
విజయనగరం జిల్లా: బీజేపీని బోనులో నిలబెట్టాల్సిన టీడీపీ..తాము కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనడం బీజేపీని రక్షించడానికి చేస్తున్న రాజకీయ జిమ్మిక్కని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామనడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమే అవుతుందని పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం 4 సంవత్సరాలు కావాలా అని ప్రశ్నించారు. కడప దీక్షలు తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి..ఇప్పుడు టీడీపీ నాయకులు దీక్షలంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు స్వార్థ ప్రయోజనాల కోసమే చూసుకుంటున్నాయని విమర్శించారు.
సీపీఐ, సీపీఎం, జనసేన ఇతర పార్టీలను కలుపుకుని విభజన హామీల సాధన కోసం ఈ నెల 13వ తారీఖున ఉమ్మడి కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. హామీల సాధన కోసం సెప్టెంబర్ 15న వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ వచ్చి సంవత్సరం గడిచినా ప్రజలకు నష్టం తప్ప లాభం లేదన్నారు. కేసీఆర్ మూడవ ప్రత్యామ్నాయం(థర్డ్ ఫ్రంట్) సాధ్యం కాదని, అది మధ్యలో ఆగిపోయిందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఒక్కోరోజు ఒక్కొక్కరికి మద్ధతునిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా అడ్డగోలుగా మైనింగ్‌కి అనుమతులిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం దొరికినదంతా గుటకా గుటకా మింగే దానిలా తయారైందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment