RR VS CSK: చివరి ఓవర్‌లో ధోని ఔట్‌.. సీఎస్‌కే ఫ్యాన్‌ గర్ల్‌ రియాక్షన్‌ చూడండి..! | IPL 2025, CSK VS RR: CSK Fangirl Reaction To Dhoni Dismissal Goes Viral | Sakshi
Sakshi News home page

RR VS CSK: చివరి ఓవర్‌లో ధోని ఔట్‌.. సీఎస్‌కే ఫ్యాన్‌ గర్ల్‌ రియాక్షన్‌ చూడండి..!

Mar 31 2025 12:38 PM | Updated on Mar 31 2025 2:45 PM

IPL 2025, CSK VS RR: CSK Fangirl Reaction To Dhoni Dismissal Goes Viral

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరి వరకు పోరాడి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 176 పరుగుల వద్ద ఆగిపోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.

చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తొలి బంతికే ఔటయ్యాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో హెట్‌మైర్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్బుతమైన క్యాచ్‌ పట్టాడు. ఇది చూసి ధోనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ఫ్యాన్‌ గర్ల్‌ తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశావు రా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. హెట్‌మైర్‌ పక్కనే ఉంటే ఆ అభిమాని చేతిలో తన్నులు తినుండే వాడు. ఈ ఫ్యాన్‌ గర్ల్‌ రియాక్షన్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. దీనిపై రకరకాల మీమ్స్‌ వస్తున్నాయి.

కాగా, ధోని ఔటైన అనంతరం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. ఈ మ్యాచ్‌లో ధోని సీఎస్‌కేను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. రాయల్స్‌ సైతం ధోనికి బయపడుతూనే సందీప్‌ శర్మకు చివరి ఓవర్‌ ఇచ్చింది. అప్పటికే 10 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 16 పరుగులు చేసిన ధోని మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. 

అయితే హెట్‌మైర్‌ డీప్ మిడ్ వికెట్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి చెన్నై అభిమానుల ఆశలను అడియాసలు చేశాడు. ధోని ఔటైన వెంటనే సీఎస్‌కే ఓటమి ఖరారైపోయింది. నాలుగో బంతికి ఓవర్టన్‌ సిక్సర్‌ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు.

ఛేదనలో సీఎస్‌కే ఆదిలోనే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర వికెట్‌ కోల్పోయినా కెప్టెన్‌ రుతురాజ్‌ చక్కటి అర్ద సెంచరీతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే అతనికి మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. ఆఖర్లో జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) పోరాడినా ఫలితం లేదు. ఇన్నింగ్స్‌ మధ్యలో హసరంగ ప్రతి ఓవర్‌లో ఓ వికెట్‌ తీసి సీఎస్‌కేను దెబ్బకొట్టాడు. శివమ్‌ దూబే లాంటి భారీ హిట్టర్‌ కొన్ని ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ దూబేను రియాన్‌ పరాగ్‌ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.

అంతకుముందు నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో రాయల్స్‌ 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్‌ ఇంకా భారీ స్కోర్‌ చేయాల్సింది. అయితే నితీశ్‌ను ఔట్‌ చేశాక సీఎస్‌కే బౌలర్లు నూర్‌ అహ్మద్‌ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-2) పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సీఎస్‌కే రన్‌రేట్‌ కూడా బాగా దెబ్బతినింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించిన ఎల్లో ఆర్మీ.. ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాయల్స్‌ చేతుల్లో పరాజయంపాలైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement