
ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం
6 వికెట్లతో బెంగళూరు చిత్తు
రాహుల్ 93 నాటౌట్
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అజేయ ప్రదర్శన కొనసాగుతోంది. ఓటమి లేకుండా సాగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. సొంత మైదానంలో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీకి పరాజయం ఎదురుకాగా... తన సొంత నగరంలో మ్యాచ్‌ను గెలిపించిన అనంతరం ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా రాహుల్ విజయనాదం చేయడం విశేషం.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగిపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 55 బంతుల్లో అభేద్యంగా 111 పరుగులు జోడించారు.
ఒకే ఓవర్లో 30 పరుగులు...
ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతులు ఆర్‌సీబీ విధ్వంసంతో 61 పరుగులు... చివరి 12 బంతుల్లో అదే తరహా దూకుడుతో 36 పరుగులు... మధ్యలో మిగిలిన 86 బంతుల్లో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం... పేలవ బ్యాటింగ్‌తో బెంగళూరు చేసిన పరుగులు 66 మాత్రమే... జట్టు ఇన్నింగ్స్ ఇలా భిన్న పార్శ్వాలలో సాగింది. తొలి ఓవర్లో స్టార్క్ 7 పరుగులే ఇవ్వగా, అక్షర్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు వచ్చాయి.
అయితే అసలు విధ్వంసం మూడో ఓవర్లో సాగింది. స్టార్క్ బౌలింగ్‌లో సాల్ట్ ఊచకోత కోశాడు. అతను 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సాల్ట్ వరుసగా 6, 4, 4, 4 (నోబాల్), 6తో చెలరేగిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక సాల్ట్ రనౌటయ్యాడు.
ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం గగనంగా మారింది. అయితే అక్షర్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో 17 పరుగులు రాగా, ముకేశ్ వేసిన చివరి ఓవర్లోనూ అతను 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి.

కీలక భాగస్వామ్యం...
ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడింది. డుప్లెసిస్ (2), ఫ్రేజర్ (7), పొరేల్ (7) విఫలం కాగా, అక్షర్ (15) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ సమయంలో చక్కటి బౌలింగ్‌తో ఆర్‌సీబీ పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే రాహుల్, స్టబ్స్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. పిచ్ ఇబ్బందికరంగా ఉండటంతో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు దూకుడు ప్రదర్శించారు.
చివర్లో 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా...రాహుల్, స్టబ్స్ కలిసి 7 ఫోర్లు 4 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు. హాజల్‌వుడ్ ఓవర్లో రాహుల్ 3 ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) 37; కోహ్లి (సి) స్టార్క్ (బి) నిగమ్ 22; పడిక్కల్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 1; పాటీదార్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 25; లివింగ్‌స్టోన్ (సి) అశుతోష్ (బి) మోహిత్ 4; జితేశ్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 3; కృనాల్ (సి) అశుతోష్ (బి) నిగమ్ 18; డేవిడ్ (నాటౌట్) 37; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–61, 2–64, 3–74, 4–91, 5–102, 6–117, 7–125. బౌలింగ్: స్టార్క్ 3–0–35–0, అక్షర్ 4–0–52–0, నిగమ్ 4–0– 18–2, ముకేశ్ 3–1–26–1, కుల్దీప్ 4–0–17–2, మోహిత్ 2–0–10–1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి) పాటీదార్ (బి) దయాళ్ 2; ఫ్రేజర్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 7; పొరేల్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 7; రాహుల్ (నాటౌట్) 93; అక్షర్ (సి) డేవిడ్ (బి) సుయాశ్ 15; స్టబ్స్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–58. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–2, దయాళ్ 3.5–0– 45–1, హాజల్‌వుడ్ 3–0–40–0, సుయాశ్ 4–0–25 –1, కృనాల్ 2–0–19–0, లివింగ్‌స్టోన్ 1–0–14–0.
ఐపీఎల్‌లో నేడు
చెన్నై X కోల్‌కతా
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం