
PC: BCCI/IPL.com
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 సీజన్ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ స్ధానంలో సీఎస్‌కే కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడం నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.
ఈ క్రమంలో గైక్వాడ్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే మెనెజ్‌మెంట్ పడింది. టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షాని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో కొన్ని సీజన్ల పాటు ఓ వెలుగు వెలిగిన పృథ్వీ షా.. తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉన్నాడు.
ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసునేందుకు ముందుకు రాలేదు.
తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తిరిగి సొంతం చేసుకునేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. అయితే మరోసారి పృథ్వీ షాకు రుతురాజ్ గాయం రూపంలో అవకాశం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన షా.. 147.47 స్ట్రైక్ రేట్‌తో 1,892 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..