Indiramma housing scheme
-
ఇందిరమ్మ ఇంటికి కటాఫ్.. 1994
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటికే ఓ పర్యాయం పేదల కోసం ప్రభుత్వం కట్టిచ్చే ఇంటిని పొందిన వారు ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదు’అని ఇటీవలే స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానికి చిన్న సవరణ చేసింది. 1994 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. 1994కు ముందు ప్రభుత్వ పథకంలో ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ కటాఫ్ సంవత్సరం తర్వాత ప్రభుత్వం నుంచి పేదల ఇంటిని పొందిన వారు మాత్రం ఇందిరమ్మ పథకానికి అనర్హులవుతారు. ఆ ఇళ్లు శిథిలమై ఉంటాయన్న ఉద్దేశంతో.. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టి సాచురేషన్ పద్ధతిలో ఇళ్లను మంజూరు చేశారు. 2004 నుంచి పదేళ్ల కాలంలో తెలంగాణలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అప్పట్లో ఈ ఇళ్లను పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవటానికి వీలు లేదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ పథకం కింద ఇల్లు పొందిన వారి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున, ఆ లబ్ధిదారులకు మళ్లీ ఇల్లు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకు నే అవకాశం ఉంది. ఆధార్ నంబర్‌తో కూడా ఆ వివరాలను అనుసంధానించినందున వడపోత సులభంగా జరుగుతుంది.అంతకుముందు వరకు ప్రభుత్వ పక్షాన ఇలా ఉధృతంగా ఇళ్ల నిర్మాణం జరిగేది కాదు. పరిమిత సంఖ్యలో ఇళ్లను నిర్మించేవారు. 1995కు పూర్వం అర్బన్ పర్మనెంట్ హౌసింగ్, రూరల్ పర్మనెంట్ హౌసింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందేది. ఆ సమయంలో గ్రామాల్లో వ్యక్తిగత పెంకుటిల్లు నిర్మించి ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యక్తిగత ఇళ్లను నిర్మించారు. అప్పట్లో కేంద్ర ప్రభు త్వం కూడా ఇందిరమ్మ ఆవాస్ యోజన పేరుతో పేదల ఇంటికి ఆర్థిక సాయం అందించింది.ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ ఇళ్లు పెంకులతో కూడినవి కావటం, 30 ఏళ్ల సమయం అవటం.. వెరసి అవి శిథిలావస్థకు చేరి ఉంటాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించినందున, వీరిని కూడా అర్హుల జాబితాలో చేర్చింది. 1994కు ముందు అలా ఇల్లు పొందిన వారు కూడా అర్హులవుతారు. ఇప్పటికీ ఆ ఇళ్లలోనే ఉంటున్నవారూ దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. -
హైదరాబాద్‌లోనే ఎక్కువ..!
సాక్షి, సిటీబ్యూరో: సొంత స్థలాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సంబంధిత అధికారులు ఆ పనుల్లో పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే జిల్లాలు నాలుగున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంది. ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏ జిల్లా పరిధిలో ఎందరున్నారో ప్రజాపాలన కార్యక్రమాల్లో అందిన దరఖాస్తుల్ని లెక్కలు తీశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనే జీహెచ్ఎంసీ వార్డులు కూడా ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. తర్వాత మేడ్చల్ జిల్లాలోని వారు ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల వంతున జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థికసాయం అందనుంది. సర్వేయర్లకు సహకారం.. దరఖాస్తుదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి ‘ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్’లో వివరాలు నమోదు చేసేందుకు సర్వేయర్లుగా జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు ఆయా జిల్లాల సిబ్బంది పని చేయనున్నారు. క్షేత్రస్థాయిలో లబి్ధదారుల చిరునామాను గుర్తించేందుకు జిల్లాల సిబ్బందికి, కంటోన్మెంట్ సిబ్బందికీ జీహెచ్ఎంసీ సర్కిళ్లలో పనిచే స్తున్న యూసీడీ, ఎంటమాలజీ విభాగాల సిబ్బందితోపాటు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు,తదితరులు సహకరించనున్నారు. మొబైల్ యాప్‌లో వివరాల నమోదు, అప్డేషన్ల కోసం జీహెచ్ఎంసీ జోనళ్లస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
ఇంటి పెద్ద, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే, పదేళ్ల తర్వాత ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పుతో అస్తవ్యస్త పరిస్థితుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. మేం క్రమంగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారు. పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి. అలాగే వదిలేస్తే ఎవరికీ మంచిది కాదు.లేనిపక్షంలో వారిని నియంత్రించేందుకు చివరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ అప్లికేషన్‌ను పలువురు మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. హోమ్ వర్క్ చేయని విద్యార్థుల్లా..‘కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే.. అప్పుల కుప్పగా మార్చి అప్పుల మిత్తి కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితికి దిగజార్చిన రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను ఏడాదిలో మేము చేసి చూపుతున్నాం. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు.. హోమ్ వర్క్ చేయని విద్యార్థులు, హోమ్ వర్క్ చేసిన వారి పుస్తకాల్లోని కాగితాలను చింపేసిన తరహాలో వ్యవహరిస్తున్నారు. మేము చేసే మంచి పనుల లబ్ధి ప్రజలకు చేరకుండా వారు మారీచ సుబాహుల తరహాలో అడ్డుపడుతున్నారు. మా పాలన కూడా వారి తరహాలోనే ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ పంథాను కేసీఆర్ మార్చేశారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చొరవ చూపేందుకు వీలు కలి్పంచారు. ఆ పంథాను కేసీఆర్ మార్చేశారు. భారత్, పాకిస్థాన్ సైనికులు ఎదురుపడితే కాల్పులు జరుపుకొంటున్న చందంగా పాలక, ప్రతిపక్షాల మధ్య శత్రుత్వాన్ని పెంచారు.ప్రజాతీర్పును గుర్తించి ఇప్పటికైనా కేసీఆర్ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేకతకు నిజామే తలవంచారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ ఇంకా గుర్తిస్తున్నట్టు లేదు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. శాసనసభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. తన సీనియారిటీకి అనుగుణంగా విలువైన సూచనలు ఇవ్వాలి. మేమంతా ఎదుగుతున్న నేతలమే.. మా మంత్రులు తుమ్మల, జూపల్లి లాంటి వారు తప్ప మిగతా వారమంతా ఎదుగుతున్న నేతలమే. సభలో ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచటం సరికాదు. కేసీఆర్ పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ సూచనలతో మార్గదర్శనం చేయాలి. మా ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచి పనులను గుర్తించాలి. ఏడాది పూర్తయిన సందర్భంగా చేస్తున్న విజయోత్సవాల్లో పాల్గొనాలి. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి మంత్రి పొన్నం ద్వారా ఆహ్వానాలు పంపుతాం. కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హాజరుకావాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. పేదల ఇళ్లకు రూ.5 లక్షలిస్తున్నది తెలంగాణ ఒక్కటే.. ‘పేదల ఇళ్ల నిర్మాణ పథకానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. పేదలు పక్కా ఇంటిని కలిగి ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరాగాంధీ చేశారు. దేశంలో గుడి లేని ఊరుంటుందేమో గానీ ఇందిరమ్మ కాలనీ లేని పల్లె ఉండదనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ భూముల సీలింగ్ యాక్టు ద్వారా భూములు సేకరించి పేదలకు పంచిన ఆమె, వారి సొంతింటి కలను నిజం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. నిరుపేదల జాడ తేల్చే యాప్ పేదల్లో అతి పేదలకు ఇళ్లు దక్కేలా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధునికతను వినియోగించుకుంటున్నాం. ఆ దిశలోనే ఇప్పుడు నిరుపేదల జాడ తేల్చేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. అర్హులకే లబ్ధి కలిగేలా, అక్రమాలు లేకుండా దీన్ని వినియోగిస్తాం. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారికి సొంతింటి లబ్ధి కలిగేలా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయిస్తాం. ప్రస్తుతం ప్రకటించిన కోటాతో ప్రమేయం లేకుండా వారికి ఇళ్లను ఇస్తాం. లబ్ధిదారులకు స్తోమత ఉంటే ఇంటిని విస్తరించుకోవచ్చు..’ అని రేవంత్ తెలిపారు. ఎంత భారం అయినా నిధులిస్తాం: భట్టి నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సొంత పక్కా ఇంటిని సమకూర్చాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టామని, ఎంత భారమైనా దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నా.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.22,500 కోట్ల నిధులను మాత్రం సమకూర్చి తీరతామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం సమకూర్చటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. అతిపేదలకు సొంతిల్లే లక్ష్యం: పొంగులేటి పేదల్లో అతి పేదలకు సొంతింటిని సమకూర్చటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు అందిన లక్షల దరఖాస్తుల్లో అతిపేదలు, నిరుపేద వితంతువులు, వికలాంగులను గుర్తించి ఇళ్లను అందిస్తామని చెప్పారు. ఈ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. యాప్‌ను ఆవిష్కరించిన తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను, డిజైన్లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన సీఎం ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని సూచన సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం లోపల ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం తన చాంబర్ నుంచి నడుచుకుంటూ నేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలానికి వచి్చన సీఎం.. విగ్రహం ముందు గ్రీనరీ పనులు, భారీ ఫౌంటైన్, ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సిస్టం పనితీరు గురించి ఆరా తీశారు. గేటు–2, గేటు 4లను అనుసంధానిస్తూ వేస్తున్న రోడ్లను చూశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం పంచేలా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు.గేటు–4 పక్కన ప్రధాన గేటు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ విగ్రహావిష్కరణకు ముందురోజే పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విగ్రహం ఏర్పాటులో ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటూ జరగకూడదని, విగ్రహాన్ని తెచ్చేటప్పుడు, వేదికపై ఏర్పాటు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడ పని చేస్తున్న కూలీలతో కూడా రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ , టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వారికే ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేస్తామని.. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు.‘‘ఇళ్ల విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబి్ధదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనకరమైన పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందని చెప్పింది. అలాంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, ఏ ఉద్దేశం మేరకు పథకం ప్రారంభించారో.. దానికి విరుద్ధంగా అమలు జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు స్వేచ్ఛనిచి్చంది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద తొలిదశలో 4,50,000 గృహాలను నిర్మించాలని, లబి్ధదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి 2024, అక్టోబర్ 11న జీవో 33 జారీచేశారు. స్థానికులతో ఈ కమిటీలను కలెక్టర్ ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి కమిటీ చైర్మన్‌గా ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో ముగ్గురు (ఒక బీసీ, ఒక ఎస్సీ లేదా ఎస్టీ తప్పనిసరి) సభ్యులుగా ఉంటారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ జీవోను సవాల్ చేస్తూ ఏలేటితోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇటీవల వెలువరించారు. పారదర్శకంగానే అమలు: ఏఏజీ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధం. ఇష్టం వచ్చిన వారిని, పార్టీలకు చెందిన కార్యకర్తలను సభ్యులుగా నియమించే ప్రమాదం ఉంటుంది. గ్రామ సభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం సరికాదు. ఈ కమిటీలను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో ఇళ్లు లేని వారి కోసం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలున్నా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేస్తారు. ఆవాస్ ప్లస్ 2024 యాప్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాకే ఎంపిక జరుగుతుంది. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ సాగుతోంది. ఈ పిటిషన్లను కొట్టివేయాలి’అని చెప్పారు.గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు.. ‘పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 6(8) ప్రకారం లబ్దిదారుల ఎంపికకు గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు. ఈ కేసులో పంచాయతీలో కార్యదర్శి, మున్సిపల్ వార్డులో వార్డుస్థాయి అధికారి ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తారు. యాప్‌లో కుటుంబంతోపాటు ఆదాయ వివరాలను నమోదు చేస్తారు. అర్హత ప్రమాణాల ప్రకారం లబ్దిదారులను నిర్ధారిస్తారు. పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. యాప్, కమిటీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఇలా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నచి్చన వారిని కమిటీలు ఎంపిక చేసుకుంటాయని, పిటిషనర్లు భయపడటం అర్థంలేనిది’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
విజయోత్సవానికి రెడీ.. ఏడాదైనా గూడేది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్న సందర్భంగా ‘ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల’ పేరిట సంబురాలకు శ్రీకారం చుట్టింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజయోత్సవాలు సరే.. ఈ ఏడాదిలో సొంత గూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఎందరు బడుగులకు ఇళ్లు ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు పేదలకు ఒక్క ‘ఇందిరమ్మ’ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో అదిగో అనడమే తప్ప.. పేదలకు ‘గూడు’ఎప్పటివరకు దక్కుతుందో చెప్పలేకపోతోందన్న ఆగ్రహం కనిపిస్తోంది.సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం గందరగోళంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనకు ఏడాది దగ్గరపడి, విజయోత్సవాలు ప్రారంభమైనా.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అదిగో, ఇదిగో అంటూ ప్రకటనలు వెలువడినా.. ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందంటూ ప్రకటనలు వచ్చాయి. పండుగ దాటి 20 రోజులు గడుస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 ఇళ్లను ఈ ఏడాది నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నిర్మించడం ఏమోగానీ, మంజూరైనా చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కారు తొలి ఏడాది కరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హడావుడిగా దరఖాస్తులు స్వీకరించినా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత ఏడాది డిసెంబర్–జనవరిలలో ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందాయి. దీనిలో రేషన్‌కార్డు లేని 30లక్షల దరఖాస్తులను పక్కనబెట్టిన అధికారులు.. మిగతా 50 లక్షల దరఖాస్తులను స్రూ్కటినీ చేయాలని నిర్ణయించారు. కానీ ప్రక్రియ ముందుకు కదలలేదు. ఏడాది అవుతుండటంతో దరఖాస్తులు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఉత్తర్వులు వెలువడి ఎనిమిది నెలలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. మంత్రులందరినీ వెంటబెట్టుకుని అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంతో.. పథకం పట్టాలెక్కినట్టే అనే భావన అప్పట్లో నెలకొంది. ఇది జరిగి ఎనిమిది నెలలైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎన్నికల కోడ్ ముందుండగా.. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడానికి మూడు నెలల ముందే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. పథకాన్ని ప్రారంభించే నాటికే లబ్ధిదారుల జాబితా రూపొందించి ఉంటే... భద్రాచలం వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించే వీలుండేది. అదే జరిగితే కొంత మేరకైనా ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేది. అయితే భద్రాచలం సభ ముగిసిన వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి.. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను చేపట్టలేని పరిస్థితి నెలకొంది. నిజానికి ఎన్నికల కోడ్ వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, అయినా దరఖాస్తుల స్రూ్కటినీ చేపట్టకుండా కాలయాపన చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊసే లేని గ్రామ సభలు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే ఉంటుందని మార్చిలో విడుదల చేసిన మార్గదర్శకాల ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు గ్రామసభల ఊసే లేదు. దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అర్హుల జాబితా ఆధారంగా గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులకు కూడా ఎలాంటి స్పష్టత లేకపోవటంతో యావత్తు పథకం నిర్వహణ గందరగోళంగా మారింది. మరోవైపు గ్రామసభలతో సంబంధం లేని ఇందిరమ్మ కమిటీల ఎంపికను మాత్రం హడావుడిగా చేపట్టడం గమనార్హం. ఈ కమిటీలు కూడా నెల రోజులుగా చేసే పనేమీ లేక ఖాళీగా ఉండిపోయాయి. 50 లక్షల దరఖాస్తులు... ఇంటింటి వెరిఫికేషన్ జరిగేదెప్పుడు? పేదల ఇళ్ల పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని.. లేకుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులను ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఆ మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆవాస్ యోజన నిధులను విడుదల చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర నిధులను రాబట్టాలని, మార్గదర్శకాలు పాటించాలని కాంగ్రెస్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది. అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి, వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. అలా 50 లక్షల దరఖాస్తులను వెరిఫై చేసే బాధ్యతను సుమారు 13 వేల మంది గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. మొదలైనా దాదాపు రెండున్నర నెలల సమయం పడుతుందని అంచనా. అంటే వచ్చే ఫిబ్రవరికి గాని అర్హుల జాబితా సిద్ధం కాదు. ఇక ఆ జాబితాలలో ఏవైనా లోపాలుంటే పరిశీలించి సరిదిద్దాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తారని సమాచారం. దాని కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చివరగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి గానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ‘ఇందిరమ్మ గృహ’ వసతి అందే సూచనలు కనిపించటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి ఒకరోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదనే స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలినట్టు సమాచారం. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. లక్ష ఇళ్లపైనే దృష్టి: ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తి కావని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తొలుత ఆ లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియ కాస్తా పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి కూడా వానాకాలం కొనసాగనున్నందున అక్టోబర్ తర్వాత గాని ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల్లో అర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోపు కొన్ని ఇళ్లకే పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు లక్ష ఇళ్లకే నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. నిధులు సిద్ధం! లక్ష ఇళ్లకు రూ.5 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ప్రస్తుతం రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి కిస్తీగా రూ.1,000 కోట్లు మంజూరవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వెరసి రూ.2,500 కోట్లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ఇళ్లే ఇచ్చినా ఎక్కువ శాతం కన్పించేలా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలుత చిన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో తక్కువ ఇళ్లనే అందించినా.. ఆ గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇళ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం ఇళ్లను కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. అదే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఇచ్చే ఇళ్ల సంఖ్యను, ఆ ప్రాంత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఇళ్లు కేటాయించినట్టుగా కన్పిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకునే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కేసులో పునర్విచారణ కీలక మలుపు తిరిగింది. 2015లో సీఐడీ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు ఫైలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (వీ అండ్ ఈ) కోర్టుకు చేరింది. తమ విచారణలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దర్యాప్తు చేసి నివేదికివ్వాలని సీఐడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు లేఖ రాశారు. ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తు 36 గ్రామాల్లోనే సాగింది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో విచారణ జరిపేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 2009 తర్వాత ఎంతమంది బిల్లులు పొందారు.. ఏ మేరకు అక్రమాలు జరిగాయి? పాత్రధారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అనే వివరాలనూ ఆరాతీయనుంది. కాగా, విజిలెన్స్ విచారణ అంశాలను బట్టి తాము చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని, దర్యాప్తులో ఎదురయ్యే అంశాలను బట్టి ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదుకు విజిలెన్స్ సిఫారసు చేస్తుందని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. -
దేవుడి పేరుతో నాటకం.!
నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): తాను కోరిన ధరకు ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని విక్రయించలేదనే అక్కసుతో ఒక నాయకుడు ఆ ఇంటి స్థలం ముందు దేవుడు వెలిసాడనే నాటకాన్ని మొదలు పెట్టడంతో బాధితురాలు లబోదిబోమంటుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలతో వ్యాపారం చేసే భూ భకాసురుల ఆగడాలకు అంతులేకుండా పోతుందనేందుకు దేవునిపేరుతో జరుగుతున్న నాటకమే నిదర్శనం. మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్లాట్లను కేటాయించారు. కొంత మంది ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగులేక పోవడంతో ఇంటి నిర్మాణాలను మధ్యలోనే నిలపివేశారు. అయితే ఈ కాలనీలో ఉండే కొందరు నాయకులు యథేచ్ఛగా ఇంటి స్థలాలను, నిర్మించిన ఇండ్లను కొనుగోలు చేసి విక్రయించడం చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎక్కువ ధరకు విక్రయించి తమ జేబులు నింపుకుంటున్నారు. అయితే ఇటీవల లక్ష్మి అనే మహిళ తనకు కేటాయించిన స్థలంలో ఆమె పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసింది. అంతలోనే ఆమె దత్తత తీసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసింది. అయితే ఈ సమయంలో ఓ నాయకుడు ఆమెను ఇందిరమ్మ ప్లాట్‌ను విక్రయించాలని వత్తిడి చేశాడు. దీనికి సదరు మహిళ అంగీకరించకపోవడంతో తనకు ప్లాట్ దక్కడం లేదని కక్ష పెంచుకున్నాడు. రాత్రికి రాత్రే బాధిత మహిళకు సంబంధిచిన ప్లాట్‌లో ఉన్న చెట్టుకింద బండరాయిని పాతించి దేవుడు వెలిసినట్లు తెల్లవారు పూజలు జరిపించారు. ఆలయం ఉన్నచోట ఇంటి నిర్మాణం చేయరాదనే భయాన్ని సృష్టించాడు. అయితే తనకు స్థలంను కేటాయించిన సమయంలో ఎలాంటి దేవుని విగ్రహం లేదని తాను ప్లాటును విక్రయించడానికి అంగీకరించకపోవడంతోనే తనపై కోపంతో నాటకం ఆడుతున్నారని ఆ మహిళ ఆరోపిస్తోంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా నిలువాల్సిన వారు ప్లాటుపై కన్నేసి దేవుని పేరుతో నాటకం ఆడటాన్ని ఆమె దుయ్యట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల విషయంలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దేవుడు వెలిశాడని వేధిస్తున్నారు.. నాకు ఇందిర మ్మ ఇంటి స్థ లం కేటాయించినప్పుడు ఎ క్కడ కూడా దే వుని విగ్రహం లేదు. ఇంటి ప్లాట్‌ను విక్రయించడా నికి అంగీకరించకపోవడంతో కొంద రి ప్రోద్బలంతో కాలనీలోని ఒక నా యకుడు దేవుడు వెలిసినట్లు నాట కం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో బాధల్లో ఉన్న నాకు ఎవరు దిక్కు. అధికారులు స్పందించి దీనిపై విచా రణ జరిపించాలి. – లక్ష్మి,ఇందిరమ్మ లబ్ధిదారు, మోర్తాడ్ -
గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత!
-
గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత!
సాక్షి, అమరావతి: ఈ రోజుల్లో టీవీలు లేని ఇళ్లు ఎక్కడున్నాయి? కాయకష్టం చేసే పేదలైనా, కాలు కదపని ధనికులైనా వినోదంతో సేదతీరే సాధనం అది. ఇప్పుడదే పేదలకు శాపంగా మారుతోంది. గూడులేని పేదల సొంతింటి కలను సర్కారు నీరుగారుస్తోంది. గుడిసెల్లో నివసించే వారికి చిన్నపాటి టీవీ ఉన్నా సరే ఉన్నత వర్గాల గాటన కట్టేస్తోంది. టీవీ, ద్విచక్రవాహనం, ఫ్రిజ్‌లలో ఏ ఒక్కటి ఉన్నా వారిని ప్రభుత్వం పక్కా ఇళ్లకు అనర్హులుగా తేల్చేసింది. గుడిసెల్లో ఉంటున్న 10.92 లక్షల పేద కుటుంబాల సొంతింటి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. 1/3 వంతు పేదల ఏరివేత రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 31.52 లక్షల కుటుంబాలు సొంతిం టి కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిం చిన ప్రజా సాధికార సర్వేలో తేలింది. గుడిసెల్లో నివాసముంటున్న వీరం దరికీ గృహ నిర్మాణ పథకం కింద పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రకరకాల పేరుతో 1/3 వంతు మందిని ఏరివేసి అనర్హులుగా చెబుతోంది. గుడిసెల్లో నివసిస్తున వారిలో దాదాపు పది లక్షల మందిని పక్కా ఇళ్లకు అనర్హులుగా నిర్ధారించినట్లు సమాచార, ప్రసార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు సైతం కొద్ది రోజుల కిత్రం అధికారులతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. అవి లేని ఇళ్లున్నాయా? ప్రజా సాధికార సర్వే ఆధారంగా గుడిసెల్లో నివాసముంటున్న 10.92 లక్షల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత వర్గాలుగా పేర్కొంది. వారు ప్రభుత్వం ఇచ్చే సొంతింటికి అనర్హులని తెలిపింది. దీనికి సర్కారు చెబుతున్న కారణం వారు టీవీ, ద్విచక్రవాహనం, ఫ్రిజ్ లాంటివి కలిగి ఉండటం. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఇలాంటి వస్తువులు కనిపిస్తున్నాయి. స్తోమత లేనివారు పాతవి కొనుగోలు చేయటం లేదంటే ఎవరైనా ఉదారంగా ఇచ్చినవి వాడుకోవటం చేస్తున్నారు. ఇవి ఉన్నాయనే కారణాలతో తమను అనర్హులుగా ప్రకటించటంపై పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన సర్వేలో సొంతిళ్లు లేవని నిర్థారించిన తరువాత అనర్హులుగా పేర్కొనటం ఏమిటని మండిపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకూ బిల్లులివ్వలేదు.. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరై నిధుల కొరత కారణంగా 2.60 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్లో ఆగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం గతంలో గుర్తించింది. వీటిని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధర రూ.70 వేలుకు అదనంగా మరో రూ.25 వేలు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా ‘ఇందిరమ్మ’ ఇళ్ల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు పేదలు నిర్మించుకునే ఇళ్లకు యూనిట్ ధరను రూ.70 వేలు నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసిన వాటిలో 1.12 లక్షల ఇళ్లు, ఇందిరమ్మ పథకం కింద మంజూరై వివిధ దశల్లో ఆగిపోయిన వాటిలో 10,426 ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇటీవల ప్రకటించారు. అయితే వీటిలో ఏ ఒక్క ఇంటికి కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. -
గూడు..గోడు
- గ్రామీణ గృహ నిర్మాణాల్లో నిర్లిప్తత - టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకే గృహాలు - వాటినీ పూర్తి చేయించని వైనం - ఈ నెలాఖరులోపు లక్ష్యసాధన అసాధ్యం - నిరుపేదలు పూరి గుడిసెల్లో మగ్గుతున్నా పట్టించుకోని యంత్రాగం ఆళ్లగడ్డ : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! భూమి ధరలకు రెక్కలు తొడుగుతున్న వేళ.. భవన నిర్మాణ సామగ్రి, కూలి రేట్లు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పేదల సొంతింటి కల సాకారం కావడం కష్టసాధ్యంగా మారింది. అందుకే అందరూ ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్లుగా గృహ నిర్మాణ పథకం చతికిల పడింది. టీడీపి ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ పథకానికి పేరు మార్చి.. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంగా నామకరణం చేసింది. అలాగే పట్టణ ప్రజల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అందరికీ ఇళ్లు) అమలు చేస్తున్నారు. 2016 –17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 17,255 ‘ఎన్టీఆర్ గృహాలు’ మంజూరు చేశారు. వీటికి పూర్తి స్థాయిలో ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. పథకంపై లబ్ధిదారుల్లో అవగాహన లేకపోవడంతో పాటు గతంలో ఇళ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలకు పట్టాలు పొందిన వారి జాబితాలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు 3,803 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 1,808 ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికీ మొదలుపెట్టలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 –18), వచ్చే ఏడాది (2018– 19)కి కలిపి జిల్లాకు మొత్తం 28,600 ఇళ్లు మంజూరయ్యాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు అదనంగా మరో మూడు వేల గృహాలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 14,300 గృహాలు గత ఏడాది ఆగస్టులోనే మంజూరయ్యాయి. అయితే.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, జాబితాలు ఉన్నతాధికారులకు చేరేసరికి నెలలు పట్టింది. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల అనుయాయులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ‘అందరికీ ఇళ్లు’ పథకం దరఖాస్తులు పూరించడంలోనూ ప్రజలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గడువులోగా సాధ్యమేనా? గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 లక్షల చొప్పున అందిస్తోంది. మంజూరు చేసిన గృహాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇప్పటి వరకు 2017– 18 ఆర్థిక సంవత్సరానికి గాను 4,196 మంది, 2018 – 19కి గాను 1,123 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. వారు నిర్మాణాలు మొదలు పెట్టినట్లు రికార్డుల్లో నమోదైంది. లక్ష్యసాధనకు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోపు మిగిలిన 23,281 గృహాలను పూర్తిచేయడం సాధ్యమయ్యే పని కాదు. ‘ధరా’ఘాతం ప్రస్తుతం గృహ నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయి. నిబంధనల ప్రకారం కనిష్టంగా 200 చదరపు అడుగులు, గరిష్టంగా 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే గృహ నిర్మాణాలు చేపట్టాలి. అయితే..చాలామంది లబ్ధిదారులు అంతకంటే ఎక్కువ స్థలంలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ప్రభత్వం అందిస్తున్న రూ.1.50 లక్షల కంటే ఎక్కువ వ్యయమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు పూర్తవ్వగానే నిర్మాణాలు నిలిపివేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. లేదంటే అప్పు చేసి కట్టుకోవాలి. మూడు వేల గృహాలు ఏవీ? మంత్రి అఖిలప్రియ వైఎస్సార్సీపీ నుంచి అధికార పార్టీలో చేరిన సమయంలో అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనంగా వెంటనే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మూడు వేల పక్కా గృహాలను ప్రత్యేకంగా మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం నుంచి మంజూరు చేసినవాటికి తోడు అదనంగా మూడు వేల గృహాలు మంజూరైతే చాలామందికి ఇళ్లు దక్కుతాయని నిరుపేదలు ఆశపడ్డారు. అయితే..వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. అఖిలప్రియ పార్టీ మారి ఏడాది దాటినా, మంత్రి పదవి కూడా చేపట్టినా అదనంగా మంజూరు చేయిస్తానన్న మూడువేల ఇళ్ల మాట ఎత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
తమ్ముళ్ల నయాదందా!
ఇందిరమ్మ లేఅవుట్పై కన్ను! కార్యకర్తలకే పట్టాలు ఇప్పించేందుకు గూడుపుఠాణి ఇంటి పట్టాలు అమ్ముకుని రూ.లక్షలు గడిస్తున్న వైనం పేదల సొంతింటి కల చెదిరిపోనుంది. మూడేళ్లుగా ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వని టీడీపీ ప్రజా ప్రతినిధులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లే అవుట్‌పై కన్నేశారు. ఇందులోని ఖాళీ ప్లాట్లను టీడీపీ కార్యకర్తలకే దక్కేటట్లు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారులకు నియోజకవర్గ ప్రధాన నేత మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. - కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంలోని ఐదుకల్లు రోడ్డు, శెట్టూరు రోడ్డులో 2010లో సర్వే 384, 385, 386 ,498–1 భూముల్లో 18 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కొనగోలు చేసి ఇందిరమ్మ లేఅవుట్ కింద 1,154 ప్లాట్లను వేసి అర్హులైన పేదలకు స్థలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో ఏడాది క్రితం నాలుగు వందల ప్లాట్లు ఖాళీగా ఉండగా, మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారుల సర్వేలో 288 మాత్రమే ఖాళీగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందకు పైగా ప్లాట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు పట్టాలు పొంది, ఒక్కొక్కటి రూ. 1లక్షకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ స్థలాలను తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకెళ్తున్నారు. అర్హుల పేరుతో దోపిడీ ఎలాగో తమ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వదన్న భావన బలంగా ఉన్న టీడీపీ నేతలు... ఇందిరమ్మ లే అవుట్లపై కన్నేశారు. ఈ లే అవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను తమ అనుయాయులకు ఇప్పించేందుకు ఆ పార్టీ ప్రధాన నేతలు గూడుపుఠాణీ చేస్తున్నారు. అర్హులకు ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు బాహటంగా చూపుతూ.. లోలోన టీడీపీ కార్యకర్తలకే పట్టాలు దక్కేటట్లు పావులు కదిపారు. ఇంటి పట్టాల కోసం 650 దరఖాస్తులు అందగా, ఇందులో 125 మందికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు అధికారుల విచారణలో తేలడం గమనార్హం. అనర్హులకు ఇస్తే సహించం ఇందిరమ్మ లే అవుట్లో టీడీపీ నాయకులకే పట్టాలిచ్చి పేదలకు అన్యాయం చేస్తే సహించం. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల ప్రకారం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పోరాటాలు చేస్తాం. – నాగరాజు, ఎంఆర్పీఎస్ నాయకుడు, కళ్యాణదుర్గం సత్తా ఇంటే భూమి కొని పట్టాలివ్వండి అర్హులకు ఇంటి పటాలిస్తే తప్పుపట్టం. అయితే అనర్హులైన వారికి ఇందిరమ్మ లే అవుట్లో అక్రమంగా పట్టాలిస్తే ఊరుకోం. టీడీపీ నేతలకు సత్తా ఉంటే భూమి కొనుగోలు చేసి ఎన్టీఆర్ కాలనీ పేరు పెట్టి పట్టాలిస్తే అభ్యంతరం లేదు. – బోయ నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు, కళ్యాణదుర్గం న్యాయపోరాటానికి సిద్ధం టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇందిరమ్మ లే అవుట్లో ప్లాట్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించకపోతే న్యాయం పోరాటం చేస్తాం. – బిక్కి హరి, వైఎస్సార్సీపీ నాయకుడు, కళ్యాణదుర్గం సిఫార్సులకు తలొగ్గామనడం సబబు కాదు అధికార పార్టీ నేతల సిఫార్సులకు తలొగ్గామని చెప్పడం సబబు కాదు. అనర్హులకు పట్టాలిస్తారని విమర్శించడం సరైందికాదు. దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టి అర్హులను గుర్తించి వారికే పట్టాలు అందజేస్తాం. – రవీంద్ర, తహసీల్దార్, కళ్యాణదుర్గం -
చిత్తశుద్ధి కనుమరుగు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నా’నని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిండు సభలో చెప్పారు. గత నెల 29న నల్లజర్ల మండలం పోతవరంలో నిర్వహిం చిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఒక్కటి కూడా లేదని.. ఇది జిల్లాకే కాదు రాష్ట్రానికీ గర్వకారణమని ఘనంగా చెప్పారు. వాస్తవంలోకి వెళితే.. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఇంకా వేల సంఖ్యలోనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే 7,877 మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పనుల ప్రారంభానికే నోచుకోని మరుగుదొడ్లు 1,700 ఉన్నాయి. అవి అధికారులు చెబుతున్న గణాంకాలు మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే.. ప్రతి మండలంలోనూ కనీసం 1,000 నుంచి 1,500 వరకూ మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయని అంచనా. అయితే, ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో గణాంకాల్లో మాయచేసి అన్నిచోట్లా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిపోయినట్టు చూపించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మంజూరైనవి 1.81లక్షల యూనిట్లు జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను మినహాయిస్తే.. 46 మండలాల్లో 1,81,179 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.262.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 22,954 మరుగుదొడ్లు పూర్తి చేశారు. మొత్తం కలుపుకుని 1,71,602 నిర్మాణాలు పూర్తయ్యాయి. 7,877 యూనిట్లు నిర్మాణంలో ఉండగా.. 1,700 యూనిట్ల నిర్మా ణం ఇంకా మొదలు కాలేదు. ఒక్క చింతలపూడి మండలంలోనే 2,938 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా 67 అసలు ప్రారంభం కాలేదు. లింగపాలెం మండలంలో 1,605, గోపాలపురంలో 561, పోడూరులో 705, టి.నర్సాపురంలో 800 నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. ఎక్కడైతే వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారో ఆ నల్లజర్ల మండలంలోనే ఇంకా 310 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా, 165 యూనిట్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. ఏలూరు, భీమవరం, పాలకోడేరు మినహా ఏ మండలంలోనూ వంద శాతం లక్ష్యం చేరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద 2019 మార్చికి వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలని నిర్దేశించింది. జిల్లాలో మాత్రం 2017 మార్చికి పూర్తి కావా లని జిల్లా కలెక్టర్ లక్ష్యం నిర్దేశించి ఆ దిశగా యంత్రాంగాన్ని ముందుకు నడిపారు. తరచూ దీనిపై సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ఎంపీడీవోలు జనవరి నుంచి మార్చి వరకూ నిర్మాణాలన్నీ పూర్తయినట్టు చూపించి కొన్ని పేర్లను జాబితాల నుంచి తొలగించారు. ఈ విధంగా మూడు నెలల్లో 25 శాతం వరకూ పేర్లను తొలగించి లక్ష్యం పూర్తయినట్టుగా చూపించారనే ఆరోపణలున్నాయి. అన్ని మండలాల్లో ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తే మండలానికి వెయ్యి నుంచి రెండు వేల వరకూ మరుగుదొడ్లు లేని ఇళ్లు కనపడతాయని అధికారులే పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ముఖ్య మంత్రి వద్ద మెప్పు కోసం తమపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. స్కీం అయిపోయిందన్నారు మాది గోపాలపురంలోని కుమ్మరకుంట గ్రామం. వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయాలని అధికారులను అడిగితే.. స్కీం అయిపోయిందని చెప్పారు. మళ్లీ పథకం వచ్చినప్పుడు కట్టుకుందురు గాని అంటున్నారు. మల విసర్జనకు ఆరబయటకు వెళ్లాలి వస్తోంది. మా కాలనీలో 30 ఇళ్లు ఉండగా.. 6 ఇళ్ల వారికి మరుగుదొడ్లు లేవు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. – షేక్ బీబీ, కుమ్మరకుంట, గోపాలపురం మండలం గిరిజన తెగకు చెందిన ఇతని పేరు కూతాడి బూసియ్య. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల దెందులూరులో నివాసం ఉంటున్నాడు. అంధురాలైన భార్య గంగమ్మతో కలిసి పూరి పాకలో తల దాచుకుంటున్నాడు. ఈ కుటుంబానికి ఇప్పటివరకూ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగిలే తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తాను, అంధురాలైన తన భార్య బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నాడు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మంజూరులో గిరిజనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న రాజ్యాంగ నిబంధనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి బూసియ్య కుటుంబానికే పరిమితం కాదు. ఇలాంటి నిరుపేదలెందరో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాక బహిర్భూమిని ఆశ్రయించాల్సి వస్తోంది. -
లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
-
లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
♦ అనర్హులు లబ్ధిపొందినట్లు తేలడంతో జాబితా నుంచి తొలగింపు ♦ మిగతా 2.10 లక్షల ఇళ్ల బిల్లుల మంజూరుకు ఓకే ♦ అవకతవకల వడపోత తర్వాత స్పష్టత ♦ తొలివిడతలో రూ.197 కోట్ల విడుదలకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకంలో అనర్హులు లబ్ధిపొందినట్లుగా గుర్తించిన లక్షన్నర ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మిగతా 2.10 లక్షల ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా దాదాపు రూ.197 కోట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ 2.10 లక్షల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.1,100 కోట్లు అవసరం. అయితే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద గతంలో కేంద్రం మంజూరు చేసిన రూ.510 కోట్లు గృహ నిర్మాణ శాఖ వద్ద ఉన్నాయి. అవి పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. దాదాపు మూడేళ్లుగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ విచారణ జరిపించగా.. అక్రమాలు నిజమేనని వెల్లడైంది. దాంతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల సంగతి అటకెక్కినట్లేననే భావన వ్యక్తమైంది. అయితే అర్హులైన పేదలు బిల్లులు అందక ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కొన్ని బిల్లులైనా మంజూరు చేయాలని నిర్ణయించి.. 2016లో కొన్ని నిధులు మంజూరు చేసింది. కానీ అది కూడా నిలిచిపోయింది. తాజాగా ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వమని, వారికి మొత్తం బిల్లులు మంజూరు చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బిల్లుల మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణ ఎలా? ‘ఇందిరమ్మ’ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.510 కోట్ల ఐఏవై నిధులు పోను.. రాష్ట్రం మరో రూ.600 కోట్ల మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధుల్లేక హడ్కో నుంచి రుణంగా తీసు కుంటున్నారు.దీంతో ఇందిరమ్మ బిల్లుల చెల్లిం పు ప్రభుత్వానికి భారంగా మారనుంది. ఇప్పుడు సిబ్బంది కరువు? ఇందిరమ్మ బిల్లుల మంజూరులో కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో గృహ నిర్మాణశాఖ సిబ్బంది బిల్లులు చెల్లించేవారు. ఇటీవల ఆ విభాగాన్ని ప్రభుత్వం రద్దు చేసి.. సిబ్బందిని ఇతర విభాగాలకు డిప్యుటేషన్‌పై పంపింది. అవినీతి ఆరోపణల మేరకు వంద ల మంది తాత్కాలిక సిబ్బందిని తొలగించిం ది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపునకు సిబ్బంది లేని పరిస్థితి ఎదురైంది. దీంతో పంచాయతీరాజ్ విభాగం నుంచి కొంతమంది సిబ్బందిని రప్పించి వారికి బిల్లుల చెల్లింపుపై తర్ఫీదు ఇస్తున్నారు. వారు ‘ఇందిరమ్మ’ ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి, ఫొటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బిల్లులను మంజూరు చేస్తారు. సోమవారం నుంచి బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశముంది. -
మోదీ మరో సంచలనం ఇదేనట..!
-
మోదీ మరో సంచలనం ఇదేనట..!
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్‌తో పెను సంచలనానికి తెరలేపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకోనున్న తదుపరి నిర్ణయంపై షాకింగ్ న్యూస్ ఒకటి వార్తల్లో నిలిచింది. గత ఏడాది జులైలో సిట్ చేసిన కీలక సూచనను అమలు చేసేందుకు మోదీ కసరత్తు చేస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. దీని ప్రకారం రూ.15లక్షలకుమించిన నగదు నిల్వలపై కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలను నిషేధించిన కేంద్రం తాజాగా ఒక వ్యక్తి లేదా సంస్థల క్యాష్ హోల్డింగ్స్ పై కూడా పరిమితులు విధించనుందట. నల్లధనంపై యుద్దంలో భాగంగా జీఎస్టీ అమలుతోపాటు, మరో సంచలనానికి కేంద్రం తెరతీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో నల్ల ధనం చలామణికి చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సిఫారసులు చేసింది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీల రద్దుతో పాటు రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని సూచించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా నాయకత్వంలోని సిట్.. ఈ సిఫారసులు చేసింది. అలాగే నగదు నిల్వలపై పరిమితులు లేకుండా ఈ నిషేధం అమలు చేయడం కష్టమని కూడా స్పష్టం చేసింది. ఇందుకోసం ఏ వ్యక్తి, సంస్థా రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని కోరింది. అయితే మరింత నగదు అవసరమైనపుడు సంస్థలు, వ్యక్తులు తమ ప్రాంతంలోని ఐటి శాఖ అధికారుల అనుమతితో అధిక నగదు ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని నివేదించిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ నగదు నిల్వ పరిమితిపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, దీనికోసం ఒక ఆర్థికబిల్లును తీసుకురావాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు తరువాత నగదు ఉపసంహరణలపై రూ.150 బాదుడు నిర్ణయాన్ని ప్రకటించాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ ,యాక్సిస్ బాటలో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులుకూడా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
పాశవికం
► కలకలం రేపిన దంపతుల హత్య ► మృగాలను మరపించిన దుండగులు ► పోలీసు జాగిలం, క్లూస్ టీం బృందం నిశిత పరిశీలన ► మంట కలసిపోతున్న మానవ సంబంధాలు ► నిందితులను పట్టుకుని తీరుతాం : పోలీసులు రేణిగుంట: అమావాస్య చీకటిలో ఊహకందని విషాదం. దుం డగులు మానవ మృగాలుగా మారి కళ్లెదుటే భర్తను దారుణంగా హతమార్చారు. ఆపై ఆరు పదుల వయస్సున్న వృద్ధురాలిని కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి పాశవికంగా కామవాంఛ తీర్చుకుని ఊపిరి తీశారు. ఈ హృదయ విదారక సంఘటన రేణిగుంట మండలం ఆర్.మల్లవరం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఊరుగాని ఊరొచ్చి.. పూతలపట్టుకు చెందిన కొత్తపల్లి శీనయ్య(65), ఇందిరమ్మ(58) దంపతులకు కుమారులు రాజశేఖర్, కుమార్, కుమార్తె కళావతి ఉన్నారు. వీరు 30 ఏళ్ల క్రితం రేణిగుంట మండలానికి వచ్చి స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. పంట చేలు, మామిడి తోటల్లో కాపలా ఉంటూ పొట్టపోసుకుంటున్నారు. ఏడాది క్రితం సమీపంలోని గుత్తివారిపల్లె గిరిజనకాలనీలో ఇంటి స్థలం ఇవ్వడంతో అక్కడే ఓ గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. వారి సమీపంలోనే పెద్ద కుమారుడు రాజశేఖర్ కుటుంబం, కూతురు కళావతి, ఆమె భర్త వెంకటేశు కాపురముంటున్నారు. రెండు నెలల క్రితం నుంచి ఆర్.మల్లవరం సమీపంలోని సదాశివరెడ్డి పొలాల వద్ద కాపలా ఉంటున్నారు. వీరికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నారు. గత గురువారం శీనయ్య తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో పూతలపట్టుకు వెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పొలం వద్ద కాపలా ఉండాల్సి రావడంతో శీనయ్య శుక్రవారం గుత్తివారిపల్లెకు చేరుకుని అక్కడి నుంచి పనికి కుదిరిన పంపు షెడ్డు వద్ద వెళ్లాడు. పూతలపట్టు నుంచి ఆదివారం మధ్యాహ్నం గుత్తివారిపల్లెకు చేరుకున్న శీనయ్య భార్య ఇందిరమ్మ ఇంట్లో భర్త లేకపోవడంతో మల్లవరంలోని పంపు షెడ్డు వద్దకు వచ్చింది. సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ఇటీవలే శీనయ్య పాముకాటుకు గురై పత్యం ఉండడంతో ఇంట్లో వండిన చేపలకూర పెట్టలేదని అలిగి రాత్రి 8 గంటలకు పంపు షెడ్డుకు బయలుదేరాడు. అతనితోపాటు భార్య కూడా వెళ్లింది. ఇద్దరూ అక్కడే పడుకున్నారు. అతి కిరాతంగా హతమార్చిన వైనం రాత్రి వెళ్లిన తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని సోమవారం ఉదయం సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, అర్బన్ సీఐ బాలయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరూ గదిలో చాపపై పడుకున్న చోటే రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. దుండగులు తొలుత ఎలుకలు పట్టేందుకు వినియోగించే ఇనుప గునపంతో శీనయ్య తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని భార్య ఇందిరమ్మను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. గోడ చువ్వలకు తాళ్లను బిగించి విచక్షణా రహితంగా అత్యాచారం చేసి ఆపై తలపై కొట్టి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. పోలీసు జాగిలం అక్కడి నుంచి గది వెనుకకు వెళ్లి మృతుల అల్లుడు వెంకటేశు కూర్చున్న చోట కాసేపు ఆగింది. అక్కడి నుంచి హైవేపై పరుగులు తీసి సమీపంలో ఉన్న మల్లవరం ఎస్టీ కాలనీలోకి వెళ్లింది. పోలీసులు మృతుల అల్లుడు వెంకటేశును విచారించారు. అలాగే గదిలో హత్యకు వినియోగించిన గునపాన్ని, మూడు మందు బాటిళ్లను, సెల్‌ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. -
ఎంత నగదు వాడుకుంటే అంతే వడ్డీ!
