
Photo Courtesy: BCCI/IPL
మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది.
గువాహాటిలో గత నెల 30న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రుతురాజ్ మోచేతికి గాయమైంది. అయితే దానికి చికిత్స కొనసాగిస్తూ అతడు మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో
ఫలితంగా ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్ ధోని (MS Dhoni) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. సొంత మైదానం చెపాక్‌లో జరిగే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్‌కే స్టార్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు.
మీరెలా ముందుకు వెళ్లగలరు?
‘‘జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలి. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్‌గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవు. రుతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారు?.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఎక్కడి నుంచి తెస్తారు?
డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా మీరెలా ముందుకు వెళ్లగలరు?’’ అని రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో సీఎస్‌కే యాజమాన్యాన్ని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా గతేడాది సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్‌లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాటపట్టింది.
తొమ్మిదో స్థానంలో
ఇక ఐపీఎల్-2025లోనూ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. సీఎస్‌కే టీమ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ధోని 2008–2023 మధ్య 235 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ‘తలా’ నాయకత్వంలో 5 సార్లు జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2022లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
అయితే టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనియే బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్ నుంచి జట్టు సారథ్య బాధ్యతలు రుతురాజ్‌కు అప్పగించారు. అతడి కెప్టెన్సీలో టీమ్ 19 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 8 గెలిచి, 11 ఓడింది.
చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?