కాంగ్రెస్ సర్కారు ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ‘ఇందిరమ్మ’ ఇళ్లపై గందరగోళం
ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలతో ఏడాది... మార్గదర్శకాలు విడుదల చేసి ఎనిమిది నెలలు పూర్తి
పథకం అమలుపై కీలక కమిటీలు ఏర్పాటై కూడా నెల రోజులు
ఇప్పటివరకు లబ్ధిదారులెవరో తేలని తీరు
నెలరోజులుగా ఖాళీగానే కమిటీలు
జాడ లేని గ్రామ సభలు.. ఒక్క దరఖాస్తుకూ కలగని మోక్షం
తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్న సందర్భంగా ‘ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల’ పేరిట సంబురాలకు శ్రీకారం చుట్టింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజయోత్సవాలు సరే.. ఈ ఏడాదిలో సొంత గూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఎందరు బడుగులకు ఇళ్లు ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు పేదలకు ఒక్క ‘ఇందిరమ్మ’ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో అదిగో అనడమే తప్ప.. పేదలకు ‘గూడు’ఎప్పటివరకు దక్కుతుందో చెప్పలేకపోతోందన్న ఆగ్రహం కనిపిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం గందరగోళంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనకు ఏడాది దగ్గరపడి, విజయోత్సవాలు ప్రారంభమైనా.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అదిగో, ఇదిగో అంటూ ప్రకటనలు వెలువడినా.. ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందంటూ ప్రకటనలు వచ్చాయి. పండుగ దాటి 20 రోజులు గడుస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 ఇళ్లను ఈ ఏడాది నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నిర్మించడం ఏమోగానీ, మంజూరైనా చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కారు తొలి ఏడాది కరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హడావుడిగా దరఖాస్తులు స్వీకరించినా..
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత ఏడాది డిసెంబర్–జనవరిలలో ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందాయి. దీనిలో రేషన్‌కార్డు లేని 30లక్షల దరఖాస్తులను పక్కనబెట్టిన అధికారులు.. మిగతా 50 లక్షల దరఖాస్తులను స్రూ్కటినీ చేయాలని నిర్ణయించారు. కానీ ప్రక్రియ ముందుకు కదలలేదు. ఏడాది అవుతుండటంతో దరఖాస్తులు దుమ్ముకొట్టుకుపోతున్నాయి.
ఉత్తర్వులు వెలువడి ఎనిమిది నెలలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. మంత్రులందరినీ వెంటబెట్టుకుని అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంతో.. పథకం పట్టాలెక్కినట్టే అనే భావన అప్పట్లో నెలకొంది. ఇది జరిగి ఎనిమిది నెలలైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు.
ఎన్నికల కోడ్ ముందుండగా..
భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడానికి మూడు నెలల ముందే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. పథకాన్ని ప్రారంభించే నాటికే లబ్ధిదారుల జాబితా రూపొందించి ఉంటే... భద్రాచలం వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించే వీలుండేది. అదే జరిగితే కొంత మేరకైనా ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేది. అయితే భద్రాచలం సభ ముగిసిన వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి.. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను చేపట్టలేని పరిస్థితి నెలకొంది. నిజానికి ఎన్నికల కోడ్ వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, అయినా దరఖాస్తుల స్రూ్కటినీ చేపట్టకుండా కాలయాపన చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఊసే లేని గ్రామ సభలు
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే ఉంటుందని మార్చిలో విడుదల చేసిన మార్గదర్శకాల ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు గ్రామసభల ఊసే లేదు. దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అర్హుల జాబితా ఆధారంగా గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులకు కూడా ఎలాంటి స్పష్టత లేకపోవటంతో యావత్తు పథకం నిర్వహణ గందరగోళంగా మారింది. మరోవైపు గ్రామసభలతో సంబంధం లేని ఇందిరమ్మ కమిటీల ఎంపికను మాత్రం హడావుడిగా చేపట్టడం గమనార్హం. ఈ కమిటీలు కూడా నెల రోజులుగా చేసే పనేమీ లేక ఖాళీగా ఉండిపోయాయి.
50 లక్షల దరఖాస్తులు... ఇంటింటి వెరిఫికేషన్ జరిగేదెప్పుడు?
పేదల ఇళ్ల పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని.. లేకుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులను ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఆ మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆవాస్ యోజన నిధులను విడుదల చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర నిధులను రాబట్టాలని, మార్గదర్శకాలు పాటించాలని కాంగ్రెస్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది.
అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి, వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. అలా 50 లక్షల దరఖాస్తులను వెరిఫై చేసే బాధ్యతను సుమారు 13 వేల మంది గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. మొదలైనా దాదాపు రెండున్నర నెలల సమయం పడుతుందని అంచనా. అంటే వచ్చే ఫిబ్రవరికి గాని అర్హుల జాబితా సిద్ధం కాదు.
ఇక ఆ జాబితాలలో ఏవైనా లోపాలుంటే పరిశీలించి సరిదిద్దాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తారని సమాచారం. దాని కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చివరగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి గానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment