
నేడు రాజస్తాన్‌తో బెంగళూరు ఢీ
మధ్యాహ్నం గం. 3:30 నుంచి
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న రెండు జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జైపూర్ వేదికగా జరగనున్న తొలి పోరులో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. తాజా సీజన్‌లో బెంగళూరు జట్టు 5 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... రాజస్తాన్ రాయల్స్ ఐదు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ను వారి సొంత మైదానాల్లో ఓడించిన బెంగళూరు... ఇప్పుడు రాజస్తాన్‌ను కూడా చిత్తు చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు తమ రెండో ‘హోం గ్రౌండ్’ గువాహటిలో మ్యాచ్‌ల అనంతరం రాజస్తాన్ జట్టు తిరిగి జైపూర్‌లో మ్యాచ్‌కు సిద్ధమైంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం రాయల్స్‌ను ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్ సంజూ సామ్సన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగతో రాజస్తాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
బౌలింగ్‌లో ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ కీలకం కానున్నారు. బెంగళూరు విషయానికి వస్తే... స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాతో బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉంది. హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. రాజస్తాన్ బౌలింగ్‌కు, బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య ఆసక్తికర సమరం ఖాయమే.
ఢిల్లీ X ముంబై
రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఈ సీజన్‌లో పరాజయం ఎరగకుండా... దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆదివారం రెండో మ్యాచ్‌లో తలపడుతుంది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించగా... హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌లాడి కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకుంది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోయినా... వారంతా సమష్టిగా సత్తాచాటలేకపోతుండటంతో ముంబై పోటీలో వెనుకబడిపోయింది.

ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే తిరిగి కోలుకొని ప్లే ఆఫ్స్‌కు చేరడం ముంబైకి కష్టతరంగా మారనుంది. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా పాండ్యా సేన బరిలోకి దిగనుంది. డుప్లెసిస్, మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, ఆశుతోష్ శర్మ, అక్షర్ పటేల్‌తో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో బెంగళూరుపై చక్కటి ఇన్నింగ్స్‌తో విలువ చాటుకున్న రాహుల్ ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు.
స్టార్క్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, ముకేశ్ కుమార్ బౌలింగ్ భారం మోయనున్నారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మపై తీవ్ర ఒత్తిడి ఉండగా... రికెల్టన్ మెరుపులు మెరిపించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. బౌల్ట్, సాంట్నర్‌తో కలిసి బుమ్రా బౌలింగ్ భారం మోయనున్నాడు.