
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఫ్రాంఛైజీలు వర్సెస్ క్యూరేటర్లు అన్నట్లుగా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్‌ఈడెన్ (KKR) గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వంతు వచ్చింది.
టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద
చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్.. క్యూరేటర్ తీరును విమర్శించాడు. ‘‘టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద. లీగ్ ప్రచారకర్తలు, అభిమానులకు ఇదే ముఖ్యం. అభిమానులంతా బ్యాటర్లు బౌండరీలు బాదుతుంటే చూడాలని కోరుకుంటారు.
ఇక్కడ తొలి రెండు మ్యాచ్‌ల కోసం మేము బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలించే పిచ్‌లు రూపొందించమని విజ్ఞప్తి చేశాం. కానీ.. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటింగ్ చేయడమే కష్టంగా మారిపోయింది.
ఈ పిచ్ బ్యాటర్లకు అంతగా అనుకూలించడం లేదు. ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం సవాలుతో కూడుకున్న పని. మేము ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పరిస్థితి.
స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టమైపోయింది. ఇక ఇలాంటి చోట భారీ షాట్ ఆడాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే, టీ20 క్రికెట్‌లో షాట్లు బాదితేనే ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు మజా.
తప్పక చర్చిస్తాం
పిచ్ తప్పకుండా మేము క్యూరేటర్‌తో చర్చిస్తాం. ఆయనపై మాకు నమ్మకం ఉంది. మాకోసం అత్యుత్తమ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నాం’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.
పాటిదార్ నాయకత్వంలో రచ్చ గెలుస్తూ.. ఇంట ఇలా
కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. అయితే, ఈ మూడూ ఇతర వేదికలపై గెలిచినవే. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ బెంగళూరు జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.
తొలుత గుజరాత్ టైటాన్స్ చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సొంతగడ్డపై పాటిదార్ సేన ఓటమిపాలైంది. గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ... నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
రహానే డైరెక్ట్‌గానే
ఇక ఢిల్లీ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93 నాటౌట్) ఒంటి చేత్తో ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఈ మేరకు పిచ్ క్యూరేటర్‌ను తప్పుబట్టడం గమనార్హం.
ఇక కేకేఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హోం గ్రౌండ్‌లో కాస్త అడ్వాంటేజీ ఉంటుందనుకుంటే.. అక్కడే డిఫెండింగ్ చాంపియన్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. స్పిన్‌కు కాస్త అనుకూలించే పిచ్ తయారు చేయమని అడిగితే..క్యూరేటర్ తమ మాట వినడం లేదంటూ కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Unbeaten. Unstoppable. Unmatched 🫡
History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙
Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025