• దేశంలోనే తొలి క్రెడిట్ లైన్ యాప్ మనీటాప్ • రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదు లభ్యత • హైదరాబాద్‌లో సేవలు ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు వ్యాపార సముదాయాలకు మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ లైన్ సేవలు ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారులకూ చేరాయి. క్రెడిట్ లైన్ అంటే బ్యాంకులు ఎలాంటి వడ్డీలేకుండా రూ.5 లక్షల వరకూ నగదును అందిస్తాయి. అయితే బెంగళూరుకు చెందిన మనీటాప్ స్టార్టప్... ఆర్బీఎల్ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని ఈ సేవలను వ్యక్తిగత వినియోగదారులకూ అందుబాటులోకితీసుకొచ్చింది. గురువారమిక్కడ మనీటాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా సంస్థ కో–ఫౌండర్ అనుజ్ కక్కర్ విలేకరులతో మాట్లాడారు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా మనీటాప్ యాప్‌ను డౌన్‌లోడ్‌చేసుకోవాలి. సంబంధిత వివరాలు అందజేశాక... క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంక్ నుంచి అనుమతి రాగానే.. కస్టమర్ కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదును పొందే వీలుంటుంది. అయితే ఈపరిమితిలో ఎంత నగదును వాడుకుంటే దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు కూడా కనిష్టంగా నెలకు 1.25 శాతం ఉంటాయి. అసలును 2 నెలల నుంచి 3 ఏళ్ల లోపు నెలవారి వాయిదా (ఈఎంఐ)పద్ధతుల్లో చెల్లిస్తే సరిపోతుంది. గతేడాది అక్టోబర్‌లో సేవలను ప్రారంభించిన మనీటాప్.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె, బరోడా నగరాల్లో సుమారు 70 వేల మంది వినియోగించుకుంటున్నారు. -
ఏరుదాటి తెప్ప తగలేస్తారా!
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది ఇందిరమ్మ ఇళ్లు రుణాలు వసూలుకు వెళ్లిన అధికారులపై లబ్ధిదారుల మండిపాటు మునిసిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లను చుట్టుముట్టిన పేదలు భీమవరం : ’ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం రుణాల మాఫీ బాధ్యత తమదేనని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో బ్యాంకోళ్లు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి రుణాలు కట్టాలంటున్నారు. లేదంటే ఇళ్లను స్వాధీనం చేసుకుని తాళాలు వేస్తామంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే జాడలేదు. ఏరు దాటాక తెప్ప తగలేస్తారా. మా బతుకుల్ని రోడ్డున పడేస్తారా’ అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మండిపడ్డారు. ’మా ఇళ్లకు తాళాలు వేస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటా’మని హెచ్చరించారు. భీమవరం పట్టణ పరిధిలోని తాడేరు రోడ్డులో వైఎస్సార్ కాలనీ (టౌన్షిప్) లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం నిమిత్తం తమ బ్యాంకులో తీసుకున్న రుణాలను చెల్లించని దృష్టా్య రెవెన్యూ రికవరీ చట్టం కింద వాటిని స్వాధీనం చేసుకుంటామని ఎస్బీఐ అధికారులు హెచ్చరించారు. పోలీసుల సాయంతో బ్యాంకు అధికారులు బుధవారం అక్కడకు వెళ్లగా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 200507 సంవత్సరాల మధ్య టౌన్‌షిప్‌లోని సుమారు 139 మంది ఒక్కొక్కరు రూ.74 వేల వ్యయంతో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు› నిర్మించుకున్నారు. వారికి భీమవరం ఏడీబీ శాఖ ఒక్కొక్కరికి రూ.28 వేల చొప్పున రుణాలు ఇచ్చింది. వీరంతా నిరుపేదలు కావడంతో వాయిదాలు చెల్లించేందుకు అవస్థలు పడ్డారు. ఆ తరుణంలో 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం వచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఇళ్ల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వాయిదాలు కట్టాలని ఎవరైనా వస్తే తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. రుణాలు మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. దీనిని నమ్మిన పేదలంతా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్నా రుణాలు మాఫీ కాలేదు. ఇదిలావుంటే.. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం రుణాలు వసూలు చేసుకోడానికి జిల్లా కలెక్టర్ అనుమతితో ఎస్బీఐ ఛీప్ మేనేజర్ ఐ.ఫణికొండలరావు, ఫీల్ట్ ఆఫీసర్ పీఎస్ఎన్ మూర్తి, తహసీల్దార్ చవాకుల ప్రసాద్ తదితరులు బుధవారం ఉదయం 9 గంటలకు టౌన్‌షిప్‌కు చేరుకున్నారు. రుణాలు చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామని హెచ్చరించడంతో లబోదిబోమన్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు మాఫీచేస్తామంటూ హామీ ఇచ్చారని విన్నవించుకున్నారు. తమకు అటువంటి ఆదేశాలేమీ రాలేదని, అప్పు చెల్లించకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించడంతో వారిలో ఆందోళన ఎక్కువైంది. బాధితులకు బాసటగా.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు టౌన్‌షిప్‌కు చేరుకుని బాధితులకు బాసటగా నిలిచారు. ఽరుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో అమాయక ప్రజలతో ఓట్లు వేయించుకుని అవసరం తీరిపోయాక పేదలను గాలికి వదిలేస్తారా అని ప్రశ్నించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ టీడీపీ హామీతో రుణాలు చెల్లించలేకపోయారని, ఈ పరిస్థితుల్లో పేదల ఇళ్లకు తాళాలు వేస్తామంటూ ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. రుణాలు మాఫీ చేయకుంటే బాధితుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మునిసిపల్ చైర్మన్‌ను నిలదీసిన లబ్ధిదారులు కొంతసేపటికి మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వార్డు కౌన్సిలర్ యర్రంశెట్టి చందు అక్కడకు చేరుకోవడంతో బాధితులంతా వారిని చుట్టుముట్టారు. ’ఎన్నికల్లో మీ నాయకుడు హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇదేంటి’ అని నిలదీశారు. కంగుతిన్న మునిసిపల్ చైర్మన్ బ్యాంకు అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు రుణాలు ఇప్పటికిప్పుడు చెల్లించలేరని, వారికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు స్వయంగా రుణాలు మాఫీ చేస్తానని చెబితే గడువు కోరడం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. మునిసిపల్ చైర్మన్ బ్యాంకు అధికారులకు నచ్చచెప్పి అక్కడ నుంచి తీసుకువెళ్లడతో పరిస్థితి చక్కబడింది. ఎన్నికల హామీ ఏమైంది..... ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు, అంజిబాబు టీడీపీకి ఓట్లువేస్తే ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మేమంతా ఓట్లు వేసి గెలిపించాక.. మూడేళ్లకు బ్యాంకోళ్లు వచ్చి రుణాలు చెల్లించాలంటున్నారు. హామీ ఇచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు. రోజు గడవమే కష్టంగా ఉన్న మేం బ్యాంకు రుణాలు ఎలా చెల్లించగలం. నూకలక్ష్మి, లబ్ధిదారు డబ్బున్న పెద్దలకే రుణాలు మాఫీ చేస్తారా డబ్బున్న పెద్దలకు కోట్లకు కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తోంది. మాలాంటి పేదలు గూడు కట్టుకుంటే కొద్దిమొత్తం రుణం మాఫీ చేయడానికి మీనవేషాలు లెక్కించడం దారుణం. ఇప్పుడు రుణాలు చెల్లించాలంటే ఆత్మహత్యలే శరణ్యం. షకీరా, లబ్ధిదారు పనుల్లేక ఇబ్బంది పడుతుంటే ఇదేంటి పెద్ద నోట్లు రద్దు చేయడంతో నెల రోజులుగా చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు దొరకడం లేదు, పేద ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్న తరుణంలో బ్యాంకు రుణాలు వసూలు చేస్తారా. పేదల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా. నాయకులు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి. పార్వతి, లబ్ధిదారు -
