
విరాట్ కోహ్లి (PC: IPL/RCB)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ ఎడిషన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్ స్టార్ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.
ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ ఆడిన షాదాబ్ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..
పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.
చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్‌తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.
నమ్మకం, సహోదర భావం లేదు
యాజమాన్యం, డ్రెసింగ్‌రూమ్ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్‌కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.
గెలిచేది ఆ జట్టే
ఇక ఈసారి ప్లే ఆఫ్స్ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్ కూడా టాప్-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యం లేదు.
అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.
ఆరెంజ్ క్యాప్ అతడికే
ఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.
ఇక పర్పుల్ క్యాప్‌ను పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్), యజువేంద్ర చహల్ (పంజాబ్ కింగ్స్)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.
చదవండి: IPL: అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!.. హ్యాట్సాఫ్
Comments
Please login to add a commentAdd a comment