RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్‌?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది! | Virat Kohli Fumes At Boundary Line Is He Points At Patidar Captaincy During RCB Vs DC Match, Video Goes Viral | Sakshi
Sakshi News home page

RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్‌?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!

Published Fri, Apr 11 2025 9:23 AM | Last Updated on Fri, Apr 11 2025 2:07 PM

Kohli Fumes At Boundary Line Is He Points At Patidar Captaincy Chat With DK

Photo Courtesy: BCCI/JioHotstar

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు మరో పరాజయం ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పాటిదార్‌ సేన ఆరు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సమిష్టి వైఫల్యంతో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో చేదు అనుభవం ఎదుర్కొంది.

వారంతా విఫలం
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీకి శుభారంభమే లభించింది. పవర్‌ ప్లేలో మెరుగైన స్కోరు సాధించినా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (17 బంతుల్లో 37), విరాట్‌ కోహ్లి (14 బంతుల్లో 22), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (25) ఫర్వాలేదనిపించగా.. దేవదత్‌ పడిక్కల్‌ (1), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (3) పూర్తిగా విఫలమయ్యారు.

ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌) కాస్త వేగంగా ఆడటంతో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ లక్ష్య ఛేదనను 17.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.

చెత్త బౌలింగ్‌
సొంతమైదానంలో కేఎల్‌ రాహుల్‌ క్లాసీ ఇన్నింగ్స్‌ (53 బంతుల్లో 93 నాటౌట్‌)తో ఢిల్లీకి విజయం అందించాడు. మిగతా వాళ్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 38 నాటౌట్‌) రాణించాడు. 

ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ (2/26), సూయశ్‌ శర్మ (1/25) ఫర్వాలేదనిపించగా.. జోష్‌ హాజిల్‌వుడ్‌, యశ్‌ దయాళ్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హాజిల్‌వుడ్‌ మూడు ఓవర్లలో 40 పరుగులు ఇవ్వగా.. దయాళ్‌ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 45 రన్స్‌ ఇచ్చేశాడు.

ఇదేం కెప్టెన్సీ?.. విరాట్‌ కోహ్లి  ఆగ్రహం
ఈ నేపథ్యంలో ఢిల్లీ టాపార్డర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (2), జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌(7), అభిషేక్‌ పోరెల్‌ (7)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపినా.. ఆర్సీబీకి ప్రయోజనం లేకుండా పోయింది. మధ్య, ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్ల వైఫల్యం వల్ల మ్యాచ్‌ చేజారింది. ఈ క్రమంలో ఆర్సీబీ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్లో జోష్‌ హాజిల్‌వుడ్‌ ఏకంగా 22 (4,4,2,2,4,6) పరుగులు ఇచ్చిన వేళ.. బౌండరీ లైన్‌ వద్ద కోహ్లి.. తమ బ్యాటింగ్‌ కోచ్‌ దినేశ్‌ కార్తిక్‌ వద్ద అసంతృప్తి వెళ్లగక్కాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ.. బౌలర్లు, ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన విధానం సరిగా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు.

అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కాగా.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ నిర్ణయంపై అసంతృప్తితోనే కోహ్లి ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన సమయంలో హిందీ కామెంట్రీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా.. ‘‘దినేశ్‌ కార్తిక్‌తో అతడు తీవ్రంగా చర్చిస్తున్నాడు.

నిజానికి కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌తో మాట్లాడాల్సింది. రజత్‌ ఈ జట్టుకు కెప్టెన్‌. కాబట్టి విరాట్‌ కోహ్లి దినేశ్‌ కార్తిక్‌తో మాట్లాడేకంటే కూడా.. రజత్‌తో మాట్లాడితేనే బాగుండేది’’ అని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. వీరేందర్‌ సెహ్వాగ్‌.. ‘‘జోష్‌ హాజిల్‌వుడ్‌ 22 పరుగులు ఇచ్చినందుకే విరాట్‌ కోహ్లి కోచ్‌తో ఇలా చర్చించి ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. 

 

చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్‌.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement