 2,384 దరఖాస్తు వచ్చాయి. నేడు ప్రజాపాలన జరగనున్న ప్రాంతాలివే.. చిగురుమామిడి మండలంకొండాపూర్, లంబాడిపల్లి, ముదిమాణిక్యం, ముల్కనూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, కోనేరుపల్లి, కుర్మపల్లి, మంగళపల్లి, ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి, మల్యాల, మర్రివానిపల్లి, పాతర్లపల్లి, గంగాధర మండలం హిమ్మత్‌నగర్, ఇస్లాంపూర్, కాచిరెడ్డిపల్లి, కాసారం, గన్నేరువరం మండలం హన్మాజిపల్లి, జంగపల్లి, ఖాసీంపేట, మాదాపూర్, హుజూరా బాద్ మండలం కాట్రపల్లి, మందాడిపల్లి, పెదపాపయ్యపల్లి, పోతిరెడ్డిపేట, జమ్మికుంట మండలం నాగంపేట, నగురం, పాపయ్యపల్లి, పాపక్కపల్లి, కరీంనగర్ రూరల్‌లో దుబ్బపల్లి, దుర్శేడ్, ఎలబోతారం, కొత్తపల్లి మండలంలో కమాన్‌పూర్, ఖాజీపూర్, మానకొండూరు మండలంలో చెంజర్ల, దేవంపల్లి, ఈదులగుట్టపల్లి, గట్టుదుద్దెనపల్లి, రామడుగు మండలం వెలిచాల, చిప్పకుర్తి, దత్తోజి పేట, శంకరపట్నం మండలంలో చింతలపల్లి, ధర్మారం, ఎరడపల్లి, గద్దపాక, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్, జుగుండ్ల, కొత్తపల్లి, లక్ష్మీదేవిపల్లి, సైదాపూర్ మండలంలో గొడిశాల, గుజ్జులపల్లి, గుండ్లపల్లి, జాగిర్పల్లి, వీణవంక మండలం బ్రహ్మణపల్లి, దేశాయిపల్లి, ఎలబాక, గంగారం, కొత్తపల్లి మునిసిపాలిటీలో 5, 6వ వార్డులు, చొప్పదండిలోని 5,6వ వార్డులు, కరీంనగర్ నగరపాలకలో 3, 8, 16, 22, 27, 30, 35, 37, 48, 51 డివిజన్లు, జమ్మికుంట మునిసిపాలిటీలో 9, 10, 11, 12వార్డుల్లో, హుజూరాబాద్‌లో 9, 10, 11, 12 వార్డుల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. జిల్లాలో గ్రామాలు: 313, మునిసిపాలిటీలు: 5, జిల్లా మొత్తంగా వచ్చిన అర్జీలు: 76,682, శుక్రవారం వచ్చినవి: 48,230, కవరైన నివాసాలు: 2,13,218, దరఖాస్తులు స్వీకరించిన గ్రామాలు: 90, వార్డులు: 48 ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్‌సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు.