
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా ముందుకు సాగుతున్న అక్షర్ సేన.. తాజాగా మరో విజయం సాధించింది. పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోనే ఓడించింది.
ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul). ఆర్సీబీ విధించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే అక్షర్ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్-మెగర్క్ (7) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (7) కూడా చేతులెత్తేశాడు. దీంతో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ విలవిల్లాడింది.
ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా
ఇలాంటి తరుణంలో నేనున్నాంటూ కేఎల్ రాహుల్ అభయమిచ్చాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. మధ్య ఓవర్లలో మాత్రం దూకుడు పెంచి ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు.
రాహుల్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా సిక్సర్‌తో ఢిల్లీ విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఢిల్లీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా.. రాహుల్ తన విన్నింగ్ ఇన్నింగ్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్‌గా మారింది.
"𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙢𝙮 𝙜𝙧𝙤𝙪𝙣𝙙" 🔥pic.twitter.com/gKtmfoFvlN
— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2025
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!
బ్యాట్‌తో గ్రౌండ్‌లో గీత గీసిన రాహుల్.. ఆ తర్వాత జెండా పాతుతున్నట్లుగా బ్యాట్‌తో మైదానంపై కొట్టి.. ‘‘ఇది నా హోం గ్రౌండ్’’ అంటూ సైగ చేశాడు. నిజానికి రాహుల్ వికెట్ తీసేందుకు ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన వేళ.. ఇతర బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సమయంలో మాత్రం కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.
After the win Rahul stared at Kohli and said "This Is My Home Ground" 🔥
Look at Kohli's Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5— Radha (@Radha4565) April 11, 2025
పాపం కోహ్లి!
ఇందుకు కౌంటర్‌గానే రాహుల్ తన క్లాసీ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లికి, ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి ఈ రకంగా రియాక్షన్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్సీబీపై ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా.. ‘‘ఇది నా సొంత మైదానం.. నా ఇల్లు.. నాకంటే ఈ పిచ్ గురించి ఇంకెవరికి బాగా తెలుసు?.. నేను ఎప్పుడు ఇక్కడ ఆడినా.. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని రాహుల్ పేర్కొన్నాడు.
కాగా బెంగళూరుకు చెందిన రాహుల్ ఆరంభంలో ఆర్సీబీకి ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఇప్పటికి ఐదింట మూడు గెలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి అక్షర్ పటేల్.. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు.
ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ
👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్
👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)
👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)
👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఢిల్లీ విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కేఎల్ రాహుల్ (53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 రన్స్ నాటౌట్).
POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU
— IndianPremierLeague (@IPL) April 10, 2025