త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు | New Arogyasree cards coming soon | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

Published Thu, Mar 14 2024 5:48 AM | Last Updated on Thu, Mar 14 2024 5:48 AM

New Arogyasree cards coming soon - Sakshi

రేషన్‌ కార్డులతో సంబంధం లేకుండా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

ఆదాయంతో నిమిత్తం లేకుండా అందరికీ పథకం వర్తింప చేసే చాన్స్‌!. అదనంగారూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా 

కొత్తగా మరిన్నిశస్త్రచికిత్సలు చేర్చాలనివైద్య,ఆరోగ్యశాఖ నిర్ణయం.. రూ.500 కోట్లకు పైగానే ఆస్పత్రులకు బకాయిలు.. త్వరలో విడుదల 

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్‌ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్‌ నంబర్‌ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్‌ ప్రొఫైల్‌కు లింక్‌ చేసి, స్టేట్‌ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్‌ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. 

వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం 
రాష్ట్రంలో 293 ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు.

ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్‌ఎస్‌ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. 

ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ 
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈహెచ్‌ఎస్‌ పథకంపై తేలని నిర్ణయం 
ఈహెచ్‌ఎస్‌ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్‌ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది.

ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. 

ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు 
ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్‌ఎస్‌ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్‌ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు.

అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి.

మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement