తీవ్రంగా గాయపడిన బాధితులు
బాడంగి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరులపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడ్డ వారు ఆస్పత్రిలో చేరారు.
వివరాల్లోకి వెళ్తే...మండలంలోని గూడెపువలస పంచాయతీ శివారు గ్రామం అల్లువానివలసలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భూపతిరాజు వెంకటపతిరాజు తనయుడు శ్రీనువాసరాజు తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మంగళవారం రాత్రి దాడులకు పాల్పడ్డారు.
గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రశ్నిస్తే తన అనుచరులతో దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితులు భయపడుతూ చెప్పారు. తన మాట కాదని ఇటీవల బాడంగిలో జరిగిన వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సమావేశానికి మాజీ సర్పంచ్ మందపాటి శ్రీరామరాజు వెంట తాము వెళ్లామని బాధితులు తెలిపారు.
దీంతో తమపై కక్ష కట్టి రాళ్లు, కర్రలతో భౌతిక దాడులు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ తనయుడు నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులు జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించాలని బాధితులు రేజేర్ల సూర్యనారాయణ, అప్పలరాజు, సత్యనారాయణ, కొరివిపాటి గోవిందరావు, బైరిరాజు రామరాజుతో పాటు రావుపాటి సత్యవతి, నాగమణి, లక్ష్మి తదితరులు కోరారు.
తమపై దాడి చేసే సమయంలో ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది వచ్చి కాపాడారని లేకుంటే ప్రాణాలు తీసేవారని ఆవేదనతో చెప్పారు. రాళ్లతో దాడి చేయడం వల్ల తమకు శరీరమంతా గాయాలయ్యాయని రోదిస్తూ తెలిపారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇరువర్గాల కొట్లాటలో పలువురికి గాయాలు
బాడంగి: మండలంలోని అల్లువానివలస గ్రామానికి చెందిన ఇరు వర్గాల కొట్లాటలో తొమ్మిది మందికి గాయాలైనట్టు ఎస్‌ఐ బి.సురేంద్రనాయుడు చెప్పారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం ఆయన కేసుకు చెందిన వివరాలను చెప్పారు.
ఒక వర్గానికి చెందిన ఏజెర్ల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నదేవుల సత్యనారాయణరాజు, తౌడురాజు, భూపతిరాజు శ్రీనువాసరాజుపైన, రెండో వర్గానికి చెందిన అన్నదేవుల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏజెర్ల సత్యనారాయణ, అప్పలరాజు, సూర్యనారాయణపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. గాయాలైన వారిని స్థానిక సీహెచ్‌సీలో చేర్పించి చికిత్సలు చేయించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment