పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
పార్వతీపురం : వారు అమాయక ప్రజలు.. మురుగువాడల్లో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజానీకం. రూ. 10 పెట్టి మినరల్ వాటర్ కొనుక్కోలేక మున్సిపల్ వాటర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే సామాన్య, మధ్య తరగతి ప్రజలు. అయితే నాలుగు సంవత్సరాలుగా పార్వతీపురం పురపాలక సంఘంలో బురదనీరే వస్తోంది. ఈ విషయమై ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు తిరగబడుతున్నారు.
ఇందుకు ఉదాహరణగా గురువారం స్థానిక ఒకటో వార్డులో జరిగిన సంఘటనను చెప్పుకోవచ్చు. ఒకటో వార్డులో టీడీపీ నాయకులు వార్డుదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో వార్డుకు చెందిన పొట్నూరు హరికృష్ణ అనే యువకుడు బురదనీటిని ఎలా తాగమంటారని వెంట తీసుకువచ్చిన బురదనీటి బాటిల్‌ను టీడీపీ నాయకులు చూపించాడు. దీంతో మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ పరుగెత్తుకుంటూ వచ్చి హరికృష్ణ మెడపట్టుకొని గెంటేయడంతో పాటు కాళ్లతో తన్నారు.
నువ్వెడవురా మమ్మల్ని అడగడానికి అంటూ హరికృష్ణపై విరుచుకుపడ్డారు. టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు ఎంతగా వారించినా కోపోద్రిక్తుడై మళ్లీ మళ్లీ హరికృష్ణపైకి దూసుకువెళ్లాడు. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ పట్టణ యువజన అధ్యక్షుడు రణభేరి బంగారునాయడు కలుగజేసుకుని బురదనీటి విషయాన్ని ప్రస్తావిస్తే దాడి చేస్తారా అంటూ ప్రశ్నించడంతో జగదీష్ అనుచరుడు, టీడీపీ కార్యకర్త సురగాల ఉమామహేశ్వరరావు దాడికి దిగాడు.
బంగారునాయుడుపై ఇష్టానుసారంగా పిడిగుద్దులు గుద్దారు. మా ప్రభుత్వం మా ఇష్టం.. మేము చెప్పిందే వినాలి తప్ప ఇక్కడ ప్రశ్నించడానికి ఎవరికీ హక్కులేదంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
జరిగిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్ బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో కలిపి పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తమపై దాడిచేసిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, అతని అనుచరుడు సురగాల ఉమామహేశ్వరరావులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై మహేష్‌ను కోరారు.
ఎమ్మెల్సీ, సురగాల ఉమామహేశ్వరరావు దాడి చేస్తున్న వీడియో క్లిప్పింగులను ఎస్సైకి చూపించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఎస్సై తాత్సారం చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి జరిగిన విషయంపై విచారణ జరిపిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని చెప్పడం విశేషం.
రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు...
టీడీపీ నాయకులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మినరల్ వాటర్ బాటిల్‌ను చూపించి పురపాలకసంఘంలో ఇలాంటి నీటిని సరఫరా చేస్తున్నామని.. ఎక్కడైనా బురదనీరు వస్తే చూపించాలంటూ సవాల్ విసిరారన్నారు.
అలాంటప్పుడు బురదనీటిని ప్రజలు చూపిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. సాక్షాత్తు ఎమ్మెల్సీ భార్య ద్వారపురెడ్డి శ్రీదేవి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉండగా బురదనీరు సరఫరా అయితే ప్రజల పరిస్థితేమిటన్నారు. సమస్యలపై నిలదీస్తున్న ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఈ సంస్కృతిని విడనాడకపోతే నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తిరగనివ్వమని హెచ్చరించారు.
ప్రజా సమస్యలను సహనంతో వినలేని మీరు రాజకీయాల్లో ఎలా మనుగుడ సాధించగలరని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, కౌన్సిలర్ గొల్లు వెంకటరావు, ఎస్.శ్రీనివాసరావు, ఏగిరెడ్డి భాస్కరరావు, బోను ఆదినారాయణ, సంగం రెడ్డి సందీప్, సర్పంచ్‌లు యాండ్రాపు తిరుపతిరావు, బొమ్మిరమేష్, రణభేరి బంగారునాయుడు, గొట్టాశివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment