మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర సాధు సంతు పరిషత్ అధ్యక్షుడు సమతానందస్వామి
విజయనగరం టౌన్ : తిరుపతి వేంకటేశ్వరాలయంలో చేసేవి శాంతి, సంప్రోక్షణలే అయితే సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర సాధు సంతు పరిషత్ అధ్యక్షుడు సమతానంద స్వామి అన్నారు. కోట జంక్షన్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మహో సంప్రోక్షణం పేరిట తొమ్మిది రోజుల పాటు భక్తుల దర్శనానికి నిరాకరించడం, సీసీ కెమెరాలు ఆపేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి 17 వరకూ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే కానీ, ఆ విషయాలను లక్షలాది మంది భక్తులకు సీసీల ద్వారా చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు.
సంప్రోక్షణ కార్యక్రమాలు ఎంతో శ్రద్ధతో చేయాలన్నారు. ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు వెల్లువెత్తిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకుని రోజుకు 50వేల మందికి దర్శనానికి అనుమతి ఇస్తామన్నా, సీసీ కెమెరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు.
ఇప్పటికే టీటీడీపై భక్తులకు ఎన్నో అనుమానాలున్నాయని, ఇటువంటి సమయంలో ఇలా చేస్తే ఆ అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆలయ సంప్రోక్షణ ముహూర్తం ఏ పీఠాధిపతి ధర్మాచార్యుడిని అడిగి ఖరారు చేశారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment