సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇందిరమ్మ పథకంలో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన 30వేల ఇళ్లు ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి రూ. 4.5కోట్లు వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటి నిర్మాణం పూర్తవ్వాలంటే చెల్లింపుల మొత్తం ఇంకా పెరగాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న ఇళ్ల బిల్లు చెల్లింపులను నిలిపివేసింది. జియో ట్యాగింగ్ అంటూ జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో లబ్ధిదారులు చాలా మంది అక్కడా ఇక్కడా అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేయగా, మరికొంతమంది మొండిగోడలతో వదిలేశారు. లబ్ధిదారుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో ఇప్పుడా పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
నిలిచిపోయిన బ్యాంకు ఖాతాలు
రెండేళ్లుగా లావాదేవీలు జరగకపోవడంతో ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు వినియోగించినా సాంకేతికంగా పనిచేయవు. వాటిని పునరుద్ధరించుకుంటేనే బిల్లులు చెల్లిస్తామంటూ ఆంక్షలు విధించింది. అంతేగాదు ప్రస్తుతం అమలు చేస్తున్న 6పాయింట్ల ప్రాతిపదికను పరిశీలిస్తామని చెబుతోంది. అదే ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై దాదాపు ఐదారేళ్లు అవుతోంది. ఆ తర్వాత లబ్ధిదారుల స్థితిగతులు మారుతాయి. ఈ క్రమంలో తాజాగా 6పాయింట్ల ప్రాతిపదికను అవలంబిస్తే కొందరు లబ్ధిదారులు అనర్హులవుతారు.
6 పాయింట్లు ఏంటంటే..,
నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, ఐదెకరాలు పల్లపు భూములు లేదా 10ఎకరాల మెట్టు భూములు ఉన్న వారు, భార్యభర్తల్లో ఉద్యోగం ఉన్నవారు, రూ.500కన్నా ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చిన వారు, భార్యభర్తల్లో ఎవరో ఒకరి పేరు మీద ఇంటి పన్ను ఉన్నవారు, వరుసగా నాలుగు నెలలు రేషన్ సరుకులు తీసుకోని వారు అనర్హులవుతారని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా కారు, రూ.500విద్యుత్ బిల్లు, భార్యభర్తల్లో ఉద్యోగం ఉన్నవారు అనేవి ఇబ్బందికరంగా మారాయి.
ఐదేళ్ల క్రితం ఇళ్లు మంజూరైన లబ్ధిదారుని పరిస్థితులు క్రమేపీ మారడానికి అవకాశం ఉంది. ఆ క్రమంలో విద్యుత్ బిల్లు పెరగొచ్చు. కారు కొనుక్కోవచ్చు. భార్యభర్తల్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం రావొచ్చు. అంతమాత్రాన గతంలో పొందిన లబ్ధికి తాజా అంశాలను ముడిపెట్టడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఏదో ఒక కొర్రీ పెట్టి గత లబ్ధిదారులను వదిలించుకోవడమే ప్రభుత్వం ఆలోచనగా కనబడుతోందనే వాదనలు విన్పిస్తున్నాయి.
షరతులు వర్తిస్తాయి !
Published Wed, Apr 20 2016 1:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement