
Photo Courtesy: BCCI/IPL
రచ్చ గెలుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంట మాత్రం మరోసారి పరాభవం ఎదుర్కొంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) విచారం వ్యక్తం చేశాడు.
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు
ఢిల్లీ చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘వికెట్ ఎప్పటికప్పుడు మారిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్ చేసేందుకు అనుకూలమైన పిచ్. కానీ మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం.
మా జట్టులోని ప్రతి బ్యాటర్ కసితోనే ఆడతారు. వాళ్లది ఆత్మవిశ్వాసమే తప్ప.. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అయితే, ఈరోజు 80/1 స్కోరు నుంచి 90/4కు పడిపోవటమన్నది ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.
మా బ్యాటింగ్ లైనప్ పటిష్టమైనది. కానీ మేము ఈరోజు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అయితే, ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం మాకు కాస్త ఊరట కలిగించే అంశం.
మా ఓటమికి కారణం అదే
ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో మా బౌలర్లు ఆడిన విధానం అద్భుతం. మాకు అది ఎంతో ప్రత్యేకమైనది. సొంత మైదానంలో కాకుండా వేరే మైదానాల్లోనే గెలుస్తామన్న అభిప్రాయాలతో మాకు పనిలేదు.
వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ గురువారం ఢిల్లీతో తలపడింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22) రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యాడు.
రజత్ పాటిదార్ (23 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ శర్మ (3) నిరాశపరిచారు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (18 బంతుల్లో 18) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడి స్కోరు 163 పరుగుల మార్కుకు తీసుకువచ్చాడు.
పవర్ ప్లేలో మూడు వికెట్లు.. కానీ
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (2)ను యశ్ దయాళ్, జేక్ ఫ్రేజర్ మెగర్క్(7)ను భువనేశ్వర్ కుమార్ వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపారు. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (7)ను కూడా భువీ వెనక్కి పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు.
రాహుల్ రఫ్పాడించాడు
అయితే, కేఎల్ రాహుల్ విజృంభణతో అంతా తలకిందులైంది. నెమ్మదిగా మొదలుపెట్టిన ఈ లోకల్ బ్యాటర్.. మధ్య ఓవర్లలో దూకుడు పెంచాడు. మొత్తంగా 53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు.
ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 169 పరుగులు సాధించిన ఢిల్లీ.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అక్షర్ సేనకు ఈ సీజన్‌లో వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లలో మూడు గెలవగలిగింది.
ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ
👉టాస్: ఢిల్లీ.. మొదట బౌలింగ్
👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)
👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)
👉ఫలితం: బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.
POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU
— IndianPremierLeague (@IPL) April 10, 2025