
విఘ్నేశ్ పుతూర్ (Photo Courtesy: BCCI/IPL.com)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ముంబై ఇండియన్స్ (MI)మధ్య పోరు అని చెప్పవచ్చు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్-2025లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన తీరు ఇందుకు నిదర్శనం.
ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే స్టార్లు రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53)ల మెరుపులు.. మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్‌లతో పాటు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ కుర్రాడు హైలైట్‌గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ధోని చేత ప్రశంసలు అందుకున్నాడు.
ఇంతకీ ఎవరా ప్లేయర్?
అతడిపేరు విఘ్నేశ్ పుతూర్. లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ స్వస్థలం కేరళలోని మలప్పురం. పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన విఘ్నేశ్.. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.
అతడి ప్రతిభకు ఫిదా అయిన ముంబై యాజమాన్యం.. ఇంతవరకు కేరళ తరఫున కనీసం దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టకపోయినప్పటికీ... ఐపీఎల్ కాంట్రాక్టు ఇచ్చింది. రూ. 30 లక్షలకు ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో పద్దెనిమిదవ ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా సీఎస్‌కేతో పోరు సందర్భంగా విఘ్నేశ్‌ను బరిలోకి దించింది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఈ స్పిన్ బౌలర్.. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే (9), దీపక్ హుడా (3) రూపంలో మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.
చెన్నై చేతిలో ముంబై సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందా? అనే పరిస్థితి నుంచి .. చివరి ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేయడంలో విఘ్నేశ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అతడి భుజం తట్టి శెభాష్ అంటూ తలా.. ఈ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.
The men in 💛 take home the honours! 💪
A classic clash in Chennai ends in the favour of #CSK ✨
Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/ZGPkkmsRHe— IndianPremierLeague (@IPL) March 23, 2025
తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు ఐపీఎల్ స్టార్
అన్నట్లు విఘ్నేశ్ పుతూర్ తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే ఆయన.. కొడుకులోని ప్రతిభను గుర్తించి క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. కేరళ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో మీడియం పేసర్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా మారిన విఘ్నేశ్ ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
కలకాలం గుర్తుండిపోతుంది!
‘‘ధోని.. విఘ్నేశ్ పుతూర్ భుజం తట్టి అభినందించాడు. నాకు తెలిసి తన జీవితకాలం ఈ కుర్రాడు ఈ సంఘటనను గుర్తుంచుకుంటాడు’’- కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. విఘ్నేశ్ పుతూర్‌కు ఇది లైఫ్‌టైమ్ మొమరీగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు.
అయితే, ఈ సీజన్‌లో బౌలర్‌గా తనదైన ముద్ర వేయగలిగితే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో.. త్వరలోనే విఘ్నేశ్ కూడా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము!! ఏమంటారు?!
ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు
👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
👉టాస్: చెన్నై.. తొలుత బౌలింగ్
👉ముంబై స్కోరు: 155/9 (20)
👉చెన్నై స్కోరు: 158/6 (19.1)
👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/18).
చదవండి: జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి?
Comments
Please login to add a commentAdd a comment