వచ్చే నెల 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా నిర్వహణ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రేషన్, హెల్త్‌కార్డులకు లింక్ లేకుండా అన్ని కుటుంబాల వివరాల సేకరణ
హెల్త్ డిజిటల్ కార్డుల జారీపై ఫ్రాన్స్ విధానాన్ని పరిశీలించండి
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌లకు ఈ కార్డే ప్రాతిపదిక అని వెల్లడి
వ్యాధులపై ఉదాసీనంగా ఉంటే సస్పెన్షనేనని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు జారీ చేయడమే ఎజెండాగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు.
ఇక నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా రెండు కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఇదే ఎజెండాగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానాన్ని అనుసరిస్తున్నారని ఇటీవల విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని.. అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా అందించే సాయానికి ఈ డిజిటల్ హెల్త్ కార్డే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు.
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ
రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న అంశంపై సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, రసాయనాల స్ప్రే వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. పనిచేయని ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలి్పంచాలని సూచించారు.
అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. డెంగీ, చికెన్‌గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment