విజయనగరం క్రైం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీల విషయంలో అధికార పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిల్ వైస్‌చైర్మన్ కేవీఎన్.తమ్మన్నశెట్టి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌బీజీ భవన్‌లో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ హామీని అమలు చేయాలని వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మన్నశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన నాయకులే నాటకాలు అడుతున్నారని ఆరోపించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తమకు ఓటేస్తే మంచి ప్యాకేజీలు ఇస్తామని ప్రగల్భాలు పలికారన్నారు.
అధికారంలోకి వచ్చాక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ తాము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయన్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి, లోటు బడ్జెట్ భర్తీకి, పారిశ్రామిక ప్రాంతాలకు స్పెషల్ స్టేటస్, విద్య, ఆరోగ్య సంస్థలకు నూతన రాజధానికి నిధులు ఇస్తామన్నారన్నారు. కొత్తగా రైల్వేజోన్, రాయలసీమలో స్టీల్‌ప్లాంట్, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
ఆంధ్రరాష్ట్రానికి అప్పట్లో ప్రకటించిన రూ.5వేల కోట్లు ఏమాత్రం సరిపోవని, రూ.10వేల కోట్లు అవసరమని బల్లగుద్ది మరీ చెప్పిన బీజేపీ ప్రస్తుతం దాన్ని అమలు చేయక పోవడం దారుణమన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసా, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి, జనవిజ్ఞాన వేదిక నాయకులు ఎస్.నాగరాజు, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ ఆర్.ఆనంద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇవ్వాలిందే
Published Fri, May 22 2015 1:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement