
PC: CSK
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి నాయకుడిగా వ్యవహరించనున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని సీఎస్‌కే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సొంత మైదానం చెపాక్‌లో సీఎస్‌కే ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలయ్యారు. ఇక ధోని సైతం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు.
ఆ సమయంలో కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్‌కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా అతడికి ఎదురువెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.
ద్రోహి వచ్చేశాడు చూడండి
ఇంతలో నెట్స్‌లో ఉన్న ధోని మాత్రం.. బ్రావోను చూసి.. ‘‘ఇదిగో.. ద్రోహి వచ్చేశాడు చూడండి’’ అంటూ తనదైన శైలిలో స్వాగతం పలికాడు. ఇందుకు.. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది’’ అని బ్రావో బదులిచ్చాడు. నవ్వుతూ వెళ్లి ధోని హగ్ చేసుకున్నాడు.
ఆ వైబ్‌ను మిస్సవుతున్నాం
ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎంఎస్- డీజే.. ఆ వైబ్‌ను మిస్సవుతున్నాం’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ వీడియోను చూసి సీఎస్‌కే అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. బ్రావో చెన్నై ఫ్రాంఛైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
సీఎస్‌కేతో సుదీర్ఘ బంధం
కాగా వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో 2011- 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2018- 2022 మధ్య కాలంలో ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ సీఎస్‌కేకు ఆడాడు. 2011, 2018, 2021, 2022లో ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.
అంతేకాదు.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రావో 2023లో బౌలింగ్ కోచ్‌గా చెన్నై జట్టుకు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో చెన్నై ముఖచిత్రం, కర్త, కర్మ, క్రియ అయిన ధోనితో బ్రావోకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, 2025 సీజన్ ఆరంభానికి ముందు పరిస్థితులు మారిపోయాయి.
గౌతం గంభీర్ స్థానంలో
సీఎస్‌కేను వీడిన తర్వాత బ్రావో.. కేకేఆర్ ఫ్రాంఛైజీతో జట్టుకట్టాడు. గౌతం గంభీర్ స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సీఎస్‌కే- కేకేఆర్ మధ్య శుక్రవారం మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను కలవగా ధోని ఇలా సరదాగా స్పందించడం విశేషం.
కాగా 41 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రావో ఐపీఎల్‌లో 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 1560 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. మరోవైపు.. సీఎస్‌కే ఆడిన ఐదింట.. గత నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది.
MS🫂DJ : MISS THIS VIBE! 💛✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/IlSd876zes
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025