‘ఇందిరమ్మ’ కాల్వ పనులకు 108 కోట్లు
నీటి పారుదల శాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో భాగంగా చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఇందిరమ్మ వరద కాల్వ (ఎఫ్ఎఫ్సీ) పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా చేపట్టనున్న పనులకు రూ.108.18 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులిచ్చారు. మిడ్‌మానేరు కుడి కాల్వల పరిధిలో ప్యాకేజీ-1లోని 17.75 కిలోమీటర్ల పొడవైన కాల్వల పనులకు రూ.54.92 కోట్లు, 17.5 కి.మీ. నుంచి 36.12 కి.మీ. వరకు పనులున్న ప్యాకేజీ-2కి రూ.53.96 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వరద కాల్వ కింద 1.9 లక్షల ఎకరాలుండగా, కొత్తగా దేవాదుల పరిధిలోని 2 లక్షల ఎకరాలు, గండిపల్లి రిజర్వాయర్ పరిధిలోని 30 వేల ఎకరాలను దీని పరిధిలోకి తేవడంతో ఆయకట్టు 4.2 లక్షల ఎకరాలకు పెరిగింది. గోదావరిలో 120 రోజులే నీటి లభ్యత! గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.182 టీఎంసీల నీటిని దేవాదులకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే గోదావరిలో వరద కేవలం 120 రోజులే ఉంటుందని, దేవాదులకు 27 టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని లెక్కగట్టారు. దీంతో ఈ ఆయకట్టుకు వరద కాల్వ ద్వారా నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మిడ్‌మానేరు కెనాల్ తొలి 36 కి.మీ. వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,650 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచాలని, తోటపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి మట్టాన్ని 305.87 నుంచి 307.45కు పెంచాలని కరీంనగర్ ప్రాజెక్టుల అధికారులు సూచించారు. -
ఇందిరమ్మ గృహాలకు బిల్లులు మంజూరు
లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఆపరేట్ చేసుకోవాలి ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్ పీడీ నర్సింహారావు సమీక్ష ముకరంపుర: ఇందిరమ్మ పథకంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్దిదారులకు బిల్లులు మంజూరైనట్లు హౌసింగ్ పీడీ నర్సింహరావు తెలిపారు. శనివారం ఈ విషయమై ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్‌శాఖ కార్యాలయంలో సమీక్షించారు. ఇందిరమ్మ పథకంలో ఇంతకు ముందు బిల్లులు పొంది గృహాలు నిర్మాణంలో ఉన్నటువంటి అర్హులైన లబ్ధిదారులకు బిల్లులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో క్షేత్రస్థాయి విచారణలో భాగంగా బిల్లులు పొంది నిర్మాణ దశలో 3926 ఇందిరమ్మ లబ్ధిదారులున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. దీనికి రూ.12.75 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా లబ్దిదారుల ఖాతాలు డార్మెంటరీ, నాన్ ఆపరేటివ్లో ఉంటాయని, అర్హత కలిగిన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలో కొంత డబ్బును జమ చేసుకుని అకౌంట్‌ను ఆపరేట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పాస్‌బుక్, జిరాక్స్, గృహం నిర్మించినప్రస్తుత స్థాయి ఫొటో, ఆధార్‌కార్డు జిరాక్స్, సంబంధిత హౌసింగ్ ఏఈకి బిల్లు కొరకు సమర్పించాలని తెలిపారు. ఆ తదుపరి లబ్ధిదారుల బిల్లులు ఆన్లైన్లో జనరేట్చేసి ప్రధాన కార్యాలయానికి సిఫారసు చేసిన అన ంతరం వారి ఖాతాలో జమ చేయబడుతుందన్నారు. -
కల తీరకుండానే
♦ కన్నుమూశారు.. ♦ ఇందిరమ్మ లబ్ధిదారుల దయనీయం ♦ సొంతింటి కల తీరకుండానే కన్నుమూత ♦ ‘సమీక్ష’లో బయటపడిన వాస్తవం ♦ ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పునాదులు తీశారు.. బేస్మెంట్ కట్టారు.. గోడలు లేపారు. పై కప్పు వేసుకుంటే ఇక గృహప్రవేశమే.. సొంతింటి కల నెరవేరబోతుందనుకున్నారు వాళ్లు.. కానీ ఏళ్లకేళ్లుగా బిల్లులు రాక.. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో దాదాపు వంద మంది చనిపోయారని, వారి ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, ఇప్పుడు వారికి బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని, రూ.16 కోట్ల బకాయి ఉదంటూ గు‘బిల్లు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ జిల్లా సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశానికి ఆదేశించారు. ఈ మేరకు గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం అందోల్‌లో అదీ సంగతి! ‘అందోల్ ఐఏవై ఇళ్ల స్టేటస్ ఏమిటి? డీఈ ఎవరు? ఒకసారి లేవండి. సమావేశానికి రాలేదా?..’ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నారు. ఓ ఏఈ ధైర్యం చేసి ఆందోల్‌కు రెగ్యులర్ డీఈ, ఇన్చార్జి డీఈ లేరని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆందోల్ నియోజకవర్గానికి రెండేళ్లుగా గృహనిర్మాణ శాఖ డీఈ లేరు. ఈ విషయం సమీక్ష సమావేశంలో బయటపడే వరకు జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియదు. అందోల్ గృహ నిర్మాణ శాఖ డీఈ ధర్మారెడ్డిని సంగారెడ్డి నియోజకవర్గానికి డీఈగా బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కనీసం ఇన్చార్జి కూడా లేకుండానే రెండేళ్లు గడవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పట్టింది. -
మద్యం మత్తులో వ్యక్తిపై దాడి
భువనగిరి:మద్యంమత్తులో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండలంలోని రాయిగిరి గ్రామాంలో ఉన్న ఓ డబా హోటల్లో జరిగింది. వివరాల ప్రకారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన అంతరి బాలస్వామి కేసారం గ్రామానికి చెందిన మకయ్యలు మద్య సేవించేదుకు రాయిగిరి డబాలో కుర్చున్నా రు. ఈ నేపథ్యంలో ఇరువురి మద్య వాగ్వాదం చేటుచేసుకుంది. ఈ క్రమంలో బాలస్వామిపై సీసా తో మక్కయ్యదాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.